బయటపడ్డ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుల మోసం | Xerox Center Administrators Fraud |
బయటపడ్డ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుల మోసం | Xerox Center Administrators Fraud |

బయటపడ్డ జిరాక్స్ సెంటర్ 
                     నిర్వాహకుల మోసం

అమ్ముకుంటున్న కొన్ని ఏజెన్సీలు
కొనుక్కుంటున్న సైబర్‌ నేరస్థులు
ఆధార్‌, క్రెడిట్‌, డెబిట్‌,, సెల్‌ నంబరు సహా..
వాటితో మోసాలకు పాల్పడుతున్న ఘనులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ,: మన వ్యక్తిగత సమాచారం బహిరంగ మార్కెట్‌లో బట్టబయలవుతోంది. మీ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌.. చివరికి మీ సెల్‌ నెంబర్‌ కూడా కొందరికి సొమ్ము చేసి పెడుతోంది. దర్జాగా మన నుంచి సేకరించిన సమాచారాన్ని కొందరు సైబర్‌ నేరస్థులకు విక్రయిస్తున్న ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇలా వివిధ ఏజెన్సీలు, సంస్థల నుంచి కార్డు హోల్టర్ల వివరాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఏకంగా కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, మాటల్లో పెట్టి మన ఖాతాలను లూటీ చేస్తున్నారు.

కస్టమర్ల నుంచి సేకరించి..

బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసే కొన్ని ఏజెన్సీలు కస్టమర్ల నుంచి సేకరించిన ఫోన్‌ నెంబర్లను నెంబర్‌కు ఇంత అని ధర నిర్ణయించి సైబర్‌ నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు.
కొత్త సిమ్‌ కొనుగోలు చేస్తున్న కస్టమర్ల నుంచి టెలీకాం సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు సేకరించిన సమాచారాన్ని, చిరునామాలను, ఫోన్‌ నెంబర్లను ఏజెన్సీలకు కమిషన్‌ రూపంలో అమ్ముతున్నారు.
‘షేర్‌’ సమాచారం కూడా..
షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న, గతంలో పెట్టుబడులు పెట్టిన షేర్‌ హోల్డర్స్‌ వివరాలను సైతం సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసి కోట్లు కొల్లగొట్టారు. ఆ ముఠాను ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవే టు డాటాబేస్‌ సంస్థ నుంచి షేర్‌ హో ల్డర్స్‌ వివరాలు కొనుగోలు చేసిన కొం దరు ఫోరెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో షేర్‌ హోల్టర్స్‌కు ఫోన్‌ చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ముగ్గులో కి దింపి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ఇలా మోసం చేసిన రాజస్థాన్‌, ముం బైకి చెందిన ముఠాలను అరెస్టు చేశారు.

ఉద్యోగాల పేరిటా..

ఆన్‌లైన్‌లో ఉద్యోగాలిస్తామని, రెజ్యూమ్‌ వివరాలు అప్‌లోడ్‌ చేయాలని నిరుద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్న కొందరు ఉద్యోగం చూపకపోగా నిరుద్యోగుల సమాచారాన్ని కొన్ని కాల్‌సెంటర్లకు అమ్ముకుంటున్నారు. దాంతో సైబర్‌ కేటుగాళ్లు ఉద్యోగాల ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఫోన్‌ చేసి, ఆన్‌లైన్‌లో నకిలీ నియామక పత్రాలు పంపడంతో పాటు వివిధ రకాల ఫీజుల పేరుతో రూ. లక్షలు కాజేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జాబ్‌ కన్సల్టెన్సీ సంస్థలు సైతం ముఠాలుగా ఏర్పడి ఇలాంటి దందా కొనసాగిస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది.


జిరాక్స్‌ పత్రాలు..

కొందరు జిరాక్స్‌ సెంటర్‌ నిర్వాహకులు తమ వద్దకు వచ్చే కస్టమర్ల ఆధార్‌, పాన్‌, ఓటర్‌, రేషన్‌ కార్డుల జిరాక్స్‌లను ఒక్కో కాపీ ఎక్కువగా తీసి భద్ర పరిచి ప్రైవేటు ఏజెన్సీలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఓ మహిళకు ఎస్‌బీఐ అధికారులమంటూ ఫోన్‌ వచ్చింది. మా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ.. మా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు పొందిన లక్షలాది మంది కస్టమర్లలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి గిఫ్ట్‌లు పంపుతున్నామని నమ్మించారు. మా వద్ద ఉన్న వివరాలు సరైనవా? కావా? తెలుసుకోవడానికి క్రాస్‌ చెక్‌ చేస్తున్నామంటూ కార్డు వివరాలు, పిన్‌ నంబర్‌ తీసుకున్నారు. ఫోన్‌ పెట్టేసిన కొద్దిసేపటి తర్వాత తన కార్డు నుంచి రూ. 8,500 వేరే ఖాతాలోకి మళ్లించినట్లు సమాచారం రావడంతో ఆమె అవాక్కయ్యింది. తిరిగి ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ చేసి ఉంది. ఇలా క్రెడిట్‌ కార్డుదారుల వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా రూ. 5 కోట్లు కొల్లగొట్టిన విజయ్‌కుమార్‌ శర్మ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రెడిట్‌ కార్డు హోల్టర్ల సమాచారం వారికి ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీయగా, ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు వివరించాడు. ఓ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి 20 మంది టెలీ కాలర్స్‌ను నియమించుకొని ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇలా దేశవ్యాప్తంగా సుమారు రెండు వేల మందిని మోసం చేసి రూ. 5 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ రకాల ప్రైవేటు ఏజెన్సీలు, వివిధ రకాల వ్యక్తుల ద్వారా కొనుగోలు చేస్తున్న సైబర్‌ నేరస్తులు అమాయకుల నుంచి వివిధ స్కీంల పేరుతో రూ. లక్షలు దండుకుంటున్నారు. ఆధార్‌ కార్డులుగానీ, ఇతర పత్రాలు ఏవైనా జిరాక్స్‌లు తీయించినప్పుడు, క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతాల కోసం బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లకు ఇచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఉపయోగించి నకిలీపత్రాలు సృష్టించి మరో బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డులు తీసుకుంటున్నారు. - సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment