
చాతుర్మాస్య వ్రతం



చాతుర్మాస్యం వెనుక పరమార్థం!
20-07-2018 00:04:22

వ్రతం అంటే నియమం. ‘వరం తనోతీతి వ్రతం’ అని శబ్ద వ్యుత్పత్తి. నియమ నిష్ఠలతో భగవంతుడిని పూజించి, అనుగ్రహాన్ని పొందడం కోసం వ్రతాలను ఆచరిస్తారు. వ్రతాలలో పలు రకాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ భిన్నమైనదీ, విశిష్టమైనదీ చాతుర్మాస్య వ్రతం.
నాలుగు నెలల ‘శేష శయనుడు’
మరొక విశేషం ఏమిటంటే, స్థితికారుడైన విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషశయ్యపై నిదురకు ఉపక్రమిస్తాడు. దీన్ని ‘శయన ఏకాదశి’గా చెబుతారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడు. దీన్ని ‘ఉత్థాన ఏకాదశి’గా పిలుస్తారు. ఈ 4 మాసాల కాలాన్ని చాతుర్మాస్యంగా వైష్ణవ ఆచార్యులు, జీయర్లు పాటిస్తారు.
చాతుర్మాస్య వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఆచరిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి, నియమాలను అనుష్ఠిస్తూ, కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఆచరించాలని ధర్మ సింధు, నిర్ణయ సింథు తదితర గ్రంథాలు చెబుతున్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం కూడా ఈ వ్రతం గురించి విస్తారంగా ఉల్లేఖించింది.
ఆ యజ్ఞమే వ్రతంగా...

చాతుర్మాస్య వ్రతం కుర్యా దత్కించిన్నయతో నరః’’
చాతుర్మాస్యం గురించి ఇతిహాసం ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ అలసిపోయి నిదురించాడట. అది గమనించిన దేవతలు ఒక యజ్ఞం చేసి, అందులోంచీ ఉద్భవించిన హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట. అది ఔషధంలా పని చేసి ఆయన అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది. నియమ నిష్ఠలతో, శ్రద్ధతో నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం.
బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’, ‘ద్వయ’, .త్రీణీ’, ‘చత్వారే’ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి, చివరగా ఒక సమిధను కూడా వేశాడు. ఫలితంగా- దేవతలు, దానవులు, పితరులు, మానవులు అనే నాలుగు రకాల జీవులను సృష్టించి, వారికి రోమములు, మజ్జ మాంసములు, ఎముకలను కూడా ఇచ్చాడు. ‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ బ్రాహ్మణం అంటోంది. మరొక నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు. ‘చతుః ప్లస్ మా ప్లస్ అస్యం చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు ముఖాలుగా- నాలుగు వేదాలు చెప్పినవాడు బ్రహ్మ. వేద లక్ష్మే శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతి రోజూ వేదాలను పూజించాలి. అధ్యయనం, అధ్యాపనం చేయడం ముఖ్యమైన అనుష్ఠామంగా భావన చేయాలని ఉపనిషత్తు అంటోంది.
ఇవీ నియమాలు!

‘‘శ్రావణే వర్జయేత్ శాకం దధి భద్రపదే తథా!
దుగ్ధ మాశ్వయుజే మాసి కార్తికే ద్విదళాం తథా!!’’
శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, అశ్వయుజ మాసంలో పాలు, పాల పదార్ధాలనూ, కార్తీకంలో రెండు బద్దలుగా విడివడే పప్పు ధాన్యాలూ లేదా పప్పుతో చేసిన పదార్ధాలనూ త్యజించాలి. దీనికి కారణాలు ఏమిటంటే, ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం నుంచి వర్ష ఋతువు, ఆపైన శరదృతువు కాలంలో వీటి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఋతువుల సంధ్య కాలాన్ని ‘యమద్రంష’్టలని అందుకే అన్నారు. శాస్త్ర రీత్యా ఆషాఢంలో కామోద్దీపకం హెచ్చు. అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదులలో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు మాసాల్లో చెయ్యాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య రీత్యా చెప్పడం జరిగింది. ఈ నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరిట కట్టడి చేయడం కూడా జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.
అదీ కాకుండా, పరివ్రాజకులు గ్రామాల్లో సంచరిస్తే, వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్ చింతనతో పాటు ధర్మ ప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment