జగన్నాథుడు... లోక నాయకుడు.... విశ్వ పాలకుడు... | Puri Jagannadha Swamy Temple | Puri Swamy | Puri jagannatha Swamy | Jagannathswamy | Jagannath Ratayatra | Jagannatha Rathayatra | Rathayatra | Ratayatra | Puri | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti


జగన్నాథుడు... లోక నాయకుడు.... విశ్వ పాలకుడు... 

ఆయన కొలువైన పూరీ ఆలయం దేశంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి... 
ఉత్సవ విగ్రహాలు కాకుండా సాక్షాత్తూ మూలవిరాట్టే వీధుల్లోకి వేంచేసి భక్తులకు దర్శనమిచ్చే అపూర్వమైన ఘట్టం జరిగేది ఇక్కడే... 
అదే జగన్నాథ రథయాత్ర... 
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన, అతి పెద్దదైన రథ యాత్ర... 
సోదర, సోదరీ సమేతుడైన జగన్నాథుడు సువిశాలమైన పూరీ వీధుల్లో రథారూఢుడై ఊరేగే ఉత్సవాన్ని కనులారా తిలకించడంతో జన్మ చరితార్థమవుతుందని భక్తుల నమ్మిక...

పూరీ జగన్నాథ ఆలయాన్ని ‘శ్రీక్షేత్రం’ అని పిలుస్తారు. అన్నదమ్ములు, సోదరి కొలువైన విలక్షణ పుణ్యస్థలి ఇది. పేదా గొప్పా తారతమ్యం, కుల వివక్షా లేకుండా, ‘సర్వం శ్రీ జగన్నాథం’ అని నినదించే ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమయ్యే శ్రీ జగన్నాథుని రథ యాత్ర వందల ఏళ్ళ నుంచీ సాగుతున్న వేడుక.

ప్రతి రథం విలక్షణం
జగన్నాథ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) రోజున వీటి నిర్మాణానికి శ్రీకారం చుడతారు. రెండు నెలలపాటు ఈ పనులు కొనసాగుతాయి. ప్రతి రథం విలక్షణంగా, నిర్దిష్టమైన కొలతలతో నిర్మితమవుతుంది. జగన్నాథుని రథాన్ని ‘నంది ఘోష’ అంటారు. ఇది 45 అడుగుల ఎత్తు ఉంటుంది. బలభద్రుని రథం పేరు ‘తాళధ్వజం’. దాని ఎత్తు 44 అడుగులు. సుభద్రా దేవి అధిరోహించే రథం పేరు ‘దర్పదళన’. దీన్నే ‘దేవదళన’, ‘పద్మధ్వజ’ అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 43 అడుగులు. ఈ రథాలను వేర్వేరు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. జగన్నాథ రథానికి ఎరుపు, పసుపు, బలభద్ర (బలరామ) రథానికి ఎరుపు, నీలం, సుభద్రాదేవి రథానికి నలుపు, ఎరుపు రంగుల వస్త్రాలు ఉంటాయి.

రాజే సేవకుడు!
ఆషాఢ శుద్ధ విదియ రోజు ఉదయం మేళతాళాలతో పూజలు నిర్వహించి, ‘మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్ద పెట్టున నామస్మరణ చేస్తూ ఆలయంలోని జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విగ్రహాల్ని కదిలిస్తారు. ఈ విగ్రహ మూర్తులను భక్తజన సందోహ కోలాహలం మధ్య ఊరేగిస్తూ... రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి పీఠాల మీద ఆసీనుల్ని చేస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అని వ్యవహరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్ళేందుకు సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... పూరీ రాజు పల్లకీలో ఆ ప్రాంతానికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పూరీ మహారాజు ఆ జగన్నాయకుని సేవకునిగా మారి, బంగారు చీపురుతో రథాల లోపల శుభ్రం చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని ‘చెరా పహారా’ అని పిలుస్తారు. కస్తూరి కళ్ళాపి జల్లి హారతిచ్చి, ‘జై జగన్నాథా’ అని నినదిస్తూ ఆయన రథం తాళ్ళను లాగడంతో రథయాత్ర మొదలవుతుంది. దీన్నే ‘గుండీచా యాత్ర’, ‘ఘోష యాత్ర’ అని అంటారు.

తొమ్మిది రోజుల విడిది
ప్రధాన ఆలయం నుంచి బయలుదేరిన జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై అక్కడికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలోని గుండీచా మందిరానికి బయలుదేరుతారు. ఈ ప్రయాణం సుమారు పన్నెండు గంటలపాటు సాగుతుంది. సువిశాలమైన పూరీ బజారు వీధి భక్తులతో కిక్కిరిసిపోతుంది. రథాన్ని చేరుకోవడానికీ, రథం తాళ్ళను తాకడానికీ, లాగడానికీ భక్తులు పోటీ పడతారు. ఈ యాత్ర గుండీచా మందిరానికి చేరుకున్నాక, విగ్రహాలను అక్కడ కొలువు తీరుస్తారు. తొమ్మిది రోజులపాటు అక్కడే పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత బహుదా యాత్ర (మారు రథయాత్ర) జరుగుతుంది. స్వామివారు తిరిగి వస్తూ దారిలో ‘వాసీమౌ’ ఆలయంలో ప్రత్యేక పూజలు స్వీకరిస్తారు. అనంతరం ప్రధాన ఆలయానికి స్వామి చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది.

నిత్య నైవేద్యం
లోకేశుడైన మహా విష్ణువుకు భోజన శాల పూరీ నగరం. ఆయన రామేశ్వరంలో స్నానం చేసి, బదరీనాథ్‌లో ధ్యానం చేసుకొని, పూరీలో భోజనం చేస్తాడట. ద్వారకలో విశ్రమిస్తాడట. అందుకే పూరీ ఆలయంలో జగన్నాథుడి ప్రసాదానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. సుమారు 700 మంది వంటవారు ప్రతిరోజూ ప్రసాదాలను తయారు చేస్తారు. రోజూ కనీసం 20 వేల మందికీ, ప్రత్యేకమైన రోజుల్లో దాదాపు 50 వేల మందికీ సరిపడే ఆహారం సిద్ధం చేస్తారు. మహా ప్రసాదంగా పంపిణీ చేస్తారు. పూరీలోని ఆనందబజార్‌లో ఉన్న జగన్నాథుని వంటశాల దేశంలో... బహుశా ప్రపంచంలోనే అతి పెద్దది. అక్కడ మట్టి కుండల్ని వరుసగా పేర్చి వాటిలో ప్రసాదం వండుతారు. పైన ఉన్న చిన్న కుండలోని ప్రసాదం ఉడకగానే దింపేస్తారు. ఒకసారి వాడిన కుండను మరోసారి వాడరు. ప్రతిరోజూ కనీసం 56 రకాల ప్రసాదాల నివేదన ఉంటుంది. విశేష దినాల్లో వీటి సంఖ్య పెరుగుతుంది.

నవ కళేబర యాత్ర
పూరీ ఆలయంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు దారువుతో- అంటే కలపతో చేసినవి. వాటిని అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో తొలగిస్తారు. కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. దీన్నే ‘నవ కళేబర యాత్ర’ అంటారు. అంటే ఆలయంలోని దేవతా మూర్తులు కొత్త దేహాన్ని ధరిస్తారన్నమాట. ఈ విగ్రహాలను వేప కలపతో చెక్కుతారు. ఎనిమిది నుంచి పంతొమ్మిదేళ్ళ మధ్య ఎప్పుడైనా అధిక ఆషాఢమాసం రావచ్చు. ఈ సహస్రాబ్దిలో తొలిసారిగా ఈ ఉత్సవం 2015లో జరిగింది.

ఇవీ చూడండి:

దేశం నలుమూలలా ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన పీఠం ఒకటి. ఇది జగన్నాథ ఆలయానికి అనుబంధంగా ఉంటుంది.
విశ్వ విఖ్యాతి పొందిన శిల్పకళా సంపదకు నెలవైన కోణార్క్‌ సూర్యాలయం పూరీకి సుమారు 36 కి.మీ. దూరంలో ఉంది. పూరీ- కోణార్క్‌ మధ్యలో బులాఖండ్‌ - కోణార్క్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరీ, ఆలివ్‌ రిడ్లే సముద్ర తాబేళ్ళ రక్షిత తీర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.
పూరీకి సుమారు 20 కి.మీ. దూరంలోని సాక్షి గోపాల్‌ పట్టణంలో పురాతనమైన సత్యవాది గోపీనాథ్‌ (శ్రీకృష్ణుడు) ఆలయం ఉంది. శ్రీకృష్ణుని మనుమడైన వజ్రుడనే రాజు ఇక్కడ విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నవారు ఆ దర్శనానికి సాక్ష్యంగా సాక్షి గోపాలుడి ఆలయానికి వెళ్ళాలని పెద్దలు చెబుతారు. చాలామంది ఈ నమ్మకాన్ని పాటిస్తారు.
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో ప్రఖ్యాతి చెందిన లింగరాజ్‌ ఆలయం ఉంది. అలాగే నందన్‌ కానన్‌ జంతు ప్రదర్శనశాల కూడా ముఖ్య ఆకర్షణల్లో ఒకటి.
ఎక్కడ?: ఒడిశా రాష్ట్రంలోని పూరీలో

ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, వరంగల్‌ తదితర ప్రధాన ప్రాంతాల నుంచి పూరీకి రైలులో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి వెళ్ళేవారు ఖుర్దారోడ్‌ జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి సుమారు 52 కి.మీ. దూరంలో ఉన్న పూరీకి రైలు, రోడ్డు మార్గాల్లో చేరవచ్చు. పూరీకి సమీప విమానాశ్రయం సుమారు 63 కి.మీ. దూరంలోని భువనేశ్వర్‌లో ఉంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment