వజ్రాలు కొంటున్నారా.. అయితే ఇది మర్చిపోకండి


చెన్నై: వజ్రాలు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో చాలా వస్తువులకు నకిలీలు వచ్చేశాయి. అచ్చం అసలైన వస్తువుల పోలికలతో నకిలీలను తయారుచేసి విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు వీటిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే తాజాగా వజ్రాల విక్రయాల్లోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నాయి. మామూలుగా బంగారం, వజ్రం లాంటి ఖరీదైన లోహాలను గుర్తించడం సాధారణ ప్రజలకు చాలా కష్టమైన పనే. దీన్ని అదనుగా భావించి కొందరు వజ్రాల స్థానంలో సింథటిక్‌ వజ్రాలను విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే వజ్రాలు కొనేప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలి అంటున్నారు ఆభరణాల తయారీదారులు.

‘సింథటిక్ వజ్రాలు.. అసలైన వజ్రాల మాదిరిగానే ఉంటాయి. అయితే వాటి ధర నిజమైన వజ్రాల కంటే 25-30శాతం తక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో వీటిని వేరుగా సింథటిక్‌ వజ్రాల పేరుతోనే విక్రయిస్తుంటారు. కానీ కొన్ని చోట్ల వీటిని అసలు వజ్రాలుగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సింథటిక్‌, సహజ వజ్రాల మధ్య తేడాను కస్టమర్లు గుర్తించలేరు. దీంతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి’ అని చెన్నైకు చెందిన ఎన్‌ఏసీ జువెల్లర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. అనంత పద్మనాభన్‌ తెలిపారు.

ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే వజ్రాలు కొనేప్పుడు బిల్లును తప్పకుండా తీసుకోవాలన్నారు. ‘ఈ రోజుల్లో కొందరు పన్నులు ఎగ్గొట్టేందుకు బిల్లులు లేకుండా వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సింథటిక్‌ వజ్రాల వ్యాపారం పెరుగుతోంది. అదే బిల్లు ఉంటే అలాంటి వ్యాపారం చేసే వారిలో కొంత భయం ఉంటుంది. అందుకే కచ్చితంగా బిల్లు తీసుకోండి’ అని అనంత పద్మనాభన్‌ సూచిస్తున్నారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment