తిలక, భస్మ ధారణతో 
       మంచి ఆలోచనలు 

‘లలాట లిఖితారేఖా పరిమార్తుం నశక్యతే’ ..చతుర్ముఖ బ్రహ్మ మన నుదుటి మీద రాసిన రాత ప్రకారం మనం పనులు చేసేస్తుంటాం, బ్రహ్మ రాసిన రాత మారదు అని ఒక వెలితి మాట అంటుంటాం. అది తప్పు. తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే, మన ఆలోచనాసరళిలో మార్పు వస్తుంది. ఆజ్ఞా చక్రంమీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞా చక్రం మీద ప్రసరించడం మొదలవగానే మన ఆలోచన మారిపోతుంది. మనం చేసే తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. పెద్దలు ఇటువంటి ఆచారములను ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు. తిలకధారణ చేయడం ప్రారంభిస్తే దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. ఇది చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్వ్తము రజస్సు తమస్సు అను మూడు గుణాలున్నాయి.

ఈ మూడూ మన మనస్సును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమైన పురాణప్రవచనాలను వినడానికి బదులు, లౌకికమయిన కార్యక్రమములు మున్నగువాటిని చూడమని చెబుతుంటాయి. అవి మనం ఉన్నతిని పొందకుండా బాధిస్తుంటాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణముల బాధ నుండి బయటపడటానికి సంసారమనే కొత్త బాధను ఎంచుకుంటాం. బాధపోవడానికి బాధలోకి వెళ్లడంలోని సూక్ష్మం ఏమిటంటే.. సత్వరజస్తమోగుణములనబడే మూడుగుణములనుండి బయట పడడానికే సంసారములోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి, ఈ సుఖములు సుఖములు కావు - నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకుని, వైరాగ్యసంపత్తిని పెంపొందించుకోవడం. దానివలన మనిషి ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు.

ఇంద్రియములను గెలవడంకాదు- మనస్సు కదలని స్థితికి పూర్ణవైరాగ్యం అనిపేరు. అంత వైరాగ్యం రావడం కూడ ఈశ్వరానుగ్రహమే!. ఈ వైరాగ్యసంపత్తిచేత శాశ్వతసుఖస్థానమయిన ఈశ్వరునియందు కలిసిపోతాడు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి ‘శంభుః’ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, శివాష్టోత్తరం చదువుకుంటూ ఉంటే, భస్మధారణ చేసినట్లయితే, బొట్టు పెట్టుకున్నట్లయితే ఏమీ చేత కాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే, మీకు తెలియకుండా ఒక రకమయిన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మంచి ఆలోచనలవైపు తీసుకొని వెళ్లగలదు.- చాగంటి కోటేశ్వరరావు శర్మ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment