పులసొచ్చిందోచ్‌!



ఏండీ... బాగున్నారా...నా పేరు ఇలసండి! మీరు పులసని పిలుచుకుంటారు కదండీ అదండీ నేను. నేనెక్కడో న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో పుట్టినా ... ఆ గోదారోళ్ల వల్ల బాగా పేరెల్లిపోయానండి వాళ్ల వల్ల ఇప్పుడు తెలుగోళ్లంతా మేము వాళ్ల సొంత సేపలని అనుకుంటుంటారండి పెళ్లాల మెళ్లో పుస్తెలమ్మయినా మమ్మల్ని కొనుక్కు తినాలని అనుకుంటారంటండీ...అంతగొప్ప రుచంటండీ మాది

మేం ఒక్కళ్లం చిక్కినా అండీ... పండగ చేసేస్కుంటారండీ ఆ గోదావరి మరకాల్లోళ్లు (జాలర్లు). మేం దొరికిన రోజు చూడండి ఇక మార్కెట్‌లో ఎంత తొడతొక్కిడి ఉంటాదో. మాక్కావాలంటే మాక్కావాలంటూ యేలకు యేలు పెట్టి తీస్కెళ్తుంటారండీ. ఆయ్‌... మంచి రేటిస్తామని ఎక్కడెక్కడి నుంచో పోన్లొస్తుంటాయండీ. గోదారి జిల్లాల్లో కొత్త అల్లుళ్లయితే మాకా చేప పులుసు కావాల్సిందేనని మంకు పట్టు పడతారంటండీ.. నిజం సెప్పాలంటేనండీ... మేం సముద్రంలో ఉన్నప్పుడు మామూలు సేపలమేనండీ. మరి ఇంత గొప్ప రుసి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు... ఆ గోదారి తల్లి వల్లేనండీ. ఎక్కడో న్యూజీలాండ్‌ నుంచి ఈదుకుంటూ వస్తామాండీ... ఈ గోదారి దగ్గరకు రాగానే ఆ నీళ్లలో ఈదాలనే కోరిక పుట్టదాండీ మాకు. ఈ నీళ్లలో ఈదుతూ ఈదుతూ... ఆ ఎర్రనీళ్లు తాగుతూ తాగుతూ కాస్త ఒళ్లు సేస్తామండి. మా పొట్ట కింద సెన పెరుగుద్ది కదండీ... అదండీ ఇంత రుసికి అసలు కారణం. అదంతా గోదారి నీళ్లల్లో ఉండే పోషకాల వల్లేనంటండీ అట్టా ఈదుతూ ఈదుతూ ధవళేశ్వరం వరకూ ఈదుతామండీ ఇక్కడ జాలర్లు పట్టేసుకుని మీకు అమ్మేస్తారండీ ఇంకా ముందే యానాం, కోటిపల్లిల్లో కూడా అప్పుడప్పుడు వల్లో పడుతుంటాం కానీ, అక్కడంత రుసిగా ఉండమండీ... ఎంత ఎర్రనీళ్లు తాగితే అంత రుసన్నమాట...
గోదారికి వరదొచ్చే ఆగస్టు, సెప్టెంబరు నుంచి దీపాళి అమాస వెళ్లే వరకు అయితే మాకు పండగండీ.. ఆ వరద నీళ్లలో ఈదుతూ కేరింతలు కొడతామండీ...అదే టయింలో మీ వాళ్లు మమ్మల్ని పట్టేసుకుని కూరొండుకు తినేస్తారండీ...
ఇప్పుడు కాదులేగానండీ...
ఒకప్పుడు చూడాలండి మా దర్జా...
మేము, మా చుట్టాలం చాలామందిమి ఇక్కడకు వచ్చే వాళ్లమండీ...
కానీ ఈ మధ్య మా వాళ్లెవరూ ఇటు రావడం లేదండీ
గోదారి సముద్రంలో కలిసే ప్రాంతంలో చమురు కోసం తవ్వకాలు చేస్తున్నారంట కదండీ
ఆ తవ్వకాల అదురుకి మా వాళ్లందరూ బెదిరిపోయి అటు ఒడిశానో, బంగ్లాదేశో యెళ్లి అక్కడోళ్లకు చిక్కుతున్నారండీ. 

ఇంకా చాలా దేశాల్లో మేం దొరుకుతుంటామండి
కొన్ని దేశాల్లో అయితే మమ్మల్ని వాళ్ల దేశపు సేపగా ఎన్నుకున్నారంటండీ
ఎన్ని దేశాల్లో మేం ఉన్నా... ఎన్ని నదుల్లో ఈదినా ఆ గోదారి నీళ్లలో ఉండే రుసి మాకెక్కడా దొరకదండీ... ఈ నీళ్లను తాగిన మా రుసి మీరెక్కడా దొరకదండీ...
అందుకే మమ్మల్ని మీ తెలుగోళ్ల సేపగా ప్రకటించమని కోరుతున్నామండీ...
ఎందుకంటే మీ గోదారంటే మాకు ఇష్టం... మేమంటే మీకు ప్రాణవండీ...
సరేనండయితే...
మా గురించి మరికొన్ని విశేషాలు ఇనేసెళ్లిపోండి...

అద్భుతమైన రుచితో భోజనప్రియులను ఆకర్షించే గోదావరి పులసకు సముద్రంలో దొరికే ఇలసకు తేడాను కనుక్కోవడం కొత్తవారికి సాధ్యం కాదు. ఎందుకంటే రూపురేఖలన్నీ ఒకేలా ఉంటాయి. ఇదే అదనుగా ఇలసలను తీసుకొచ్చి గోదావరి నదీతీర ప్రాంతాల్లో పులసలుగా చెప్పి విక్రయిస్తుంటారు. సీజన్‌లో క్రమం తప్పకుండా కొనుగోలు చేసేవారు పులసలను ఇట్టే గుర్తుపట్టేస్తారు. సముద్రంలో దొరికే చేపలకు ఛాయ తక్కువగా ఉంటే... గోదావరి పులస తెల్లగా ఎండలో వెండిలా ధగధగా మెరిసిపోతుంటుంది.




పాతరోజుల్లో అయితే కుమ్ముటాముదం అని ఉండేది. దాన్ని కూర దించేముందు నాలుగు చుక్కలు వేసేవారు. ఈ ఆముదాన్ని ఇంట్లోనే తయారుచేసుకుంటారు. ఇంకొందరయితే ఆవకాయలో ఉండే ఎర్రని నూనెని కూడా ఇందులో వేస్తారు. అది కూడా కూర రుచిని పెంచుతుంది.
ఈ చేపలు గోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే సంగమ ప్రాంతాల నుంచి నదిలోకి ప్రవేశిస్తాయి. అంతర్వేదిపాలెం, బెండమూర్లంక, ఓడలరేవు, యానాం ప్రాంతాల్లోని సంగమ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. అలా వాటి ప్రయాణం ధవళేశ్వరం వద్ద ఉన్న బ్యారేజ్‌ వరకూ ఉంటుంది. గోదావరి తీపినీటిలో సంతానోత్పత్తి కోసం నదిలో ఎంతో దూరం ఎదురు ఈదుకుంటూ వెళ్లే ఈ మత్స్యరాజం లార్వాను నీటిలో వదులుతుంది. తరువాత పులస జీవితచక్రం పూర్తవుతుంది. నీటిలో ఉన్న లార్వా గుడ్లు చేప పిల్లలుగా మారి తిరిగి సముద్ర జలాల్లోకి చేరుకుంటాయి. సముద్రంలో దొరికే ఇలసతో పోల్చితే గోదావరికి వచ్చిన పులస అయిదారు రెట్ల ఎక్కువ ధర పలుకుతాయి. ఎందుకంటే చేప ఒకటే అయినా సముద్రంలో లభించే వాటితో పోల్చితే గోదావరిలో దొరికే పులస రుచే వేరని చెప్తారు. కిలో, కిలోన్నర బరువులో దొరికే ఈ చేప ధర అసాధారణంగా ఉంటుంది. రూ.2 వేల నుంచి రూ.5వేలు పెట్టడానికి కూడా సిద్ధపడుతుంటారు.
- మేకల నాగేశ్వర్రావు, రాజమండ్రి

* ఈ కూరలో అల్లం, కొత్తిమీర వేసుకోకూడదు. ఇవి కూర రుచిని పొగొట్టేస్తాయి కాబట్టి. వీటిని దూరంగానే ఉంచాలి.

* గోదావరి జిలాల్లో రామల దాకలు, పులస దాకలు అని ఉంటాయి. ఇవి వెడల్పుగా ఉంటాయి. వీటిల్లో వండితే చేప విరగకుండా ముక్క చెదరకుండా వస్తుంది. నాలిక గరిటె, గుంట గరిటె అని ఉంటాయి. పులుసు తీయడానికి గుంట గరిటెలు, ముక్కలు తీయడానికి వెడల్పుగా ఉండే నాలిక గరిటెలు వాడతారు.


కూర తయారీ



తయారీ విధానం: పులస చేప- కేజీ, ఏదైనా గానుగ నూనె- 200గ్రా, బెండకాయలు- ఎనిమిది, పచ్చిమిర్చి పెద్దవి- ఎనిమిది, ఉల్లిపాయలు- నాలుగు, ధనియాలు- చెంచా, జీలకర్ర- చెంచా, వెల్లుల్లిగడ్డ- ఒకటి, వెన్నపూస- 100గ్రా, చింతపండు- 150 గ్రా, కారం- రెండు పెద్ద చెంచాలు, కల్లుప్పు- తగినంత
తయారీ: సాధారణంగా పులసలని మట్టిదాకల్లోనే వండాలంటారు. దాంట్లోనే ఆ రుచి వస్తుందని అంటారు. మీ వీలుని బట్టి పాత్రను ఎంచుకున్న తర్వాత నూనె పోసి వేడిచేసుకోవాలి. అందులో ముందుగా బెండకాయలు, పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయరేకలు వేసి రుబ్బుకోవాలి. నూనెలో వీటిని కమ్మని వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత చేపముక్కలు వేసి వేయించుకోవాలి. పసుపు, కారం, కల్లుప్పు వేసి ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి. ఈ ముక్కల్లో పులుసుతో పాటూ లీటర్‌ నీళ్లు పడతాయి. ఈ పులుసు మరుగుతున్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కనీసం అరగంటపాటు సన్నసెగమీద మగ్గించాలి. కూర దగ్గరకు వస్తున్నప్పుడు వెన్నపూస వేసుకోవాలి.
- అడ్డగళ్ల భగత్‌సింగ్, న్యూస్‌టుడే, పి.గన్నవరం
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment