పిల్లలలో కీళ్లవాతం   | జువైనల్‌ ఇడియోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌ | Juvenile idiopathic arthritis |  Mohanpublications | Granthanidhi | BhakthiBooks | BhaktiBooks | Mohanbooks | MohanBooks | Telugu Books


కీలెరిగిన ‘పిల్ల’వాతం!
జువైనల్‌ ఇడియోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌

కీళ్లు కదులుతాయి. మనల్ని కదిలిస్తాయి.
ఎముకల మధ్య ఇరుసులా పనిచేస్తూ మనల్ని, మన జీవన చక్రాన్ని ముందుకు నడిపిస్తాయి.
ఇంత కీలకమైనవి కాబట్టే కీళ్లకు ఏ చిన్న సమస్య ఎదురైనా పెద్ద ప్రభావమే పడుతుంది. ఇక పిల్లల కీళ్లకైతే మరిన్ని చిక్కులు తప్పవు.
లేలేత వయసులో..
ఎదుగుతున్న దశలో..
పిల్లల కీళ్లను లక్ష్యంగా చేసుకునే కీళ్లవాతం ఇలాంటి సమస్యే.
ఇది నొప్పి, వాపులతోనే ఆగిపోదు.
గుండె జబ్బు, కంటి జబ్బు వంటి దుష్ప్రభావాలకూ దారితీస్తుంది.
నిర్లక్ష్యం చేస్తే కీళ్ల ఆకారాన్నీ మార్చేసి శాశ్వత వైకల్యాన్నీ తెచ్చిపెడుతుంది.
కానీ దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు.
‘పిల్లలకు కీళ్లవాతమేంటి?’
‘ఎముక వాచిందేమో అదే తగ్గుతుందిలే’
అని పొరపడుతున్నవారు ఎందరో..
దీంతో చికిత్స చేసినా ఫలితం లేని స్థితికి చేరుకుంటోంది.
అందుకే ‘పిల్ల కీళ్లవాతం’ పై సమగ్ర కథనం ఈవారం మీకోసం.
పిల్లలంటే ఉత్సాహ తరంగాలు. పిల్లలంటే ఆనంద కెరటాలు. ఉరుకులు పరుగులతో కేరింతలు కొడుతూ నడయాడే ఇలాంటి పిల్లలు ఎప్పుడైనా నీరస పడిపోతే ‘ఏదో జలుబు చేసిందేమోలే’ అని తేలిగ్గా తీసుకుంటాం. కాళ్లలోనో చేతుల్లోనో నొప్పి పుడుతోందంటే ‘బడిలో ఆడుతూ కింద పడిపోయి ఉండొచ్చు’ అని సర్దిచెబుతుంటాం. ఎప్పుడైనా పిల్లలు ఇలాంటి ఫిర్యాదులు చేసినపుడు పెద్దగా పట్టించుకోకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు గానీ తరచుగా నీరసం, నొప్పి, జ్వరంతో బాధపడుతున్నా.. అలాగే పెన్సిల్‌ వంటివి పట్టుకోవటానికి, నడవటానికి ఇబ్బంది పడుతున్నా నిర్లక్ష్యం పనికిరాదు. ముఖ్యంగా కీళ్లు నొప్పి పెడుతున్నాయంటే ఏమాత్రం తాత్సారం చేయరాదు. ‘ఎదుగుతున్న వయసులో ఇవన్నీ సహజమే’ అనుకోవటమూ మంచిది కాదు. ఎందుకంటే ఇవి పిల్ల కీళ్లవాతం (జువైనల్‌ ఆర్థ్రయిటిస్‌) తొలి సంకేతాలు కావొచ్చు. ఇది దానంతటదే తగ్గిపోయే మామూలు సమస్య కాదు. ఒంట్లో వాపు ప్రక్రియతో ముడిపడిన కీళ్ల సమస్య. వచ్చిందంటే దీర్ఘకాలం వెంటాడుతుంది. నొప్పి, వాపుతో పిల్లలను తెగ ఇబ్బంది పెడుతుంది. ఇవి తరచుగా వేధిస్తుంటే శారీరక, మానసిక ఆరోగ్యం మీదా విపరీత ప్రభావం పడుతుంది. కాబట్టి దీనిపై అవగాహన కలిగుండటం ఎంతో అవసరం.


ఎందుకు?ఎవరికి?
పిల్ల కీళ్లవాతం 1-15 ఏళ్ల వారిలోనే కనబడుతుంది. ఒకప్పుడు ‘జువైనల్‌ రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌’గా భావించే దీన్ని ఇప్పుడు ‘జువైనల్‌ ఇడియోపతిక్‌ ఆర్థ్రయిటిస్‌’ అని పిలుచుకుంటున్నారు. అంటే కారణమేంటో తెలియని పిల్ల కీళ్లవాతమని అర్థం. ఇది ఎందుకొస్తుంది? ఎవరికి వస్తుంది? అనేవి కచ్చితంగా తెలియదు. ప్రతి వెయ్యిమందిలో ఒకరికి రావొచ్చని అంచనా. ఇదేమీ వంశపారంపర్య సమస్య కాదు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా రుమటాయిడ్‌ కీళ్లవాతం ఉన్నా పిల్లలకు రావాలనేమీ లేదు. అయితే కుటుంబంలో పిల్లల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇతర పిల్లలకు వచ్చే ముప్పు (ప్రతి 100 మందిలో ఒకరికి) పెరగొచ్చు. దీన్ని ప్రేరేపించటంలో జన్యువులు, పర్యావరణ అంశాల వంటివి పాలు పంచుకుంటుండొచ్చని అనుమానిస్తున్నారు. రోగ నిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడి చేయటం ఈ సమస్యకు మూలం. మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్లనే ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంటే.. మరికొన్ని తగ్గుముఖం పట్టేలా చూస్తుంటాయి. వీటి మధ్య నిరంతరం ఒక సమతుల్య స్థితి కొనసాగుతూ వస్తుంది. అయితే కొన్నిసార్లు ఇది అస్తవ్యస్తం కావొచ్చు. వాపును ప్రేరేపించే సైటోకైన్ల స్థాయులు పెరిగి.. వాపును తగ్గించే సైటోకైన్లు తగ్గిపోవచ్చు. కీళ్లవాతం బాధితుల్లో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. దీంతో వాపు కారక సైటోకైన్లు కీలు మీద దాడిచేసి దాన్ని దెబ్బతీస్తాయి. మన కీలు చుట్టూ సైనోవియం అనే పొర ఉంటుంది. కీళ్లు సులభంగా, తేలికగా కదలటానికి తోడ్పడే జిగురుద్రవం (సైనోవియల్‌ ద్రవం) దీనిలోంచే ఉత్పత్తి అవుతుంది. కీళ్లవాతం బాధితుల్లో రోగనిరోధకవ్యవస్థ ఈ సైనోవియం పొర మీదే దాడిచేస్తుంది. దీంతో అది ఉబ్బిపోతుంది. జిగురుద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. కీళ్లలోకి విషతుల్యాలు చొచ్చుకెళ్తాయి. ఫలితంగా వాపు, నొప్పి వంటివి వేధిస్తాయి. ఈ ప్రక్రియ అంతటితోనే ఆగిపోదు. చుట్టుపక్కల కణజాలానికీ విస్తరిస్తుంది. ఫలితంగా కీళ్లు ఒరుసుకుపోకుండా చూసే మృదులాస్థి, క్రమంగా ఎముక దెబ్బతింటాయి. అయితే ఈ సైటోకైన్ల స్థాయులు ఎవరిలో పెరుగుతాయి? దీనికి దోహదం చేస్తున్నవేంటి? అనేది మాత్రం మనకు తెలియదు. కీళ్లవాతం సమస్య అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువగా కనబడుతుంది.
దుష్పరిణామాల ముప్పు
కీళ్లవాతం కీళ్లకే పరిమితం కావాల్సిన పనిలేదు. ఇది ఇతరత్రా సమస్యలకూ దారితీయొచ్చు.
కంటివాపు: కీళ్లవాతంలో కొందరికి కళ్లు ఎరుపెక్కటం, నొప్పి, వాపు (యువియైటిస్‌) సైతం ఉంటాయి. దాదాపు సగం మందికి కీళ్లవాతంతోనే కంటి సమస్య కూడా దాడిచేయొచ్చు. కీళ్లవాతం కొద్ది కీళ్లకే పరిమితమైనవారికి, ఎక్కువ కీళ్లకు విస్తరించినవారిలో ఏఎన్‌ఏ పాజిటివ్‌ గలవారికి దీని ముప్పు ఎక్కువ. పిల్లల్లో దీని లక్షణాలు అంత స్పష్టంగా ఉండవు. నొప్పి కూడా ఉండదు. అందువల్ల దీన్ని గుర్తించటం కష్టం. కాబట్టి కీళ్లవాతాన్ని అనుమానించినప్పుడే కంటి పరీక్ష కూడా చేయించటం తప్పనిసరి. దీన్ని విస్మరిస్తే మున్ముందు నీటికాసులు, శుక్లాల వంటివి బయలుదేరొచ్చు. కొందరికి చూపు పూర్తిగానూ పోవచ్చు.

మాస్‌: సిస్టమిక్‌ రకం కీళ్లవాతంలో దాదాపు 10% మందిలో అరుదుగా మ్యాక్రోఫేజ్‌ యాక్టివేషన్‌ సిండ్రోమ్‌ (మాస్‌) తలెత్తొచ్చు. వీరిలో ఒకపట్టాన జ్వరం తగ్గదు. తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు ఉన్నట్టుండి పడిపోతాయి. ఈఎస్‌ఆర్‌ తగ్గుతుంది. కాలేయ ఎంజైమ్‌లు, ట్రైగ్లిజరైడ్లు, ఫెరిటిన్‌ స్థాయులు బాగా పెరుగుతాయి. దీన్ని నిర్ధరణకు ఎముక మజ్జ, కాలేయం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షించాల్సి ఉంటుంది కూడా. దీనికి ప్రత్యేకంగా చికిత్స అవసరం. లేకపోతే ప్రాణాపాయానికి దారితీయొచ్చు.

క్యాన్సర్లు: కొందరిలో రక్త క్యాన్సర్‌, నాడీ క్యాన్సర్లు (న్యూరోబ్లాస్టోమా) కూడా కీళ్లవాతం మాదిరిగానూ కనబడుతుంటాయి. ఎల్‌డీహెచ్‌, యూరిక్‌ ఆమ్లం చాలా ఎక్కువగా.. అలాగే ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నప్పుడు వీటిని అనుమానించాల్సి ఉంటుంది. పెరిఫెరల్‌ స్మియర్‌ పరీక్ష చేస్తే రక్తకణాల్లో లోపాలు స్పష్టంగా బయటపడతాయి.

వైకల్యం: కీలు వాచినపుడు చాలామంది ఎముకల సమస్యగా పొరపడుతుంటారు. ఒకోసారి క్షయ చికిత్స కూడా చేస్తుంటారు. దీంతో సమస్య మరింత ముదిరిపోవచ్చు. క్రమంగా కీళ్లు వంకర్లు పోవచ్చు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నా వైకల్యం అలాగే ఉండిపోతుంది.


రుమాటిక్‌ జ్వరం
గొంతు నొప్పి (స్ట్రెప్టోకాకల్‌ ఇన్‌ఫెక్షన్‌) తర్వాత మొదలయ్యే ఇది రుమటాయిడ్‌ కీళ్లవాతం సమస్య కాకపోయినా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవటం మంచిది. ఇందులోనూ కీళ్లనొప్పి మారిపోతూ వేధిస్తుంటుంది (మైగ్రేయిటరీ ఆర్థ్రయిటిస్‌). దద్దు (ఎరితీమా మార్జినేటమ్‌), చర్మం కింద కంతులు కూడా రావొచ్చు. దీనికి సరిగా చికిత్స చేయకపోతే గుండె కవాటాలు మూసుకుపోయే ప్రమాదమూ ఉంది.

రకరకాలు
కీళ్లవాతం కొందరికి కొన్ని కీళ్లకే పరిమితమైతే.. కొందరిలో చాలా కీళ్లకు విస్తరించొచ్చు. కొందరికి వెన్నుకూ పాకొచ్చు. ఇది ప్రధానంగా ఐదు రకాలుగా కనబడుతుంది.

1 కొద్ది కీళ్ల సమస్య: పిల్లల్లో తరచుగా కనబడే (30-40% మందిలో) కీళ్లవాతం ఇదే. నాలుగు, అంతకన్నా తక్కువ కీళ్లకే పరిమితమయ్యే దీన్ని ‘ఓలిగోఆర్థ్రయిటిస్‌’ అంటారు. ఎక్కువగా మోకాలు, మడమ, మణికట్టు కీళ్లు ప్రభావితమవుతుంటాయి. మామూలుగా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ సమస్యల్లో ఒకే సమయంలో రెండు వైపు భాగాల్లో (ఉదా: కుడి చేతితో పాటు ఎడమ చేయి) కీళ్లు వాస్తుంటాయి. ఇందులో అలా కాదు. ఎడమ మోచేయిలో నొప్పి ఉంటే కుడి మోకీలులో నొప్పి వస్తుంటుంది. ఇలాంటి కీళ్లవాతం 2-4 ఏళ్ల వయసు వారిలో ఎక్కువ. కొందరికి సమస్య మొదలైన ఆరు నెలల తర్వాత ఇతర కీళ్లకూ విస్తరించొచ్చు. కంటినీ దెబ్బతీయొచ్చు.

2 ఎక్కువ కీళ్ల సమస్య: ఇది ఐదు, అంతకన్నా ఎక్కువ కీళ్లకు వస్తుంది (పాలీఆర్థ్రయిటిస్‌). సుమారు 10-30% మంది దీని బారినపడుతుంటారు. చాలావరకు పెద్దవారిలో మాదిరిగానే కనబడుతుంది. రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ పాజిటివ్‌గా గానీ నెగెటివ్‌గా గానీ ఉండొచ్చు. సమస్య కాళ్లు, చేతులకే కాకుండా దవడ, మెడ, భుజం కీళ్లకూ విస్తరించొచ్చు.

3 వెన్ను బిగువు: ఇందులో కాళ్లు, చేతులతో పాటు వెన్నుపూసలు కూడా ప్రభావితమవుతాయి. ఒకరకంగా దీన్ని పెద్దల్లో వచ్చే వెన్నుపూసలు బిగుసుకుపోయే సమస్య (యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌) అనుకోవచ్చు. దీన్నే జువైనల్‌ స్పాండలోఆర్థ్రయిటిస్‌ అంటారు. సుమారు 20% మందిలో కనబడుతుంది. ఇది ఆరేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో 7 రెట్లు అధికంగా కనబడుతుంది. ఎముకలకు కండర బంధనాలు, స్నాయువులు అంటుకునే చోట వాపు రావటం దీని ప్రత్యేకత. దీంతో మోకీలు చిప్ప ముందు, కింది భాగాల్లోనూ.. మడమ, అరికాళ్లతో పాటు తొడ పక్కవైపులా నొప్పి వస్తుంటుంది. సుమారు 30% మందిలో కటి ఎముకలో సాక్రమ్‌, ఇలియాక్‌ మధ్యలోని సాక్రో-ఇలియాక్‌ కీళ్లలోనూ వాపు రావొచ్చు. దీంతో ఉదయం పూట నిద్ర లేచాక వెంటనే మంచం మీది నుంచి లేవలేరు. దాదాపు 45 నిమిషాలు గడిస్తే గానీ అడుగు వేయలేరు. అర్ధరాత్రి పూట నొప్పి ఆరంభమవుతుంది. మంచం మీద పొర్లటం సాధ్యం కాదు. తుంటిలో నొప్పి కుడిఎడమలకు మారిపోతుండటం మరో ప్రత్యేకత. అంటే కొద్దిరోజులు ఎడమ తుంటిలో.. కొద్దిరోజులు కుడి తుంటిలో నొప్పి కనబడుతుంది.

4 శరీరం మొత్తం: ఇది శరీరంలోని ఇతర భాగాలకూ విస్తరించే రకం (సిస్టమిక్‌ ఆర్థ్రయిటిస్‌). దీన్ని స్టిల్స్‌ డిసీజ్‌ అనీ అంటారు. సుమారు 10-15% మందిలో ఇది కనబడుతుంది. వీరిలో కీళ్ల వాపు, నొప్పులతో పాటు జ్వరం, దద్దు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఛాతీ, ఉదర భాగాల్లో దద్దు ఎక్కువ. చేతుల్లో మోచేయి పైభాగాన, కాళ్లలో తొడల వద్ద దద్దు వస్తుంటుంది. చిత్రంగా వీరిలో ముఖం మీద దద్దు రాదు. జ్వరం పెరుగుతున్నకొద్దీ దద్దూ ఎక్కువవుతుంది. జ్వరం తగ్గితే దద్దూ తగ్గుతుంది. వేడి నీటితో స్నానం చేసినా, రగ్గు కప్పుకున్నా దద్దు రావొచ్చు. ఇలాంటి కీళ్లవాతం 2-5 ఏళ్ల వయసులో ఎక్కువగా కనబడుతుంది. ఇది అమ్మాయిల్లో, అబ్బాయిల్లో సమానంగా వస్తుంది.

* మామూలుగా పిల్లల్లో వైరల్‌ జ్వరాలు, గొంతునొప్పి వంటి సమస్యల్లోనూ దద్దు వస్తుంటుంది. అందువల్ల సిస్టమిక్‌ కీళ్లవాతాన్ని గుర్తించటం చాలా కీలకం. రెండు వారాలకు పైగా జ్వరంతో బాధపడుతుండటం.. గొంతు వద్ద, చంకల్లో, గజ్జల్లో లింఫ్‌ గ్రంథులు ఉబ్బటం వంటివి ఉంటే శారీరక కీళ్లవాతంగా అనుమానించాలి. వీరిలో కాలేయం, ప్లీహం కూడా పెద్దగా అవుతాయి. ఎక్స్‌రే తీస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టు కనబడుతుంది. ఎకో పరీక్షలో గుండె చుట్టూ ఉండే పెరికార్డియంలో నీరు ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. ఒకేరోజున జ్వరం ఉన్నట్టుండి ఎక్కువవటం, కొద్దిగంటల్లోనే పూర్తిగా తగ్గిపోతుండటం దీని ప్రత్యేకత. జ్వరం వచ్చినపుడు పిల్లలు నీరసంగా, చిరాకుగా కనబడతారు. జ్వరం తగ్గగానే హుషారుగా లేచి తిరుగుతారు. బాగా ఆడుకుంటారు. జ్వరం రాగానే మళ్లీ నీరసంతో పడుకుండిపోతుంటారు. అదే టైఫాయిడ్‌, మలేరియా వంటి ఇన్ఫెక్షన్లలోనైతే మందులు వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గిపోయేంతవరకూ పిల్లలు నీరసంగానే ఉంటారు.

5 పొలుసుల కీళ్లవాతం: ఇది సోరియాసిస్‌తో ముడిపడిన కీళ్లవాతం. కీళ్లవాతం బారినపడ్డ పిల్లల్లో సుమారు 2-10% మందిలో ఇది కనబడుతుంది. మామూలుగా పెద్దవాళ్లలో సోరియాసిస్‌ తర్వాత కీళ్లవాతం మొదలవుతుంటుంది. కానీ పిల్లల్లో ముందుగా కీళ్లవాతం.. తర్వాత రెండు మూడేళ్లకు చర్మం మీద పొలుసులు వస్తుంటాయి. వీరిలో వేళ్లు ఉబ్బిపోయి బజ్జీల్లా (డాక్టిలైటిస్‌) కనబడటం గమనార్హం. సాధారణంగా కీళ్లవాతంలో వేలి చివరి కీళ్లలో వాపు ఉండదు. కానీ సొరియాటిక్‌ ఆర్థ్రయిటిస్‌లో వరుసగా అన్ని కీళ్లూ ఉబ్బుతాయి. దీంతో వేలంతా మిరప బజ్జీ మాదిరిగా కనబడుతుంది. కీళ్లవాతంతో బాధపడే పిల్లల కుటుంబంలో పెద్దవాళ్లలో ఎవరికైనా సొరియాసిస్‌ ఉంటే ఇలాంటి సమస్య రావొచ్చు. సాధారణంగా 6 ఏళ్లలోపే ఇది మొదలవుతుంది.

6 ఇతర రకాలు: కొందరికి చర్మ కణజాలాన్ని దెబ్బతీసే కీళ్లవాతం (డెర్మటోమయోసైటిస్‌) ఉండొచ్చు. వీరిలో మెడ కింది కండరాలు, భుజాలు, తొడ కండరాలూ బలహీన పడుతుంటాయి. దీంతో నేల మీద కూర్చొని పైకి లేవటంలో ఇబ్బంది పడుతుంటారు. ముఖం మీద రెండు పక్కలా ఎర్రటి దద్దుతో వేధించే ల్యూపస్‌ సైతం కీళ్లను దెబ్బతీయొచ్చు. ముఖం, కాళ్లు, చేతుల్లో చర్మం గట్టి పడేలా చేసే స్క్లీరోడెర్మా.. అలాగే దద్దు, కళ్లు ఎర్రబడటం, పెదాలు పగలటం, లింఫ్‌ గ్రంథులు ఉబ్బటంతో వేధించే కవసాకి వంటివీ కీళ్లను దెబ్బతీస్తాయి.

ఇవీ లక్షణాలు
నిర్ధరణ- రక్తపరీక్ష కీలకం
చాలావరకు లక్షణాల ఆధారంగానే సమస్యను గుర్తిస్తారు. అనంతరం రక్తపరీక్ష, ఎక్స్‌రే ద్వారా సమస్యను నిర్ధరిస్తారు. రక్తపరీక్షలో యాంటీన్యూక్లియర్‌ యాంటీబోడీ (ఏఎన్‌ఏ), రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌, ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ స్థాయులను పరిశీలిస్తారు. సమస్య తొలిదశలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎక్స్‌రేలో బయటపడదు. కాబట్టి అవసరమైతే హైరెజల్యూషన్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తారు. అప్పటికీ తేలకపోతే ఎంఆర్‌ఐ చేయాల్సి ఉంటుంది. కీళ్లలో సైనోవియం పొర ఉబ్బితే ఇందులో స్పష్టంగా కనబడుతుంది.

చికిత్స- మందులతో మంచి ఫలితం
కీళ్లవాతంలో ప్రధానంగా మెథట్రక్సేట్‌, సల్ఫసలజైన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, లెఫ్లునొమైడ్‌ వంటి మందులు బాగా ఉపయోగపడతాయి. ముందు ఒక మందుతో ఆరంభించి.. ఫలితం కనబడకపోతే రెండు, మూడు మందులు కలిపి ఇస్తారు. అలాగే నొప్పి తగ్గటానికి ఐబూప్రొఫెన్‌, నాప్రోగ్జెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి నొప్పి మందులూ ఇస్తారు. నొప్పి కొన్ని కీళ్లకే పరిమితమైతే ఆయా కీళ్లలోకి నేరుగా స్టిరాయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో అంతగా ఫలితం కనబడకపోతే ఇన్‌ఫ్లిక్సిమాబ్‌, ఎటనోర్‌సెప్ట్‌, అడలిమాబ్‌, గొలిముమాబ్‌, సెరటొలిజుమాబ్‌, టాసిలిజుమాబ్‌ వంటి బయోలాజికల్స్‌ కూడా ఇవొచ్చు. ఇవి చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తాయి. వాపు ప్రక్రియను ప్రేరేపించే టీఎన్‌ఎఫ్‌, ఇంటర్‌ల్యూకిన్‌-6 వంటి సైటోకైన్లను అడ్డుకుంటాయి. దీంతో కీళ్ల నొప్పి, వాపు తగ్గుముఖం పడతాయి. చికిత్స తర్వాత చాలామందికి సమస్య నయమవుతుంది గానీ కొందరికి పెద్దయ్యాకా కొనసాగొచ్చు. కొందరిలో కీళ్లవాతం ఒకసారితోనే ఆగిపోవచ్చు కూడా.
* సమస్య తగ్గుతున్నకొద్దీ మందులు మోతాదులను తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత పూర్తిగా ఆపేయొచ్చు. అయితే ఎవరికి నయమవుతుంది, ఎవరికి కాదని చెప్పలేం. కొందరికి కొన్నాళ్ల తర్వాత సమస్య తిరగబెట్టొచ్చు. కాబట్టి మందులు మానేసిన తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రతించటం మంచిది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment