స్నేహ బంధం 

జీవితమనే తోటలో పరిమళించే పుష్పం స్నేహం. చెలిమికి హద్దులు ఉండవు. ఏ కొలబద్దా స్నేహాన్ని కొలవలేదు. మైత్రి ప్రతిఫలాన్ని ఆశించదు. అది మొలకలా పుట్టి మానై ఎదిగి జీవితాంతం తోడు నీడగా నిలుస్తుంది. స్నేహం అద్భుతమైనది. ప్రేమకు చెలిమి ప్రతి రూపమని కవులు రాశారు. స్నేహమేరా జీవితం అంటూ మధురంగా గానం చేశారు.

అన్ని ధర్మాల్లాగే స్నేహధర్మానికీ వాఙ్మయాల్లో గొప్ప స్థానం ఉంది. మనసు తలుపును ఒక్కసారి తడితే, అది తెరుచుకొని, మైత్రిని ఆహ్వానిస్తూ మాధుర్యాన్ని స్నేహ పరిమళాల్ని గుబాళిస్తుంది. ‘స్నేహితుడు దైవంతో సమానం... కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది’ అని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు ఒక ఉత్తరంలో గాంధీ రాశారు. అమ్మకు, నాన్నకు, అన్నకు, అక్కకు, చెల్లికి చెప్పలేని ఎన్నో విషయాలు చెలికాడికి చెప్పుకోవడం సహజం. ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ ‘స్నేహం’ ప్రపంచాన్ని సైతం గెలిపిస్తుంది.

విష్ణు సహస్ర నామాల్లో కృష్ణార్జున చెలిమి ప్రస్తావన ఉంది. ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, కౌంతేయుడైన ధనుంజయుడి కలయిక ఉందో- అక్కడ అన్నీ విజయాలేనని చెబుతారు. స్నేహానికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం లేదేమో. కొన్నిసార్లు స్నేహం బంధుత్వానికీ దారితీస్తుంది. ఫల్గుణుడు స్నేహధర్మంతో శ్రీకృష్ణుడి సోదరి సుభద్రను పెళ్లాడాడు. స్నేహం ఎంత తీయనిదంటే- కురుపాండవ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి రథానికి సారథిగా ఉంటూ విజయ పథాన నడిపించాడు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొంతమంది స్నేహితులు ఒక బృందంగా ఏర్పడ్డారు. క్షతగాత్రులైన పదివేలకుపైగా పౌరులకు, సైనికులకు వీరు వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడారు. వికలాంగులై సర్వం కోల్పోయినవారిని అక్కున చేర్చుకుని, విరాళాలతో ఒక శరణాలయం ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్‌కు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్న ఇరవైమంది శరణార్థులను నాజీల నుంచి కాపాడి వారికి ప్రాణభిక్ష పెట్టారు. 1947లో ఈ మిత్ర బృందానికి నోబెల్‌ బహుమతి లభించింది. స్నేహం వికాసానికి బాటలు వేస్తుందనేందుకు ఇంతకన్నా చక్కని ఉదాహరణ లేదు.

ఆటపాటలాడే బాల్యంలో స్నేహం మొలకెత్తుతుంది. కొందరిలో ఈ మైత్రి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షాల కాలంలో పితృ పితామహులకే కాక మరణించిన స్నేహితులకూ తర్పణాలు విడుస్తారు. పూర్వకాలం నుంచీ స్నేహానికి ఎంత విలువ ఉందో ఈ సంప్రదాయం వల్ల అవగతమవుతుంది.

రామాయణంలో రామ సుగ్రీవుల మైత్రి గురించి వాల్మీకి విలక్షణ రీతిలో ప్రస్తావించారు. మిత్రధర్మానికి కట్టుబడినవాడిగా రామాయణంలో సుగ్రీవుడు కనిపిస్తాడు. కబంధుడు సకలాభరణుడైన గంధర్వుడై హంసల విమానంలో వెళుతూ- ‘రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుడి అవసరం ఉంది. నీవు సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే సీతను వెదకడంలో అతడు నీకు సహాయపడతాడు. నీలాగే అతడూ భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు’ అని అన్నాడు. రాముడు అరణ్యంలో రుశ్యమూక పర్వతం సమీపించాక హనుమ తనను తాను పరిచయం చేసుకొని రామలక్ష్మణులను ఆ పర్వతంపైకి చేర్చాడు. అన్నదమ్ములిద్దరినీ సుగ్రీవుడికి పరిచయం చేస్తాడు. స్నేహాన్ని కాంక్షించి వచ్చిన శ్రీరాముణ్ని అగ్నిసాక్షిగా సుగ్రీవుడికి మిత్రుడిగా చేస్తాడు. స్నేహానికి అంతటి పవిత్రత ఉంది.

‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే... మిత్రులు వంద అయినా తక్కువే’ అన్నాడు వివేకానందుడు. మనం చేసిన తప్పుల్ని వివరించి, మార్గనిర్దేశం చేసేవాడే నిజమైన మిత్రుడు. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం. స్నేహం వల్ల అహం తొలగిపోయి, ఆ స్నేహితుడే హితుడై మనల్ని ముందుకు నడిపిస్తాడు. నిజానికి మంచి స్నేహితుడే మార్గదర్శి!
- అప్పరుసు రమాకాంతరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment