
సమైక్యతా మూర్తికి శిరసెత్తి వందనం
నేడు సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ

పేరులో గాంభీర్యం.. పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానం దేశ సమగ్రత కోసం ఏడు పదుల వయసులోనూ శ్రమించిన ధీరత్వం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సొంతం. రెండు చేతులా సంపాదించుకోగలిగే న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి.. ఖద్దరు కట్టి స్వాతంత్య్ర సంగ్రామంలో దూకినప్పుడే ఆయన జాతికి తరగని ఆస్తి అవుతారని దేశం గుర్తించింది. రైతు ఉద్యమంతో బ్రిటిష్ ప్రభుత్వం మెడలు వంచినప్పుడే ఆయనలోని పోరాట పటిమను జాతి శ్లాఘించింది. మహాత్ముడి అడుగుజాడల్లో ఆయన సాగించిన అహింసా పోరాటం.. స్వరాజ్య స్థాపనకు దన్నుగా నిలిచింది. సమైక్యతా సారథిగా, అశేష భారతావనికి ‘సర్దార్’గా నిలిచిన ఆ ఉక్కు మనిషికి నేడు భరత జాతి సమున్నతంగా నివాళులర్పించబోతోంది. 182 మీటర్ల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని గుజరాత్‌లోని కేవడియాలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.భరతజాతి చెక్కిన శిల్పం

నర్మదా నది నడిబొడ్డున తలెత్తుకుని నిలుచుని సగర్వంగా దేశంకేసి చూస్తున్న ఈ ఉక్కు మనిషిని చూశారా.. 565 సంస్థానాలను రక్తపాతరహితంగా దేశంలో విలీనం చేసిన ఈ బాహుబలికి దేశం అర్పిస్తున్న నివాళిని కన్నారా.. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన ఆ మహనీయుడికి జరుగుతున్న వైభోగం కంటున్నారా... ఇది జాతి గర్వించే సమయం. అప్పుడే స్వాతంత్య్రం వచ్చిన పసిగుడ్డులాంటి దేశాన్ని ఒంటిచేత్తో ఏకం చేసిన మహనీయుడికి ఘనంగా నివాళులర్పించే కీలక ఘట్టం.. దేశ విభజనతో జాతి గుండెకు గాయమైన వేళ వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన సాహసి... సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా చూపిన చొరవ, సాహసం ఆయనను ఉక్కు మనిషిని చేశాయి. దేశాన్ని ఉక్కు సంకల్పంతో నడిపించాయి. దేశ సమైక్యతా సారథిగా జాతి జనుల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి. అంతటి మహనీయుడికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పిస్తోంది భరతజాతి. దానినో పర్యాటక క్షేత్రంగా.. పరిశోధనా స్థానంగా.. ఉపాధి కేంద్రంగా గుజరాత్ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. నాలుగేళ్ల కిందట పనులు ప్రారంభించి అనేక ఆటంకాలను, సాంకేతిక సవాళ్లను అధిగమించి విగ్రహ నిర్మాణం పూర్తి చేసింది. పటేల్ జన్మదినమైన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిజంగా ఇది అద్భుతమే.. అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం రికార్డే. మరో వైపు ఆ ప్రాజెక్టు కింద నలిగిపోయామని గిరిజనులంటున్నారు.. 72 గ్రామాలను ఖాళీ చేయించారని ఆరోపిస్తున్నారు.. వారి మొరను కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు ఆలకిస్తాయా? అసలు ఈ ప్రాజెక్టుతోనే గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్న ప్రభుత్వాల వాదన నిజమవుతుందా? కాలమే తేల్చాలి...
నిర్మాణం
పటేల్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. అక్కడ నివసించే స్థానికులకు ఇబ్బంది లేకుండా, సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. విగ్రహం ఛాతి వరకు వెళ్లి పరిసరాలను చూసేలా లోపలి నుంచి రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌తో నిర్మించిన రెండు కాళ్ల లోపలి నుంచి ఈ రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. వాటిద్వారా 157 మీటర్ల ఎత్తు వరకూ సందర్శకులు వెళ్లవచ్చు. అంటే పటేల్ ఛాతి దగ్గర నుంచి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.
హంగులివీ...
రోడ్డు, రైలు అనుసంధానంతో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. విగ్రహం ఉన్న సాధు ఐలాండ్‌ను వంతెన నిర్మించి హైవేతో కలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఇక్కడ పాఠశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటవుతాయి.
మెమోరియల్, సందర్శకుల కేంద్రం.
విద్యా పరిశోధనా కేంద్రం, నాలెడ్జ్ సిటీ.
గరుడేశ్వర్ నుంచి బద్‌బుత్ వరకూ పర్యాటక కారిడార్.
క్లీన్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శిక్షణా కేంద్రం.
ఇక్కడే ఎందుకంటే...

సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్ గ్రావిటీ డ్యాం ఇది. 121 మీటర్ల ఎత్తున ఉంది. విగ్రహం నుంచి చూస్తే డ్యాం అందాలు కనువిందు చేస్తాయి.
ప్రాజెక్టు లక్ష్యం
పటేల్ విగ్రహం ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్టును (ఎస్‌వీపీఆర్‌ఈటీ) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేసింది. 2010లో విగ్రహం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. అప్పటికే ఏర్పాటై ఉన్న సర్దార్ సరోవర్ నర్మదా నిగం లిమిటెడ్ ఇందులో పాలుపంచుకుంది.
పటేల్ విగ్రహ ఏర్పాటు లక్ష్యం ఆయనకు నివాళే కాదు. ఆయన కలలుగన్న సమైక్యత, పోరాటస్ఫూర్తి, సమ్మిళిత అభివృద్ధి, సుపరిపాలన సాధనకూ ఉపయోగపడాలన్నది లక్ష్యం. ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికీ దోహదం చేస్తుందని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మెరుగైన రవాణా సౌకర్యం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు ఆ ప్రాంత గిరిజనులకు సమకూరుతాయనేది ప్రభుత్వ భావన.
ఇంకా
* కనీస జీవన ప్రమాణాల మెరుగు.
* సామాజిక నిర్మాణం.
* గిరిజనుల అభివృద్ధి.
* ఉపాధి అవకాశాలు.
* పరిశోధన.
* పర్యావరణ పరిరక్షణ... వంటివి సాధ్యమవుతాయని ప్రభుత్వ ఆలోచన.
విశేషాలు
విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగులు)
నిర్మాణ ప్రదేశం: సాధు బెట్ ఐలాండ్. సర్దార్ సరోవర్ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్, సాత్పూర పర్వత సానువుల మధ్య.
వ్యయం: రూ.2,989 కోట్లు.
* ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు.
* నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్ కాంక్రీట్‌లో కలిపి, 6500 టన్నుల స్టీల్ విడిగా స్ట్రక్చర్ కోసం వాడారు.
* ఒక మనిషి 5.6 అడుగులు ఉన్నాడనుకుంటే అలాంటి 100 మంది వ్యక్తులను నిలువుగా ఒకరిపై ఒకరిని నిలిపితే ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తున విగ్రహం ఉంటుంది.
* విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. ఆ ప్రాంతంలో ఒకేసారి 200 మంది నిలుచుని పరిసరాలను వీక్షించవచ్చు.
* విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలవగలదు.
* విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు.
* 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు.
* ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 26 మంది వెళ్లవచ్చు. కేవలం అరనిమిషంలో లిఫ్ట్ 500 అడుగులు వెళ్తుంది.
* మొత్తం 3వేల పటేల్ ఫొటోలను పరిశీలించి విగ్రహానికి రూపునిచ్చారు. 1949లో తీసిన ఫొటో ప్రధాన పాత్ర వహించింది. మొదట సుతార్ 18 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేశారు. పటేల్‌ను నిజజీవితంలో చూసిన వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు.
* చైనాలో కాంస్య తాపడాలు తయారయ్యాయి.
సాంకేతికతనాలుగు అంచెల్లో నిర్మాణం. త్రీ డైమెన్షనల్ స్కానింగ్ టెక్నిక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను ఉపయోగించారు. టర్నర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది. దానికి మెయిన్‌హార్డ్, మైఖేల్ గ్రేవ్స్, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. స్ట్రక్చర్ డిజైన్, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కాంక్రీట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది.
విగ్రహ నిర్మాణం కోసం దేశంలోని లక్షా అరవైతొమ్మిది వేల గ్రామాల నుంచి ఇనుమును సేకరించారు.
పర్యాటక ప్రాంతంగా...పర్యాటకుల విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠ భారత్ భవన్, పటేల్ జీవిత విశేషాలతో మ్యూజియం, పరిశోధనా కేంద్రం ఏర్పాటవుతున్నాయి. శ్రేష్ఠ భారత్ భవన్ త్రీస్టార్ హోటల్‌గా ఉంటుంది. అక్కడ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. సభలు, సమావేశాలకు అనువుగా ఉంటుంది. దీని నిర్మాణం పర్యావరణానికి అనువుగా ఉంటుంది. లేజర్ సౌండ్, లైట్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. పరిశోధనా కేంద్రంలో వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలు, నీటి నిర్వహణ, గిరిజనుల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతాయి. ఇంకా రెస్టారెంట్లు, సేదతీరే కేంద్రాలతో విగ్రహం ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది ప్రభుత్వ లక్ష్యం.
పటేల్ విగ్రహానికి ఎంత ఖర్చు, ఎవరి వాటా ఎంత?మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3001 కోట్లుగా మొదట కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విధానంలో చేపట్టేందుకు నిర్ణయించి టెండర్లు ఆహ్వానించడంతో రూ.2989 కోట్లకే చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ కన్సార్షియం ముందుకొచ్చింది.
విగ్రహం నిర్మాణానికి: 1347 కోట్లు
ఎగ్జిబిషన్ హాలు, కన్వెన్షన్ సెంటరుకు: 235 కోట్లు
నది నుంచి విగ్రహం వరకూ వంతెనకు: 83 కోట్లు
15ఏళ్లపాటు నిర్వహణ వ్యయం: 657 కోట్లు
గుజరాత్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చింది: 800 కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది: 300 కోట్లు
మిగిలిన నిధులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కేంద్రం ఇంకా ఎంత ఇస్తుందనేది తెలియరాలేదు.
నిర్మాణం ఇలా





-------------------------------------------------------------------------
ఐక్యతా సాధకుడు సురాజ్య స్వాప్నికుడు
పట్టుదలే పటేల్ ప్రాణం
స్వాతంత్య్ర పోరాటం నుంచి సమైక్య భారతం వరకు
అనితర సాధ్యం.. ఆయన ప్రస్థానం
సర్దార్ పటేల్.. చిన్ననాటి నుంచే పట్టుదల గల మనిషి. అరువు తెచ్చుకున్న పుస్తకాలతో న్యాయవిద్య చదివి బారిస్టర్ ఎట్ లా పరీక్షల్లో ప్రథముడిగా నిలిచిన దీక్ష ఆయనది. ఎంతో ఇష్టమైన న్యాయవాద వృత్తిని, భోగభాగ్యాలను త్యజించి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగిన యోధుడాయన. స్వరాజ్య స్థాపన తర్వాతా భరతజాతికి ఆయన సేవలు నభూతో. సమైక్య భారత నిర్మాతగా, సుపరిపాలన ప్రణాళికలకు ఆద్యుడిగా నిలిచిన ఆ మహానేత స్ఫూర్తిదాయక
ప్రస్థానమిదీ..

ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించని తత్వం పటేల్ సొంతం. ఆ దృఢ సంకల్పమే ఆయనకు ‘ఉక్కుమనిషి’గా పేరు తెచ్చింది. ఆ పట్టుదల, సంకల్పబలం వల్లభ్‌భాయ్‌కు చిన్ననాడే వంటబట్టాయి. న్యాయవాద విద్యలో బారిస్టర్ కావాలన్నది పటేల్ కల. అది నెరవేరాలంటే ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ ఎట్ లా చదవాలి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పటేల్‌కు ఆ ఖర్చును తట్టుకోవడం సాధ్యం కాని పని. కానీ ఆయన పట్టు వదల్లేదు. న్యాయవిద్య చదువుతున్న స్నేహితుడి దగ్గర పుస్తకాలు అరువు తెచ్చుకుని చదువుకున్నారు. నిత్యం కోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తారో చూసి తెలుసుకున్నారు. అలా న్యాయ విద్యను అభ్యసించి గుజరాత్‌లోని గోద్రాలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బారిస్టర్ చదవడానికి సరిపడా డబ్బు సంపాదించారు. కానీ వెంటనే ఇంగ్లాండ్ వెళ్లిపోలేదు. బారిస్టర్ కావాలని కలలుగన్న అన్న విఠల్‌భాయ్ పటేల్‌ను ముందు ఇంగ్లాండ్ పంపించారు. ఆయన బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని వచ్చాకే వల్లభ్‌భాయ్ పటేల్ ఇంగ్లాండ్ బయల్దేరారు. బారిస్టర్ ఎట్ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచి తన కల నిజం చేసుకున్నారు.
సంగ్రామంలో సర్దారే
ఎంతో ఇష్టపడి, చిన్ననాటి నుంచి లక్ష్యంగా పెట్టుకుని బారిస్టర్ చదివిన పటేల్ న్యాయవాద వృత్తిలో విశేషంగా రాణిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీని కలిశారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ సాగిస్తున్న అహింసాయుత పోరాటంతో స్ఫూర్తి పొందారు. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తానూ సంగ్రామంలోకి దూకారు. 1918లో బ్రిటిష్ ప్రభుత్వం గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో భూమిశిస్తును భారీగా పెంచింది. పన్ను తగ్గించేవరకు సహాయ నిరాకరణ చేయాలని గాంధీజీ ప్రజలకు సూచించారు. ఈ ఉద్యమాన్ని నడిపే బాధ్యతను పటేల్ భుజస్కంధాలపై పెట్టారు. రైతులను, ముఖ్యంగా రైతు మహిళలను ఏకం చేసి పటేల్ పోరాడారు. ‘ఈ ఉద్యమంలో మనకెన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆస్తులు జప్తు చేయొచ్చు. కానీ మనం వెనక్కి తగ్గొద్దు. మన పోరాటమే మనకు శ్రీరామరక్ష’ అని వారిలో ధైర్యం నూరిపోశారు. రైతుల సహాయ నిరాకరణ ఉద్యమ ఉద్ధృతికి బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గింది. పన్నుల పెంపును రద్దు చేసింది. దీంతో ఉద్యమ సారథిగా పటేల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పుడే ఆ ప్రాంత మహిళలు సర్దార్ అని పటేల్‌కు బిరుదునిచ్చారు. అదే తర్వాత ఆయనకు ఇంటిపేరయింది. తర్వాత బర్దోలీ ఉద్యమాన్నీ పటేల్ ముందుండి నడిపారు.
సమైక్య భారత నిర్మాత
శతాబ్దాల బానిసత్వపు సంకెళ్లు తెంచుకుని భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో.. బ్రిటిష్ ప్రభుత్వం ‘విభజించి పాలించు’ సిద్ధాంతంతో దేశాన్ని రెండు ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందం అనుభవించకముందే విభజనతో భరతజాతిని నిలువునా చీల్చేసింది. కొందరు సంస్థానాదీశులు భారత్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. సంస్థానాలు వేటికవే స్వతంత్ర రాజ్యాలుగా స్థిరపడిపోతే.. బానిసత్వపు బంధనాలు తెంచుకుని మాత్రం ప్రయోజనమేంటి? దేశ స్వాతంత్య్రం కోసం సాగిన బలిదానాలకు పరమార్థమేంటి? అందరిలోనూ ఇదే ప్రశ్న. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి పెనుసవాలుగా నిలిచిన ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రధాని నెహ్రూ.. పటేల్‌కు అప్పగించారు. అప్పటికి పటేల్ వయసు 72 సంవత్సరాలు. అయినా ఆయన వయోభారాన్ని లెక్క చేయలేదు. సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసేవరకు విశ్రమించలేదు. సంస్థానాధీశులను ఒప్పించారు. హైదరాబాద్ నిజాంలా మొండికెత్తిన వాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. మొత్తానికి భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా నిలిపారు.
సుపరిపాలకుడు...
దేశంలో అతిపెద్ద వర్గంగా ఉన్న రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వాత్రంత్య్ర సంగ్రామంలో ముందుకు నడిపించారు పటేల్. విభిన్న కులాలు, మతాలు, వర్గాలను కూడగట్టి పోరాడారు. అయితే స్వరాజ్యం సాధించిన తర్వాత దేశం ముందు నిలిచిన మరో పెద్ద సవాలు.. సురాజ్య స్థాపన. అంటే సుపరిపాలన. విభిన్న కులాలు, మతాలు, వర్గాలు, జాతులుగా ఉన్న దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని పటేల్ బలంగా విశ్వసించారు. దేశ తొలి ఉపప్రధానిగా, హోం మంత్రిగా ఆ లక్ష్యసాధనలో త్రికరణశుద్ధిగా శ్రమించారు. పరిపాలనా సౌలభ్యం కోసం అఖిలభారత సర్వీసులు తేవాలన్న ఆలోచన పటేల్‌దే.
పరిపాలనా దక్షుడు
పోరాట యోధుడిగానే కాదు.. పరిపాలనా దక్షుడిగానూ భారతావని పటేల్‌ను వేనోళ్ల పొగుడుతుంది. కానీ పటేల్ ఉపప్రధాని కాకముందే.. అసలు స్వాతంత్రోద్యమంలోకి రాకముందే ఆయన పాలనాదక్షతను అహ్మదాబాద్ ప్రజలు కళ్లారా చూశారు. న్యాయవాద వృత్తిలో ఉండగానే 1917లో వల్లభ్‌భాయ్ పటేల్ అహ్మదాబాద్‌కు నగర శానిటేషన్ కమిషనర్‌గా పని చేశారు. పరిశుభ్రంగా, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు. 1922, 1924, 1927ల్లో అహ్మదాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నగరమంతటా విద్యుత్ సరఫరా, విద్యారంగంలో సంస్కరణలు ఇలా ఎన్నింటికో ఆయనే శ్రీకారం చుట్టారు.
సర్దార్ జీవనయానంపూర్తి పేరు: వల్లభ్‌భాయ్ జవేరీభాయ్ పటేల్
పుట్టిన తేదీ: 1875 అక్టోబరు 31
తల్లిదండ్రులు: లాడ్‌భాయి, జవేరీభాయ్.
జన్మస్థలం: నడియాద్, గుజరాత్
* 1893లో 18ఏళ్ల వయసులోనే జవేర్బాను పటేల్ పెళ్లి చేసుకున్నారు.
* 1901 నుంచి గోద్రా జిల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
* 1903లో కుమార్తె మణిబెన్, 1905లో కుమారుడు దహ్యాభాయ్ జన్మించారు.
* 1910లో మిడిల్ టెంపుల్ వర్సిటీలో న్యాయవిద్య పై చదువులకు లండన్ వెళ్లారు.
* 1914లో క్రిమినల్ లాయరుగా అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు.
* 1915లో గుజరాత్ సభలో సభ్యుడిగా నియమితులయ్యారు. ముంబయిలో జరిగే భారత జాతీయ కాంగ్రెస్ సభలకు ప్రతినిధిగా ఎంపికయ్యారు.
* 1917 జనవరి 5న అహ్మదాబాద్ మున్సిపాలిటీలోని దరియాపూర్ వార్డు సభ్యుడిగా గెలిచారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం.ఈ ఎన్నికను కొందరు సవాలు చేయడంతో రద్దైంది. మే 14న మళ్లీ ఎన్నిక నిర్వహించగా తిరుగులేని విజయం సాధించారు.
* 1931లో భారత జాతీయ కాంగ్రెస్‌కు పోటీ ద్వారా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు.
* 1947లో దేశ విభజనపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పటేల్ విభజనకు అంగీకరించారు.
* 1950 డిసెంబరు 15న ముంబయిలో తుదిశ్వాస విడిచారు.
* 1991లో భారతరత్న వరించింది.

సహకార రంగంలో మన దేశం ఇప్పుడెంతో ఉజ్వలంగా ఉందంటే దానికి ఖ్యాతిని పటేల్‌కే ఇవ్వాలి. అమూల్ మూలాలూ ఆయన దార్శనికతలోనే ఉన్నాయి. సహకార గృహ నిర్మాణ సొసైటీలకూ ఆయనే గుర్తింపు తెచ్చారు. తద్వారా అనేక మందికి ఆవాసాలు లభించేలా చేశారు.
ఇది భారతీయులందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరూ ఈ విగ్రహాన్ని సందర్శించాలని కోరుతున్నా. మన హృదయాల్లో ఐక్యతకే కాకుండా భౌగోళిక సమగ్రతకు ఐక్యత విగ్రహం ప్రతీక. కలిసి ఉంటే ప్రపంచాన్ని ఎదుర్కొని, సమున్నత శిఖరాలకు చేరుకోగలమని ఈ నిర్మాణం మనకు గుర్తు చేస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment