గురువు ఎందుకు? | Why the Guru | గురువులు ఏడు రకాలు | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గురువు ఎందుకు?

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు సమర్థరామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ! రామకృష్ణపరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు

మాత్రమే! ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది.. నేటికీ కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుందాం.. 

అజ్ఞానపొరలు తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అలాంటి గురువును దైవం కన్నా ఎక్కువగా ఆరాధించే సంస్కృతి మనది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు. మహాభారతం అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. 

శాంతమూర్తి సదాచారదీప్తి 

ఒక గురువు ఎలా ఉండాలో సనాతన ధర్మం సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో చక్కటి వివరణ ఉంది. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? మొదలైన ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు. 

శాంతో దాన్తో కులీనశ్చ, 
వినీత శ్శుద్ధవేషవాన్‌ 
సదాచార స్సుప్రసిద్ధః 
శుచిర్దక్ష స్సుబుద్ధిమాన్‌ 
ఆశ్రయే ధ్యాననిష్ఠశ్చ 
మంత్ర తంత్ర విచక్షణః 
నిగ్రహానుగ్రహే శక్తో గురురిత్యభిధీయతే ।। 

గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం ధరించాలి. సదాచారం పాటించాలి. మంచి బుద్ధి, మంత్ర, తంత్రాలపై చక్కని అభినివేశం, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. యోగశిఖోపనిషత్‌, ముక్తికోపనిషత్‌, బ్రహ్మవిద్యోపనిషత్‌... ఇంకా ఎన్నో ఉపనిషత్తుల్లో గురువు గొప్పదనం, గురువును ఎలా సేవించాలి, గురువు అవసరం ఏమిటనే విషయాలు ఉన్నాయి.

అందరూ గురువులే..

సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ, గురువులు ఏడు రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. 
1. సూచక గురువు - చదువు చెప్పేవాడు 
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు 
3. బోధక గురువు - మంత్రాలు ఉపదేశించేవాడు 
4. నిషిద్ధ గురువు - వశీకరణ విద్యలు బోధించేవాడు 
5. విహిత గురువు - భోగాల మీద విరక్తి కలిగించేవాడు 
6. కారణ గురువు - బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించేవాడు 
7. పరమ గురువు - పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు

జాతికి అంకితం 

ఆధునిక కాలంలోనూ ఎందరో గురువులు తమ అపారమైన శక్తి, మేధస్సుతో శిష్యులను తయారుచేసి, వారి ద్వారా మనదేశాన్ని కాపాడారు. ప్రగతిపథంలో నడిపించారు. చాణక్యుడు గురుస్థానంలో ఉండి చంద్రగుప్తమౌర్యుడికి ధర్మరాజ్య స్థాపన కోసం మార్గనిర్దేశం చేశాడు. పతంజలి పుష్యమిత్రుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. విద్యారణ్యుడు భారతీయ సంస్కృతీ పరిరక్షణాభిలాషను హరిహర, బుక్కరాయ సోదరుల్లో ప్రజ్జ్వలింపజేశాడు. సమర్థ రామదాసు శివాజీ వంటి చురకత్తిని మనదేశానికి అందించాడు. తన ఉపన్యాసాలతో భారతీయ హృదయాలను చైతన్యవంతం చేసిన వివేకానందుడిని రామకృష్ణ పరమహంస గురుస్థానంలో ఉండి, మనకు అందించాడు. భగవాన్‌ రమణమహర్షి, నడిచేదైవంగా ప్రసిద్ధిపొందిన కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి... ఇంకా ఎందరో గురువులు తమ బోధనలతో మనదేశాన్ని ధర్మమార్గంలో నడిపిస్తున్నారు.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ 

ఎందరో మహానుభావులు 

గురువంటే కేవలం ఆధ్యాత్మిక విద్యల్ని, లౌకిక జీవనానికి ఉపకరించే విద్యల్ని బోధించే ఆచార్యుడు కాదు. సమాజమే దేవాలయం, సమాజ హితమే భగవదనుగ్రహ కారకమని, పరోపకారమే పరమేశ్వరుడికి ప్రీతికరం అని చెప్పి, ఆచరించి సామాజిక జాగృతిని కలిగించిన గురువులు ఎందరో! వారి బోధలు, దార్శనిక సూత్రాలు చైతన్య స్ఫోరకాలు. అలాంటి ఎందరో మహానుభావుల్లో వీళ్లు కొందరు..


సంత్‌ ఏక్‌నాథ్‌


తనను తాను అన్ని జీవరాశుల్లో దర్శించాలనే భగవతత్త్వాన్ని ఆదర్శంగా స్వీకరించిన వాడు సంత్‌ ఏక్‌నాథ్‌. పాండురంగడి భక్తుడిగా అంతటా విఠల దర్శనం చేశాడు. కులవ్యవస్థను నిరసించి, సర్వత్రా సమత్వ సాధనను ఆచరించి మహనీయుడిగా ఏక్‌నాథ్‌ చరితార్థుడయ్యాడు. పరోపకారమే పాండురంగడి పూజ అని చాటిచెప్పాడు. 

కబీర్‌ దాసు


అన్ని మతాల్లోని అంధవిశ్వాసాల్ని బహిర్గతం చేసి.. నిజభక్తి ఎలా ఉండాలో పరిచయం చేశాడు కబీర్‌. తాను రచించిన దోహాల ద్వారా సామజిక రుగ్మతలను ప్రశ్నించి.. సంఘంలో చైతన్యాన్ని కలిగించాడు. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని దర్శించడమే మానవత్వమని చాటి చెప్పాడు కబీర్‌.


గురునానక్‌

‘నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో.. ఇతరులను కూడా అలాగే ప్రేమించు’ అనే విశ్వ ప్రేమ సూత్రాన్ని గురునానక్‌ వెల్లడించాడు. ‘జాతి అభిమానం వృథా!
అన్ని జీవులు ఉండేది పరమాత్ముడి నీడలోనే’ అని జాత్యహంకారాన్ని నిరసించాడు.

స్వామి నారాయణ్‌

‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, దాహార్తితో ఉన్నవారికి నీళ్లివ్వడం దైవపూజ. బీదల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించడం.. దేవుడి గుడిలో దీపారాధన చేయడం’ అంటారు స్వామి నారాయణ్‌. సత్సంగం, సమాజ హితం, సాధుజీవనం పరమాత్ముడికి చేరువ చేస్తాయని ఉపదేశించాడు. 

స్వామి దయానంద సరస్వతి


ఆర్య సమాజాన్ని స్థాపించి, అంధ విశ్వాసాల్లో, అవిద్యలో కూరుకుపోయిన స్వధర్మీయులను దయానంద సరస్వతి సముద్ధరణ చేశాడు. అభ్యుదయవాదిగా, సామాజిక సంస్కర్తగా దయానందది ప్రత్యేక స్థానం. లాలా లజపతిరాయ్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి వారికి ఆయన మార్గదర్శకడు. - డాక్టర్‌ కె.లాస్యశ్రీనిధి 

మేల్కొల్పే మహాశక్తి

గురువంటే ప్రశాంతతను అందించే సాధనం కాదు. సాంత్వననిచ్చే ఔషధం కాదు. మీలోని మౌలిక అంశాలను మార్చేవాడే గురువు. ఇలా మార్చే క్రమంలో ఆయన ప్రసన్నంగా ఉండాల్సిన పనిలేదు. గురువు లక్ష్యం.. మిమ్మల్ని నిద్రపుచ్చడం కాదు. నిద్ర నుంచి మేల్కొల్పడం. మీలో ఆలోచనలు రేకెత్తించడం. ఆశయాలను పురిగొల్పడం. 
చాలా విషయాల్లో.. చాలా నిర్ధారణలు కలిగి ఉంటాం. గురువు వాటన్నిటినీ కుదిపేస్తారు. సరికొత్త ఆలోచన మీలో కలిగిస్తారు. మిమ్మల్ని నిద్రపోనివ్వరు. మిమ్మల్ని ముక్తివైపు నడిచేందుకు సహకరిస్తారు. సాంత్వన మానసికమైన మనుగడకు ఉపకరిస్తుందంతే! ఇందుకోసం గురువు దాకా వెళ్లాల్సిన పనిలేదు. అలాంటి ప్రశాంతత ఎవరిస్తారో వారి దగ్గరకు వెళ్తే సరిపోతుంది. గురువు దగ్గరికి వెళ్లదలుచుకుంటే.. మేల్కొనడానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సంసిద్ధులు కావాలి. మీ పరిమితులను వదిలిపెట్టడానికి వెనుకాడకూడదు. ఇవన్నీ పాటిస్తూ.. జీవితంలో మరో కోణానికి వెళ్లాలనుకున్నప్పుడు మాత్రమే గురువు కోసం అన్వేషించండి. ఇటువంటి ఆకాంక్ష మీలో కలగనప్పుడు గురువులను ఆశ్రయించి ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి సిద్ధపడకుండా గురువుల దగ్గరకు వెళ్లి వారిని ఇబ్బంది పెట్టకండి.
మాతా, పితా, గురు, దైవం అనే మాటలను సరైన విధానంలో తెలుసుకోవడం ముఖ్యం. తల్లి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తుంది. తండ్రి మనుగడకు దారి చూపిస్తాడు. గురువు మిమ్మల్ని మర్దించి, సరైన దారిలో ఉంచుతాడు. పిండిని సరిగ్గా కలిపి మర్దిస్తేనే, రొట్టె ముక్క తినడానికి వీలుగా ఉంటుంది. దైవం స్వీకరించగల రీతిలో మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి గురువు అవసరం.



ఉన్నతస్థితికి.. 

ఇలా అన్నిటికీ సిద్ధపడి గురువును ఆశ్రయిస్తే.. ఆయన మీకో సాధనంగా ఉపయోగపడతారు. ఇహం నుంచి పరానికి చేరుకునే ద్వారంగా మారతాడు. మీరు గదిలో బంధీలుగా ఉన్నారనుకోండి.. ఓ ద్వారం అవతలికి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ సమయంలో అక్కడ ద్వారం ఉండటం ఒక గొప్ప అవకాశం. గురువు లభించడమూ అలాంటిదే! గురువనే ద్వారం మనకు అవతల ఉన్నదానిని చూపిస్తుంది. అంటే మనకు అందని, తెలియని అవకాశాలను కల్పించే శక్తి గురువు. అయితే, ఆ ద్వారం ఎటు దారి చూపుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ రోజుల్లో మతగ్రంథాల్లో ఒకట్రెండు పుటలు చదివినవాళ్లంతా గురువులు అయిపోతున్నారు. ‘నేనున్నాను’ అని నమ్మకాన్ని కలిగిస్తూ గురువులుగా చెలామణి అయిపోతున్నారు. ఇలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. అయినా ప్రజలు రోజువారి ఇబ్బందులతో కుస్తీ పడుతూనే ఉన్నారు. అసలైన గురువు మిమ్మల్ని జాగరూకులుగా తీర్చిదిద్దుతారు.
- సద్గురు జగ్గీ వాసుదేవ్‌ 

భరతజాతి గురువు 

జ్ఞానాన్ని ప్రసాదించిన గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండగ గురుపూర్ణిమ. దీన్నే వ్యాసపూర్ణిమ అంటారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది. 
వాస్తవానికి ‘వ్యాసుడు’ అనేది ఒక వ్యక్తి పేరు కాదు. అదొక పదవి. ఆ పదవిలో ఉన్న వారందరూ వ్యాసులే. ప్రతి మన్వంతరంలోనూ ఒక్కో వ్యాసుడు అవతరిస్తాడు. సృష్టి ప్రారంభమై 27 మన్వంతరాలు గడిచి, ప్రస్తుతం 28వ వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఈ మన్వంతరంలో సత్యవతి, పరాశరుల కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు (ఈయనకే బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది) వ్యాసుడుగా ఉన్నాడు. ఈయన జన్మించిన ఆషాఢ పూర్ణిమగురుపూర్ణిమగా వ్యాప్తిలోకి వచ్చింది 
వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేదవేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే, ఒకే రాశిగా ఉన్నా వేదాల్ని రుక్‌, యజు, సామ, అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించినవాడు వ్యాసుడు. ఈయనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. భారత, భాగవతాలను రచించాడు. శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించాడు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి, దాని ద్వారా భారతీయ సంస్కృతీ

సంప్రదాయ హర్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాసభగవానుడు. సార్వజనీనం, సార్వకాలికమైన సాహిత్యానికి సృష్టికర్త కూడా ఆయనే. శక్తి, భక్తి, సౌశీల్యం, సహజీవనం, సనాతన ధర్మం, పవిత్రత, దానధర్మాలు ఈ దేశ సహజ లక్షణాలుగా రూపొందటానికి మూలం వ్యాసుడి రచనలే. ఇంతటి మహోన్నతమూర్తిని భారతజాతికి గురువుగా భావించి చేసే అర్చనే ‘గురుపూర్ణిమ’. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘మునీనామప్యహం వ్యాసః’- మునుల్లో నేను వ్యాసుడిని అంటాడు. ‘కృష్ణద్వైపాయనాదయో యే రుషయః తాన్‌ రుషీగ్‌ం తర్పయామి’అంటూ ఆచారాలు కూడా వ్యాసుడికే అగ్రపీఠం వేశాయి. ఇదీ వ్యాసుడి ఘనత. 

27 మన్వంతరాల్లో వ్యాసులు.. 

స్వయంభువు, ప్రజాపతి, ఉశనుడు, బృహస్పతి, సూర్యుడు, యముడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిథాముడు, త్రివృషుడు, భరద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, త్రయారుణి, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయుడు, అత్రి, గౌతముడు, హార్యాత్మకుడు, వేణుడు (వాజిశ్రవుడు), సోముడు, తృణబిందు, భార్గవుడు, శక్తిమహర్షి, జాతకర్ణుడు.

వందే గురు పరంపరాం

శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. ఆయన నుంచి బ్రహ్మదేవుడు ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని పొందాడు. బ్రహ్మ నుంచి నారదుడు, ఆయన నుంచి వ్యాసుడు.. ఇలా గురుశిష్య పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఈ జాతికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ వస్తోంది. ‘మహాజనో యేన గతః సపంథాః’ అనే సూక్తి ప్రకారం పూర్వపు మహాత్ములు చూపించిన దారిలోనే జ్ఞాన బోధ నడుస్తూ వస్తోంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న ఆచార్యుడు తనతో సమానమన్నాడు శ్రీకృష్ణుడు.


పరమ గురువులు ఈ భూమిపై సంచరిస్తూ, తమ కర్తవ్యాలను నిర్వహించినప్పుడు, బోధనలు అందించినప్పుడు.. ప్రకృతి వాటన్నింటినీ తనలో రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచుతుంది. తిరిగి ఆ స్థాయి కారణజన్ములు అవతరించినప్పుడు అంతకుముందు జరిగిన సన్నివేశాలను, ముందుతరం వారు చేసిన బోధనల సారాంశాన్ని కొత్తవారికి ప్రకృతి ప్రసారం చేస్తుంది. వారి కర్తవ్య రూపకల్పనలో సాయపడుతుంది. కనుకనే పరమగురువుల నేపథ్యాన్ని గమనిస్తే.. వారి వారి కర్తవ్యాలలో, బోధనలలో పోలికలూ, కొనసాగింపు మనకు కనిపిస్తాయి. దీనిని ‘అనుస్యూతత’ అంటారు. వేదకాలం నాటి నుంచి కొనసాగుతున్న గురుపరంపర ఒకానొక ఆధ్యాత్మిక రహస్య ఉద్యమం! ఇలా మనల్ని అనుగ్రహిస్తున్న గురువులను పూజించేందుకు ప్రత్యేకంగా ఒక రోజును నిర్దేశించుకున్నారు. ఆషాఢమాసానికి ఉత్తమ గ్రహం గురువు.. కనుక ఆ మాసాన్ని గురుపూజకు అనుకూలంగా ఎంచుకున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమిగా ప్రకటించారు. ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు ఈ మాసంలో చాతుర్మాస్య దీక్ష చేపట్టి.. సంచారం వీడి శిష్యులందరికీ అందుబాటులో ఉంటారు. అలా జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను పూజించి.. సనాతన గురుపరంపరను గౌరవించుకుంటారు.  - యర్రాపగడ రామకృష్ణ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment