శ్రీ సరస్వతి జ్ఞాననిధి | Sri Saraswathi Jnananidhi | Granthanidhi | Mohanpublication | BhakthiPustakalu | BhakthiBooks | Mohanbooks | Jnanasaraswathi | Basara Temple | Srungeri Peetam | Saraswathi Temple | Saraswathi Ghat | Rajamahendravaram | Rajahmundry |


శ్రీ సరస్వతి జ్ఞాననిధి
Sri Saraswathi Jnananidhi
- Adipudi Sairam
200 pages / Rs.108/- 

శ్రీ సరస్వతి జ్ఞాననిధి | Sri Saraswathi Jnananidhi | Granthanidhi | Mohanpublication | BhakthiPustakalu | BhakthiBooks | Mohanbooks | Jnanasaraswathi | Basara Temple | Srungeri Peetam | Saraswathi Temple | Saraswathi Ghat | Rajamahendravaram | Rajahmundry |

సరస్వతి
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".

పరాశక్తి, జ్ఞాన ప్రదాత
సరస్వతి - రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం - 9వ శతాబ్దానికి చెందినది
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాథలు
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.
----------

విద్యతో చతుర్విధ పురుషార్థాలు..


   సృష్టిలో ప్రతి ప్రకృతి శక్తినీ దేవతగా భావించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత. మన జీవితంలో అత్యవసరమైన ధనం మన దృష్టిలో వట్టి రూపాయి కాదు. సాక్షాత్తూ లక్ష్మీదేవి. అలాగే జ్ఞానాన్నిచ్చే విద్య కేవలం చదువు కాదు. సాక్షాత్తూ సరస్వతీ దేవి. అటువంటి సరస్వతీదేవిని బమ్మెర పోతన తన భాగవతంలో విశేషంగా ప్రార్థించాడు. ఆ పద్యం భారతీయ విద్యావ్యవస్థ మొత్తాన్నీ ప్రతిబింబిస్తుంది.

‘క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కినుతింతు 
సైకత శ్రోణికి చంచరీకయ సుందరవేణికి, రక్షి
తామరశ్రేణికి తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్‌
వాణికి, అక్షదామశుక వారిజ పుస్తక రమ్య పాణికిన్‌’’

   ఈ పద్యం చివరిపాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల (అక్షదామం), చిలుక (శుకం), పద్మం (వారిజం), పుస్తకం ఉంటాయని వర్ణించాడు. మనం ఇప్పుడు చూస్తున్న సరస్వతి చిత్రంలో జపమాల, పుస్తకం ఉండి మరో రెండు చేతుల్తో వీణవాయిస్తూ ఉంటుంది. పోతన ఈ మూర్తినే వర్ణించి ఉంటే వీణ ఎందుకకు వదిలేస్తాడు? పైగా చేతుల్లో లేని పద్మాన్ని, చిలుకను, చేతుల్లోనే ఉన్నట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? అంటే మనం చూస్తున్న సరస్వతీమూర్తి.. పోతన వర్ణించిన మూర్తి వేరని అర్థమవుతోంది కదా! అయితే వీణ లేకుండా అక్షదామశుకవారిజ పుస్తకాలు చతుర్భుజాల్లో ధరించిన ఈ మూర్తి ఎవరు? పోతన వర్ణించింది ‘శారదామూర్తి’ అని, ఆవిడ వైదిక విద్యలకు అధిదేవత అని.. మనం చూస్తున్న సరస్వతీ మూర్తి లౌకిక విద్యలకు అధిదేవత అని వేదవిద్యలోను, సంస్కృత సాహిత్యంలోనూ నిష్ణాతులైన పెద్దల అభిప్రాయం. శృంగేరీ శారదాపీఠం వారు ప్రకటించిన శారదామూర్తి ఇందుకు సమర్థన. ఆ తల్లి చేతుల్లో ఈ నాలూగూ ఉంటాయి. వీణ ఉండదు.

    కాబట్టి, పోతన ప్రార్థించిన వాణి లలితాదేవి యొక్క జ్ఞానస్వరూపంగా భావించే ‘శారదాదేవి’ అని బోధపడుతుంది. భారతీయ జీవన విధానంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనే జీవిత లక్ష్యంగా భావిస్తారు. విద్య ద్వారా ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించడమే లక్ష్యమని ‘శారదామూర్తి’ చేతుల్లోని నాలుగు ప్రతీకలు సూచిస్తున్నాయి. అమ్మవారి చేతుల్లోని పుస్తకం ధర్మానికి ప్రతీక. పద్మం అర్థానికి ప్రతీక. లక్ష్మీదేవి పుట్టింది దాని నుండే కదా! ఇక, మన్మథుడి వాహనమైన చిలుక.. కామ పురుషార్థానికి ప్రతీక. నాలుగోచేతిలోని జపమాల మోక్షానికి ప్రతీక. జపతపాల ద్వారానే కదా సిద్ధిపొందేది! విద్య ద్వారా ఈ నాలుగు పురుషార్థాలనూ సాధించాలని.. అప్పుడే మనిషికి భవబంధాల నుంచి విముక్తి అని తెలియజేయడం కోసమే విద్యాదేవత తన చేతుల్లో ఆ నాలుగు వస్తువులనూ ధరించిందని గ్రహించవచ్చు. ‘సావిద్యా యా విముక్తయే’ అని గదా ఆర్యోక్తి!! -గరికిపాటి నరసింహారావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment