‘రామాయణ’ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేస్తోంది!
టికెట్‌ ధర సుమారు రూ.15,000

‘సైన్స్‌ ఎక్స్‌ప్రెస్’‌ పేరుతో శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నా... ‘సంచార గ్రంథాలయం’ పేరిట పుస్తక జ్ఞానాన్నిదేశవ్యాప్తంగా పంచాలన్నాఇండియన్‌ రైల్వేస్‌ అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. ఇవే కాదు, విజ్ఞాన యాత్రలు, వినోద యాత్రలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ప్రజలకు చేరువవుతున్న ఇండియన్‌ రైల్వేస్‌ మరో అడుగు ముందుకేసింది. రాముడు నడయాడిన ప్రదేశాలను చూసి వచ్చేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. దీనికి ‘రామాయణ ఎక్స్‌ప్రెస్‌’ అని పేరు పెట్టారు. 800 మంది వరకు దీనిలో ప్రయాణించవచ్చు.

ఏయే ప్రదేశాలు... 
దిల్లీలోని సఫ్తార్‌జంగ్‌లో మొదలైన ఈ యాత్ర 16 రోజులపాటు కొనసాగుతుంది. శ్రీలంకలోని కొలంబో నగరాన్ని చేరుకోవడంతో ముగుస్తుంది. తొలిసారిగా నవంబర్‌ 14న ఈ ప్రత్యేక యాత్రను ప్రారంభించనున్నారు. దిల్లీ నుంచి ప్రారంభమైన ‘రామాయణ ఎక్స్‌ప్రెస్‌’ అయోధ్య, సీతామర్తి, జనక్‌పూర్‌, వారణాసి, చిత్రకోట్‌, హంపి మీదుగా రామేశ్వరం చేరుకుంటుంది. అక్కడి నుంచి యాత్రికులు విమానం ద్వారా శ్రీలంకలోని కొలంబో నగరాన్ని చేరుకుంటారు.

ప్యాకేజీ ఎంత?
ఈ యాత్ర కోసం ఇండియన్‌ రైల్వే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భోజనాలు, వసతి, క్షేత్ర సందర్శన కోసం అయ్యే ఖర్చులన్నీ ఈ ప్యాకేజీ కిందికే వస్తాయి. ఈ ఏర్పాట్లన్నీ చూసేందుకు రైల్వే ఓ మేనేజర్‌ని నియమిస్తుంది. యాత్ర ముగిసేవరకు ఆయన ప్రయాణీకులతోనే ఉంటారు. ప్యాకేజీ ధర దాదాపు రూ.15,000 ఉంటుందని రైల్వే అంచనా వేస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చెన్నై నుంచి శ్రీలంకలోని కొలంబో వరకు విమానంలో వెళ్లేందుకు అయ్యే ఖర్చులు మాత్రం ప్యాకేజీ పరిధిలోకి రావు. దీనిని యాత్రికులే భరించాల్సి ఉంటుంది.

టికెట్‌ బుకింగ్‌ ఎలా?
ప్రస్తుతం బుకింగ్స్‌ ప్రారంభం కాలేదు. త్వరలో ఇండియన్‌ రైల్వేస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ ద్వారా యాత్రికులు తమ సీట్‌ను బుక్‌ చేసుకోవచ్చని సంస్థ‌ వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 27 పర్యాటక సదుపాయ కేంద్రాల్లోనూ టికెట్‌ తీసుకునే అవకాశం ఉంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment