తెలంగాణను చుట్టేద్దాం!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయం తెలంగాణ గడ్డ.. ముక్కోటి దేవతలు కొలువైన ప్రాంతం, ఆకుపచ్చని అరణ్యాలకు నెలవు, ఆకాశం నుంచి దుంకే జలపాతల కొలువు ..ఆలయాలు, చారిత్రక నేపథ్యం సంతరించుకొన్న కోటలు, రాజభవనాలు ఇలా ఎన్నెన్నో అందాలు..ఒక్కటని కాదు ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ. ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. ప్రపంచ పర్యాటకానికి తీసిపోని దర్శనీయ ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్రంలో కొదువ లేదు. కుటుంబ సభ్యు లతో పిక్నిక్‌కైనా, ఫ్రెండ్స్‌తో విహారయాత్రలకైనా రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలు మనకు కనువిందు చేస్తాయి. ఎక్కడో విదేశాలకు, ఉత్తర భారతదేశ యాత్రలు చేసేదానికంటే తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ప్రయాణాలు చేస్తే సమయంతో పాటు ఒకింత డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
మధుకర్ వైద్యుల,

వందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరి..ఎన్నో అద్భుత కట్టడాలకు, బిన్న సంస్కృతి సంప్రదాయాలకు, భాషాసాంస్కృతిక వైభవానికి నిలయం. నిజాం నిర్మిత కట్టడాలు మొదలు నేటి ఆధునిక నిర్మాణాలెన్నో మనల్ని రా..రమ్మని ఆహ్వానిస్తాయి. ఇండో- అరబిక్- పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యాలకు హైదరాబాద్ కట్టడాలు ప్రతీకలు. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణశైలి వీటి సొంతం. హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని ప్రతీ మట్టి పరిమళాన్ని ఆస్వాదించాల్సిందే..
మెదక్ చర్చి
హైదరాబాద్ మహానగరానికి 100 కి. మీ. దూరంలో ఉన్నది. మెదక్‌లోని ప్రధాన ఆకర్షణ ప్రసిద్ధి గాంచిన చర్చి. గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ వేడుకల సమయంలో ఈ చర్చి అశేష భక్తులతో కిక్కిరిసిపోతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చిలో ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇక్కడ అందమైన సరస్సులు, ఆల యాలు, కోట, చర్చి ఉన్నాయి. సమీపంలో ఏడు పాయల దుర్గా భవాని గుడి, మెదక్ కోట, పోచారం అభయారణ్యం చూడవచ్చు. 

అనంతగిరి కొండలు
ట్రెక్కింగ్‌ను కోరుకోనే వారికి అనంతగిరి కొండలు బాగా ఆకట్టుకుంటాయి. మూసీ నది జన్మస్థానం ఇదే. వికారాబాద్‌కు కేవలం 10 కి.మీ. దూరంలో, హైదరాబాద్ నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న అనంతగిరి కొండల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, నిర్మలమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. కొండల మీద నుండి అద్భుతమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు వీక్షించవచ్చు. రెండు రోజులు షెడ్యూలులో అనంతగిరితో పాటు మృగవనీ నేషనల్ పార్క్, చిలుకూరు బాలాజీ టెంపుల్, లోటస్, పద్మనాభ టెంపుల్, ట్రెక్కింగ్, బర్డ్స్ సందర్శన ప్రత్యేకం.
రవాణా ఖర్చులు:
పర్యాటక శాఖ ప్యాకేజీ పెద్దలకు(నాన్ ఎసీ) రూ.2100, పిల్లలకు రూ.1680, ఏసీ- పెద్దలకు రూ.2900, పిల్లలకు రూ.2350 (నాన్ ఎసీ వసతి, 
భోజనంతో కలిపి).

భద్రాచలం
భద్రాచలం ఖమ్మం నగరం నుండి 115 కి.మీ. దూరంలో గోదావరి నది ఒడ్డున కలదు. ఇక్కడి ప్రధాన ఆకర్షణ రాముల వారి ఆలయం. ఆలయంలో రాముడు, సీతాదేవి విగ్రహాలే కాకుండా ఇతర దైవుళ్లు సైతం కొలువుదీరారు. దీన్ని రామదాసు నిర్మించాడని చెబుతారు. దేవాలయానికి సమీపంలో జటాయువు పాక, గుణదల, పర్ణశాల, దుమ్మగూడెం, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అటవీ ప్రాంతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అభయారణ్యం ఏర్పాటుకు అనుకూలం. కిన్నెరసానిలో రూ.15 కోట్లతో హరిత రెస్టారెంట్, ఎకో పార్క్, గెస్ట్ హౌజ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం 309.3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేక బస్సులు, రైలు సౌకర్యాలున్నాయి. త్వరలోనే విమానాశ్రయం కూడా రానుండడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది.
రవాణా ఖర్చులు:
పర్యాటక శాఖ 
ప్యాకేజీ పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.440 
(వసతి, భోజనం అదనం)

హైదరాబాద్
హైదరాబాద్‌లో తప్పక దర్శించాల్సిన చారిత్రక చిహ్నం చార్మినార్, మక్కామసీద్, ఒకప్పటి హైదరాబాద్ రాజధానిగా కీర్తికెక్కింది గోల్కొండ కోట. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు మధ్యలో ఉన్న అతి పెద్ద జలాశయం హుస్సేన్‌సాగర్. ఈ రెండు నగరాలను కలుపుతూ నిర్మించినట్యాంక్‌బండ్. సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహంతో ఈ చెరువు చుట్టూ లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్, ఎన్టీయార్ గార్డెన్‌లను చూడవచ్చు. నౌబథ్ పహాడ్ అనే చిన్న కొండమీద నిర్మించిన బిర్లా మందిర్, హైదరాబాద్ నిజాంల అధికార నివాసం చౌమహల్లా ప్యాలెస్, షామీర్ పేట్ సరస్సు చూడదగినవి. వీటితో పాటు హైదరాబాద్ నగరంలో సాలార్జంగ్ మ్యూజియం, కింగ్‌కోఠి, పురానీ హవేలీ, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్‌షాహీ టూంబ్స్ వంటి కట్టడాలు చరిత్రకు సజీవసాక్ష్యాలు. లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండుగలకు ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్ నగర పర్యటనలో ముఖ్యమైన ప్రాంతాల పర్యటనను ఉదయం నుండి సాయంత్రం లోపు పూర్తి చేసుకోవచ్చు. తెలంగాణ పర్యాటక శాఖ ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలో బస్సులను నడుపుతుంది.
పెద్దలకు (నాన్ ఎసీ) రూ.250, 
పిల్లలకు రూ.200, 
ఏసీ పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.280 
ధరల్లో హైదరాబాద్‌ను చుట్టెయ్యచ్చు.
నాగార్జున సాగర్
ఆధునిక దేవాలయంగా అభివర్ణించే నాగార్జున సాగర్ డ్యామ్ (26 గేట్లు)ను చూడడం ఒక అద్భుతం. సాగర్‌లో బోటింగ్ చాలా అనందాన్నిస్తుంది. సాగర్ మధ్యలో నాగార్జున కొండపై బౌద్ధుల పవిత్ర స్థలం, బౌద్ధ ద్వీపం చూడవచ్చు. నాగార్జున సాగర్ సమీపంలో చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జలాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు వాడపల్లి, ఛాయా సోమేశ్వర దేవాలయం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను హెరిటేజ్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడికి ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. రైల్వే సౌకర్యం కూడా ఉంది.
రవాణా ఖర్చులు:
పర్యాటక శాఖ ప్యాకేజీ పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.450 (కేవలం ట్రాన్స్‌పోర్ట్) 
కాకతీయ కళా తోరణం
నాటి కాకతీయుల రాజ్యానికి చారిత్రక చిహ్నం కాకతీయ కళా తోరణం. దీనినే వరంగల్ ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. కాకతీయ వంశీయులు తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలనూ పాలించారు. తమ అద్భుత పాలనకు నిదర్శనంగా వారు నిర్మించిన పలు చెరువులు, దేవాలయాలతోపాటు సమీపంలో శిల్పకళలతో ఉట్టిపడే వరంగల్ కోటనూ చూడవచ్చు. ఓరుగల్లు పేరుతో విలసిల్లిన వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా నగరం చుట్టూ ఉన్న మండలాలన్నీ కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా ఆవతరించింది. తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత ప్రధాన రైల్వే జంక్షన్ కాజీపేట ఇక్కడే ఉంది.
వేయి స్తంభాల గుడి
వేయి స్తంభాల గుడి వరంగల్‌కు సమీపాన 8 కి. మీ. దూరంలో ఉన్న హన్మకొండలో ఉంది. ఈ గుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు, ఇతర దేవతలు కొలువై ఉన్నారు. ఈ ఆలయం వేయి స్తంభాలతో, ఆకట్టుకొనే తలుపులతో, శిల్పకళతో, దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా అలరారుతున్నది. ప్రతి బతుకమ్మ పండుగ రోజున ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మను అడడం ఇక్కడి ప్రత్యేకత. ఇంకా ఇక్కడ తెలంగాణ ప్రజలు కొలిచి మొక్కే భద్రకాళి దేవాలయం, ఖుష్ మహల్, నైజాం కాలం నాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉన్నాయి.
రవాణా ఖర్చులు:
పర్యాటక శాఖ వరంగల్‌లోని ముఖ్య ప్రాంతాల పర్యటన ప్యాకేజీ పెద్దలకు 
రూ. 800, పిల్లలకు రూ.650 (ఒక్కరోజు) ఏసీ వసతి పెద్దలకు రూ. 2999, పిల్లలకు రూ.2399 ( ఎంట్రీ ఫీజు, భోజనానికి అదనం)

రామప్ప దేవాలయం
రామప్ప దేవాలయం వరంగల్ పట్టణానికి 70 కి. మీ. దూరంలో ఉన్న పాలంపేట ఊర్లో ఉన్నది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శివుడు కాగా, విష్ణువు, రాముని మందిరాలు కూడా ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన ఈ రామ లింగేశ్వర దేవాలయం(రామప్ప దేవాలయం) పక్కనే రామప్ప చెరువు ఉన్నది. ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంట పొలాలకు సాగునీరును అందిస్తున్నది.
లక్నవరం సరస్సు
లక్నవరం సరస్సుకు చేరుకోవాలంటే గోవిందరావుపేట్ సమీపంలోని దట్టమైన అడవి మార్గం గుండా ప్రయాణించాలి. ఈ సరస్సు వరంగల్ పట్టణానికి 70 కి. మీ. దూరంలో ఉంది. స్థానికులతో లక్కవరం చెరువుగా పిలువబడే ఈ సరస్సు చుట్టూ పచ్చని చెట్లతో నిండిన కొండలు, దట్టమైన అడవి కనువిందు చేస్తాయి. లక్నవరం చెరువులో వేలాడే వంతెన, కాటేజీలు ఆకర్శిస్తాయి.


కిన్నెరసాని
కిన్నెరసాని ఖమ్మం జిల్లా పాల్వంచకు 12 కి. మీ. దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నది. ఇది అద్భుతమైన విహారయాత్రా స్థలం. ఇక్కడ కిన్నెరసాని నదిపై నిర్మించిన రిజర్వాయర్, ఒక అభయారణ్యం, నది మధ్యలో ద్వీపం, మూడు దశాబ్దాలకు పూర్వం సింగరేణి సంస్థ నిర్మించిన అద్దాల మేడను చూడవచ్చు.
రవాణా ఖర్చులు:
పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 (వసతి, భోజనం అదనం)
వేములవాడ వేములవాడ ఎన్నో విశిష్టతల దివ్య క్షేత్రం. ఇది కరీంనగర్ పట్టణం నుండి 32 కి. మీ. దూరంలో కామారెడ్డి వెళ్లే మార్గంలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది. చరిత్ర ప్రసిద్ధి గాంచిన రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కోడె మొక్కుల దేవుడిగా ఆయన పేరొందాడు. దీనిని పశ్చిమ చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తున్నది. సమీపంలో భీమన్న ఆలయం, పోచమ్మ ఆలయం, ట్రెక్కింగ్ ప్రదేశం ఎలగందల్ కోటలను సందర్శించవచ్చు. ఎగువ మానేరు జలాశయం, నాంపల్లి గుట్ట మొదలైనవి కూడా పరిసరాలలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వేములవాడకు బస్సులు నడుస్తున్నాయి.
రవాణా ఖర్చులు:
రూ.200-రూ.500 (వసతి, భోజనం అదనం)
బాసర సరస్వతి ఆలయం
బాసర దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతీదేవి పుణ్య క్షేత్రం. చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతీ దేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమరన బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగి ఉన్న అద్భుతమైన జిల్లా ఇది. గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం అదిలాబాద్ పట్టణానికి 145 కి. మీ. దూరంలో, నిర్మల్ పట్టణానికి 35 కి. మీ దూరంలో ఉన్నది. చాళుక్య రాజులు నిర్మించిన ఈ ఆలయంలో సరస్వతి దేవి, ఇసుక విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. పక్కనే పరవళ్ళు తొక్కే గోదావరి నదిలో బోటింగ్ వినోదాన్ని కలిగిస్తుంది. ఇంకా పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయాలు, స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్ బ్యారేజీ నిర్మల్‌లోని పొచ్చెర, కుంటాల, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతాలను సందర్శించవచ్చు.
అలీ సాగర్
అలీసాగర్ నిజామాబాద్‌కు సుమారు 15 కి.మీ. దూరంలో, నిజామాబాద్ - బాసర రోడ్‌కు 2 కి.మీ. దూరంలో ఉంది. ఇది మానవ నిర్మిత రిజర్వాయర్. దీని చుట్టూ సమ్మర్ హౌస్, దాని పక్కనే పెంచిన గార్డెన్స్ ఐలాండ్, కొండపై ఉన్న అతిధి గృహం, చుట్టూ విస్తరించిన అడవి ఈ ప్రాంత అందాల్ని పెంచాయి. సమీపంలో జింకల పార్క్ ఉంది. ట్రెక్కింగ్, వాటర్‌స్పోర్ట్స్ లాంటి ఆటలకు అవసరమైన సదుపాయాలు కూడా ఇక్కడ పర్యాటకులకు ఆనందం కల్గిస్తాయి. జిల్లాలోని సంస్థానాల కాలంలో కట్టించిన రాజభవనాలు, కోటలు చూడవచ్చు.
రవాణా ఖర్చులు:
పెద్దలకు రూ.1000,
పిల్లలకు రూ.800 
(నాన్ ఎసీ వసతి, భోజనం అదనం)
శ్రీరాం సాగర్
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని లాంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పుట్టినిల్లు నిజామాబాద్. గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతున్నది. ఇంకా ఇక్కడ బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్‌మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అశోకా సాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. వీటితో పాటు బ్రిటిష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్య కళాశాల చూడదగ్గ ప్రాంతాలు. పర్యాటక శాఖ ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని నిర్వహిస్తున్నది.
యాదాద్రి
తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత యాదాద్రిని పునఃనిర్మిస్తున్నది. దేవాలయ నిర్మాణం పూర్తయితే చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఇక్కడ కొలనుపాక జైనదేవాలయం, పోచంపల్లి చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. తెలంగాణ పర్యాటక శాఖ యాదాద్రి భువనగిరి కోట మీదకు కేబుల్ కారు ఏర్పాటు చేయనుంది. దీనివల్ల పర్యాటకంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది.
భువనగిరి కోట
భువనగిరి కోట భువనగిరి పట్టణంలో ఉంది. ఈ కోటను సముద్రమట్టానికి 500 మీ. ఎత్తున కొండమీద 40 ఎకరాల విస్తీర్ణంలో చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. కోడి గుడ్డు ఆకారంలో ఉన్న ఈ కోటలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయి. ఆసక్తి గలవారు కొండ మీదికి ట్రెక్కింగ్ చేసుకుంటూ చేరుకోవచ్చు.
రవాణా ఖర్చులు:
రూ.300-రూ.500 (వసతి, భోజనం అదనం)
పిల్లలమర్రి
మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లలమర్రి, మహబూబ్‌నగర్ పట్టణం నుండి 4 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 800 సంవత్సరాల క్రితం నాటి మర్రి మహా వృక్షం. పక్కనే మ్యూజియం, జింకల పార్క్, చెట్లతో నిండిన చిన్న 
చిన్న కొండలు ఉన్నాయి.

రవాణా ఖర్చులు:
రూ.200-500 (వసతి, భోజనం అదనం)
పొచ్చెర జలపాతం
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ పట్టణానికి 35 కి. మీ. దూరంలో బోథ్ మండలానికి 6 కి. మీ. దూరంలో పొచ్చెర జలపాతం ఉన్నది. చిన్న చిన్న కొండ రాళ్ళ నుంచి ఎగిసిపడే నీటిధార అందాలను చూడటానికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. దగ్గరలో వనదేవత విగ్రహం చూడదగింది. ఎన్నో సినిమా షూటింగ్‌లు ఈ జలపాతం పరిసరాల్లో జరుగుతుంటాయి. ఇంకా ఇక్కడ గాయత్రి, కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడి ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఇంద్రవెల్లి మండలంలో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 304.9 కి.మీ దూరంలో ఈ ప్రాంతాలున్నాయి.
కవ్వాల్ అభయారణ్యం
కవ్వాల్ వైల్డ్‌లైఫ్ స్యాంక్చురీ అదిలాబాద్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ప్రాంతమైన జన్నారం మండలం సమీపంలో ఉంది. సుమారు 893 చ. కి.మీ. మేర విస్తరించిన ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, జింకలు, ఎలుగులు వంటి అనేక అడవిజంతువులతో పాటు వివిధ రకాల పక్షులు, అనేక జాతుల సరీసృపాలను చూడవచ్చు.
రవాణా ఖర్చులు: రూ.500-1000
(ఆయా ప్రాంతాలకు అదనపు చార్జీలతో పాటు వసతి, భోజనానికి అదనం)
కుంటాల జలపాతం
ఈ జలపాతం పూర్వ అదిలాబాద్ జిల్లాలోని అభయారణ్యంలో ఉంది. ఈ జలపాతం ఎన్ హెచ్ 7 పై నిర్మల్ నుండి అదిలాబాద్ వెళ్లే మార్గంలో నేరడిగొండ మండలానికి 12 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో 45 మీ. ఎత్తునుండి జాలువారే ఆ నీళ్ళు, చప్పుళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
గాయత్రి జలపాతం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు సమీపంలో ఉన్న గాయత్రి జలపాతం సాహసాలకు అనువైన ప్రాంతం. ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి రోడ్డుమార్గం లేదు. జలపాతానికి చేరుకోవాలంటే పంట చేలలోంచి మూడు కి.మీ. నడిచివెళ్లాలి. లోయలోకి దిగేందుకు మెట్లు లేకపోవడంతో పర్యాటకులు కాస్త కష్టపడాల్సిందే. నేరడిగొండ నుంచి 4 కి.మీ. ట్రెక్కింగ్ చేస్తూ అక్కడికి చేరుకోవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment