ప్రియ నేస్తం... గూగుల్‌ మ్యాప్స్‌ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఫోన్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయడం చాలామందికి అలవాటు. అయితే కేవలం కొత్త ప్రదేశాలకు దారి చూపించడం మాత్రమే కాదు. అనేక అద్భుతమైన సదుపాయాలను గూగుల్‌ మ్యాప్స్‌ మనకు అందిస్తోంది. ఆ ఫీచర్స్‌ విశేషాలు ఇవి...


పార్కింగ్‌ లొకేషన్‌
షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లలో పలు అంతస్తుల్లో పార్కింగ్‌ ఉంటుంది. వెహికల్‌ ఎక్కడ పార్క్‌ చేశారో గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు వెహికల్‌ పార్క్‌ చేసిన వెంటనే మీ ఫోన్లో గూగుల్‌ మ్యాప్స్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి బ్లూ డాట్‌ మీద ట్యాప్‌ చేసి ‘సేవ్‌ యువర్‌ పార్కింగ్‌’ అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత మీరు పని పూర్తి చేసుకున్నాక మళ్లీ గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి, వెహికల్‌ ఎక్కడ ఉందో అక్కడికి నావిగేట్‌ చేసుకుంటూ రావచ్చు. ‘ఓకే గూగుల్‌, సేవ్‌ మై పార్కింగ్‌ లొకేషన్‌’ అనే వాయిస్‌ కమాండ్‌ జారీచేసినా కూడా ప్రస్తుతం మీరున్న లొకేషన్‌ పార్కింగ్‌ లొకేషన్‌గా సేవ్‌ అవుతుంది.


పలు లొకేషన్లకి
ఒక సోర్స్‌ ఒక డెస్టినేషన్‌కి చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్స్‌ వాడడం మాత్రమే చాలామందికి తెలుసు. కొన్నిసార్లు మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టిన తర్వాత నాలుగైదు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. స్కూల్లో మీ పిల్లలను డ్రాప్‌ చేసి, అటు నుండి ఇటు మరోచోటకు వెళ్లి, అక్కడనుండి మీ ఆఫీసుకు చేరుకోవాలి అనుకోండి. అప్పుడు ఒకేసారి మూడు స్టాప్‌లను చేర్చుకునే అవకాశం కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో ఉంది. ప్రస్తుతం మీరున్న ప్రదేశంతో పాటు మొదటి డెస్టినేషన్‌ ఎంపిక చేసుకున్న తర్వాత, మ్యాప్స్‌ అప్లికేషన్లు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల వద్ద ట్యాప్‌ చేసి వెంటనే వచ్చే మెనూలో ‘యాడ్‌ స్టాప్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకుని మరో స్టాప్‌ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.


ఫేవరెట్‌ ప్లేస్‌లు
మనలో చాలామంది బయటకు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఇంటికి రావడం సహజం. లేదా ఆఫీస్‌ పనుల మీద బయట రకరకాల ప్రదేశాలు తిరిగేవారు పని పూర్తయిన తర్వాత ఆఫీసుకు చేరుకుంటుంటారు. ఈ నేపద్యంలో ఓ కొత్త ప్రదేశం నుండి మీ ఇంటికో, ఆఫీసుకో ప్రతీసారీ గూగుల్‌ మ్యాప్స్‌లో డెస్టినేషన్‌ ఎంపిక చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, మీరు తరచూ చేరుకునే ఇల్లు, ఆఫీస్‌ వంటి ప్రదేశాలను ఫేవరెట్స్‌గా సేవ్‌ చేసుకుంటే మంచిది. హోమ్‌, ఆఫీస్‌ వంటి లేబుళ్లతో వాటిని సేవ్‌ చేసుకోవచ్చు. అలాగే ఇదే పద్ధతిలో మీరు తరచూ విజిట్‌ చేసే రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ని కూడా సేవ్‌ చేసుకోవచ్చు. ఇకపై ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాటిలో కావలసిన దాన్ని సులభంగా ఎంపిక చేసుకుని నావిగేట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. మీరు ఒక నిర్దిష్టమైన లొకేషన్‌ని మ్యాప్స్‌లో ఎంపిక చేసుకున్న తర్వాత స్ర్కీన్‌ అడుగు భాగంలో కనిపించే సేవ్‌ అనే బటన్‌ ఎంచుకుంటే వేర్వేరు లిస్టుల్లో దాన్ని మీరు సేవ్‌ చేసుకునే ఆప్షన్లు స్ర్కీన్‌ పై చూపించబడతాయి.


ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌
ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నంతసేపు బానే ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్లే ప్రదేశంలో సిగ్నల్‌ సరిగా లేకపోతే గనుక గూగుల్‌ మ్యాప్స్‌ సక్రమంగా పనిచేయడం నిలిచి పోతుంది. ముఖ్యంగా వేరే ఊళ్లకి, రాష్ట్రాలకు టూర్‌ వేసుకు నేటప్పుడు ఇలా మధ్యలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ నిలిచిపోతే ఇబ్బంది పడవలసి ఉంటుంది. అందుకే మీరు నివసిస్తున్న నగరానికి సంబంధించి కావచ్చు, లేదా మీరు టూర్‌ కి వెళ్ళబోతున్న ప్రదేశం, దాని రూట్‌ మొత్తాన్ని ఎంపిక చేసుకొని దాన్ని ఆఫ్‌లైన్‌ మ్యాప్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవటం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్లో కొద్దిమొత్తంలో స్టోరేజ్‌గా వినియోగించుకోబడుతుంది గానీ, కచ్చితంగా ప్రయాణం చేసేటప్పుడు నెట్‌ కనెక్షన్‌ గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు.


లైవ్‌ లొకేషన్‌ షేరింగ్‌
వేరే ఊరి నుండి మీ స్నేహితులు ఎవరైనా మీ నగరానికి వచ్చి మిమ్మల్ని కలవాలి అనుకున్నారనుకోండి. మీ ఇంటికి వారెలా చేరుకోవాలో గూగుల్‌ మ్యాప్స్‌లో గానీ, లేదా గూగుల్‌ మ్యాప్స్‌ సర్వీసునే వాడుకునే వాట్సప్‌లో గానీ లొకేషన్‌ షేరింగ్‌ చేయడం ఈమధ్య చాలా మంది చేస్తున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేస్తే లొకేషన్‌ షేర్‌ చేయటానికి ఆప్షన్‌ కనిపిస్తుంది.

కేవలం ఒక నిర్దిష్టమైన లోకేషన్‌ మాత్రమే కాదు, ఒక పావు గంట, అరగంట, గంటపాటు మీ లైవ్‌ లొకేషన్‌ని మీ మిత్రులతో షేర్‌ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ఊరు వెళుతుంటే, ఆ ఊళ్లో ఉన్న మీ స్నేహితుడు ఎవరో ఫలానా గాంధీ బొమ్మ దగ్గర నిలబడి ఉంటాను అని చెప్పాడనుకోండి. ప్రస్తుతం మీరున్న లొకేషన్‌ నుండి సరైన రూట్‌లోనే ఆ గాంధీ బొమ్మ సెంటర్‌కి చేరుకుంటున్నారా లేదా అన్నది అతనికి మీ లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేస్తే అర్థమవుతుంది. సరిగ్గా మీరు ఆ ప్రదేశానికి చేరగానే అతను గుర్తించే వీలుంటుంది. అంతేకాదు ఇద్దరు మిత్రులు ఒక సినిమా ధియేటర్‌ వద్ద కలుద్దాం అనుకుంటే, ఇద్దరూ ఇద్దరికీ లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేసుకుంటే ఎవరెక్కడ ఉన్నారో థియేటర్‌ వద్దకు చేరుకునే వరకూ ట్రాక్‌ చేసుకోవడానికి వీలుపడుతుంది.


మీరెక్కడెక్కడ తిరిగారు?
ప్రతిరోజు పలురకాల పనులు మీద మీరు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు కదా. అయితే ఏరోజు ఎక్కడకి వెళ్లారో కొన్నిసార్లు గుర్తుండడం కష్టం. అలాంటప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ మీకు ఉపయోగపడు తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్లికేషన్‌ మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఆ హిస్టరీ మొత్తాన్ని సేవ్‌ చేస్తూ ఉంటుంది. మీ ఫోన్లో మ్యాప్స్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేసి సెట్టింగుల్లో టైమ్‌లైన్‌ అనే విభాగంలోకి వెళితే తేదీల వారీగా మీరు ఎక్కడ ఎక్కడ తిరిగిందీ వివరాలు చూపించ బడతాయి. దీన్ని గూగుల్‌ లొకేషన్‌ హిస్టరీ అంటారు.


వాయిస్‌ కమాండ్లు
మీ ఫోన్‌ని కార్లో విండ్‌ షీల్డ్‌కి మొబైల్‌ అమర్చుకుని మ్యాప్స్‌ ద్వారా నావిగేట్‌ చేసుకుంటూ వెళుతున్నారు అనుకుందాం. అప్పుడు డైవ్రింగ్‌ చేస్తూ మ్యాప్స్‌ ఆపరేట్‌ చేయడం కష్టం కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్‌ మ్యాప్స్‌ వాయిస్‌ కమాండ్లను సపోర్ట్‌ చేస్తోంది. నిషో ట్రాఫిక్‌, మ్యూట్‌, బీ క్వైట్‌, షో ఆల్టర్నేట్‌ రూట్స్‌, నెక్ట్స్‌ టర్న్‌కు వంటి వాయిస్‌ కమాండ్‌లను జారీ చేయడం ద్వారా ఫోన్‌ చేతిలో పట్టుకోవలసిన పనిలేకుండానే వాయిస్‌తో గూగుల్‌ మ్యాప్స్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. అలాగే ఇటీవల ‘ఫర్‌ యు’ అనే ప్రత్యేకమైన సదుపాయాన్ని కూడా గూగుల్‌ మ్యాప్స్‌ ప్రవేశపెట్టింది. ఇది మీ అభిరుచులకి తగ్గట్లు వివిధ వ్యాపారసంస్థలు, రెస్టారెంట్లు, అందుబా టులో ఉన్న ఆఫర్లు వంటి అనేక వివరాల్ని ఓ ప్రత్యేకమైన టాబ్‌లో అందిస్తుంది. ఇలా పలు రకాల అడ్వాన్సుడ్‌ సదుపాయాల్ని గూగుల్‌ మ్యాప్స్‌ మనకు కల్సిస్తుంది. ఒకసారి ఈ యాప్‌ని స్టడీ చేస్తే మనకు తెలియనివి చాలా కనిపిస్తాయి.


దగ్గర్లోని ప్రదేశాలు
వర్షాకాలం కదా.. సరదాగా ఏ సాయంత్రమో మీకు దగ్గరలో ఉన్న ఏదో ఒక రెస్టారెంట్‌ వెదికి పట్టుకుని డిన్నర్‌ చేద్దామనుకున్నా.. లేక మీ దగ్గరలో ఉన్న షాపింగ్‌ మాల్స్‌, పెట్రోల్‌ బంకులు, ఏటీఎం సెంటర్లు వెదికి పట్టుకోవాలన్నా గూగుల్‌ మ్యాప్స్‌కి మించిన పరిష్కారం లేదు. గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి పైన కనిపించే సెర్చ్‌ బాక్స్‌లో మీకు కావలసిన పదం కోసం వెదకండి. వెంటనే మీకు దగ్గరలోని ఆ సేవలందించే వ్యాపార సంస్థల వివరాలు చూపించబడతాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని నేవిగేట్‌ చేసుకుంటూ వెళ్లడమే తరువాయ -నల్లమోతు శ్రీధర్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment