
కోర్కెలు తీర్చే కోటసత్తెమ్మకు నూతన రాజగోపురం
అమ్మలగన్న అమ్మ... భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పూజలందుకొంటున్న తల్లి కోటసత్తెమ్మ అమ్మవారు... సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించే తల్లిగా తెలుగు రాష్ట్రాలలోని భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెలిసింది. శంఖుచక్ర యజ్ఞోపవేదధారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారికి భక్తులు దాతలు ఇస్తున్న విరాళాలతోనే ఆలయం అంగరంగ వైభవంగా అభివృద్ది చెందింది.
ఈ కల్పవల్లి కోసం ఇప్పుడు అశేష భక్తజనసందోహం సరికొత్త రాజగోపుర నిర్మాణానికి 

శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఆలయంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపుర నిర్మాణాన్ని చేపట్టారు. ఇది తుది దశకు చేరుకుంది. వచ్చే నెల ఆగష్టు 2వ వారంలో అంగరంగ వైభవంగా అంబరాన ఆలయ రాజగోపుర ప్రారంభోత్సవం జరుగనుంది. రాజగోపుర నిర్మాణానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పులు శిల్పాలు చెక్కగా, తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణానికి చెందిన స్తపతి ఆధ్వర్యంలో రాజగోపురం ప్రధాన ద్వారాలను పూర్తి చేశారు. ఈ ద్వారానికి సుమారు 20 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న తలుపులను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేశారు.

పూర్వపు చరిత్ర...
పూర్వ నిడదవోలు పట్టణం నిరవధ్యపురంగా ప్రసిద్ది చెందింది. 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చాళుక్య రాజులు నిరవధ్యపురాన్ని పాలించేవారని. వీరభద్ర చాణిక్యుని కోటలో శక్తి స్వరూపిణిగా పూజలందుకొన్న అమ్మవారు కాలక్రమేణా చాళుక్యుల పాలన అంతమవడంతో అమ్మవారి విగ్రహం అదృశ్యమైంది. తరువాత 1934వ సంవత్సరంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తిశాస్ర్తి పొలం దున్నుతుండగా బైటపడింది. అనంతరం భూమి ఆసామికి కలలో కనిపించి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించాలని అమ్మవారు అనుజ్ఞ ఇవ్వడంతో అదే ప్రదేశంలో విగ్రహప్రతిష్ట చేశారు. నాటి నుండి నేటి వరకు భక్తుల కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా కోటసత్తెమ్మ పేరు రోజురోజుకు వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నుండి విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక తెలంగాణా రాష్ట్రమైన హైద్రాబాద్ పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం, మంగళవారాలు అమ్మవారికి ఇష్టమైన రోజులు కావడంతో ఈ రోజులలో అమ్మవారి ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.
సంతానవృక్షం ప్రత్యేక ఆకర్షణ...
కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో గర్భాలయానికి నైఋతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజురోజుకు మహిళాభక్తుల పూజలు పెరుగుతున్నాయి. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతాన వృక్షానికి ఊయల కట్టడం సాంప్రదాయం. అమ్మవారికి సమర్పించిన రెండు అరటి పళ్ళలో ఒక అరటి పండును ఎర్రటి వస్త్రంతో సంతాన వృక్షానికి ఊయలకట్టి ఒక అరటి పండును ఆ ఊయలలో పెట్టి అమ్మవారిని పూజించి రెండవ అరటి పండును ప్రసాదంగా స్వీకరించడం అనవాయితీ. అలా కోరుకున్న మహిళా భక్తులకు పిల్లలు పుట్టిన తరువాత అమ్మవారి పేరు కలసి వచ్చేలా కోట సత్య నారాయణ, కోట సత్యవతి, కోటతోను, సత్యతోను కలసి వచ్చే పేర్లు పెట్టుకోవడంతో పాటుగా అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు.
అమ్మవారి విగ్రహ ప్రత్యేకత
కోట సత్తెమ్మ అమ్మవారు శంఖుచక్రగద అభయ హస్త యజ్ఞోపవేదధారిణిగా ఏకశిల స్వయంభు విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిశారు. అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. ప్రతి ఏటా ఆంధ్రపదేశ్ తెలంగాణా రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఏడు లక్షలకు పైగానే ఉంటారనేది ఒక అంచనా. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొనేందుకు 65 గదులను దేవస్థానం అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది శ్రావణమాసం చివరి శుక్రవారం రెండు వేలకు పైగా ముత్తయిదువలతో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించడం అనవాయితీ. ఆలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతినిత్యం నిత్య అన్నదాన ట్రస్ట్ ద్వారా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు

చల్లని తల్లి కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఇష్టమైన ఆదివారం మంగళవారం రోజులతో పాటు ప్రతి ఏడాది విజయదశమికి పది రోజుల పాటు నవరాత్రికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు కుంకుమ పూజలు, జరుగుతాయి. దీనితో పాటు ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి నుండి చవితి వరకు ఐదు రోజులపాటు తిరునాళ్ళను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ తిరునాళ్ళకు నిర్వహించే ఉత్సవాలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి దర్శనానికి వస్తుంటారు.
ఆలయానికి మార్గాలు...
నిడదవోలు రైల్వే స్టేషన్ నుండి.. బస్టాండు నుండి అమ్మవారి ఆలయం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ నుండి అమ్మవారి ఆలయం 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుండి 40 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు నిడదవోలులో విడిది చేసేందుకు రైల్వేస్టేషన్ వద్ద, గణపతి సెంటర్‌లోను హొటళ్ళు అందుబాటులో ఉన్నాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment