అంతర్జాతీయ వృద్ధుల దినం
బాల్య, కౌమార్య, యవ్వన, వృద్ధాప్యాలు జీవితంలో ఏ ప్రాణికయినా తప్పనిసరిగా సంభవించే జీవన రేఖలు. 'ఎండుటాకును చూసి పచ్చటాకు నవ్వింది' అని తెలుగులో ఒక సామెత ఉంది. పండిపోయి చెట్టు నుంచి రాలే ఎండుటాకును చూసి చెట్టు రెమ్మలకు వేలాడే పచ్చటాకు నవ్విందట. అది గమనించిన ఎండుటాకు పిచ్చిమొహమా రేపు నీకు కూడా నా గతే కదే.. అని పకపకమంటూ ఆ ఎండుటాకు రాలిపోయిందట.


నీవు నేర్పిన విద్యయే...


ముసలి తండ్రికి తిండి పెట్టడం కూడా దండగే అని చెప్పి బతికుండగానే తండ్రిని పాతిపెట్టేందుకు చూసిన పాత సినిమాలోని కన్నకొడుకును తల్చుకుందాం. రేపు నువ్వూ ముసలాడివే అవుతావుగా.. నీకూ ఇప్పుడే గొయ్యి తవ్వుతా అంటూ మనవడు బయలుదేరతాడు...

అందుకే గుర్తుంచుకుందాం, నేడు పిల్లలుగా, యువజనులుగా, నడివయస్కులుగా పాత్రలు పోషిస్తున్న మనమంతా ఈరోజో రేపో మాపో ఈ కడు వృద్ధుల బృందంలోకి అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది. సమాజ గమనంలో వృద్ధుల పాత్రకు ఏమంత ప్రాముఖ్యత ఉండకపోవచ్చు. ఎందుకంటే యవ్వనదశలో వారు సమాజానికి అవసరమైన సమస్త ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొని రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు తమ వంతు కృషి చేసి ఉంటారు. ఆ అంతంలేని కృషిలో కండరాల పటుత్వాన్ని, పని చేసే శక్తిని కోల్పోయి జీవితం చివరి అంచులలో ఇప్పుడు నిలిచి ఉంటారు.

పనులు మాని, లక్ష్యాలు పూర్తి చేసుకుని ఉత్పత్తికి దూరమై విశ్రాంతి తీసుకుంటూ జీవన చరమదశను ముగిద్దామని దీర్ఘ సెలవులో ఉన్న జాతి నిర్మాతలే వృద్ధులు. అందుకే వారికీ ఓ రోజును కేటాయించి సమాజానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినం జరుపుకుంటున్నారు.

వయోవృద్ధులను గౌరవించి, వారి సంరక్షణకు కృషిచేసే లక్ష్యంతో ప్రతి ఏటా అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వృద్ధాప్య దినాన్ని జరుపుకుంటున్నారు. 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రతి ఏటా అక్టోబర్ 1ని అంతర్జాతీయ వృద్ధాప్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. దీనినే అంతర్జాతీయ వయోవృద్ధుల దినంగా కూడా పిలుస్తున్నారు. ప్రపంచంలో వృద్ధుల అవసరాలను గమనించి వారి సంరక్షణను పట్టించుకోవడానికి గాను 1982లో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ వృద్ధాప్య సభ అక్టోబర్ 1ని సెలవుదినంగా ప్రకటించింది.

మీకు తెలుసా... ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఇప్పుడు 60 ఏళ్ల వయసును కలిగి ఉన్నారు. 2050 నాటికి ప్రపంచంలోని ప్రతి అయిదుమందిలో ఒకరు 60 ఏళ్లు ఆ పైబడి వయసు కలిగి ఉంటారట. 2150వ సంవత్సరానికి ప్రపంచంలో ప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు ముదుసలిగా ఉంటారట.

సీనియర్ సిటిజన్లుగా పేరు పడిన ఈ వయోవృద్ధులు జాతి కందించిన సేవలు గుర్తుంచుకుని వారి అవసరాలు తీర్చే కృషిలో వ్యక్తులూ, సమాజమూ పునరంకింతం అయేందుకుగాను ప్రపంచం వ్యాప్తంగా అన్ని దేశాలూ అంతర్జాతీయ వృద్ధాప్య దినాన్ని జరుపుతున్నాయి. భారత్‌లో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు వృద్ధాప్య ఫించను కూడా ఇస్తూ వారి శ్రేయస్సుకు ప్రభుత్వం తన వంతు బాధ్యతను నెరవేరుస్తోంది.

వ్యక్తులు, ప్రభుత్వాలు, సమాజాలు, కమ్యూనిటీలు తమ వంతు చర్యలు చేపట్టి ప్రపంచ వయోవృద్ధుల సంక్షేమానికి మరింతగా కృషి చేయవలసిన అవసరం ఉంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment