జన్మజన్మల పాప పరిహారానికి
గోమాత సాయం

"పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే" పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపం వ్యాధి రూపంలో మనని బాధిస్తుంది. అటువంటి పాపాల వల్ల సంక్రమించే వ్యాధులకు గోమాత ద్వారా పరిష్కారాలున్నాయి. ధర్మశాస్త్రాలు వాటిని సూచించాయి. శాతాతప స్మృతి ఇలా చెప్పింది: పూర్వజన్మలో కొంగను హింసిస్తే అది పాతకమై అనంతర జన్మలో ముక్కుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అందవికారమైన ముక్కు కారణంగా పరిహాసానికి గురికావడం లేదా ముక్తికి సంబంధించిన వ్యాధులతో బాధపడడం ఉంటుంది. అట్టి వారు తెల్లగోవును దానం చేయడం ఆ పాపానికి పరిష్కారం. 

అలానే గత జన్మలో కాకిని హింసించిన వారు ఈ జన్మలో చెవి సంబంధమైన వ్యాధితో బాధపడతారనీ, దానికి పరిహారంగా కృష్ణవర్ణ ధేనువును అంటే నల్లని ఆవును దానం చేయాలనీ చెప్పారు. పూర్వజన్మలో వంచన చేసినవారు ఆ వంచన దారుణమైన ఫలితాన్ని ఇవ్వడం వలన ఈ జన్మలో మూర్ఛరోగంతో బాధపడతారు. దానిని పోగొట్టుకోవడానికి కపిల గోవును దానం చేయాలని శాతాతపుడు తెలిపాడు. శాతాతప స్మృతి 109వ శ్లోకం ఇలా చెప్పింది. 

ఖల్సాటః పరనిందావాన్ ధేనం దద్యాత్ స కాంచనామ్ 
పరోపహసకృతే కాణః స గాం దద్యాత్ స మౌక్తికామ్ 


పూర్వజన్మలో ఎవరు పరనింద చేశారో, వారికి ఈ జన్మలో బట్టతల వస్తుంది. ఆ పాప పరిహారార్థం బంగారంతోపాటు గోవును దానం చేయాలి. పూర్వజన్మలో పరులను ఎగతాళి చేసిన వారికి ఈ జన్మలో ఒక కన్ను కనబడదు. పరిహారంగా వారు గోవును ముత్యంతో దానం చేయాలి. పాప తీవ్రత పెరిగిన వారు ఆత్మహత్య చేసుకోవాలనే దుశ్చింతలకు లోనవుతారు. అట్టి తీవ్రతాపం జన్మజన్మలలో అనేక రీతులుగా బాధించవచ్చు. కాబట్టి వేదాలు పాపపరిహారం అనంతర జన్మలకు కూడా ఉపకరిస్తుంది. ఇలా వేదాలు, ధర్మశాస్త్రాలు గోమాతను గురించి ఎంతగానో తెలిపాయి. 

గోవులే ఐశ్వర్యం. గోవులే ఇంద్రియ బలవర్థకాలు. సోమరసంలో గోక్షీరాలను తప్స వేరే వాటిని కలుపకూడదు. సోమరసం అంటే యజ్ఞాలలో దేవతలకు ప్రీతికరంగా సోమరసాన్ని సమర్పించడానికి సోమలత నుంచి సిద్ధం చేసింది. వాటిలో కలపడానికి యోగ్యమైనది ఆవుపాలు మాత్రమే. కాబట్టి ఓ మానవులారా! గో సంపదను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గోవులే ఐశ్వర్యాన్నిఇచ్చేవని ఋగ్వేదంలోని 4-28-5 ఋక్కు తెలియజేస్తుంది.

"గావో భ గో గావ ఇంద్రో యే ఇచ్చాద్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమా వాయా గావః సజనా స ఇంద్ర ఇచ్ఛామి ధ్రుదా మానసా చిదింద్రిమ్"

స్మృతి సంగ్రహం ఆ విషయాన్నే బలపరుస్తూ ఇలా తెలియజేసింది. 


గవాం సేవాతు కర్తవ్యా గృహస్థైః పుణ్య విప్సుభిః
గవాం సేవాపరో యస్తు తస్య శ్రీర్వర్ధతే చిరాత్ !!


పుణ్యాన్ని ఆకాంక్షించే గృహస్థులు తప్పక గోసేవ చేయాలని ఆ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అలా గోసేవ చేసేవారికి సంపద చిరకాలం వర్థిల్లుతుందని తెలిపింది. అందుకే అథర్వవేద ఋషి దేవతలను ప్రార్థిస్తూ 'ఓ దేవా! మా భార్య, పిల్లలకు గోసంపదకు మంగళం జరిగేటట్లు చేయవలసింది' అంటారు. సామవేదం 20-7 లోనూ, ఋగ్వేదం 8-14-3 లోనూ ఇంద్రుడిని స్తుతిస్తూ గో సమృద్ధిని ఈయవలసినదిగా ప్రార్థించడం జరిగింది. 

అలాగే సామవేదంలో 1-3లో కూడా "క్షుమంతం వాజగ్ం సహస్తిణాయాక్షు గో మంత మీ మహే" అని గో సంపత్తిని విశేషంగా ఇమ్మని కోరటం జరుగుతుంది. ఎందుకంటే ధేనుం సదనమ్ రణియానాం అని అథర్వణం 11-1-34 లో ధనసంపదకు ప్రాప్తి స్థానం గోవు అనీ, గోవు ఉన్న గృహానికి సౌభాగ్యం కలుగుతుందని తెలిపింది. శుక్ల యజుర్వేదం 7-10 మంత్రంలో మిత్రావరుణ దేవతలకు యజ్ఞం ద్వారా హవిస్సులు సమర్ఫించడం వలన వారు తృప్తి పొందుతున్నారని, ధేనువు పచ్చి గరిక తిని తృప్తి పొంది పాలు, పెరుగు, నెయ్యి ఇవ్వడం వల్లనే యజ్ఞకర్మలు నిర్వఘ్నంగా జరుగుతున్నాయనీ, ఆ కారణంగా సర్వ సంపదలకు సాధనంగా గోవును గ్రహించాలని చెప్పడం జరిగింది. 

ధర్మ శాస్త్రాలు గోవును అనేక రీతుల ప్రశంసించాయి. "పంథా దేయో బ్రాహ్మణాయా గవే రాజేహ్య చక్షుషే" అని చెప్పింది బోధనాయ స్మృతి. అంటే బ్రహ్మణుడు, గోవు, రాజు, అంధుడు దారిలో ఎదురైతే, వారికి దారి ఇస్తూ మనమే పక్కకి తప్పుకోవాలని తాత్పర్యం. అంతే కాదు. వేద ధ్వని వినబడని గృహము, అలంకృతమైన ఆదరింపబడుతున్న గో సంపద లేని ఇల్లు ఇల్లే కాదని కూడా చెప్పింది. 

"గాం ధృహ్యంతే పర మై నీచక్షేతన చైనం వా రమేత్" అని గౌతమ మహర్షి తన గౌతమ స్మృతిలో చెప్పాడు. అంటే గోవు పాలు తాగి మానవులందరూ లాభం పొందుతున్నారు తప్ప గోవు ఏ లాభమూ పొందడం లేదు. అంటే గోమాత పరోపకారం కోసమే పాలనిస్తోంది అని భావం. పంచగవ్యాలైన గోమూత్రం, గోమయం, గోక్షీరం, ఆవు పెరుగు, ఆవు నెయ్యిలను ఆహారంగా స్వీకరించి, ఐదు రాత్రులు ఉపవాసం చేస్తే వారి సమస్త మహాపాతకాలూ తొలగిపోతాయి అని చెప్పాడు వశిష్ఠుడు తన స్మృతి (11-380)లో. యమ స్మృతి కూడా (71-72)లో కపిల గోవు నెయ్యి తాగిన వారికి మహాపాతకాలు నశిస్తాయని చెప్పింది. 

ఈ విధంగా జన్మజన్మల పాపాలను మనం గోవు ద్వారా పటాపంచలు చేసుకోవచ్చు. జన్మజన్మల మేలుని పొందవచ్చు. 
డా. అన్నదానం చిదంబర శాస్త్రి

post
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment