150వ గాంధీ జయంతి

అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా 
గాంధేయ వేదం

ఆ రెండు గీతాలూ... 
1946... బెంగాల్‌లో మహాత్ముడు పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు మౌన వ్రతంలో ఉన్న ఆయన్ను పత్రికా విలేకరులు ప్రజలకు ఏదైనా సందేశం ఇమ్మని కోరారు. గాంధీజీ ఒక పలక తీసుకుని బెంగాలీ లిపిలో రాశారు ‘అమీన్‌ జిబనీ అమార్‌ బానీ’... అంటే నా జీవితమే నా సందేశం. 
దైవం ఎవరు? ఉనికి ఎక్కడ?

దైవం ఎక్కడో లేడు... సత్యంలో కొలువై ఉన్నాడు. అసలు సత్యమే దైవం. ప్రతి మనిషీ సత్యానికి బద్ధుడు. అని ప్రవచించారు మహాత్ముడు. జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని తన విశ్వాసాలను, సిద్ధాంతాలను అందులో పరిశోధించిన గాంధీజీ భారతీయ చింతనకు కొత్త రంగులద్దారు. 
సత్యం, అహింసలను వెలుగులోకి తెచ్చి ఒక వినూత్న పద్ధతిలో ఆచరించి చూపారు. అందుకే ఆయన విశ్వజ్యోతి అయ్యారు.

గాంధీ జీవితం, ఆయన విశ్వసించిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటికి ప్రాతిపదికలు సత్యం, అహింస. రెంటినీ కలిపి సత్యాగ్రహమనే ఆయుధాన్ని తయారు చేసి గాంధీ తన పోరాటంలో ఆయుధంగా వాడుకున్నారు. గాంధీజీ ఆస్తికుడు. దేవుడి అస్తిత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇక్కడ దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించిన మహాశక్తి. గాంధీ మొదట్లో దేవుడే సత్యం అని నిర్వచించేవారు. కానీ తర్వాత ఆయన సత్యమే దేవుడు అని అన్నారు. సత్యాన్ని మించిన దేవుడు లేడు అని ఉద్ఘాటించారు. ఇంతకీ సత్యం అంటే ఏంటి? సర్వమానవాళికీ ఆమోదయోగ్యమైనదే సత్యం... అలాగే సత్యాన్ని సర్వమానవాళీ తప్పనిసరిగా ఆమోదిస్తుంది అంటారాయన.

మాటలోనూ... మనసులోనూ.. 
కల్లాకపటం అంటారు. తెలుగులో జంటగా వాడే ఈ పదాలు పరమ సత్యానికి దారి చూపే సూచికలు. మనిషి మాటల్లో అబద్దాన్ని కల్ల అనవచ్చు. మనసులోని అబద్దం కపటం అవుతుంది. పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి మొదటిమెట్టు కల్లాకపటం లేకుండా ఉండడం అని చెప్పొచ్చు. అలా ఉన్నవాడే విశ్వసత్యాన్ని తెలుసుకోగలుగుతాడని మహాత్ముడు ప్రవచించారు. నిజం మనిషికి ధైర్యాన్నిస్తుంది. పోరాడే శక్తినిస్తుందని చెబుతారు గాంధీ. ఇక్కడ సత్యాగ్రహం అంటే సత్యం కోసం ఆగ్రహం కాదు. సత్యాన్ని దృఢంగా పట్టుకుని ఉండడం. సత్యాగ్రహ ఉద్యమ సమయంలో ఎంతో మంది ఆయన విశ్వాసాలను ప్రశ్నించారు. అవహేళన చేశారు. కానీ మహాత్ముడు వెనకంజ వేయలేదు. ఆచరణను మార్చుకోలేదు. రాజకీయాల్లో ఎత్తుగడలు తప్పనిసరి. గాంధీజీ కూడా తన ఎత్తుగడలు మార్చుకున్నారు తప్ప సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదు.

హింసను అహింసతో ఎదుర్కోవడమే సత్యాగ్రహం. అహింస అంటే హింస కానిది అని మాత్రమే అర్థం కాదు. దానికి ఒక సంపూర్ణమైన నిర్వచనాన్ని గాంధీ ఇచ్చారు. ఆయన దృష్టిలో అహింస అంటే ప్రేమ. ప్రతివారూ తనను ప్రేమించుకున్నట్లే ఇతరులనూ ప్రేమించడం. అదే అహింస. సత్యాగ్రహం అనే గొప్ప ప్రక్రియకి సత్యం పునాది అయితే ప్రేమ ఓ ప్రాతిపదిక. ప్రతి హృదయంలో ఏదో ఒక మూల ప్రేమజ్యోతి మిణుకుమిణుకుమంటూ ఉంటుంది. దాన్ని ప్రకాశింపజేయడమే సత్యాగ్రహం.

సత్యసంధతను పాటించే విషయంలో ఎలాంటి ఒడిదొడుకులైనా తొణకకూడదంటారాయన. ఏ పరిస్ధితుల్లోనైనా సరే హృదయంలోని నిజాన్ని ఆయన ఆవిష్కరించి చూపించారు. తన జాతితో తాను చేయించిన ప్రయోగాలు విఫలమైన సందర్భాల్లో కూడా నియమం తప్పలేదు. 1922లో చౌరాచౌరీ అనేచోట ప్రజలు కోపోద్రిక్తులై పోలీసులను సజీవ దహనం చేసినప్పుడు ఆయన క్షోభపడ్డారు. తన సిద్ధాంతాల ఆచరణకు ప్రజలు సిద్ధంగా లేరేమో, సిద్ధంగా లేని వారిపై తన విశ్వాసాలను రుద్దుతున్నానేమోనని మధనపడ్డ గాంధీజీ తన మనసులోని విషయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ‘ఆ తప్పు నాకు పర్వతమంతగా కనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేశారు. అయినా తప్పును ఒప్పుకున్నాను. కాబట్టి నాకు పశ్చాత్తాపం కలగలేదు.’ అని వెల్లడించారు. అంతటి సహాయ నిరాకరణోద్యమాన్నీ ఉన్నట్టుండి ఆపు చేయించారు. కానీ సత్యానికి ఉన్న శక్తిని జనం గ్రహించేలా చేశారు కాబట్టే తర్వాత కూడా జాతి అంతా ఆయనను అనుసరించింది.

నా దృష్టిలో...

 

భగవద్గీత ఓ వజ్రాల గని. పద్దెనిమిది యోగాలు చదివి, వాటి సారాన్ని ఆకళింపు చేసుకోవడం ద్వారా జీవితం ఆనందమయం అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు నాకు పౌరాణిక పాత్రలా కాకుండా.. ఓ మహాగురువుగా, దివ్యజ్ఞాన యోగీశ్వరుడుగా దర్శనమిస్తాడు. తరతరాల భరతజాతికి ‘గీత’ తరగని పెన్నిధి. ఇది ఏ ఒక్క మతానికో సంబంధించిన గ్రంథంగా పరిశీలించకూడదు. భగవద్గీత విశ్వమానవ కల్యాణ కారకానికి ఉపయుక్తమయ్యే జీవన సూత్రాల సమాహారం. ‘దీక్ష, కర్తవ్యం, విశ్వాసం, సత్యం, కృషి, గమ్యం వంటి ఉదాత్త అంశాల ప్రాతిపదికగా చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి సాధించాలి’ అనే సిద్ధాంతాన్ని భగవద్గీత సంపూర్ణంగా బలపరుస్తుంది. భారత స్వాతంత్య్ర సంగ్రామ దీక్షకు కావాల్సిన శక్తియుక్తుల్ని, దృఢచిత్తాన్ని, సానుకూల దృక్పథాన్ని నేను భగవద్గీత నుంచి పొందాను. ‘గీత’ లేని నా జీవితాన్ని ఊహించలేను. అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. భగవద్గీత అందించిన ఆత్మవిశ్వాసం మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. యువతరానికి భగవద్గీత కరదీపిక కావాలి.

చింతన

ఆధ్యాత్మిక చింతన అంటే పూజలు చేయడం, ఆలయాలను సందర్శించడం మాత్రమే కాదు. అంతకుమించిన అత్యున్నత స్థితి. అది హృదయ సంబంధమైనది. మనస్సనే మందిరంలో పరమాత్మ చైతన్యాన్ని నింపుకొని, సర్వేసర్వత్రా భగవత్‌శక్తిని దర్శించడమే ఆధ్యాత్మికత. భౌతిక సంబంధాల కన్నా అతీతమైనది ఆధ్యాత్మిక బాంధవ్యం. ఆ చింతన లేని జీవితం పరిపూర్ణం కాదు. అది ఆత్మలేని శరీరం లాంటిది.’’

రామాయణం


నా జీవితంపై భగవద్గీత తర్వాత అంతటి ప్రగాఢ ప్రభావాన్ని కలగజేసింది.. తులసీదాస్‌ రామచరితమానస్‌. పవిత్రత, ప్రశాంతం, ప్రసన్నం, ప్రహ్లాదం అనే నాలుగు అంశాలకు ఆ గ్రంథం ఆధార భూమిక. ధర్మాన్ని ఎలా నిర్వహించాలో శ్రీరాముడు తన వ్యక్తిత్వం ద్వారా మనకు నేర్పాడు. మన ధర్మాన్ని మనం నిబద్ధతతో నిర్వహిస్తే.. ఫలితం జయప్రదమవుతుందని రాముడి పాత్ర నిరూపిస్తుంది.

ప్రార్థన

పరమాత్ముడితో మనం మౌనంగా సంభాషించడమే ప్రార్థన. అంతరంగంలో అంతర్యామిని నిలుపుకొని కొనసాగే ఆత్మీయ మనో సంవేదన ఇది.నిత్యప్రార్థన మనో కాలుష్యాన్ని నివారిస్త్తుంది.

శాంతి

‘‘మనశ్శాంతికి మార్గం మన మనసులోనే ఉంది. కలహాలు, కపటాలు లేని మనసే శాంతిని అందుకుంటుంది. నీతి, నిజాయతీలతో నడిచినపుడు శాంతి మనవెంటే నడుస్తుంది. సకారాత్మక దృక్పథంతో ప్రతిమార్గాన, సచ్ఛీలతతో ముందుకు సాగినపుడు ‘శాంతి’ మనకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతుంది. ఇది నేను స్వీయ అనుభవంతో చెబుతున్న మాట. నైతికపరమైన ఆదర్శాలు, ధ్యానసిద్ధి, ఆత్మలో సద్భక్తి శాంతికి మూలాలు. విషయ వాసనలతో, అనేక జీవన క్లేశాలతో బాధపడే మనసుకు.. శాంతి ఇంధనమవుతుంది.

బ్రహ్మచర్యం

1908లో నేను ఈ వ్రతానికి పూనుకున్నాను. బ్రహ్మచర్యాన్ని పాటించడం అంటే ఆత్మను బ్రహ్మకు అర్పణం చేసుకోవడం. సర్వేద్రియాలను నిగ్రహించడం. ఇందుకోసం పూర్వపు విషయవాసనలన్నిటినీ వదిలేయడం అవసరం. నిజానికి నాకు సత్యాగ్రహ సమరానికి కావాల్సిన శక్తిని ఈ వ్రతమే ఇచ్చిందని భావిస్తున్నాను. మనోవికారాలను అణుచుకోవడం అంత తేలికేం కాదు. ఇది కఠోర తపశ్చర్య అనిపించేది. కానీ నా లక్ష్యం శుద్ధమైంది కాబట్టి పరమాత్ముడు నాకా శక్తిని ఇచ్చాడని అనిపిస్తోంది.
గాంధీవాదాన్ని రూపొందించింది మహాత్ముడైనా దానిపై అనేక భిన్న సిద్ధాంతాల ప్రభావం ఉంది. ఆయన వాటన్నిటినీ క్రోఢీకరించి తీర్చిదిద్ది దానికో రూపం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను ప్రభావితం చేసిన రచనలు ఎన్నో.. పలు గ్రంథాలే కాదు గేయాలు, గీతాలు కూడా ఆయన వల్ల ప్రాచుర్యంలోకి వచ్చాయి.

అంందులో మొదటిది ‘వైష్ణవ జనతో’. ఇది ఒక భజన గీతం. దీన్ని 15వ శతాబ్దంలో నరసింహ మెహతా గుజరాతీలో రచించారు. ఈ గీతం ఇలా సాగుతుంది... 
వైష్ణవ జనతో తేనే కహియే 
జే పీడ పరాయీ జానేరే 
పర్‌ దుఃఖ్‌ ఉపకార్‌ కరే తోహే 
మన్‌ అభిమాన్‌ నా ఆణేరే! 
తెలుగులో దీని అర్ధం ఇలా ఉంటుంది. ‘ఇతరుల దుఃఖాలను, బాధలను, వాటి పట్ల తన బాధ్యతలను గ్రహించగలిగిన వారే నిజమైన దైవ జనులు, వైష్ణవులు. స్వార్థం ఉన్న వారెప్పుడూ దైవానికి దగ్గర కాలేరు.

మరో ప్రఖ్యాత గీతం 
రఘుపతి రాఘవ రాజారాం 
పతిత పావన సీతారాం 
సీతారాం సీతారాం 
భజ్‌ ప్యారే తు సీతారాం 
ఈశ్వర అల్లాహ్‌ తేరోనాం 
సబ్‌కో సన్మతి దే భగవాన్‌ 
రామ్‌రహీంకరీం సమాన్‌ 
హమ్‌ సబ్‌హై ఉన్‌కీ సంతాన్‌ 
సబ్‌ మిలా మాంగే యహ పరదాన్‌ 
హమారా రహే మానవ్‌కా జ్ఞాన్‌ 
ఓ జగదేక ప్రభూ శ్రీరామా... ఈశ్వరుడైనా, అల్లాహ్‌ అయినా సర్వం నీవే కదా... ఈ విశ్వానికి శాంతిని సౌభ్రాతృత్వాన్ని అందించు తండ్రీ... అనే సందేశాన్నిస్తుందీ గీతం. 
నిజానికి ఇవి మహాత్ముడి ప్రార్థనా గీతాలైనా వీటిలో ఉన్న ఉదాత్తమైన భావాల మూలంగా జాతి పాడుకునే శాంతి గీతాలయ్యాయి.
వేల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ గాంధీకి ముందు ఎవరూ సత్యాగ్రహం అనే ఆయుధంతో యుద్ధం చేయలేదు. వాటితో అంత సుదీర్ఘకాలం, విశాల ప్రయోజనాల కోసం, విస్తృత పోరాటం సాగించలేదు. అది ఆయనకు మాత్రమే చెల్లింది. సత్యం, అహింసలను తన జీవితమనే కొలిమిలో కాల్చి, పదునుపెట్టి ప్రయోగించిన ఏకైక యోధుడు మన మహాత్ముడు.

అపకారం తలపెట్టిన వాడికి కూడా ఉపకారం చేయగలిగితే నా ప్రేమ అతనిలోకి కూడా ప్రవహిస్తుంది. నేను అతడిని ద్వేషిస్తే ఆదే అతనిలోనూ ప్రతిఫలిస్తుంది. పరస్పర ద్వేషం ఇద్దరినీ దహిస్తుంది. పరస్పర ప్రేమ ఉభయులనూ ఉన్నతీకరిస్తుంది. మహాత్మా గాంధీ
సేకరణ: మహాత్ముడి ‘సత్య శోధన’ నుంచి

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment