.

------
online లో
కొనుగోలు చేయుటకు Devullu.Com
క్లిక్ చేయగలరు.
------
ఇది పరమాత్మతత్త్వం 
నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు 
సెప్టెంబరు 2 శ్రీకృష్ణ జన్మాష్టమి

గోకులంలో నందకిశోరుడుగా... నవనీత చోరుడుగా ఉన్నా... కురుక్షేత్రంలో అర్జున రథసారథిగా మారి... కర్తవ్యాన్ని బోధించి మహాభారతాన్ని నడిపినా పరమాత్మది భిన్నమైన శైలి... ఆయన అడుగుజాడలే కాదు ఆహార్యం కూడా అద్భుతమే... ఆయన రూపవిలాసంలో ప్రస్ఫుటంగా కనిపించేవి... అందంగా ఇమిడిపోయినవి నెమలి పింఛం... పిల్లన గ్రోవి... ఓ పక్షి శరీరంపై ఉన్న ఈకలు భగవానుడి అలంకారమయ్యాయన్నా, వనంలోని వెదురు ఆయన చేతిలో రాగాలు పలికించిందన్నా వాటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలే కారణం...

నల్లనయ్య సిగలో నిగనిగలాడుతూ, ఠీవిగా నిలబడే నెమలిపింఛాన్ని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కృష్ణుడు అనగానే నెమలిపింఛం గుర్తుకు వస్తుంది. కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారం కూడా పింఛమే. నెమలి ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది.

* నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు... లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్ల పక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి.

* నెమలి తన జీవితకాలమంతా అందరినీ ఆకర్షిస్తుంది. అందరూ నెమలిని చూసి ఎంతో ఆనందిస్తారు. జీవితం ముగిసిన తర్వాత కూడా నెమలి వదిలిన పింఛం కూడా నెమలి తీరులోనే అందరినీ ఆకర్షిస్తుంది.కొద్దికాలం జీవించిన నెమలి కన్నా జీవం లేకపోయినా నెమలి పింఛం మాత్రం తరతరాలపాటు అందరి మనసుల్నీ మురిపిస్తూనే ఉంటుంది. మానవ జీవన సత్యం ఇందులో దాగి ఉంది. బతికినన్నాళ్లూ అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు. కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా ఆ జ్ఞాపకాలను అట్టిపెట్టుకునే ఆప్యాయత మనం సంపాదించుకోవాలి.

* నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్దితే ప్రాణం ఉన్నదానిలా మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ ప్రవాహానికి సంకేతం. మనిషి మనసుది కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన అంశంతో ఎక్కువసేపు రమిస్తే అతడి మనస్సు అమితమైన ఆనందం పొందుతుంది.

* నెమలిపింఛంలోని రంగులు, వాటిలోని వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించారు. ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక వల్ల పింఛంలో విభిన్నమైన రంగులు ఏర్పడుతున్నాయని కనుగొన్నారు. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి.చూడటానికి పింఛాలన్నీ ఒకేతీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ సృష్టిలోని మనుషుల లక్షణాలకు సంకేతంగా నిలుస్తాయి. ఎవరి కర్మలు భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా పరమాత్మ ఆదరణకు పాత్రుడవుతాడు.

* పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది. మనిషి మనసు కూడా లోపల, బయటా ఒకేవిధంగా ఉండాలని పింఛం అందిస్తున్న సందేశం ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదనే సత్యాన్ని పింఛం మనిషికి బోధిస్తుంది.

* కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. ఉండబట్టలేక, నేరుగా వేణువు దగ్గరకే వెళ్లి అడిగారు. ఏమమ్మా! ఏమిటీ నువ్వు చేసుకున్న పుణ్యం. గోపయ్యను కట్టేసుకున్నావు. ఏం మాయ చేశావు? నీకు ఇంతటి శక్తి ఎలా వచ్చిందని నేరుగా అడిగేశారు. వేణువు అందికదా... ‘నేను చేసింది ఏమీ లేదమ్మా! నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. తత్త్వం బోధపడింది గోపికలకు. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వికారాలకు మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.

* ఇతర వాద్యాలకు భిన్నమైన సంగీత వాద్యం వేణువు. ప్రకృతిలో అత్యంత సహజంగా లభించే వెదురు పదార్థం నుంచి తయారైంది. ఏవిధమైన ఆడంబరాలు, అలంకారాలు, బిగింపులు లేవు. మనిషి కూడా వేణువు కావాలి. అత్యంత సహజమైన భక్తి భావంతో ఉండాలి. వేణువు అందిస్తున్న సందేశం ఇదే.

* వేణువులో ఉండే రంధ్రాలు మానవశరీరంలో ఉండే షట్చక్రాలకు సంకేతం. వేణువులోని ప్రధానరంధ్రం ద్వారా గాలి ఊదుతూ, ఇతర రంధ్రాల మీద వేళ్లు ఉంచి, ఆ వాయువును నియంత్రిస్తే, కమ్మనైన నాదం ఆవిర్భవిస్తుంది. ఆ నాదం పరమాత్మకు పూజా పుష్పంగా మారుతుంది. యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. దీన్నే యోగపరిభాషలో ‘హంస’ అంటారు. షట్చక్రాల్లో సాగే వాయుసంచారాన్ని నియంత్రించటమే యోగసాధన. ఎప్పుడైతే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధ్యమవుతుందో, ఆ సాధకుడు యోగిగా మారుతాడు. వేణునాదం మన జీవన నాదానికి ప్రతిరూపం.  - డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, విజయవాడ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment