గురు సన్నిధి | GuruSannidhi | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


గురు సన్నిధికి...



దత్తాత్రేయుడు ‘ఆది గురువు’ అని పురాణ గ్రంథాల మాట! ఉత్తర భారతదేశంలోని ఆదినాథ్‌ సంప్రదాయం ఈ కోవకు చెందినదే! ‘గురుచరిత్ర’ల ప్రకారం, అయిదు దత్తాత్రేయ అవతారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి షిరిడీ , కాగా మిగిలిన దత్తాత్రేయ అవతార క్షేత్రాలు ఎక్కడున్నాయి?


శ్రీపాద వల్లభుడు

శ్రీపాద వల్లభ స్వామి దత్తాత్రేయుడి తొలి అవతార మనీ, ఆయన 13వ శతాబ్దం నాటి వాడనీ ప్రతీతి. అప్పలరాజు శర్మ, సుమతి దంపతులకు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో జన్మించిన శ్రీపాద వల్లభుడు పదహారేళ్ళ వయసులో 
కురువ పురానికి చేరి, ఆ ప్రాంతాన్నే తన కార్యక్షేత్రంగా చేసుకున్నారనీ, కృష్ణా తీరంలోనే అవతార సమాప్తి చేశారనీ గురుచరిత్రలు చెబుతున్నాయి. దేశంలోని మూడు గయ క్షేత్రాల్లో పాదగయ పిఠాపురంలో ఉంది. అంతేకాదు, అష్టాదశ శక్తి పీఠాల్లో పురుహూతికా పీఠం కూడా ఇక్కడే ఉంది.


ఎక్కడున్నాయి?: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో, తెలంగాణ సరిహద్దుల్లో- కర్నాటకలోని రాయచూర్‌ జిల్లా కురువపురంలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి పిఠాపురానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. పిఠాపురంలో రైల్వే స్టేషన్‌ ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్‌ 14 కి.మీ. దూరంలోని సామర్లకోటలో, సమీప విమానాశ్రయం సుమారు 62 కి.మీ. దూరంలోని రాజమండ్రిలో ఉన్నాయి. 
 

   కురువపురం కర్నాటకలోని రాయచూర్‌కు దాదాపు 30 కి.మీ., మహబూబ్‌నగర్‌ నుంచి దాదాపు 92 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి రాయచూర్‌కు బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. రాయచూర్‌ నుంచి ఆత్కూర్‌కు బస్సులో వెళ్ళాలి. అక్కడి నుంచి చిన్న పడవల్లో కృష్ణానదిని దాటి శ్రీపాద వల్లభ ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్ళేవారు మక్తల్‌, పంచదేవ్‌పహాడ్‌ మీదుగా కృష్ణా తీరాన్ని
చేరుకోవచ్చు.



శ్రీ నరసింహ సరస్వతి

దత్తాత్రేయుడి రెండవ అవతారంగా భక్తులు పూజించే శ్రీ నరసింహ సరస్వతి మహారాష్ట్రలోని కరంజ గ్రామంలో జన్మించారు. ఆయన 1378-1459 మధ్య జీవించినట్టు చెబుతారు. ఎనిమిదేళ్ళ వయసులో సన్యాసాశ్రమం స్వీకరించిన నరసింహ సరస్వతి జీవిత గాథనూ, ఆయన మహిమలనూ ఆయన శిష్యుడు శ్రీ సిద్ధ సరస్వతి ‘శ్రీ గురు చరిత్ర’గా రాశారు. దాన్ని గంగాధర సరస్వతి మరాఠీలోకి అనువదించారు. అనేక భాషల్లోకి అనువాదమైన ఈ రచన దత్త భక్తులకు నిత్య పారాయణ గ్రంఽథం. మహారాష్ట్రలోని గంధర్వపురం (గాణగాపురం)లో నివసించిన

నరసింహ సరస్వతి శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో అంతర్థానమయ్యారట. భీమ-అమరజ నదీ సంగమ స్థలమైన గాణగాపురం దత్త క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
ఎక్కడుంది?: కర్నాటకలోని గుల్బర్గా జిల్లా గాణగాపురంలో.
ఎలా వెళ్ళాలి?: గుల్బర్గాకు 42 కి.మీ., హైదరాబాద్‌ నుంచి 250 కి.మీ. దూరంలో గాణగాపూర్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నేరుగా గాణగాపూర్‌ రైల్వే స్టేషన్లో దిగవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి ముంబయి వెళ్ళే రైళ్ళు గుల్బర్గాలో ఆగుతాయి. గుల్బర్గాకు హైదరాబాద్‌ నుంచి బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గాణగాపురం చేరుకోవచ్చు.


శ్రీ స్వామి సమర్థ

అక్కల్‌కోట మహారాజ్‌గా ప్రాచుర్యం పొందిన శ్రీ స్వామి సమర్థను అపర దత్తావతారంగా భక్తులు పూజిస్తారు. భారతదేశం లోని వివిధ పుణ్య క్షేత్రాలనే కాకుండా, నేపాల్‌, చైనా, టిబెట్‌ లను కూడా ఆయన సందర్శిం చారని తెలుస్తోంది. సన్నిహితు లైన భక్తులకు వారి వారి అభీష్టాలను అనుసరించి ఆయన దర్శనమిచ్చే వారట. 1856లో మహారాష్ట్రలోని అక్కల్‌ కోట చేరుకున్న స్వామి సమర్థ 1878లో పరమపదించే వరకూ అక్కడే గడిపారు. అక్కల్‌కోటలోని ఆయన సమాధి, ఆలయం ఆరాధనీయ స్థలాలుగా ఉన్నాయి.


ఎక్కడుంది?: మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా అక్కల్‌కోటలో
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌ నుంచి సుమారు 310 కి.మీ. దూరంలో, గుల్బర్గా నుంచి 88 కి.మీ., షోలాపూర్‌కు 39 కి.మీ. దూరంలో అక్కల్‌కోట ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి షోలాపూర్‌కు నేరుగా రైళ్ళున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అక్కల్‌కోట చేరుకోవచ్చు.


శ్రీ మాణిక్య ప్రభు

సాధువు, వేదాంతి, కవి అయిన మాణిక్య ప్రభువు ఆధ్యాత్మిక ఐక్యతను బోధించిన దత్తాత్రేయ అవతారంగా పూజలందుకుంటున్నారు. 1817లో కర్నాటకలోని బసవకల్యాణ సమీపంలో ఉన్న లదవంతిలో ఆయన జన్మించారు. దేశమంతటా ఆధ్యాత్మిక యాత్రలు సాగించిన ఆయన చివరికి మాణిక్‌నగర్‌ చేరుకొని, 1865లో అవతార సమాప్తి వరకూ తన శేష జీవితాన్ని అక్కడే గడిపారు. అక్కడ ఆయన దర్బారు, మహా సమాధి ఉన్నాయి. మతాలన్నీ ఒక్కటే అని చాటిన ఆయన ప్రతి రోజూ దర్బార్‌ నిర్వహించి, భక్తుల సందేహాలను తీర్చేవారు.
ఎక్కడుంది?: కర్నాటకలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ శివార్లలోని మాణిక్‌నగర్‌లో
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌కు 172 కి.మీ., బీదర్‌కు 50 కి.మీ. దూరంలో మాణిక్‌నగర్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి బీదర్‌, హుమ్నాబాద్‌లకు బస్సులున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి బీదర్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి డెమూ రైళ్ళు లేదా బస్సుల్లో హుమ్నాబాద్‌ చేరుకోవచ్చు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment