శ్రీదత్త చరిత్ర Sridatta Charitra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీదత్త చరిత్ర

Sridatta Charitra
Author: Aluru Gopala Rao
Publisher: Mohan Publications
Pages: 224 -- Rs 108/-

      శ్రీదత్త భక్తులు పారాయణ చేసుకొనుటకు వీలగునట్లుగ ఈ గ్రంథము రూపొందించబడినది శ్రీసాయిసచ్చరిత్ర, శ్రీగురు చరిత్ర, పారాయణము చేసినట్లుగా శ్రీదత్తచరిత్ర కూడా పారాయణ చేసుకొనవచ్చును. ముఖ్యముగా ఔదంబర వృక్షము వద్ద పారాయణ చేసినచో పూర్తి సత్ఫలితము పొందగలరు. ఇన్ని గ్రంథములు రచన చేసిన శ్రీ ఆలూరు గోపాల రావుగారు ధన్యజీవి. - ఆదిపూడి వేంకటశివసాయిరామ్

------------------

అనసూయ పుత్ర దత్తాత్రేయ


అజ్ఞానం వల్ల జీవులు తప్పనిసరిగా చేసే తప్పులు పెరిగిపోతాయి. ప్రజలు ధర్మబద్ధంగా జీవించాలి. దానికి రకరకాల ఆటంకాలు ఏర్పడుతుంటాయి. వాటిని తొలగించడానికి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతారాలను ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు. సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంతవరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువుగా అవతరిస్తాడు. తన లీలల ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందికి మోక్షం మీద కోరిక కలిగిస్తాడు. ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు. ఈ విధంగా మహాత్ములుగా అవతరించే భగవత్తత్వాన్నే ‘దత్తాత్రేయుడు’ అన్నారు.

ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా దుఃఖాలు కలుగుతాయని పురాణాలు తెలియజెబుతున్నాయి. ఇదే శ్రీ దత్తావతరానికి నాంది అయింది. అనసూయ శక్తిని పరీక్షించడానికి త్రిమూర్తులు వెళ్లారు. వారి ఆగమనంతో అక్కడ దివ్యత్వం వ్యాపించింది. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీచాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరమైంది. ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోపక్క అనసూయ ఆశ్రమంలో వేదమంత్రోచ్ఛాటన... ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణంలో తేలియాడుతున్న భూలోకవాసులు ఎంతో అదృష్టవంతులనిపించింది వారికి. మనం ముగ్గురమూ మునిబాలురుగా మారి ఇక్కడ ఆటలాడుకుంటే ఎంత బావుండునో అని క్షణకాలం అనుకున్నారు. వచ్చిన పని మరిచిపోయారు. వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చి అత్రి, అనసూయ మాతల ఆశ్రమంలోకి ప్రవేశించారు.

త్రిమూర్తులు అనసూయను పరీక్షించారు. ఆమె శక్తి ప్రభావంతో ఆశ్రమ ఊయలలో బాలురుగా మారిపోయారు. ఆమె మాతృప్రేమను పొందారు. సృష్టికర్తల్నే బిడ్డలుగా లాలించింది అనసూయ. చివరకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమంలో మీరు కన్న తల్లిదండ్రులకంటే మిన్నగా మాకు పుత్రవాత్సల్యాన్ని పంచిపెట్టారు. మీకేం వరం కావాలో కోరుకొమ్మన్నారు. ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వారు వరం కోరుకున్నారు. ఆ ముగ్గురి అంశలు ఒకే మూర్తిగా అనసూయకు జన్మించారు. శ్రీమహావిష్ణువే తనను తాను ఆమెకు దత్తత ఇచ్చుకున్నాడు. అంటే సమర్పించుకున్నాడు. అత్రికి పుత్రుడయ్యాడు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. మార్కండేయ పురాణంలో మదాలస చరిత్ర ఈ కథను వివరిస్తోంది.

నాలుగు యుగాల్లో మొదటిదైన కృతయుగం ఆరంభంలోనే జన్మించాడు దత్తుడు. మార్గశీర్ష శుక్ల పౌర్ణమినాడు శ్రీ దత్తాత్రేయ జయంతి జరుపుకొంటారు. ధర్మ స్వరూపమైన గోవు ఒక పక్క, చుట్టూ నాలుగు వేదాలకు సంకేతాలైన కుక్కలతో, అత్యంత దివ్యమైన రూపంతో పరమయోగి, దిగంబరుడు, బ్రహ్మచారి అయిన శ్రీదత్తుడు గోచరిస్తాడు. మూడు తలలు కలిగి ఉంటాడు.

శ్రీగురుదత్త, జయగురుదత్త అంటే ఆయన వెంటనే పలుకుతాడని ఎందరో విశ్వసిస్తారు. స్మరించినంత మాత్రానే అనుగ్రహించే స్వభావం కలవాడు దత్తాత్రేయుడు. అయితే ఆయన పరీక్షించి కాని భక్తులకు వశం కాడని ప్రతీతి. దత్తజయంతి రోజు విశేషంగా గురుపూజ చేస్తారు. దత్తమంత్రం పఠించాలని దత్తోపాసకులు చెబుతారు. దత్తుడి భార్య అనఘాదేవి పేరిట వ్రతాలూ చేస్తారు.

ఆత్మజ్ఞానం బోధించేవాడు శ్రీ గురు దత్తాత్రేయుడు. గొప్ప ధారణశక్తి కలిగిస్తాడు. చూపులతోనే సందేహాలు తీర్చే మహావ్యక్తిగా ప్రతీతుడు. త్రిపురారహస్యం అనే గొప్ప గ్రంథం రచించాడాయన. అష్టాదశ పురాణాల్లోని గురుమహిమలు, గురుశక్తులు కలిపి గురుతత్వం అవుతుంది. ఆ తత్వమే గురు చరిత్ర. ఆ గురుచరిత్రనే శ్రీ దత్తాత్రేయ చరిత్రగా చెబుతారు.
- ఆనందసాయి స్వామి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment