తెలుగంటే అలుసా! 
మాట్లాడేవారి సంఖ్య తగ్గుతోంది 
భారతీయ భాషల్లో నాలుగో స్థానం 
ఒక మెట్టు పైకెక్కిన మరాఠీలు 
రెండోస్థానంలో బెంగాలీ 
విస్తరిస్తున్న హిందీ 
ఆంగ్లం జోరూ అంతంతే

ఈనాడు, దిల్లీ: దేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతోంది. హిందీ తర్వాత అత్యధికమంది మాట్లాడే భాషగా ఉన్న స్థానం పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగోస్థానానికి పడిపోయింది. వృద్ధిరేటు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూలేనంత స్థాయికి తగ్గిపోయింది. దేశంలో తెలుగుమాట్లాడే వారి సంఖ్య 1971లో 8.16% మంది ఉండగా ఇప్పుడు అది 6.70కి తగ్గిపోయింది. మరాఠీలు మనల్ని వెనక్కునెట్టి ఓ మెట్టు పైకెక్కారు. మొత్తంగా చూస్తే దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే సమయంలో ప్రాంతీయ భాషల ప్రభావం తగ్గుముఖం పడుతూ పోతోంది. 22 షెడ్యూల్డు భాషల్లో ఒక్క హిందీ మినహా మిగతా ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య పెరగలేదు. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 1971లో 36.99% ఉండగా 2011 నాటికి అది 43.63%కి పెరిగిపోయింది. హిందీ విస్తృతికారణంగా ఉర్దూమాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

సంస్కృతం మాట్లాడేవారి సంఖ్య 75.60% పెరిగినట్లు లెక్కలు చెబుతున్నా సంఖ్యాపరంగా చూస్తే వేళ్లమీద లెక్కపెట్టేంతే ఉంది. దేశంలో ఇంగ్లిష్‌ ప్రభావం పెరుగుతోందన్న భావన ఉన్నప్పటికీ ఆ భాష మాట్లాడే వృద్ధిరేటు గత దశాబ్దంలో పోలిస్తే పెద్దగా పెరగలేదు. వీరి సంఖ్య 1971లో 1.91 కోట్లమందిగా ఉండేది. ఇప్పుడది 2.59 కోట్లకు చేరింది. దేశంలోని 99 నాన్‌ షెడ్యూల్డ్‌ భాషల్లో దాదాపు 17 కనుమరుగవుతున్నాయి. అవి మాట్లాడే వారి సంఖ్య మైనస్‌లో పడిపోయింది.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 8.11 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ సంఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 7.06 కోట్లు కాగా, కర్ణాటకలో 35 లక్షలు, మహారాష్ట్రలో 13 లక్షలు, తమిళనాడులో 42 లక్షలు, ఒడిశాలో 6.6 లక్షలు, ఛత్తీస్‌గడ్‌లో 1.52 లక్షలమందిగా ఉంది. ఇక, పశ్చిమబంగలో 88వేలమంది, పుదుచ్చేరిలో 74వేలు, గుజరాత్‌లో 73వేలు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 50వేలు, దేశరాజధాని దిల్లీలో 25వేల మంది తెలుగుమాట్లాడే వారు ఉన్నారు. 1971 జనాభా లెక్కల నాటినుంచి దేశంలో తెలుగుమాట్లాడేవారి సంఖ్య మూడోస్థానంలో కొనసాగింది. అయితే, ఇప్పుడు కాస్తా నాలుగుకు పడిపోయింది. గత నాలుగు దశాబ్దాలుగా హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బెంగాలీయే కొనసాగుతూ వస్తోంది. మరాఠీ మాట్లాడే వారి సంఖ్య 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగుకంటే అధికంగా నమోదైనప్పటికీ వారి వృద్ధిరేటు మాత్రం తగ్గుముఖం పడుతూ వస్తోంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment