కర్పూరం కథ తెలుసా?!
దేవీదేవతలకి సమర్పించే లడ్డూప్రసాదాల్లో కాస్త పచ్చకర్పూరం వేస్తే ఆ గుబాళింపే వేరు అంటారు సనాతనవాదులు. అదేమాదిరిగా షోడశోపచారాల్లో భాగంగా ఆ భగవంతునికి కర్పూరహారతి ఇస్తే కానీ పూజ పూర్తికాదు అంటారు సంప్రదాయవాదులు. అయితే అసలీ కర్పూరం ఏమిటీ, ఎలా తయారవుతుందీ, తినేదీ వెలిగించేదీ అంటూ అందులో తేడాలెందుకూ... ఆ కథాకమామీషు..!
 
‘ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు...’ అంటారు. అవును, రూపంలోనే కాదు, ఆ రెండింటికీ గుణంలోనూ ఓ చిన్న సారూప్యం ఉంది. నీటి నుంచి తయారైన ఉప్పును తిరిగి నీటిలో వేస్తే కరిగి మళ్లీ నీరయిపోతుంది. అంటే ఏ రూపంలోంచి వచ్చిందో ఆ రూపంలోకి వెళ్లిపోతుంది. కర్పూరం కూడా అంతే. గాల్లోంచి తయారైన కర్పూరం వెలిగించగానే మళ్లీ ఆ గాల్లోనే కలిసిపోతుంది. అంటే అక్కడ ఉప్పదనాన్నీ ఇక్కడ వాసననీ మనం ఒడిసి పట్టుకుని వాడుకుంటున్నామన్నమాట.
దాల్చినచెక్క కుటుంబానికి చెందిన మరో వృక్షరాజమే సిన్నామోమమ్‌ కేంఫొరా. ఈ చెట్టు బెరడే కాదు, ఆకులూ కాండం కూడా కర్పూరవాసనలు వెదజల్లుతుంటాయి. ఎక్కువగా చైనా, జపాన్‌, శ్రీలంక, ఇండొనేషియాల్లోనూ అరుదుగా అమెరికాలోనూ పెరుగుతాయి. సుమారు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ చెట్టు కాండం నుంచి తైలాన్నీ పొడినీ తయారుచేస్తారు. చైనా, జపాన్‌లలో పూర్వకాలం నుంచీ ఈ చెట్ల కాండాన్ని చిన్న ముక్కలుగా కోసి వాటిని నీళ్లలో వేసి ఉడికించి ఆవిరిని ఒడిసిపట్టడం ద్వారా తైలాన్నీ, ఆ ఆవిరిని శీతలీకరించడం ద్వారా తెల్లని ఘనపదార్థాన్నీ తయారుచేస్తారు. అదే సహజ కర్పూరం. అంటే- పచ్చకర్పూరం. దీన్నే ప్రాచీనకాలం నుంచీ హారతికోసం పూజల్లోనూ కొద్దిపాళ్లలో వంటల్లోనూ ఔషధంగానూ వాడేవారు. అయితే ఈ పద్ధతిలో కర్పూరం కొద్దిమొత్తంలో మాత్రమే తయారవుతుంది. ధర కూడా ఎక్కువ. దాంతో ఈ కర్పూరాన్ని తినడానికి మాత్రమే ప్రత్యేకించి, హారతికోసం మరో పద్ధతిలో కర్పూరాన్ని తయారుచేయసాగారు.
ఔషధ గుణాలెన్నో...
సహజ లేదా పచ్చ కర్పూరంలో అనేక ఔషధగుణాలూ ఉన్నాయి. జీర్ణసంబంధ, శ్వాసకోశ సమస్యల్ని తగ్గించడంతోబాటు రక్తప్రసరణనూ మెరుగుపరుస్తుంది. అందుకే కర్ణాటకలో పచ్చళ్లు, గుజరాత్‌లో పెరుగు సంబంధ వంటల్లోనూ దీన్ని వాడుతుంటారు. చంద్రభస్మ పేరుతో తాంబూల సేవనంలోనూ వాడేవారు. లడ్డూ, పరమాన్నం, పొంగలి.. వంటి సంప్రదాయ మిఠాయిల తయారీలోనూ చిటికెడు పచ్చకర్పూరాన్ని జోడిస్తుంటారు. కర్పూరం బ్యాక్టీరియానీ వైరల్‌
ఇన్ఫెక్షన్లనీ నివారిస్తుంది. కొద్దిమొత్తంలో దగ్గు, ఇతరత్రా కొన్నిరకాల మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. విక్స్‌, అమృతాంజన్‌వంటి పైపూత మందుల్లో దీని వాడకం ఎక్కువ. టూత్‌పేస్టు, పళ్లపొడుల తయారీలోనూ వాడతారు.
కర్పూరాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే అదే శరీరంలోకి చొచ్చుకునిపోయి నరాల్ని ప్రేరేపిస్తుంది. ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవాళ్లు కొబ్బరి లేదా నువ్వుల నూనెలో దీన్ని కలిపి కీళ్లనొప్పులు, వాపులకి రుద్దితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవాళ్లు చిటికెడు పచ్చకర్పూరాన్ని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగితే మంచి నిద్ర పడుతుందట. అరకప్పు నీళ్లల్లో టీస్పూను వాము, చిటికెడు కర్పూరం వేసి సగమయ్యేవరకూ మరిగించి తాగితే జీర్ణసంబంధ సమస్యలు హాంఫట్‌.
కర్పూరాన్ని ముద్దలా చేసి ఆయా భాగాల్లో రాస్తే ఎగ్జిమా, ఫంగస్‌ కారక చర్మవ్యాధులూ తగ్గుముఖం పడతాయి. కాస్త కర్పూరాన్ని మరిగించిన నీటిలో వేసి ఆవిరిపడితే దగ్గూజలుబులు తగ్గుతాయి. ఆస్తమా బాధితులకీ మంచిదే. అందుకే అంటారు... ‘పచ్చకర్పూరం... ఓ అద్భుత ఔషధ సుగంధం’ అని..!

కర్పూరహారతి..!
మ సకల పాపాలూ హరించుకుపోవాలని ఆ పరమాత్మను కోరుతూ హారతి ఇచ్చే కర్పూరాన్ని ఎలా తయారుచేస్తారంటే... పైన్‌ చెట్ల నుంచి జిగురుని సేకరించి దాన్నుంచి టర్పెంటైన్‌ అనే రసాయనాన్ని తయారుచేస్తారు. దీన్నుంచి పైనిన్‌ అనే పదార్థాన్ని వేరుచేసి ఘనీభవింపచేసి శుద్ధిచేస్తారు. అదే సింథటిక్‌ కర్పూరం ఉరఫ్‌ హారతి కర్పూరం. ఇది కూడా సహజ కర్పూరం మాదిరిగానే మండుతుంది. నీటిలో కరగదు, పచ్చకర్పూరం అయితే బరువు ఎక్కువ. వెంటనే నీటిలో మునిగిపోతుంది. సింథటిక్‌ కర్పూరం తేలికగా ఉండటంతో కాస్త ఆలస్యంగా మునుగుతుంది. పైగా సహజ కర్పూరం కన్నా తెల్లగా మెరుస్తూ ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ధర తక్కువ.  పూజలతోబాటు బాణాసంచా, నాఫ్తలీన్‌, మాత్‌బాల్స్‌ తయారీలోనూ ఇంకా అనేకానేక పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలోనూ దీన్ని వాడుతుంటారు. అలాగే దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. కలుషిత వాయువుల్ని హరించి గాలినీ శుభ్రపరుస్తుంది. ‘కర్పూర నీరాజనం సమర్పయామి...’ అంటూ దేవుడికి హారతి ఇవ్వడంలోని అసలైన అంతరార్థం అదే మరి

......
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment