మీ ఇంటికి...



ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే...



మీ ఇంటికి... ఇల్లాలికి శుభం జ‌ర‌గాలంటే... కొన్ని నియమాలను పాటించాలి. భర్త అనురాగం పెరగటానికి... సంతాన భాగ్యానికి... సిరిసంపదలు పొందటానికి... వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలు పాటించి చూడండి.

- మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి. భర్తకు అనారోగ్యం, భార్యాభర్తల పట్ల అనురాగం తగ్గటం ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి.

- స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.

- ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.

- సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం, సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

- ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.

- వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి... వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.

- పని మనిషిరానప్పుడు విసుగు చెంది కోపంతో బాధపడే కంటె, పని మనిషి కంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను, వాళ్ళ‌కంటే నేనైతే శుభ్రంగా ఉంచుకోగలనని మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీ పనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి. అసలు పని మనిషిని మానిపించాలనే అనిపిస్తుంది మీకు.

- భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత ఒక చిన్న స్పూన్ అంటే సుమారు అర గ్రాము కరక్కాయ పౌడరును ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి. ఇలా అరవై రోజులు చేస్తే.... వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలామంచిది. మొదట దీనిని తాగనని మారాం చేస్తారు. కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటు చేయండి ఈ ఔషధాన్ని. తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.

- సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది.

- అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.

- ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.

- పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి ధ‌రించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి .

- మంచి తీర్థంలో రెండు తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలాలంత పవిత్రమవుతాయి.

- కూర్చునే పీఠానికి శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి. చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి.

- భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి.

ఆ... ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే సోమరిపోతు వాదనలు చేసేవారిని వదిలేయండి. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి. వీటిని పాటించటానికి మీకు ఖర్చేమీ కాదు కదా? కొంచెం శ్రద్ధ కావాలి అంతే.

----------------------

ఇల్లాలి గౌరవమే ఇంటి గౌరవం! 


ఎంత చదువుకున్నా ఎంత ఆధునిక కాలమైనా పుట్టింటినీ, కన్నవారినీ, అందర్నీ వదిలి అత్తవారింటికి వచ్చిన నవవధువు ఆదిలో కంగారు పడడం సహజం. ఇంటా బయటా కొత్తవాళ్లు.. ఎవరేమంటారో? ఎవరెలా ఉంటారో అంటూ అడుగడుగునా తొట్రుపాటు పడడమూ తెలిసిందే. ఇది దాదాపు ప్రతి కొత్తకోడలూ ఎదుర్కొనే ఇబ్బందికర సన్నివేశమే. బిక్కుబిక్కుమంటూ బెరుకుగా వచ్చిన కోడల్ని అత్తింటివారు ప్రేమగా ఆహ్వానించాలి.. ఆదరించాలి తప్ప ఆధిపత్యధోరణితో మరింత బెదరగొట్టరాదు. చిన్నబుచ్చరాదు.

‘ఏంట్రా మీ ఆవిడ బాగా ఛాదస్తం మనిషిలా ఉందేంటి?’ అనో-

‘ఏంట్రా నీ శ్రీమతి ఎప్పుడూ మూతిముడుచుకునే ఉంటుందా?’ అనో ఏ కుటుంబ సభ్యుడో/ బంధువో హేళనచేస్తే ఆ భర్తగారు కచ్చితంగా అవమానపడతాడు. తర్వాత దాని ప్రభావం భార్యపై ఏదో ఒక రూపంలో పడుతుంది. అసలు ఇలాంటి బయటివారి వ్యాఖ్యలూ అభిప్రాయాలే నవదంపతుల మధ్య అగ్గిరాజేస్తాయి. అంచేత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కాస్తంత ముందూ వెనుకా ఆలోచిస్తే చాలా సమస్యలు మొగ్గతొడగనే తొడగవు. నవదంపతులు కూడా వాటిని మనసుకు తీసుకోకుండా ఉంటే మరీ మేలు.

చాలా కుటుంబాల్లో కొత్తకోడలు కాపరానికి వచ్చినప్పుడు ముఖ్యంగా గ్రామాల్లో అమ్మలక్కలంతా ఆమెను చూడడానికి వారింటికి చేరతారు. పుట్టింటివారు సారె, చీరె పెట్టి పంపుతారు కాబట్టి వాటిని స్వీకరించడానికి కూడా వస్తారు. వచ్చినవాళ్లు ఊరికే ఉండకుండా ఆ అమ్మాయిని బోనులో నిలబెట్టినట్టు నిలబెట్టి రకరకాల ప్రశ్నలువేసి, పరాచకాలు చేసి, ఆటపట్టిస్తూ బెదరగొట్టేస్తుంటారు. ‘ఏంటమ్మా.. మీ అమ్మావాళ్లు లడ్డూలంటూ గోళీకాయలు పంపారేంటి?’ అని ఒకావిడంటే - ‘ఏం తల్లీ గోళీకాయల్ని మీ ఊళ్లో లడ్డూలంటారా?’ అంటూ మరో ఇల్లాలు హాస్యం పేరుతో అపహాస్యం చేస్తుంది.. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదే. ఆ సమయంలో అత్తగారో ఆడపడుచులో కొత్తకోడలికి బాసటగా వస్తే బాధేలేదు.. అలాకాక వాళ్లుకూడా పేరంటాళ్లతో కలిసి పకపక నవ్వితే ఆమె చిన్నతనానికి లోనవుతుంది.. అసలే కొత్తకోడలు- కొత్తమనుషులు, కొత్త ఊరు, కొత్త వాతావరణంలో కంగారుపడి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడిందో ఇక రభసే! వేళాకోళాలు వెక్కిరింతలే! దాని సెగ అత్తగారింట్లోకీ పాకుతుంది. అతిథుల్ని ఏమనలేరు కనుక కోడల్నే మందలిస్తారు. దెప్పిపొడుస్తారు. ‘నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. ఇలా నవ్వకుండా ఉండాల్సింది..’ అంటూ అంతా వెళ్లాక ఆమెకు ఉపదేశాలు చేస్తారు. కొండొకచో ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తారు.. భర్త వచ్చాక అతనికి ఫిర్యాదు చేస్తారు. కనీసం అతనన్నా ఆమెను సమర్థిస్తూ మాట్లాడితే ఆ నవవధువుకు పోయిన ప్రాణం లేచొస్తుంది. అతనూ సాధింపుల పర్వం సాగిస్తే ఆదిలోనే హంసపాదన్నట్టు ఇక జీవితం మీదే విరక్తి పుడుతుంది. భార్యకు జరిగిన అవమానం తనకు జరిగిన అవమానంగా భర్త భావించాలి. ఒకవేళ ఆమె పుట్టింట అతనినెవరైనా న్యూనత పరిస్తే తన భర్త గౌరవం కాపాడడానికి వధువు సైతం నడుం కట్టాల్సి ఉంటుంది. అలా ఒకరికొకరుగా నిలబడితేనే అన్యోన్య దాంపత్యం అవుతుంది.

ఇదే భావనను మహాకవి శ్రీశ్రీ - 
‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు 
నీకోసమె కన్నీరు నించుటకు 
నేనున్నానని నిండుగ పలికే 
తోడొకరుండిన అదే భాగ్యమూ 
అదే స్వర్గమూ..’ అన్నారు.

ఆ పరిస్థితి కరవై అత్తింట్లో కొత్త కోడలికి ప్రేమ, ఆప్యాయత లభించకుంటే ఆమె జీవితం నరకమవుతుంది. దాని ప్రభావం కుటుంబం మొత్తంమీద పడుతుంది. కుటుంబంలో అశాంతికి మూలమవుతుంది. ఇరుపక్షాల నడుమ కలతలకు, కలహాలకు కారకమవుతుంది. వధూవరుల బంధం కష్టాల్లో పడుతుంది.

నిజానికి కోడలంటే అత్తింటికి మహారాణి. ఆమె ద్వారానే ఆ వంశం నిలబడుతుంది. ఎందుకంటే ఆ వంశోద్ధారకులకు జన్మనిచ్చేది తనే. అత్తింటివారి భవిష్యత్తునంతా లిఖించేదీ శాసించేది ఆమే. అలాంటి మనిషి మహారాణికాక మరేమవుతుంది? ఈ సత్యం భర్తతోపాటు అత్తింటివారు, వారి బంధుమిత్రులంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కోడళ్లను కూతుళ్లుగా చూచుకునే అత్తమామలు లేకపోలేదు. వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి. అలాగే అత్తమామల్ని కన్నతల్లిదండ్రుల్లా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమకుందని కోడళ్లు మరవరాదు. ఇది తెలుసుకుంటే ప్రతి ఇల్లూ నిత్యకల్యాణం పచ్చతోరణమే!
- చంద్రప్రతాప్‌

post
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment