అధికారులొస్తున్నారు..!
మీరు జీఎస్‌టీ సక్రమంగానే కడుతున్నారా?
ఎప్పటికప్పుడు రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారా?
ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘అవును’ అయితే ఫర్వాలేదు..
కాదు అయితేనే ‘ఇబ్బంది’.
ఎందుకంటే కార్యాలయాలు/ వ్యాపార సంస్థల పరిశీలనకు జీఎస్‌టీ అధికారులు వస్తున్నారు.
ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ.
గత వారం ముగ్గురు అధికారులు నా కార్యాలయానికి విచ్చేసి ఆరు నెలలుగా రిటర్న్‌లు ఎందుకు దాఖలు చేయడం లేదని నన్ను అడిగారు. ఆరు నెలల క్రితమే జీఎస్‌టీ లైసెన్సును సరెండర్ చేశాను, అందుకే రిటర్న్‌లు దాఖలు చేయలేదని నేను వాళ్లకు వివరించాను. ఆ అధికారులునాతో సుహృద్భావ రీతిలో వ్యవహరించారు.

కార్యాలయాన్ని పరిశీలించామనే రుజువు కోసం నా పేరు బోర్డు, నేను జారీ చేసిన పన్ను రశీదులు, కార్యాలయ ప్రాంత ఫొటోలు తీసుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. జీఎస్‌టీ అధికారులు ఏ క్షణమైనా మీ కార్యాలయంలోనూ అడుగుపెట్టొచ్చు. వాళ్లు వచ్చాక జరిమానాలు లాంటి చర్యలు ఎదుర్కోవడం కంటే సకాలంలో పన్నులు చెల్లించి, రిటర్న్‌లు దాఖలు చేస్తే మీకే మంచిది.
జీఎస్‌టీ కింద నమోదైన వ్యక్తుల కార్యాలయాలను పరిశీలించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పన్ను అధికారులు క్షేత్ర పర్యటనల బాట పట్టారనడానికి నా ఉదంతమే నిదర్శనం. పన్ను ఎగవేతల నియంత్రణకు, వ్యాపారులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చేసేందుకు ఈ పరిశీలనలు దోహదపడతాయి. ఒక్కసారి పన్ను అధికారులు క్షేత్ర పరిశీలనకు రావడం ప్రారంభమైతే జీఎస్‌టీ చట్టం అమలు మరింత సమర్ధంగా తయారవుతుంది. పన్ను వసూళ్లు పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం పన్ను రేట్లు తగ్గించే వీలుంటుంది. తద్వారా వినియోగదారుడికి మేలు జరుగుతుంది.
క్షేత్ర పర్యటనలతో లాభాలేంటి?
* వస్తువులు, సేవల అక్రమ అమ్మకాల నియంత్రణకు క్షేత పర్యటనలు ఆయుధంగా పనిచేస్తాయి.
* పన్ను అధికారులు తమ కార్యాలయాలు పరిశీలించేందుకు వస్తారేమోననే భయం ఉంటుండటంతో పన్నులు సక్రమంగా కడతారు. పన్ను ఎగవేతలు తగ్గి వసూళ్లు పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ పరిణామంతో పన్ను రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు వస్తువులు, సేవలు మరింత చౌక అవుతాయి.
* రశీదు, ఇ-వేబిల్లులు లాంటి సరైన పత్రాలు లేకుండా వస్తువుల సరఫరా/ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.
లేఖలు.. అరెస్టులు
సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేయని వ్యక్తులు/ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపిస్తోంది. రిటర్న్‌ల్లో తప్పుడు వివరాలు పొందుపరిచి సమర్పిస్తున్న వారికి కూడా వివరణ ఇవ్వాలంటూ లేఖలు వెళ్తున్నాయి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు 50 మందిని పైగా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అధికంగా క్లెయిమ్ చేసుకోవడం, వస్తువులు సరఫరా చేయకుండానే బిల్లులు ఇవ్వడం లాంటి వివిధ కారణాలతో వీళ్లను అరెస్టు చేశారు. ఉక్కుపాదం మోపాలి..
వాస్తవానికి జీఎస్‌టీ అమల్లోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఇప్పటికీ సరైన పత్రాలు లేకుండా వస్తువుల సరఫరా/ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది పన్ను ఎగవేతలకు దారితీస్తోంది. కొందరు వ్యాపారులు కావాలనే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా వస్తువులను సరఫరా చేసి పన్నుల ఎగవేతకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పనులను ఉపేక్షించడం కచ్చితంగా ప్రభుత్వ అసమర్థతే. అందుకే ఈ తరహా కార్యాకలాపాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి.
రశీదు అడుగుతున్నారా?
పన్ను వసూళ్లను కాపాడుకునేందుకు, జీఎస్‌టీ చట్టాన్ని సమర్ధంగా అమలుచేసేందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేస్తోంది. అదే సమయంలో దేశంలోని ప్రతి పౌరుడు కూడా తమ వంతు కర్తవ్యంగా ఆర్థికవ్యవస్థ పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉంది. అసలు వస్తువులు/ సేవల కొనుగోలు అనంతరం ఎంత మంది రశీదు తీసుకుంటున్నారు? ఇది ప్రతి పౌరుడిని నేను అడుగుతున్న ఒకే ఒక్క చిన్న ప్రశ్న. ఒకవేళ మీరు రశీదు తీసుకోవడం లేనట్లయితే దేశ పౌరుడిగా మీ వంతు బాధ్యతను మీరు నెరవేర్చడం లేదనే అనుకోవాల్సి వస్తుంది. అందుకే మీరు ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా.. ఎలాంటి చిన్నపాటి సేవకైనా రశీదును అడగండి. ప్రతి వినియోగదారుడు రశీదు అడగడం ప్రారంభిస్తే ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే దాని వల్ల దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. రశీదును అడగం వల్ల ప్రతి ఒక్క లావాదేవీ వివరాలు ప్రభుత్వం వద్ద నమోదువుతాయి. పన్ను వసూళ్లు పెరగడానికి దోహదం చేస్తుంది. దాంతో పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించేందుకు అవకాశం ఉంటుది. దేశ మంచి కోసం మనం చేసే ప్రతి పని వల్ల కేవలం ఒక్క దేశానికే కాదు మీకు, నాకు అందరికీ మేలు కలుగుతుంది. మనకు లేదా బాధ్యత..
పన్ను ఎగవేతల నియంత్రణలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో.. వినియోగదారుడికీ అంతే ఉంది. ఉదాహరణకు.. టోకు ధర (హోల్‌సేల్ రేట్) మార్కెట్‌లో రశీదు లేకుండా వస్తువులు దొరుకుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. సరైన పత్రాలు లేని వస్తువుల అమ్మకాలకు అడ్డుకట్ట వేయడంలో గత 16 నెలలుగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. వినియోగదారుడు తన వంతు కర్తవ్యంగా రశీదు అడిగితే విక్రయదారు రశీదు ఇవ్వకుండా ఉంటాడా? కచ్చితంగా ఇచ్చే తీరుతాడు. అప్పుడు హోల్‌సేల్ విక్రయదారు కూడా తయారీదారు నుంచి రశీదుతోనే కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకే అక్రమ అమ్మకాల నియంత్రణకు ప్రభుత్వం, వినియోగదారుడు కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. చౌక ధరకే వినియోగదారుడికి వస్తువులు, సేవలు దొరుకుతాయి.
ముగింపు..
ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వినియోగదారు రశీదు అడగడం వల్ల సత్ఫఫలితాలు కనిపిస్తుండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం మాత్రం నా మదిని తొలుస్తోంది. అదేమిటంటే పన్ను అధికారులు క్షేత్ర పర్యటనకు వెళ్లినప్పుడు సుహృద్భావంగా మెలుగుతారా? లేదా? అని. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా పన్ను అధికారులు అంటే వ్యాపారుల్లో ఓ రకమైన అపోహ నెలకొంది. ఇప్పుడు ఆ అపోహను పోగొట్టేందుకు అధికారులు కృషి చేయాలి. సుహృద్భావ మార్గంలో నియమ నిబంధనలపై వ్యాపారులకు ఓ అవగాహన కలిగించేలా క్షేత్ర పరిశీలనలు సాగాలి. నియమ నిబంధనలు పాటిస్తూ, నిజాయతీగా వ్యవహరించే ఓ ఒక్క వ్యాపారికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా వ్యవహరించాలి.
మీ సందేహాలు పంపండిజీఎస్‌టీకి సంబంధించి మీ సందేహాలు మాకు పంపించండి.. మీ సందేహాలు ఎలాంటివైనా సరే అవి క్లుప్తంగాను, సరళంగాను ఉండాలి..మా చిరునామా
eenadubusinessdesk@gmail.com; businessdesk@eenadu.net
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment