'శనివారం' మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే 
శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి


చతుర్ముఖ బ్రహ్మ రోజూ ఈ కొండకి వచ్చి స్వామిని సేవించేవాడు. అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి, ఈ పుణ్య క్షేత్రం తన తపస్సుకు అనువైనదని, ఇక్కడకొచ్చి, స్వామికోసం కఠోర తపస్సు చేశాడు. ఆయనకి ఒకరోజు సాయంసంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో, స్వామి సాక్షాత్కరించాడు. అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడుగనుకు ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది.

సాక్షాత్కరించిన స్వామిని అగస్త్య మహర్షి భూలోకవాసుల పాపాలు పటాపంచలు చేసి, వాళ్ళని ఉధ్ధరించటానికి అక్కడే జ్వాలా నరసింహరూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు. అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు...తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరావారికి స్వామి దర్శనం లభించటంకోసం వారంలో ఒక్క రోజు, శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శనంభాగం లభిస్తుందనీ, ఇటు మానవులుకూడా స్వామిని సేవించి తరిస్తారనీ వేడుకున్నాడు.

శ్రీ అగస్త్య మహాముని తపస్సు ఫలితంగా 'శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి' వారు ఎర్రని కాంతితో 'జ్వాలా నరసింహుని' గా ప్రత్యక్షమయినప్పుడు, స్వామివారిని మహాముని ఈ క్షేత్రం లో వెలిసి కనీసం వారం లో ఒక్కరోజు ఈ భక్తుల కోసం దర్శనమివ్వమని అడిగారు. అందుకు స్వామివారు అంగీకరించి, అప్పట్నుంచి వారం లో ఒక్క 'శనివారం' మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా వారంలో ఒక్కరోజు మాత్రమే దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఈ 'మాలకొండ' పుణ్యక్షేత్రం. తర్వాత కాలంలో దీనిని నమ్మని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలకు ప్రతి రోజూ కల్పించాలని అనేకసార్లు ప్రయత్నించారుగానీ, వారి ప్రయత్నాలు ప్రతిసారీ విఫలమయ్యాయి.


ఈ మాల్యాద్రి మీద అనేక తీర్ధాలున్నాయి. పూర్వం మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని వలన ఈ గిరి ప్రాశస్త్యాన్ని గురించి విని రోజూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించసాగాడు. ఈ స్వామిని సేవించి తరించినవారి కధలు ఎన్నో వున్నాయి. ఒకసారి భానుమానుడనే రాజు మాల్యాద్రి వైభవంగురించి విని తానుకూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు. అయితే అక్కడ పూజారి లేడు. అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని బాధపడి భానుమానుడు ఆ రోజంతా నిరాహారంగా అక్కడే వుండిపోయాడు. మరునాడు స్వామినర్చించటానికి బ్రహ్మదేవుడు రాగా, స్వామి ఆయనతో భానుమానుడు నా దర్శనార్ధము వచ్చి నా సేవకోసం నిరాహారుడుగా వేచియున్నాడు. అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించటం కుదరలేదు. కనుక నువ్వు వెంటనే ఒక అర్చకుడిని సృష్టించి, శనివారంనాడు మాత్రం మానవ పూజకై కేటాయించి, మిగతా వారాలలో దేవ, ఋషి పూజలు జరిగేటట్లు ఏర్పాటు చెయ్యమని ఆనతిచ్చాడు.

బ్రహ్మదేవుడు తన సంకల్పంచే నృసింహాచార్యుడనే సకల శాస్త్రవేత్త, భక్తి తత్పరుడైన బ్రాహ్మడుని సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవులకోసం పూజాదికాలు నిర్వర్తించునట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజునుంచీ, ఈ రోజువరకూ ప్రతి శనివారం మాల్యాద్రి పై శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment