ప్రపంచ చిరునవ్వు దినోత్సవం

నవ్వవయ్య బాబూ.. ఈ రోజైనా నవ్వు!‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు.. చిన్నారి పాపల్లే నవ్వు.. చిరకాలం ఉండాలి నీనవ్వు.. చిగురిస్తు ఉండాలి నా నువ్వు..’ అని నవ్వు గొప్పదనాన్ని పాట రూపంలో అక్షరీకరించారు తెలుగు సినీకవి ఆచార్య ఆత్రేయ. నవ్వుకు ఉన్న ప్రాధాన్యం, గొప్పదనం అలాంటిది మరి. హాయిగా నవ్వడంలో ఉన్న ఆనందం వెల కట్టలేనిది. నవ్వు ముఖానికి ఒక పెట్టని ఆభరణం వంటిది. అందుకే ‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం’ అని ఏనాడో చెప్పారు దర్శకుడు జంధ్యాల. నవ్వుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా లాఫింగ్‌ క్లబ్‌లు విరివిగా వెలుస్తున్నాయి. హాయిగా నవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శిక్షకులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం..


నవ్వు అందరికీ అర్థమయ్యే భాష. పసిపాప నవ్వుతో కనెక్ట్‌ కానివారెవ్వరూ ఉండరు. జీవితంలో సహజాతమైన అద్భుతం నవ్వు. నవ్వును మించిన సౌందర్యం ఉండదు. నవ్వు ఎన్ని రకాలో.. గుంభనంగా నవ్వడం, పెద్దగా నవ్వడం, చిలిపిగా నవ్వడం, పడీపడీ నవ్వడం, కొస పెదవి మీద నవ్వడం, చిరు మందహాసం చేయడం, నర్మగర్భంగా నవ్వడం.. ప్రతి నవ్వుకూ ఓ అర్థం ఉంటుంది. స్వచ్ఛమైన నవ్వుకు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉంటుంది. గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది. నవ్వు శారీరక, మనో వ్యాయామానికి దోహదపడుతుంది. అందుకే పట్టణాల్లో లాఫింగ్‌ క్లబ్‌లు ఉంటాయి. యోగాలో నవ్వు ఒక ప్రక్రియ. నవ్వడం, నవ్వించడం కంటే జీవన సాఫల్యం మరేదీ ఉండదని అంటారు. అందుకు ప్రపంచవ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని ఆ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...

నవ్వు మనం నేర్చుకోనక్కర్లేని భాష. పుట్టుకతోనే అబ్బుతుంది. మరో విశేషం ఏమంటే అది మనకు తెలియకుండానే వస్తుంది. వచ్చినప్పుడు నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ... బలవంతంగా నవ్వలేం. నవ్వే అవకాశం మనిషికి మాత్రమే ఉంది. మన పూర్వీకులైన మహా వానరాలు, గొరిల్లాలు, చింపాంజీలు నవ్వినా అవి ‘హ...హ...హ..’ అని మాత్రం నవ్వలేవు. నవ్వు నేర్చుకునే విద్య కాదు. పుట్టు అంధులు, బదిర శిశువులు కూడా ఎంచక్కా నవ్వేస్తారు. ఒక మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే అతను ఆరోజులో ఎన్ని సార్లు నవ్వాడో లెక్క వేస్తే తెలిసిపోతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

నవ్వుల దినోత్సవం ఏర్పడింది ఇలా...


భారతదేశానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవానికి ఆద్యుడు. 1995 మార్చి 13న తొలుత ఆయన దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు 65 దేశాల్లో ఆరువేలకు పైగా నవ్వుల క్లబ్బులు వెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని జనవరి 2వ ఆదివారం జరిపేవారు. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో జనవరి మాసంలో చలితీవ్రత ఉంటుందని, ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు. దీంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వారు ఈ దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ మొదటి శుక్రవారంగా జరపాలని నిర్ణయించారు.

అనాదిగా హాస్యానికే పెద్దపీట...

నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన మన పూర్వీకులు హాస్యానికి పెద్దపీట వేశారు. పూర్వం రాజరిక వ్యవస్థ నుంచి హాస్యానికి అగ్రతాంబూలం అందుతోంది. అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్‌ అనే విదూషకుడు, శ్రీకృషదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు వంటి వారి కథలు వింటే కడుపుబ్బ నవ్విస్తాయి. నవరసాల్లో హాస్యం అంటే అన్ని వర్గాల వారు ఇష్టపడతారు. నవ్వు ఆరోగ్యానికి మంచిదనే భావన వందల ఏళ్ల పరంపరగా వస్తోంది. ఆధునిక కాలంలోనూ మానసిక వైద్యులు కూడా నవ్వడంలో ఉన్న ఆరోగ్య రహస్యాలను వివరిస్తున్నారు. హాస్యం మనలో హాయిగా ఉన్నామనే భావన కల్పిస్తుంది. ఈ దశలో నేడు ప్రపంచమంతటా హాస్యాన్ని, నవ్వును చికిత్స సాధనంగా గుర్తిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ ఇతర పాశ్చాత్య దేశాల్లో ఆసుపత్రులకు అనుబంధంగా నవ్వుల ఆసుపత్రులు ఏర్పడుతున్నాయి. వీటిలో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. కడుపుబ్బ నవ్వేవారు ఒత్తడిని తగ్గించుకొని ఎక్కడైనా సర్దుకుపోగలరని, హాయిగా నవ్వేవారు మెరుగైన జీవనంతో సాగిపోతారని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.

హాస్యానికి దూరమౌతున్నామా...?

దైనందిన జీవితం యాంత్రికంగా మారిపోతున్న నేటి కాలంలో మానసిక ప్రశాంతత కరువు అవుతోంది. పిల్లలకు చదువుతో ఒత్తిడి, పెద్దలకు తమతమ కార్యకలాపాల్లో, విధుల్లో తీవ్ర పని ఒత్తిడి వల్ల ఉల్లాసానికి దూరమవుతున్నారు. జీవితంలో పెరిగే వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు...ఇంకా అనేక కారణాలు మనిషిని నవ్వుకు దూరం చేస్తున్నాయి. ఈ తరుణంలో మానసిక ఒత్తిడిని అధిగమించి, ప్రశాంతతను పొందాలనే తపన నేడు అన్ని వర్గాల్లో ఉంది. శరీర దృఢత్వానికి వ్యాయామం, నడక వంటివి ఉపకరిస్తే...మానసిక వికాసానికి హాస్యం ఎంతో దోహదపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం సంతోషంగా జీవిడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని వారు వివరిస్తున్నారు. ఈ తరుణంలో కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని తదితర పట్టణాల్లోని యోగా శిక్షణ కేంద్రాల్లో లాఫింగ్‌ థెరపీ ఒక భాగంగా చేరుస్తున్నారు. వారంలో ఒకరోజు ఈ శిక్షణలు ఇస్తున్నారు. కర్నూలు, నంద్యాలలో లాఫింగ్‌ క్లబ్‌లు కూడా పనిచేస్తున్నాయి. ఒకే గేటెడ్‌ కమ్యూనిటీ వీధులు, అపార్ట్‌మెంట్లలోనూ కొత్తగా లాఫింగ్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

నవ్వుతూ పలుకరించడం నేర్చుకోవాలి...

‘ప్రపంచంలో ఒకరినొకరు నవ్వుతూ పలుకరించుకుంటే అసలు యుద్దాలు అనేవే రావు’ అంటారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరిస్టాటిల్‌. చిరునవ్వుకు ఉన్న బలం అలాంటిది.

నవ్వుల్లోనూ అనేక రకాలు...

నవ్వు అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరి వద్ద ఒక్కో ప్రత్యేకమైన లాస్యం కానవస్తుంది. పసి పాపల మోముల్లో విరిసే బోసి నవ్వుల్లో ఎలాంటి కల్మషం కనిపించదు. కొందరు పైకి నవ్వుతున్నా లోపల చిటపటలాడుతూ ఉంటారు. అది కపటమైన నవ్వు అని తెలుస్తూనే ఉంటుంది. కొందరు నవ్వడం చూస్తే ముఖంలో నవ్వున్నా..నొసటితో వెక్కిరిస్తున్నట్లు ఉంటుంది. మరికొందరి హాస్యం నోట్లోంటి ముత్యాలు రాలినట్లుగా ఉంటుంది. ఇంకొందరి మోముల్లో ఎంత వెతికినా హాస్యం కానరాదు.

హాస్యం అపహాస్యం కాకూడదు...

నవ్వు బాధల్లో ఉన్న వారికి ఓదార్పు ఇచ్చేదై ఉండాలి. మానసిక రుగ్మతల నివారణకు దోహదపడేలా నిలవాలి. అయితే హాస్యం అన్ని వేళలా పనికి రాదని యోగా నిపుణులు చెబుతున్నారు. హాస్యం ఒక్కోసారి వికటించి అపహాస్యంగా మారే అవకాశాలు లేకపోలేదు. అందుకే తమస్థాయి వ్యక్తులతోనే హాస్య సంభాషణలుగానీ, జోకులుగానీ, చతురోక్తులుగానీ వేయాలి. లేకుంటే అవి రివర్స్‌గా మనపైకే వచ్చే ప్రమాదం లేకపోలేదు.

నవ్వుతో ప్రయోజనాలివి

ఒక్కసారి గట్టిగా నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుంది.
నవ్వుతూ జీవించడం ఒక కళ. మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి నవ్వు ఒక దివ్వ ఔషధం.
నవ్వు ఒక ఆధ్యాత్మిక సద్గుణం, మానసిక రోగాలకు సంజీవని.
గట్టిగా నవ్వే వారిలో రక్తపీడనం (బీపీ)ని అదుపులో ఉంటుంది. హైబీపీ, ఉబ్బసం, మధుమేహం, మానసిక ఒత్తిడులను నవ్వు అదుపులో ఉంచుతుంది.
బాగా నవ్వే సమయంలో శరీరం ఆక్సీజన్‌ను బాగా తీసుకుంటుంది. దీనివల్ల ఎలాంటి హృద్రోగాలు రావు.
నవ్వడం వల్ల శరీరంలో నొప్పుల నివారణకు ఉపయోగపడే ఎండార్ఫిస్‌ను శరీరం విడుదల చేస్తుంది.
హాయిగా నవ్వే వారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు.
నవ్వు గుండెపోటును నివారిస్తుంది. థైరాయిడ్‌, స్కాండిలైటిస్‌ వంటి సమస్యలను దరిచేరనీయదు.
ముఖంపై వార్థక్యపు ఛాయలు, ముడుతలు పడనీయకుండా చిరునవ్వు ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
నవ్వు ధ్యానానికి సులభమైన మర్గం. ఎందుకంటే నవ్వేటప్పుడు మరి దేని గురించీ ఆలోచించం.
కంటికి, పెదవులకు, బుగ్గలకు నవ్వు ఒక ప్రధాన వ్యాయామం.
నవ్వడం వల్ల శరీరంలోని అనేక కండరాలకు వ్యాయామం లభిస్తుంది. అంటే నడుము, కాళ్లు, చేతులు, మెడ, వీపుభాగాలకు చేసే ఎక్సర్‌సైజు ఒక గట్టి నవ్వువల్ల లభిస్తుంది.
నవ్వడం వల్ల మెడకు మంచి వ్యాయామం లభిస్తుంది. నరాల బలహీనత పోయి గట్టి పడతాయి. మెడకు బెల్టు వాడే అవసరమే రాదు.
బాగా నవ్వుతున్నప్పుడు శ్వాస ఎక్కువ సార్లు పీల్చుకొని వదలడం వల్ల శరీరంలోని అనేక మలినాలు కార్బన్‌డయాక్సైడ్‌ ద్వారా వెళ్లిపోయి, ఛాతీకి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి.
నిత్యం నవ్వుతూ ఉండే వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. 

సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి
హాస్య దినోత్సవం ఏడాది పొడవునా సంతోషంగానే ఉండాలని గుర్తు చేస్తుంది. దురదృష్టవశాత్తు మనిషి సంపాదన పెరిగింది కానీ, మనిషి ఆ సంపాదనతో సంతోషంగా ఉండటం మర్చిపోయాడు. కోపం, విసుగు, ఆవేశం అనే వాటికి ఖర్చు పెట్టి మరీ దగ్గరవుతున్నాం. కానీ, ఉచితంగా లభించిన చిరునవ్వును రోజూ దూరం చేసుకుంటున్నాం. పిల్లలు రోజుకు 30 సార్లు నవ్వితే, ఒక ఉద్యోగి 30 రోజుల్లో జీతం వచ్చిన రోజే నవ్వుతాడు.

- సలీంబాషా, లాఫ్‌థెరపిస్టు, లాఫింగ్‌ క్లబ్‌, కర్నూలు

సినిమాల్లో హద్దులు దాటుతున్న హాస్యం...

హాయిగా నవ్వుకునేందుకు నేడు ప్రధాన వినోద సాధనం సినిమా. అయితే నేటి చిత్రాల్లో హాస్యం అపహాస్యం అవుతోంది. ద్వంద్వార్థాలు, డబుల్‌ మీనింగ్‌ మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఎస్వీఆర్‌, ఎన్టీయార్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు వంటి పెద్దపెద్ద నటులు కూడా తమ హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నవారే. ఆంగ్ల నటుడు చార్లీ చాప్లిన్‌ కళ్లు తిప్పడం, నడక, మాటలు లేని తన అభినయంతోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. నాటకాల్లో కూడా నేడు హాస్యం దూరమౌతోంది. హాస్య నాటికలు, నాటకాలు కూడా తగ్గిపోతున్నాయి. టీవీల్లో ఏడుపు సీరియళ్లకు ప్రాధాన్యత పెరిగింది. - ఎస్‌. శ్రీనివాసరావు, రంగస్థల నటుడు

యోగాలో భాగంగా లాఫింగ్‌ థెరపీ

70 రకాల జబ్బులు ఒత్తిడి, మానసిక సమస్యలతో వస్తుంటాయి. బీపీ, గుండెజబ్బులు, డిప్రిషన్‌, ఇన్సోమియా, మైగ్రిన్‌, ఆతృత, అలర్జీ, ఆందోళన, అల్సర్‌ వంటివన్నీ ఇలా వచ్చేవే. ఆధునిక జీవనంలో హాయిగా నవ్వుకోవడానికి, మానసిక ఉల్లాసానికి యోగాలోనూ లాఫింగ్‌ థెరపీని ఒక భాగంగా చేర్చారు. వ్యాఘ్రాసనం ద్వారా నవ్వడం నేర్పిస్తున్నాం. దీనివల్ల శరీరంలో అంతర్లీన శక్తి పెరుగుతుంది. నరాలకు మంచి వ్యాయామం కలిగి రక్త ప్రసరణ బాగుంటుంది. రక్త ప్రసరణ బాగుంటే ఏ వ్యాధులూ రావు.
- జి. మురళీకృష్ణ, యోగా గురువు


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment