నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ ఓ పాఠమే! - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు | Chaganti Koteswara Rao goal

నేర్చుకోవాలనుకుంటే ప్రతిదీ ఓ పాఠమే!
 - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

లక్ష్యసాధనకు వశపడడమే మార్గం. జీవితంలో కొంతమందికి వశపడండి. ప్రయత్నపూర్వకంగా తల్లికి వశపడండి, తండ్రికి వశపడండి. ప్రభుత్వచట్టాలకు వశపడండి. గురువుకి వశపడండి. వారిని గౌరవించడం నేర్చుకోండి. ఎవరికి వశపడాలనుకున్నామో వారికి వశపడాలనుకున్నప్పుడు మీరు స్వయంగా వారివెంట ఉండక్కరలేదు. వారి ఫొటో ఒక్కటి మీ జేబులో ఉన్నదనుకోండి. ‘‘మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు. అన్నీ చూస్తున్నాడు.’’ అన్న భావన కలుగుతుంటుంది. మీరు చదువుకునే గదిలో కలాంగారి ఫొటో పెట్టుకుని ‘మీరు చెప్పినట్లే బతుకుతాను’ అని రోజుకు ఒకసారి ఆయన చెప్పిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నారనుకోండి.

అలా ఉన్నప్పుడు పుస్తకం చదువుతూ మీరు సెల్‌ఫోన్‌ మాట్లాడగలరా? నా తపస్సు అంతా నా పుస్తకమే గదా... దానికి భంగం కలిగితే పెద్దాయన ఎంత బాధపడతారన్న భావన ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంటుందిగదా! అసలు గదిలో ఉన్నది ఫొటో ఎందుకవుతుంది? కలాంగారే మా ఇంట్లో ఉన్నారు. నేను ఏం చేస్తున్నదీ ఆయన చూస్తున్నారు. నేను చదివినది ఆయన వింటున్నారు. వివేకానందుడి పుస్తకం చదువుతున్నాను... అంటే వివేకానందుడికి ఎదురుగా కూర్చుని ఆయన మాట్లాడుతుంటే నేను వింటున్నాను’ అన్నభావనలు కలుగుతాయి. అలా చదువుతూ కూడా–‘‘వారుచెప్పినట్లుగాక నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను’ అంటే ఇక ఎందుకు ఆ పుస్తకం చదవడం ..???

ప్రయత్న పూర్వకంగా వశపడడం అలవాటు కాకపోతే అది చివరకు అసహనానికి, చీకాకుకు దారితీస్తుంది. మరొకరు చెప్పింది వినాలనిపించదు. ఈ దేశంలో ఒకప్పడు చట్టసభల్లో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే... మధ్యలో అంతరాయం కలిగించవద్దని స్వపక్షానికి సైగలు చేస్తూ పూర్తిగా ఓపికగా విన్న ప్రధానమంత్రులను చూసాం. ఒఠ్ఠిగా వినడమే కాదు, వారి ప్రసంగాలను మనసారా అభినందించే పరిపక్వత, విశాల హృదయం వారికి ఉండేవి. నెల్సన్‌ మండేలాను 27 సంవత్సరాలు కారాగారంలో బంధించి భయంకరంగా నానా హింసలు పెట్టారు. దక్షిణాఫ్రికాకు ఆయన స్వాతంత్ర్యం తెచ్చిన తరువాత ఆయన తనను హింసించిన వాళ్ళను కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అది పరిపక్వత. అది మనిషికి ఉండవలసిన సంయమనం.

చిన్నతనంలో మండేలా సహచరులతో కలిసి గొర్రెలు కాస్తున్నాడు. వారు ఒకరోజున వంతులవారీగా అక్కడే ఉన్న ఒక గేదెమీద ఎక్కి సరదాగా కాసేపు అలా తిరిగొస్తున్నారు. మండేలా వంతు వచ్చింది. ఆయన గేదెమీదకు ఎక్కగానే ఒక్క ఉదుటున అది గెంతుకుంటూ ఒక ముళ్ళపొదలోకి దూరి ఆయన్ని ఎత్తిపడేసి పారిపోయింది. ముళ్ళు గుచ్చుకుపోయాయి. బయటికి తీసుకు వచ్చి సపర్యలు చేస్తూ...‘బాధగా ఉందా!!’ అని స్నేహితులు అడిగారు.

‘బాధేమీ లేదు. ఒక పాఠం నేర్చుకున్నట్లుంది’ అన్నారు. ఏమిటది అని వారడిగితే – ‘‘ఈ గేదెకు నన్ను ఎక్కించుకోవడం ఇష్టంలేకపోతే ఇక్కడే ఎత్తిపడేయవచ్చు. కానీ ముళ్ళపొదల్లోకి తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సిన అవసరం లేదు. ఇష్టంలేని విషయాన్ని ఇష్టం లేదని చెప్పడానికి నేను జీవితంలో ఇంత క్రూరంగా ప్రవర్తించి ఎవరినీ బాధపెట్టకూడదని తెలుసుకున్నా..’’ అని బదులిచ్చారు. మీరు కూడా జీవితంలో ఎదురయిన ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకోగల ఓర్పును, పరిపక్వతను పెంపొందించుకోండి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment