మొక్కజొన్న మజా!


ఈ సీజన్‌లో రోడ్డుపై ఎక్కడ చూసినా మొక్కజొన్న పొత్తులే కనిపిస్తాయి. అయితే వీటిని బొగ్గులపై కాల్చుకుని తినడం, ఉడకబెట్టి తినడం మాత్రమేనా... వెరైటీగా కూరలు చేసుకోవచ్చు, స్నాక్స్‌ చేసుకోవచ్చు, సూపులు చేసుకోవచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు. ఇంకాస్త స్పైసీగా ఉండే... కార్న్‌ సాల్సా వంటివి కూడా చేసుకోవచ్చు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టపడే మొక్కజొన్న పొత్తుల వెరైటీ రెసిపీలు ఈ వారం మీకోసం.




మొక్కజొన్న వడలు

కావలసినవి: మొక్కజొన్నలు - రెండు కప్పులు, మక్కపిండి - ఒక కప్పు, అల్లం, వెల్లులి పేస్టు, పచ్చిమిర్చిపేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఉల్లిపాయముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, కారం - రుచికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, ఉడకబెట్టిన మొక్కజొన్నవిత్తులు, ఉల్లిపాయముక్కలు - కొన్ని (అలంకరణకు).
తయారీ:

మొక్కజొన్న గింజలను మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
ఇందులో మక్కపిండి, అల్లం-వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. నీళ్లు పోయొద్దు.
కడాయిలో నూనె వేడిచేయాలి.
వడలను ఫ్లాట్‌గా, మీడియం సైజులో చేసి నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి.
వేడి మొక్కజొన్న వడలను పుదీనా చెట్నీతో లేదా టొమాటో చెట్నీ, ఉల్లిపాయముక్కలతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.



కార్న్‌ సాల్సా

కావలసినవి: కాప్సికం - ఒకటిన్నర (గింజలతో), ఆలివ్‌ ఆయిల్‌ - మూడు టీస్పూన్లు, ఉప్పు - సరిపడా, తాజా లేదా ఫ్రోజెన్‌ మొక్కజొన్న గింజలు - ఒక కప్పు, ఘాటుగా ఉండే చిన్న మిరపకాయ - ఒకటి (గింజలతో కట్‌చేయాలి), కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర - అర టీస్పూను.
తయారీ:

ముందుగా గ్రిల్‌ని మీడియం హైలో వేడిచేయాలి. కాప్సికంకు ఒక టీస్పూను ఆలివ్‌ ఆయిల్‌ రాసి ఐదు నిమిషాలు గ్రిల్‌ చేయాలి. అలా చేసేటప్పుడు కాప్సికం వంగకుండా చూడాలి. తర్వాత దానిపైనుండే తొక్కు తీసి సన్నటి ముక్కలుగా కట్‌ చేయాలి.
తాజా మొక్కజొన్నగింజలను వాడిన పక్షంలో ఒక చిన్న కుండలో కొద్దిగా నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. మరుగుతున్న ఆ నీళ్లల్లో మొక్కజొన్న గింజలు వేసి మెత్తగా అయ్యేవరకూ అంటే ఒక మూడు నిమిషాల పాటు స్టవ్‌పై ఉడికించాలి. తర్వాత అందులోని నీరును వార్చేయాలి.
ఉడకబెట్టిన మొక్కజొన్నగింజలు (ఫ్రోజెన్‌ మొక్కజొన్నవిత్తులైతే వాటిని), కొత్తిమీర, గ్రిల్డ్‌ కాప్సికం, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలను ఒక బౌల్‌లో వేసి రెండు టీస్పూన్లు ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, చక్కెర, అర టీస్పూను ఉప్పును అందులో వేసి బాగా కలపాలి. కార్న్‌ సాల్సా రెడీ. ఇది స్పైసీగా బాగుంటుంది.



చికెన్‌, కార్న్‌ కర్రీ

కావలసినవి: మద్రాసు కర్రీ పొడి- అరకప్పు, కొబ్బరిపాలు - సరిపడా, వెజిటబుల్‌ ఆయిల్‌ - అరకప్పు, ఉల్లిపాయలు - మూడు (పెద్దవి, ముక్కలుగా చేసి), వెల్లుల్లిపాయలు - నాలుగు (సన్నగా తరిగి). అల్లం - చిన్నది (సన్నటి ముక్కలుగా తరిగి), ఉల్లిపాయ - ఒకటి (సన్నటి ముక్కలుగా చేసి), స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్స్ట్‌ - రెండు (పెద్దముక్కలు), ఉప్పు - రుచికి సరిపడా, చక్కెర - రెండు స్పూను (పొడిలా చేసి), మొక్కజొన్నగింజలు- రెండు కప్పులు, అన్నం - కొద్దిగా.
తయారీ:

చిన్న బౌల్‌ తీసుకుని అందులో పావుకప్పు కొబ్బరిపాలు, మద్రాసు కర్రీపొడి వేసి పేస్టులా చేయాలి.
పెద్ద పాన్‌ తీసుకుని అందులో వెజిటబుల్‌ ఆయిల్‌ వేడిచేసి చిన్న సైజు ఉల్లిపాయలు (ముక్కలుగా), అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేగించాలి.
ఇందులో తయారుచేసిపెట్టుకున్న కర్రీ పేస్టును కలపాలి.
తర్వాత మంట తగ్గించి అన్ని పదార్థాలు బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి.
కర్రీ వేడెక్కి, సువాసనలు రావడం కోసం పదిహేను నిమిషాల పాటు కర్రీని ఉడికించాలి.. మధ్య మధ్యలో కర్రీని కలపడం మరవొద్దు.
తర్వాత చికెన్‌, టోస్‌ అందులో వేసి కర్రీలో కలిసిపోయేలా కలపాలి. మిగిలిన కొబ్బరిపాలు, చక్కెరలను కూడా ఇందులో కలిపి మీడియం మంటపై ఇరవై నిమిషాలపాటు ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుతుండాలి.
దాంట్లో తాజా మొక్కజొన్నగింజలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.
దీన్ని వేడిగా తింటే బాగుంటుంది. లేదా కర్రీ చల్లారాక సీల్డ్‌ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగురోజులు నిల్వ ఉంటుంది.

కార్న్‌ హల్వా

కావలసినవి: మొక్కజొన్న కండెలు - రెండు, పాలు - ఒక కప్పు, నెయ్యి - అరకప్పు, చక్కెర - అరకప్పు, యాలకులు - నాలుగు, జీడిపప్పు, బాదం, పిస్తా - ఒక్కొక్కటీ డజను చొప్పున.
తయారీ:

మొక్కజొన్న గింజలను నీళ్లల్లో కడిగి ఆరబెట్టాలి. ఆరిన గింజలను మిక్సీలో వేసి పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
బాదం పప్పును గంటపాటు నీళ్లల్లో నానబెట్టి వాటిపైన ఉండే పొట్టును తీసి చిన్న ముక్కలు చేయాలి. జీడిపప్పు, పిస్తాలను చిన్న పలుకులుగా చేయాలి. యాలకులను పొడిలా దంచాలి.
స్టవ్‌పై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి అందులో నెయ్యి వేసి అది కరిగిన తర్వాత అందులో మొక్కజొన్నగింజల పేస్టును వేయాలి. ఈ పేస్టు బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ స్టవ్‌ మీద ఉడికించాలి. గరిటెతో పేస్టును ఆపకుండా కలుపుతుండాలి. పెద్ద మంట పెట్టొద్దు.
మొక్కజొన్న గింజల పేస్టు బాగా దగ్గరపడిన తర్వాత అందులో పాలు, చక్కెర వేసి కలపాలి. చిన్న మంటపై దీన్ని కాసేపు ఉడికించాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో క లుపుతుండాలి. హల్వా చిక్కగా అయిన తర్వాత అందులో బాదం, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి స్టవ్‌పై నుంచి దించాలి.
తర్వాత అందులో యాలకుల పొడిని కలపి చిన్న బౌల్‌లోకి మార్చాలి. హల్వాపై పిస్తా, బాదం పప్పులను చల్లి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

గుమ్మడి ఫ్రిట్టర్స్‌

కావలసినవి: మీడియంసైజు గుమ్మడిముక్కలు - 2 (చిన్నముక్కలుగా కట్‌చేసి), ఉప్పు - తగినంత, వెన్న- ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయ - చిన్నది (ముక్కలుగా కట్‌ చేసి), వెల్లుల్లిపాయ - ఒకటి (తరిగి), మొక్కజొన్న గింజలు - కొన్ని, మక్కపిండి - అర కప్పు, మైదా - అరకప్పు, వంటసోడా - పావుటీస్పూను, మిరియాలపొడి - కొద్దిగా, మజ్జిగ - ముప్పావుకప్పు, గుడ్డు-ఒకటి, వెజిటబుల్‌ ఆయిల్‌- వేగించడానికి సరిపడా.
తయారీ:

గుమ్మడికాయముక్కల్లో అరచెంచా ఉప్పు కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి.
ఒక నూలు గుడ్డలో ఆ ముక్కలు పోసి గట్టిగా పిండాలి. ఇలా చేస్తే గుమ్మడి ముక్కల్లోని నీరంతా బయటకు పోతుంది.
నాన్‌స్టిక్‌ స్కిల్లెట్‌ని పెట్టి వెన్నని వేడిచేయాలి.
వేడెక్కిన వెన్నలో వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలను వేసి వేగించాలి.
మిశ్రమం బంగారువర్ణంలోకి వచ్చిన తర్వాత అందులో మొక్కజొన్నగింజలు వేసి మెత్తగా, క్రిస్ప్‌గా అయ్యేవరకూ ఉంచాలి.
ఒక బౌల్‌లో మైదాపిండి, మక్కపిండి, వంటసోడా, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
పెద్ద బౌల్‌ తీసుకుని అందులో మజ్జిగ, గుడ్డును గిలక్కొట్టాలి.
దానిని మొక్కజొన్న, ఉల్లిపాయ, గుమ్మడిముక్కల మిశ్రమంలో కలపాలి. మక్కపిండి మిశ్రమాన్ని కూడా కలపాలి.
మంటను సన్నని సెగపై పెట్టి పెద్ద స్కిల్లెట్‌పై 1/8వంతు మేర వెజిటబుల్‌ ఆయిల్‌ పోయాలి. స్కిల్లెట్‌ బాగా వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న పిండిని దఫదఫాలుగా నూనెలో ఫ్లాట్‌ షేపులో వేయాలి. ఈ కార్న్‌ ఫ్రిట్టర్స్‌ రెండువైపులా బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత నూనెలోంచి తీసి పేపర్‌ టవల్స్‌పై ఆరబెడితే అదనపు నూనెని పీల్చేస్తాయి. వీటిపై కాస్త ఉప్పు చల్లి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.

స్పైసీ కార్న్‌

కావలసినవి: మొక్కజొన్నగింజలు, బేబీకార్న్‌ - అరకిలో(ఉడకబెట్టినవి), పచ్చికొబ్బరితరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగు, కొత్త్తిమీర తరుగు - నాలుగు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టేబుల్‌స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, కరివేపాకు, పాలు - 125ఎంఎల్‌, గిలక్కొట్టిన పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా (పైన చల్లడానికి).
తయారీ:

మొక్కజొన్న గింజలు ఉడకబెట్టిన 200 ఎంఎల్‌ నీళ్లను విడిగా గిన్నెలో తీసిపెట్టుకోవాలి.
పచ్చికొబ్బరితోపాటు పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరలను మిక్సీలో వేసి పేస్టు చేయాలి.
200ఎంఎల్‌ నీళ్లల్లో ఈ పేస్టును కలపాలి.
పాన్‌లో నూనె పోసి వేడిచేసి ఆవాలు, కరివేపాకులను వేగించాలి.
పచ్చికొబ్బరి కలిపిన మొక్కజొన్న నీళ్లను అందులో వేసి ఉడికించాలి.
ముందరే ఉడికించిన మొక్కజొన్నగింజలు, పెరుగు, పాలు కూడా అందులో పోసి పది నిమిషాలు స్టవ్‌పై ఉడికించాలి.
చిక్కగా తయారయిన స్పైసీ కార్న్‌ని వేడిగా తింటే యమ్మీగా ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment