నొప్పి సహజం! ఆ మాటకొస్తే అది మన జీవితంలో ఒక భాగం!! మనమంతా నొప్పి బాధితులమే. ఎప్పుడో అప్పుడు దీని బారినపడ్డవాళ్లమే. నిజానికిదేమీ జబ్బు కాదు. ఒక సంకేతం. ఒక హెచ్చరిక. సమస్య పైకి కనబడొచ్చు, కనబడకపోవచ్చు. కానీ నొప్పి మాత్రం సుస్పష్టం. ఒళ్లునొప్పులు ఇలాంటి హెచ్చరిక సంకేతాలే! మామూలు నొప్పులు విశ్రాంతి తీసుకుంటే కొద్దిరోజుల్లో కుదురుకుంటాయి గానీ కొన్ని నొప్పులు దీర్ఘకాలం వెంటబడి వేధిస్తుంటాయి. ఇందుకు సాధారణ కారణాల దగ్గర్నుంచి.. అంతర్గత సమస్యల వరకూ రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. 
    ఒళ్లు నొప్పులు సర్వ సాధారణ లక్షణం. చాలామంది తరచుగా దీని గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. మగవారిలో కన్నా ఆడవారిలో ఒకింత ఎక్కువగానూ చూస్తుంటాం. మామూలు జలుబు, ఫ్లూతో పాటు టైఫాయిడ్‌, మలేరియా వంటి జ్వరాల్లో ఒళ్లునొప్పులు మామూలే. డెంగీ జ్వరంలోనైతే ఎముకలు విరిగిపోతున్నాయేమో అన్నంత తీవ్రంగానూ నొప్పులు భయపెడుతుంటాయి. ఒకోసారి ఇన్‌ఫెక్షన్లు ఆరంభం కావటానికి రెండు మూడు రోజుల ముందు నుంచే నొప్పులు ఉంటుండొచ్చు. ఒకరకంగా ఇవి మన రక్షణ వ్యవస్థలో భాగమనే చెప్పుకోవచ్చు. వైరస్‌, బ్యాక్టీరియా వంటివి ఒంట్లోకి ప్రవేశించినపుడు రోగనిరోధకశక్తి వెంటనే ప్రతిస్పందించి వాటితో పోరాడటానికి తెల్లరక్తకణాలను పురమాయిస్తుంది. ఈ క్రమంలో వాపు ప్రక్రియ ప్రేరేపితమై కండరాలు, ఎముకల నొప్పుల వంటివి బయలుదేరతాయి. ఆయా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నకొద్దీ నొప్పులూ తగ్గిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు పోషకాల లోపం, థైరాయిడ్‌ జబ్బులు, తీవ్రమైన అలసట వంటి అంతర్గత సమస్యలూ నొప్పుల రూపంలో బయటపడుతుండొచ్చు. వీటి గురించి తెలియక ఎంతోమంది రోజులు, నెలల కొద్దీ నొప్పులతో సతమతమైపోతూనే ఉంటారు. అనుక్షణం నొప్పి కలతతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. నొప్పి మాత్రలు వేసుకుంటూ ఎలాగోలా రోజులు నెట్టుకొస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒళ్లునొప్పులు దీర్ఘకాలంగా వేధిస్తుంటే వాటికి మూలమేంటన్నది తరచి చూడటం అత్యవసరం.

మానసిక సమస్యలు

శరీరం, మనసు.. రెండూ పరస్పర ఆధారితాలు. మనసు బాగా లేనప్పుడు ఏ పని చేయటానికీ శరీరం సహకరించకపోవటం తెలిసిందే. ఒళ్లునొప్పుల విషయంలో మానసిక సమస్యలు.. ముఖ్యంగా కుంగుబాటు (డిప్రెషన్‌), ఒత్తిడి (స్ట్రెస్‌), ఆందోళన (ఆంగ్జయిటీ) తీవ్ర ప్రభావమే చూపుతాయి. శరీరంలోని అన్ని అవయవాలకు సంకేతాలను జారీచేసేది మెదడే. ఇందులో నాడీకణాల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిల్లో సెరటోనిన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌ మూడ్‌తో పాటు నొప్పి ప్రతిస్పందనలకూ కారణమవుతుంటాయి. ఈ రసాయనాలు అస్తవ్యస్తమైతే కీళ్లనొప్పులు, కాళ్లనొప్పులు, నడుం నొప్పి వంటివీ వేధిస్తుంటాయి. నిజానికి కొందరిలో ఇలాంటి నొప్పులతోనే కుంగుబాటు బయటపడుతుంటుంది కూడా. ఆందోళన, ఒత్తిడికి గురైనప్పుడు అడ్రినలిన్‌, కార్టిజోల్‌ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయులు పెరిగిపోయి.. కండరాలు బిగపట్టేసి నొప్పులకు దారితీస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారిలో నొప్పి భావన కూడా ఎక్కువే. అంటే చిన్న చిన్న నొప్పులు సైతం పెద్ద బాధలుగా అనిపిస్తాయి. అలాగే నొప్పులు సుదీర్ఘంగానూ వెంటాడుతుంటాయి. 
జాగ్రత్తలు-చికిత్స 
* యోగా, ధ్యానం ఎంతో మేలు చేస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతను చేకూరుస్తూ ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి తోడ్పడతాయి. 
* ఒత్తిడికి కారణమవుతున్న సందర్భాలకు దూరంగా ఉండాలి. 
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. 
* మనసులోని భావాలను ఆత్మీయులతో పంచుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
* అవసరమైతే కుంగుబాటును తగ్గించే మందులు వేసుకోవాలి.

ఫైబ్రోమయాల్జియా 


ఫైబ్రోమయాల్జియాలో ఆపాదమస్తకమూ నొప్పి వేధిస్తుంది. నిస్సత్తువ కూడా కనబడుతుంది. దీర్ఘకాలంగా వేధించే ఇది ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. కాకపోతే ఒత్తిడి, అలసటకు గురయ్యేవారిలో ఎక్కువ. ఇన్‌ఫెక్షన్లు, ప్రమాదాలు, ఒత్తిడి, జన్యుపరమైన అంశాల వంటివి దీనికి దోహదం చేయొచ్చు. ఇందులో ఒళ్లంతా బిగుసుకుపోయినట్టు, శరీరమంతా సూదులు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంటుంది. తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, ఆందోళన వంటి లక్షణాలూ ఉంటాయి. ఒళ్లునొప్పులకు దారితీసే ఇతరత్రా సమస్యలేవీ కనబడకపోతే ఫైబ్రోమయాల్జియాగా అనుమానించాల్సి ఉంటుంది. 

జాగ్రత్తలు-చికిత్స 
* మామూలు నొప్పి నివారణ మందులతో మంచి ఉపశమనం లభిస్తుంది. 
* కుంగుబాటు మందులు కూడా బాగా ఉపయోగపడతాయి. 
* వ్యాయామం, యోగా, ధ్యానం చేయటం మంచిది. 
* నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి.

శారీరకశ్రమ తగ్గటం


ఒకింత ఎక్కువసేపు పనిచేసినపుడు, వ్యాయామం చేసినపుడు ఒళ్లు నొప్పిగా అనిపించటం సహజమే. కానీ శారీరకశ్రమ తగ్గినా కూడా ఒళ్లునొప్పులు తలెత్తొచ్చు. కండరాలకు ఎంత పని చెబితే అంత బలోపేతం అవుతాయి. లేకపోతే కండర మోతాదు తగ్గిపోయి.. బలహీనత ముంచుకొస్తుంది. ఇది ఒళ్లు నొప్పులకూ దారితీస్తుంది. డెస్క్‌ ఉద్యోగుల వంటి వారికి దీని ముప్పు ఎక్కువ. గంటలకొద్దీ ఒకే భంగిమలో కూచోవటం వల్ల కండరాలు ఒత్తిడికి గురై.. నడుంనొప్పి, మెడనొప్పి, ఒళ్లునొప్పుల వంటివి బయలుదేరుతుంటాయి. విద్యార్థుల్లోనూ ఇలాంటి నొప్పులు చూస్తుంటాం. బడిలో కుర్చీలు, బెంచీలు పిల్లల ఎత్తుకు తగ్గట్టుగా లేకపోవటం.. బ్యాగుల మోత వంటివీ నొప్పులకు దారితీస్తుంటాయి. 
జాగ్రత్తలు 
* అదేపనిగా కూచోకుండా వీలైనప్పుడల్లా కాసేపు లేచి అటూఇటూ నడవటం మంచిది. ముఖ్యంగా కండరాలు సాగటానికి తోడ్పడే స్ట్రెచింగ్‌ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. 
* రోజూ కనీసం అరగంట సేపు నడక, జాగింగ్‌, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి వ్యాయామాలు చేయాలి. 
* యోగాతోనూ మంచి ఉపశమనం లభిస్తుంది.

థైరాయిడ్‌ సమస్యలు


థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు పెరిగినా, తగ్గినా ఒళ్లు నొప్పులు రావొచ్చు. థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు అస్తవ్యస్తమైతే మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థం శక్తిగా మారే ప్రక్రియ దెబ్బతింటుంది. దీంతో కండరాలకు తగినంత శక్తి అందక త్వరగా అలసిపోతుంటాయి. ఇది నొప్పులకు దారితీస్తుంది. అంతేకాదు.. థైరాయిడ్‌ గ్రంథి వెనకభాగాన ఉండే ప్యారాథైరాయిడ్‌ గ్రంథులు పెద్దగా అవటం (ఎడినోమా) కూడా నొప్పులకు కారణం కావొచ్చు. ఈ గ్రంథి ఉబ్బినపుడు ప్యారాథైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు బాగా పెరిగిపోతాయి. దీంతో ఎముకల్లోంచి క్యాల్షియం పెద్దమొత్తంలో బయటకు వచ్చేస్తుంటుంది. ఫలితంగా ఒళ్లంతా విపరీతమైన నొప్పులు వేధిస్తుంటాయి. థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులను సరిచేస్తే ఒళ్లునొప్పులూ తగ్గుతాయి. అందువల్ల థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయనివారికి థైరాయిడ్‌ హార్మోన్‌ మాత్రలు ఇస్తారు. థైరాయిడ్‌ మోతాదులు ఎక్కువగా గలవారికి రేడియోయాక్టివ్‌ అయోడిన్‌తో మంచి ఫలితం కనబడుతుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి కుంచించుకుపోతుంది. కొందరికి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు, అధిక రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్లు కూడా ఇస్తారు. అవసరమైతే సర్జరీ చేసి గ్రంథిని తొలగించాల్సి ఉంటుంది. ప్యారాథైరాయిడ్‌ గ్రంథి ఉబ్బినవారికీ సర్జరీ అవసరమవుతుంది. 
జాగ్రత్తలు 
* హైపోథైరాయిడిజమ్‌ గలవారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. 
* గోరువెచ్చటి నీటితో స్నానం, మర్దనతో ఉపశమనం కలుగుతుంది. 
* తేలికపాటి వ్యాయామాలు చేయటం మంచిది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి నొప్పులు తగ్గుతాయి. 
* అవసరమైతే మెగ్నీషియం మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.

నీటిశాతం తగ్గటం


మనం పెద్దగా పట్టించుకోం గానీ ఒంట్లో నీటిశాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) ఒంటి నొప్పులకు దారితీస్తుంది. శరీరం సరిగా పనిచేయటానికి నీరు అత్యవసరం. నీటి శాతం తగ్గితే శ్వాసక్రియ, జీర్ణక్రియ వంటి కీలకమైన పనులన్నీ అస్తవ్యస్తమవుతాయి. రక్తంలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల మోతాదులూ పడిపోతాయి. దీంతో కండరాలు పట్టేయటం.. ఫలితంగా నొప్పులూ వేధిస్తాయి. ఎండకాలంలోనే డీహైడ్రేషన్‌ వస్తుందని భావిస్తుంటారు గానీ చలికాలం, వానకాలంలోనూ నెమ్మదిగా ఒంట్లో నీటిశాతం తగ్గిపోతుంటుంది. ఇది మనకు తెలియకుండానే సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. అలాగే అవసరానికి మించి అదేపనిగా నీళ్లు తాగటం కూడా మంచిది కాదు. దీంతో మూత్రం ఎక్కువగా తయారై.. దాంతో పాటు ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా కండరాలు కుంచించుకుపోయి నొప్పులకు దారితీస్తుంది. 
జాగ్రత్తలు 
* దాహం వేయటానికి ముందే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవటం, అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తాగటం మంచిది. ఏసీ గదుల్లో గడిపేవారు కూడా దీన్ని మరవరాదు. బయటకు వెళ్లినపుడు వెంట నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. 
* నీరు ఎక్కువగా ఉండే కీర దోసకాయ, పుచ్చకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

రక్తప్రసరణ తగ్గటం


కండరాలకు నిరంతరం తగినంత రక్తం సరఫరా అందుతుండాలి. అప్పుడే అవి సమర్థంగా పనిచేస్తాయి. రక్తప్రసరణ తగ్గిపోతే కండరాలు బలహీనమై నొప్పులు వేధిస్తాయి. పొగతాగే అలవాటు గలవారిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా కాళ్లలో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కొంతదూరం నడవగానే పిక్కలు పట్టేస్తుంటాయి. విశ్రాంతి తీసుకోగానే తగ్గుతాయి. దీనికి ప్రధాన కారణం కాలి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం (ఫెరిఫెరల్‌ వాస్క్యులర్‌ డిసీజ్‌). మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, పొగ అలవాటు వంటివన్నీ దీనికి దారితీస్తాయి. సమస్య ముదిరిపోతే విశ్రాంతి తీసుకునే సమయంలోనూ నొప్పి కలుగుతుంది. 
జాగ్రత్తలు 
* పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. 
* గ్లూకోజు, కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

మందులు


ఇతరత్రా జబ్బుల కోసం వేసుకునే కొన్ని రకాల మందులు కూడా ఒళ్లునొప్పులు తెచ్చిపెట్టొచ్చు. కొన్నిరకాల బీపీ మందుల మూలంగా రక్తంలో పొటాషియం, సోడియం స్థాయులు తగ్గిపోతుంటాయి. ఇలాంటివారు తరచుగా నొప్పులతో సతమతమవటం చూస్తుంటాం. కొలెస్ట్రాల్‌ తగ్గటానికి స్టాటిన్స్‌ వేసుకునేవారిలోనూ నొప్పులు సర్వ సాధారణం. ఇవి శక్తిని పుట్టించే క్యూ10 అనే ఎంజైమ్‌ మోతాదులు తగ్గేలా చేస్తాయి. ఫలితంగా కండరాలు త్వరగా అలసిపోయి నొప్పులు తలెత్తుతుంటాయి. 
జాగ్రత్తలు 
* ఏవైనా మందులు మొదలుపెట్టాక ఒళ్లునొప్పులు వస్తుంటే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే డాక్టర్లు మందులు మార్చటం గానీ మోతాదులు తగ్గించటం గానీ చేస్తారు.

పోషకాల లోపం


       మనదేశంలో ఒళ్లు నొప్పులకు దారితీస్తున్న అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోషకాల లోపం గురించే. ముఖ్యంగా విటమిన్‌ డి, క్యాల్షియం, ఐరన్‌ లోపం ఒళ్లు నొప్పుల వంటి ఎన్నెన్నో చిక్కులు తెచ్చిపెడుతోంది. విటమిన్‌ డి ఎముకల పటుత్వానికే కాదు.. కండరాలు బలోపేతం కావటానికీ తోడ్పడుతుంది. మనదేశంలో ఏడాదంతా ఎండలు కాసే మాట నిజమే అయినా.. విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నవారు ఎందరో. మనం ఎండలో అంతగా బయటకు వెళ్లకపోవటం.. ఒకవేళ వెళ్లినా ఒళ్లంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించటం వల్ల చర్మానికి ఎండ తగలటమనేది తక్కువ. ఇక మన చర్మం ముదురురంగులో ఉండటం వల్ల విటమిన్‌ డి తయారీకి తోడ్పడే కిరణాలు లోపలికి అంతగా వెళ్లవు కూడా. ఇవన్నీ విటమిన్‌ డి లోపానికి కారణమవుతున్నాయి. క్యాల్షియం లోపమూ ఒళ్లునొప్పులకు దారితీస్తుంది. కండరాలు తేలికగా కదలటానికి క్యాల్షియం తోడ్పడుతుంది. ఇది లోపిస్తే మాటిమాటికీ కండరాలు పట్టేస్తుంటాయి, తీపులు తీస్తుంటాయి. అలాగే విటమిన్‌ బి12 లోపంతోనూ కండరాలు పట్టేసినట్టు, లాగుతున్నట్టు అనిపిస్తుంది. మనలో శాకాహారులు ఎక్కువ. మాంసాహారుల్లోనూ వారానికి ఒకసారో, రెండుసార్లో మాంసం తింటారు. ఇదీ విటమిన్‌ బి12 తగ్గటానికి కారణమవుతోంది. అలాగే కొన్నిరకాల మందులు సైతం బి12 లోపానికి దారితీయొచ్చు. ఉదాహరణకు- మధుమేహులు వేసుకునే మెట్‌ఫార్మిన్‌ మందు మూలంగా శరీరం విటమిన్‌ బి12ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతుంది. కొందరిలో బి12ను శరీరం సంగ్రహించుకోవటానికి తోడ్పడే ఇంట్రిన్సిక్‌ ఫ్యాక్టర్‌ లేకపోవటమూ బి12 లోపానికి దారితీస్తుంది. ఇక ఐరన్‌ లోపంతో తలెత్తే రక్తహీనత మూలంగా కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. ఫలితంగా త్వరగా అలసట ముంచుకురావటం, ఒంటి నొప్పులు వేధించటం మొదలవుతుంది. 
జాగ్రత్తలు-చికిత్స 
* రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. 
* పాలు, పెరుగు, ఆకుకూరల వంటివి విధిగా తీసుకోవాలి. 
* మాంసాహారులైతే మాంసం, చికెన్‌, చేపల వంటివి తినాలి. 
* అవసరాన్ని బట్టి విటమిన్‌ డి, బి12, క్యాల్షియం, ఐరన్‌ మాత్రలు వేసుకోవాలి.

నిద్రలేమి


నొప్పులతో నిద్ర పట్టకపోవటం మామూలే. అయితే నిద్ర సరిగా పట్టకపోయినా ఒళ్లునొప్పులు రావొచ్చు. రోజంతా పనులతో, ఆలోచనలతో అలసిపోయిన కండరాలు, మెదడు నిద్రలోనే విశ్రాంతి తీసుకుంటాయి. తిరిగి ఉత్తేజితమై కొత్తశక్తిని సంతరించుకుంటాయి. అదే నిద్ర సరిగా పట్టకపోతే కండరాలు శక్తిని కోల్పోయి త్వరగా అలసిపోతాయి. ఇది నొప్పులకు దారితీస్తుంది. కొందరు నిద్రలో ఉన్నట్టుండి కాసేపు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై లేచేస్తుంటారు (స్లీప్‌ అప్నియా). దీంతో ఎప్పుడూ మెలకువగానే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం వల్ల నిరుత్సాహం ఆవరిస్తుంది. ఒళ్లునొప్పులూ వేధిస్తుంటాయి. నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల నొప్పిని ఓర్చుకునే గుణమూ తగ్గుతుంది. చిన్న నొప్పులైనా పెద్దగా కనబడతాయి. 
జాగ్రత్తలు 
* రోజూ సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. 
* సాయంత్రం తర్వాత కాఫీ, టీ వంటివి తాగకపోవటం మంచిది. 
* నిద్ర సమస్యలేవైనా ఉంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలి.

తీవ్రమైన నిస్సత్తువ


ఎప్పుడు చూసినా నిస్సత్తువ, నిరుత్సాహం. దీన్నే క్రానిక్‌ ఫేటిగ్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇందులోనూ చాలావరకు ఫైబ్రోమయాల్జియా లక్షణాలే కనబడుతుంటాయి. ఎంత తిన్నా, ఎంత విశ్రాంతి తీసుకున్నా హుషారుగా అనిపించదు. నిద్ర సరిగా పట్టదు. శరీరం ఎప్పుడూ విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించదు. ఒళ్లంతా నొప్పులు వేధిస్తుంటాయి. కీళ్ల నొప్పులు కూడా ఉండొచ్చు. ఇది ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. మగవారిలో కన్నా ఆడవారిలో నాలుగు రెట్లు ఎక్కువగా కనబడుతుంది. 
జాగ్రత్తలు-చికిత్స 
* దీనికి ఆయా లక్షణాలను బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మామూలు నొప్పి నివారణ మందులు, కుంగుబాటు మందులు ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకోవాలి. 
* ఒత్తిడిని తగ్గించుకోవాలి. కష్టమైన పనులకు దూరంగా ఉండాలి. 
* ఫిజియోథెరపీ, వ్యాయామం, యోగా మేలు చేస్తాయి.  SEE PRINT BOOKS CKIK ME.....
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment