ప్లాస్టిక్‌ను పాతరేద్దాం!

    మొన్న మహారాష్ట్ర.. నిన్న తెలంగాణ.. నేడు ఉత్తర్‌ప్రదేశ్.. ప్లాస్టిక్‌పై సమరానికి సై అంటున్నాయి. ప్రజా ప్రతినిధులు.. అధికారులతో పాటు ప్రజలు కూడా ప్లాస్టిక్‌పై అవగాహన పొందితే మన నట్టింట్లో తిష్టవేసి నాట్యం చేస్తున్న ప్లాస్టిక్‌ను తరిమికొట్టొచ్చని నినదిస్తున్నారు. తినే తిండిని.. తాగే నీరుని విషపూరితం చేస్తూ విశృంఖల విహారం చేస్తున్న ప్లాస్టిక్‌కు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే పర్యావరణం పాడైపోయి మానవ మనుగడ అంధకారమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ వాడొద్దు. సాధ్యమయ్యే పనేనా? అంటే.. దీన్నొక యజ్ఞంలా భావిస్తే సాధ్యమవుతుందనే చెప్పొచ్చు. ప్లాస్టిక్ వల్ల మనం చస్తున్నాం.. కానీ, దాన్ని చంపాలనే ఆలోచన చేయడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ తరాలు బతికి బట్టకట్టేనా? అందుకే.. మన దెబ్బకు ఇక సెలవు అని ప్లాస్టిక్ పారిపోవాల్సిందే. పదండీ.. ప్లాస్టిక్‌ను పాతరేసి, దానికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. 
దాయి శ్రీశైలం, 

పౌరులారా..ప్లాస్టిక్ అనబడే నేను వందల యేండ్ల క్రితం మీ మధ్యలోకి వచ్చాను. నేను పురుడు పోసుకున్న తర్వాత మీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు విన్నాను. ఆకులు.. నారతో ప్రారంభమైన మీ జీవన విధానం క్రమంగా వనరులను అందిపుచ్చుకొని ఆధునికతవైపు మళ్లింది. నాగరికత పెరిగేనాటికి మీరు వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి కోసం పాత్రలు, సంచులు రూపొందించుకున్నారు. మట్టి పాత్రలు.. లోహపు పాత్రలు తయారుచేసుకున్నారు. వాటినే విరివిగా ఉపయోగించేవారు. ధాన్యాన్ని గుమ్మీలల్లో.. మట్టి పేర్పులల్లో భద్రపరిచేవారట. ఆహార సేకరణ కోసం జనుము, నారతో చేసిన సంచులు వాడేవారు. కూరగాయల సేకరణ కోసం వెదురుతో చేసిన గుల్లలను ఉపయోగించేవారు. మాంసం తెచ్చుకోవాలంటే టిఫిన్ బాక్సుల్లాంటివి తీసుకెళ్లేవారు. ఇంతలో నేను జీవం పోసుకున్నాను. ఆధునిక మానవ సమాజానికి నేను ఓ అద్భుతమైన వస్తువుగా కనిపించాను. మోడ్రన్ మోజులో మీరు నన్ను గుండెలకు హత్తుకున్నారు. ఆదిమానవుల్లా ఇంకా ఈ మట్టిపాత్రలు.. వెదురు గంపలు.. గుమ్మీలు.. స్టీల్ బాక్స్‌లు ఏమిటనే సోయితో వాటిని వదిలేశారు గుర్తుందా? మీరు నాపై చూపిన ప్రేమకు.. అభిమానానికి నేనొక వెలుగు వెలిగాను. ఇంకా వెలుగుతూనే ఉన్నాను. 
ప్రతి ఊర్లో.. ప్రతి ఇంట్లో.. ప్రతి మనిషీ నేను లేనిదే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. నాకు ఇది నిజంగా గర్వకారణం. ఒకానొక దశలో.. నా ప్రాధాన్యం అంతటిదని వారు భావించినప్పుడు నేను ఎందుకు మీ అవసరాలు తీర్చొద్దు? అనే ప్రశ్న మొదలైంది. పచ్చటి గడ్డితో.. మట్టితో కనిపించే పరిసరాలను.. పాత్రలు కనిపించే ఇళ్లను నేను ఆక్రమించినందుకు నాకు చాలా సంతోషమేసింది. భూమి మొత్తం నేనే.. నా సామ్రాజ్యమే కనిపిస్తున్నది. మీ హృదయాల్లో నాకు స్థానం కల్పించినందుకు నేను మిమ్మల్ని నా గుప్పిట్లో ఉంచుకోగలిగాను. కానీ నాకిప్పుడు బాధనిపిస్తున్నది. నేను లేనిదే మీరు ఉండలేని పరిస్థితిని చూడలేకపోతున్నాను. నన్ను తరిమేయాలని మీరు చేస్తున్న పనులను చూసి జాలి కలుగుతున్నది. ఆధునికతలో భాగంగా నేను మీకు కనీస అవసరమై మీతో పాటు ఉండాలనుకున్నా కానీ.. మీ జీవితాల్నే నాశనం చేయాలనుకోలేదు. మీరనుకున్నట్టు నేను మహమ్మారినే.. రక్కసినే.. మానవ జీవితాలను ఛిద్రం చేస్తున్న చిన్నపాటి దయ్యాన్నే. కానీ ఎవరు ఇంతలా వాడుకోమన్నారు? అవసరానికి మించి నన్ను తయారు చేసింది మీరు కాదా? నన్ను మీరు పరిమితికి మించి ఉపయోగించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. మీలా నేను వందేండ్లు యాభైయేండ్లు కాదు. వెయ్యేండ్లయినా కానీ మీరు నన్ను ద్వేషిస్తున్నందుకు నేనే సరెండర్ అవుదామనుకుంటున్నాను. మీ పచ్చని జీవితాల్లో విషాదం నింపడం నాకు ఇష్టం లేదు. దయచేసి.. నన్ను వాడకండి. నా జోలికి రాకండి. నాకు నేనుగా మెర్సీ కిల్లింగ్‌తో చావును కోరుకుంటున్నాను. చావడానికి నేను రెడీ. నన్ను అంతమొందించేందుకు మీరు రెడీనా? నేనే చెప్తున్నా కదా.. చలో నన్ను పాతరేయండీ!! 

సే.. నో ప్లాస్టిక్!కదలిక మెల్లగా మొదలైంది. ప్లాస్టిక్ సమస్యను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కారు దాని నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లో అవగాహన పెంచుతున్నది. చాలా రోజుల తర్వాత మటన్ దుకాణాలకు స్టీల్ టిఫిన్ బాక్సులు పెట్టుకొని వెళ్తున్న వాళ్లను, కూరగాయలకు జ్యూట్ సంచి తీసుకెళ్లిన వాళ్లను.. రాగి చెంబులో నీళ్లు పోసుకొని తాగుతున్న వారి దృశ్యాలు కనిపిస్తున్నాయి. #SayNoToPlastic అంటూ సోషల్‌మీడియా పర్యావరణ పాట అందుకున్నది. మున్సిపల్ అధికారులు.. సిబ్బంది.. టిఫిన్ డబ్బాలతో.. జ్యూట్ బాక్స్‌లతో దుకాణాలకు వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. 

నియంత్రణే మార్గం:ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగాన్ని విస్మరించలేం. అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడింది. వాణిజ్యపరంగా భారతదేశంలో ప్లాస్టిక్ రంగానికి చాలా భవిష్యత్తు ఉంది. కానీ, పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ అవసరాన్ని గుర్తిస్తూనే మనం దాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే ఈ అందమైన పర్యావరణాన్ని ముందు తరాల వాళ్ళకు బాధ్యతగా అందించగలుగుతాం. 
రాగడి కాంతారావు, శుభ్ర హైదరాబాద్ ఆర్గనైజర్

ఫొటో పెట్టు.. వంద పట్టు!మిర్యాలగూడకు చెందిన మన్నెం శ్రీధర్‌రెడ్డి ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించడాన్ని బాధ్యతగా తీసుకున్నాడు. పర్యావరణం గురించి ఏడేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. మన మిర్యాలగూడ అనే ఒక ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించి మిర్యాలగూడకు చెందిన పదహారు వేల మందిని, విదేశాల్లో స్థిరపడ్డ వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశాడు. తర్వాత ఇదే పేరుతో ఎన్జీఓ ప్రారంభించి ప్రజలకు అన్ని విషయాల్లో భరోసా కల్పిస్తున్నారు. మటన్.. చికెన్‌కు వెళ్లేవాళ్లు స్టీల్ టిఫిన్ బాక్స్‌లను తీసుకెళ్లాలని అవగాహన కల్పిస్తున్నాడు. అంతేకాదు.. స్టీల్ టిఫిన్‌బాక్స్‌తో మటన్ తీసుకెళ్తున్నట్టు ఫొటో తీసి వాట్సప్ మెసేజ్ చేస్తే వాళ్లకు రూ.100 బహుమతి ఇస్తున్నాడు. జ్యూట్ బ్యాగుల్లో కూరగాయలు తీసుకెళ్లే వాళ్లకు.. ఆ రోజు వాళ్లకు కూరగాయలకు ఎంత ఖర్చు అయిందో అంత తనే చెల్లిస్తున్నాడు.

ప్లాస్టిక్ భూతమా?అవును.. భూతం కన్నా భీకరమైందిగా భావించొచ్చు. మనం రోజూ చేసే పని.. ప్లాస్టిక్ పాత్రల్లో వేడివేడి ఆహార పదార్థాలు వేసుకొని తింటుంటాం. ఫుడ్ పార్సిల్స్ కూడా ప్లాస్టిక్ కవర్స్‌లో తీసుకెళ్తుంటాం. ఆ వేడికి.. బిస్ఫెనాల్ అనే రసాయనాలు ఉత్పన్నమై ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇదొక హార్మోన్. బిస్ఫెనాల్ రసాయనం సంతాన సమస్యలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం బిస్ఫెనాల్ వల్ల పురుషుల్లో 45 శాతం సంతానలేమి సమస్యలు వస్తున్నాయి.

స్వీయ నియంత్రణ పాటించాలి...ఈ రోజుల్లో ప్రతి వస్తువు ప్యాకింగ్ ప్లాస్టిక్‌తోనే ఉంటున్నది. ఆ వస్తువును ఉపయోగించిన తర్వాత ప్లాస్టిక్ ప్యాకింగ్‌ను రోడ్డు పక్కన పడేస్తున్నాం. ఇలా రోజుకు దేశంలో ఎన్ని బాటిల్స్.. ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ పారేస్తున్నామో అర్థం చేసుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. మేం దీనిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరో వచ్చి చేయాలనే దానికన్నా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ పని పట్టడానికి సైనికులుగా సిద్ధంగా ఉండాలి. సాకేత్ కొత్తమాసు, ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ ఆర్గనైజర్

జీరో ప్లాస్టిక్ సిటీ!ప్లాస్టిక్ వ్యర్థాలు నగర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బల్దియా ప్లాస్టిక్ నిషేధానికి సన్నాహాలు చేస్తున్నది. వర్తక.. వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.కన్‌స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ పారబోతపై నిర్బంధం అమలు చేసిన తరువాత ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి కేంద్రీకరించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా తయారీని అడ్డుకోవడమే కాకుండా వినియోగం, విక్రయాలపై కూడా ఉక్కుపాదం మోపనున్నది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వడానికి కారణం ప్లాస్టిక్ వ్యర్థాలేనని అనేకసార్లు అనుభవ పూర్వకంగా రుజువైన నేపథ్యంలో భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఈ నిర్ణయానికి వచ్చారు.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?ఒకప్పుడు అంటే ఏ వందల ఏండ్ల క్రితమో కాదు; ఓ ముప్పయేండ్లే మటన్ దుఖాణానికి వెళ్లి మటన్ తీసుకురావాలంటే స్టీల్ డబ్బాలు, రాగి డబ్బాలు తీసుకెళ్లేవాళ్లు. పాల కోసం రాగి క్యాన్లు ఉపయోగించేవాళ్లు. తిండి తినడం, నీళ్లు తాగడానికి కూడా లోహపు పాత్రలనే వాడేవాళ్లం. బర్రెలు, ఆవులు పచ్చటి గడ్డినే మేసేవి. స్వచ్ఛమైన పాలను ఇచ్చేవి. కానీ ఇప్పుడు పైన చెప్పినవన్నీ ప్లాస్టిక్ పాత్రలు, క్యారీ బ్యాగుల ద్వారానే చేసుకుంటున్నాం. బర్రెలు, ఆవులు ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల పాలు విషపూరితమై క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరే ప్రమాదం ఏర్పడింది. వ్యవసాయంలో అయితే సహజరీతిలో కలప, లోహపు పనిముట్లు పోయి ప్లాస్టిక్ చొచ్చుకొచ్చింది.

ప్లాస్టిక్ బ్యూటీ ఒక భ్రమ!మనలో చైతన్యం ఉంటే నిజంగా ఇలాంటి ఓ అద్భుతం జరగొచ్చు. మనిషి జీవితంతో ఆడుకుంటున్న ప్లాస్టిక్ ఇక ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఇప్పటిదాకా ప్లాస్టిక్ అనే ఒక వస్తువు చాప్టర్ నడిచింది. ఇక నడవాల్సింది మన చాప్టర్. మనలో చైతన్యం వస్తే దానిని వెయ్యేండ్ల వెనక్కి పంపించి మనిషికి జీవితకాలపు ఆరోగ్యాన్ని ప్రసాదించొచ్చు. మహాష్ట్రలో ప్లాస్టిక్ నిషేధం వల్ల అద్భుతమైన ఫలితాలు రాకపోయుండొచ్చు. కానీ ప్రయత్నమైతే జరిగింది. మనుషులకైతే తెలిసిపోయింది. నానాటికీ ప్లాస్టిక్ మనల్ని ఎలా దహించివేస్తుందో అన్న అవగాహనైతే కలిగింది. ఈ రోజు రాకపోయి ఉండొచ్చు.. రేపు రాకపోయి ఉండొచ్చు.. క్రమక్రమంగా ఇదే ఒరవడి కొనసాగితే కచ్చితంగా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. తాజాగా యూపీ కూడా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది. జూలై 15 నుంచే ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. ప్లాస్టిక్ బ్యూటీ భ్రమల్లోంచి బయటపడి పచ్చని జీవితాన్ని పొందవచ్చు.

జీవ విధ్వంసపు కుట్ర!బియ్యం.. మాంసం.. గుడ్లు వంటి నిత్యావసరాలు కూడా ప్లాస్టిక్‌తో తయారుచేస్తుప్పట్టు వార్తలు వచ్చాయి. ఇది పర్యావరణ, జీవ విధ్వంసానికి జరుగుతున్న పెద్ద కుట్రగా భావించొచ్చు. అందుకే అవగాహన.. చైతన్యం.. అప్రమత్తత అవసరం. రేపటి తరం కోసం ప్లాస్టిక్‌పై ప్రచారం కూడా చేయాలి.

వీళ్లు చేయలేదా?మనమే ఇప్పుడు కొత్తగా ఏదో ప్రయత్నాలు చేయడం లేదు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చైనా, జింబాబ్వే, తైవాన్, కెనెడా, ఫ్రాన్స్, ఐర్లండ్ దేశాల్లో ప్లాస్టిక్‌పై నిషేధాజ్ఞలు జారీ చేశారు. పదేళ్లక్రితమే రువాండాలో నిషేధించారు. ప్రపంచంలోనే తొలి ప్లాస్టిక్ రహిత దేశంగా అవతరించడానికి సన్నద్ధమవుతున్నది రువాండా. ఇలాంటి ప్రయోగాత్మక మార్పులు ఇండియాలో కూడా శ్రీకారం చుట్టుకున్నాయి. ఇరవై ఏండ్ల క్రితమే సిక్కిం క్యారీ బ్యాగుల్ని.. రెండేళ్ల క్రితం నుంచి నీళ్ల బాటిల్స్‌ను, డిస్పోజబుల్ ప్లేట్స్‌ను కూడా నిషేదించింది. అది ఉన్నది ఇండియాలోనే కదా? ఆ పౌరులు చేయగా మనం ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన పెరిగితే మార్పు సాధించి తీరుతాం.

ప్లాస్టిక్ వాడకుండా ఉండగలమా?ప్లాస్టిక్ మన జీవితాల్లోకి వచ్చింది కాబట్టి అది లేకుండా మనం ఉండగలమా? అనే సందేహం ఎవ్వరికైనా వస్తుంది. ఇది సహజమే. అయితే ఇది మన చేతుల్లోని పనే కదా. ప్రాథమికంగా కనీస బాధ్యతతో ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, డబ్బాలు వాడొద్దు. ఇది అలవాటు పడితే ప్లాస్టిక్ రహిత జీవన సరళిని ఏర్పరచుకున్నవాళ్లం అవుతాం. దీన్నొక ఉద్యమంలా తీసుకొని ఇంటి నుంచే ప్రారంభించాలి. ఇండ్లలో మనం రోజూ ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు పోసుకొని కాకుండా చక్కగా గ్లాసుల్లో పోసుకొని తాగాలి. ప్లాస్టిక్ కవర్లు లేని రోజుల్లో సాంబర్, చట్నీల కోసం రాతెండి, స్టీలు డబ్బాల్ని హోటల్‌కు తీసుకెళ్లేవారు. ఇలాంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ప్లాస్టిక్ కప్పుల్లో టీలు, కాఫీలు తాగడం మానేయాలి. గాజు గ్లాసులు, పింగాణీ కప్పుల్లో మాత్రమే తాగాలి. ఒకప్పుడు ఫంక్షన్లలో స్టీలు పాత్రలు పెట్టలేదా? అతిథులు ఆనందంగా ఉండలేదా? కూరగాయల్ని, ఆకుకూరల్ని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఫ్రిజ్లో పెట్టడం మానేయాలి. నియంత్రణ ఉంటే ప్లాస్టిక్ వాడకుండా ఉండొచ్చు.

మట్టిలో కరిగే ప్లాస్టిక్!సమస్యల్లా ప్లాస్టిక్ మట్టిలో కలవకపోవడమే కదా. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవనందున పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళనే కదా. అయితే మానవ ప్రయత్నంగా మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ఆలోపు ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ అందుబాట్లోకి రానుంది. ప్లాస్టిక్ గురించి ఇకపై ఎలాంటి ఆందోళన వద్దంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని కొలొకడో యూనివర్సిటీ పరిశోధకులు మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను తయారుచేస్తున్నారు. దీనిని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిముల పాలిమర్‌తో రూపొందిస్తారు. వీటిద్వారా చేసిన వస్తువులు మట్టిలో సులభంగా కరిగిపోతాయట. పీహెచ్‌బీ, బాక్టీరియల్ పాలీగా వీటిని వ్యవహరిస్తారు. దీనినే ప్లాస్టిక్‌కు అసలైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను రూపొందిస్తే మానవ జీవనానికి.. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు.

పర్యావరణహిత ప్లాస్టిక్!చెట్ల నుంచి తీసే జిగురుతో ప్లాస్టిక్ తయారు చేయొచ్చంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఈ ప్లాస్టిక్ పర్యావరణ హితమైందని.. భూమిలో సులువుగా కలిసిపోతుందని.. దృఢంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. లండన్‌లోని వార్‌విక్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని అభివృద్ధి పరుస్తున్నారు. చెట్లలో సెల్యూలోజ్ ఫైబర్స్‌తో కూడిన లిగ్నిన్ అనే జిగురు ఉత్పత్తి అవుతుంది. లిగ్నిన్ విచ్ఛిన్నమైతే పలు సంక్లిష్ట రసాయన పదార్థాలు వెలువడుతాయి. వీటిని వినియోగించి ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయొచ్చు. అయితే లిగ్నిన్‌ను విచ్ఛిన్నం చేయగలిగే జీవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయట. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు రోడోకాక్కస్ జోస్టి అనే బ్యాక్టీరియాను ఉపయోగించి లిగ్నిన్‌ను విచ్ఛిన్నం చేయగలిగారు. మరో ఐదేండ్లలో ఈ ప్లాస్టిక్‌ను అందుబాటులోకి తెస్తామని వారు చెప్తున్నారు.

ఎంత పడేస్తున్నాం?ప్రపంచంలోని 10 నదుల ద్వారా 90% ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి.

దేశంలో ప్రతియేటా 5.6 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. అందులో 60% వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి.

దీనివల్ల ప్రతీ సంవత్సరం దాదాపు ఒక మిలియన్ సముద్రపు పక్షులు.. లక్ష వరకు సముద్ర జంతువులు చనిపోతున్నాయి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం దేశంలోని 60 నగరాలలో సరాసరి రోజుకు 15,342 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటికి పడేస్తున్నాం. అందులో కేవలం 9250 టన్నుల వరకు మాత్రమే తిరిగి రీసైక్లింగ్ చేస్తున్నాం.

మిగిలిన వ్యర్థాలు డంపింగ్ కేంద్రాలు, రోడ్లు, నాలాల్లో పడేస్తున్నారు.ఈ వ్యర్థాల్లో దాదాపు 66% ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సంబంధించినవి. ప్లాస్టిక్‌లో దాదాపు 
90% వరకు ప్లాస్టిక్ చెత్తను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉన్నది.

వెయ్యేండ్లు వదులదు!ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలవడానికి 500ల ఏండ్లు పడుతుంది. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ అంతా ఎండకు ఎండి.. వానకు తడిసి రకరకాల మార్గాల్లో కొట్టుకెల్లి నదుల్లో.. సముద్రాల్లో చేరుతుంది. నీటి అడుగున అలా చేరిన చెత్త నుంచి కంటికి కనపడనంత చిన్న రేణువులు విడుదలవుతాయి. వాటిలోని పాలీస్టిరీన్ అనే అత్యంత సూక్ష్మమైన పదార్థాలను జల చరాలు ఆహారంగా భావించి తినేస్తున్నాయి. ఆ జల చరాలను మనం ఆహారంలో తీసుకుంటే ఆ పదార్థాలు నేరుగా మన శరీరంలోకి చేరుతున్నాయి. మనం చనిపోగానే కాలి బూడిదైపోతుంది ఈ శరీరం. లేదా మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్ కలిసిపోవడం లేదు. ఇప్పటివరకు మనం వాడి పారేసిన ప్లాస్టిక్‌లో ఇంకా 80% అలాగే ఉందట. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ మట్టిలో కలిసిపోవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. నీళ్ల బాటిల్ 450 ఏళ్లకు మట్టిలో కలిసిపోతుంది. శానిటరీ న్యాప్‌కిన్స్‌కు 500 నుంచి 800 ఏళ్లు పడుతుంది. డియోడరెంట్ స్ప్రే బాటిల్స్ 500 ఏళ్లకు మట్టిలో కలిసిపోతాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment