మధుమేహాన్ని అదుపు చేసే అద్భుతమైన చిట్కాలు..!

జీవక్రియా లోపం వల్ల రక్తంలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీన్నే ఆయుర్వేదంలో ప్రమేహం అని పిలుస్తారు. దీన్ని మధుమేహం అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారి మూత్రం తేనె కలిపిన నీరులా తియ్యగా ఉంటుంది. మూత్రం పోసిన చోట చీమలు పడుతుంటాయి. అలాగే అధిక సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. అందుకే దీన్ని అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు. మధుమేహంలో రెండు రకాలు ఉంటాయి. అయితే ఏ తరహా మధుమేహం అయినా ఒకసారి వచ్చిందంటే ఇక దానికి జీవితాంతం మందులు వాడవలసిందే. లేదంటే గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, చూపు పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే మధుమేహానికి డాక్టర్లు సూచించే మందులతోపాటు కింద ఇచ్చిన చిట్కాలు పాటిస్తే దాంతో మధుమేహాన్ని దూరంగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 

1. మోదుగ చెట్టు ఆకులు లేదా పూలను తెచ్చి ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడితో కషాయం కాచి ఉదయం పరగడుపున, రాత్రి భోజనం చేసే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది. 

2. నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేప ఆకులను అలాగే నమిలి తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది. 

3. ఒక పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు మెంతులను వేసి రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి అనంతరం మెంతులను తినేయాలి. ఇలా చేస్తే చాలా త్వరగా మధుమేహం అదుపులోకి వస్తుంది. లేదంటే మెంతులను పొడి చేసి నీటిలో కలుపుకుని రెండు పూటలా భోజనానికి ముందు తాగినా చాలు. షుగర్ వ్యాధిని అదుపు చేయవచ్చు. 

4. ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల పొడపత్రి ఆకు చూర్ణాన్ని వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలి. మధుమేహాన్ని అదుపు చేసే గుణాలు పొడపత్రి ఆకులో సమృద్ధిగా ఉంటాయి. 

5. నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని రోజూ ఉదయం, సాయంత్రం భోజానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా కలిపి తాగాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. 

6. మర్రి ఊడలను సేకరించి ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో నానబెట్టాలి. రాత్రంతా అలా చేశాక మరుసటి రోజు ఉదయం ముక్కలను తీసేసి నీటిని వడకట్టి తాగితే ఫలితం ఉంటుంది. 

7. బాగా ముదిరిన కాకరకాయలను విత్తనాలతో సహా అలాగే ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడిని ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 

8. రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ జ్యూస్‌ను తాగాలి. లేదంటే ఉసిరిపొడిని నీటిలో కలుపుకుని తాగినా చాలు, మధుమేహం అదుపులో ఉంటుంది. 

9. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు లేదా మూడు లేత మారేడు ఆకులు, లేత వేపాకులను బాగా నలిపి అనంతరం ఆ మిశ్రమాన్ని అలాగే తినేయాలి. ఇలా చేసినా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment