నాటితరం 
నగలతో... నయాగా!

వచ్చేదంతా పండగలూ, పెళ్లిళ్ల కాలమే. ఆ సందర్భాలకు అందరినీ మెప్పించే ఆహార్యంలో నగలదీ ప్రత్యేక స్థానం. నేటితరం అమ్మాయిలు సింపుల్‌గా ఉండే ఆధునిక డిజైన్లనే ఇష్టపడినా... సందర్భాన్ని బట్టి హంగులు అద్దిన నాటితరం నగల్ని కూడా కోరుకుంటున్నారు. అవి ఎలాంటివంటే...

నగలంటే పెద్ద పెద్ద హారాలే ఉండాలని లేదుగా. ముక్కుపుడక నుంచి కాలి మెట్టెల వరకూ ప్రతిదానికీ ప్రాధాన్యం ఉంటుంది. చిన్న సందర్భమే అయినా అన్నీ వేసుకోకపోతే నిండుదనం రాదనుకునేవారూ పెరిగిపోయారు. 

సందర్భానికి తగ్గట్లు ఎన్నో డిజైనర్‌ నగలు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ముత్యాలూ, నవరత్నాలు పొదిగినవీ, దేవతావిగ్రహాలూ, గుళ్లూ, సంప్రదాయాన్ని ప్రతిబింబించే గుర్తులూ, అలనాటి చంద్రహారాలూ, కాసుమాలలూ, సూర్యచంద్రులూ, చెంపసరాలు... ఇలా వేసుకునే ప్రతి నగా మరింత అందాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మమ్మల కాలం నాటి డిజైన్లే ఇప్పుడు అమ్మాయిల్ని మెప్పిస్తున్నాయి. పచ్చలూ, ముత్యాలూ, కెంపులూ కలగలిసిన కాసు మాలలకి లక్ష్మీదేవి పెండెంట్‌ ఇప్పుడు ట్రెండ్‌. దీన్ని వ్రతాలూ, పూజలూ వంటి సందర్భాలకు వేసుకుంటే నిండుదనం వచ్చినట్లే. దీనికే కాస్త రాళ్లూ, పూల డిజైన్లూ జతచేస్తే మరింత ఆడంబరంగా కనిపిస్తాయి. వివాహ వేడుకల్లో వేసుకున్నా వావ్‌ అనిపిస్తాయి. మెడంతా కప్పేసే చోకర్‌ల హంగామా తగ్గింది. ఇప్పుడు వాటి స్థానంలో టెంపుల్‌ డిజైన్‌లలో మినీహారాలు మెప్పిస్తున్నాయి. అవేకాదు... చంద్రహారం, రాళ్లహారం వంటి పాతకాలపు నగలకీ, వడ్డాణాలకీ కాస్త మెరుగులూ, మెరుపులూ జోడించి సరికొత్తగానూ వేసుకుంటున్నారు.


రాచరికపు హంగులతో... 
* అలనాటి మహారాణులు ఉపయోగించిన డిజైన్‌లకు ఆధునిక హంగులూ అద్దుతున్నారు. మరీ ముఖ్యంగా మొఘల్‌, కుందన్‌, మీనాకారీ వర్క్‌లతో చేసిన యాంటిక్‌ జ్యుయలరీ కూడా కొత్త రూపుతో ఆకట్టుకుంటోంది. రాచరికం ఉట్టిపడే పెద్ద పెద్ద డిజైన్‌లూ, కుందన్లూ, సీజెడ్‌ల మెరుపులూ ఈ నగలకు ఉండేలా చూసుకుంటున్నారు.


* నల్లపూసలకు సీతారాముల వివాహఘట్టాలను గుర్తు చేసే లాకెట్‌లూ, లక్ష్మీ విగ్రహాలు...ఏనుగులూ, గుర్రాలూ, పూల పెండెట్ల వంటివెన్నో ఇప్పుడు ట్రెండ్‌. నల్లపూసలకే ముత్యాలూ, కెంపులూ, పచ్చలు తోడై పలువరుసల్లో ఆకట్టుకుంటున్నాయి. చెంపసరాలకు జుంకాలు తోడై బాహుబలి డిజైన్‌లుగా ఇప్పుడు అంతటా కనిపిస్తున్నాయి.

* సిల్క్‌ దారాలపై మామిడిపిందెలూ, బుట్టలు వంటి ఆకట్టుకునే ఆకృతులతో హారాల్ని తయారు చేస్తున్నారు. వీటికి తగ్గట్లే రంగు రంగుల సీజెడ్స్‌తో గాజులూ, కాలి పట్టీలూ, మెట్టెలు అందం తెచ్చిపెడుతున్నాయి. స్థోమత ఉన్నవారు వీటిని బంగారంలో ఎంచుకుంటే...లేదనుకునేవారు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ని వేసుకుంటున్నారు. ఏదైనా సరే...కొత్తగా మెరిపించాలనుకుంటున్నారు.


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment