ఆ వెలుగు నీదే!
దీపావళి అంటే అభ్యంగన స్నానాలు ఆచరించడమేనా? 
దీపావళి అంటే సాయం సంధ్య వేళ దివ్వెలు వెలిగించడమేనా? 
దీపావళి అంటే దిక్కులు మార్మోగేలా టపాసులు కాల్చడమేనా? 
కాదు... అంతకు మించి... దీపావళి ఎన్నో అంతరార్థాలతో కూడిన పండగ... 
ఈ రోజు విరబూసే ప్రతి వెలుగూ అంతరంగాన్ని వెలిగించాలి.
కొత్త ‘నిన్ను’ ఆవిష్కరించాలి... జీవితాన్ని దేదీప్యమానం చేయాలి...

దీపావళి వెలుగులు మనిషిని నిర్వచించాలి. మనిషిలోని రాక్షస ప్రవృత్తికి నిదర్శనమైన నరకాసురుని వధించినప్పుడు అది దీపావళి. దురహంకారానికి ప్రతీక అయిన బలి తలను పాతాళానికి అణచి వేసినప్పుడు... అజ్ఞానం మటుమాయమై జ్ఞానం విరజిమ్మినప్పుడు వెలుగుల పండగ ఆవిష్కృతమైంది. అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం, మూర్ఖత్వంపై వివేకం, చెడుపై మంచి పై చేయి సాధించడమే నిజమైన తిమిర సంహారం. మనిషిని పునర్‌నిర్వచించే మధుర క్షణాలు అవే. మానవత్వాన్ని పునర్నిర్మించే మూల పదార్థాలూ అవే. చీకటిని తొలగించడం అనే మాటకు నిజమైన అర్థం కూడా అదే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటుంది వేదం... చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించు అని దీని అర్థం... చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు. చిన్న దివ్వెను వెలిగించిచూడు అనే అమృత ప్రబోధమే దీపావళి ఆంతర్యం. చీకటిని దుఃఖానికి, వెలుగును సంతోషానికి ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి రెండూ తప్పవు. దుఃఖాన్ని జయించి, ఆనందాన్ని సాధించాలన్న మనిషి యత్నానికి దీపావళి ఓ సంకేతం.

‘అమృత భావనలు అన్ని దిక్కుల నుంచి మనిషిని ఆవరించుగాక’ అని ఉపనిషత్తులు ఆకాంక్షించాయి. లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలంటూ దీవించాయి. ఆ లోకోత్తర భావనలు ఎప్పుడు సాకారం అవుతాయో, ఆ శుభాకాంక్షలు ఎప్పుడు ఫలిస్తాయో, ‘లోకమంతా ఒక్క ఇల్లై...’ అన్న కవుల భావనలు ఎప్పుడు నిజం అవుతాయో అదే నిజమైన దీపావళి. పురాణగాథలు చెప్పే పరమ సత్యం ఇదే. మన పూర్వీకులు ప్రతీకలుగా అందించిన ఆకర్షణీయమైన కథల సారాంశం అదే. అంతర్గత శబ్ద కాలుష్యానికి దూరంగా, దురాలోచనలకు అతీతంగా, అభ్యుదయ పథంలో మనిషి అడుగిడినప్పుడు లోకంలో దీపావళి నిత్యోత్సవమై విలసిల్లుతుంది. దీపోత్సవమై ప్రకాశిస్తుంది. అమృతోత్సవమై అలరారుతుంది. అప్పుడు మనిషి తిరిగి జన్మిస్తాడు. మనిషితనం తిరిగి నిర్వచింపబడుతుంది. ఆధునిక యుగంలో దీపావళి గురించి ఆలోచించాల్సిన సరికొత్త కోణమిది. మానవీయ దృక్పథమిది. పురాణగాథలు మనకందిస్తున్న సందేశమిది. ప్రాచీన, జానపద గాథల్లోని అంతరార్థాలు మనిషికి నేర్పుతున్న పాఠాలివి. ఆలోచనల కాలుష్యం నుంచి మనిషి బయటపడినప్పడు ఆనందం గుండె తలుపు తడుతుంది. ధియో యో నః ప్రచోదయాత్‌... సరికొత్త ఆలోచనలు మొలకెత్తడానికి ఈ వెలుగులు దారి చూపుగాక. ఆధునిక మానవుడు అద్భుతమైన అభ్యుదయ భావాలతో ఈ లోకాన్ని వెలిగించాలి. రాబోయే తరాల ఆదర్శాలకు వెలుగు పంచాలి. ప్రాచీన రుషులు, ఆధునిక శాస్త్రవేత్తలు కన్న కలలకు, పడ్డ తపనలకు మనిషి సమాధానం కావాలి. అప్పుడే ఈ జనానికి ఆనంద దీపావళి.


నరక చతుర్దశి రోజు పితృ లోకాల్లోని మన పెద్దల్ని తలచుకుని వారి పేరిట ఒక్కొక్క దీపాన్ని వెలిగించి వారిని స్వర్గానికి తీసుకెళ్లమని ప్రార్థించాలి. ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ పితృదేవతలను తలచుకుంటే ఆ వెలుగులే వారి స్వర్గ పథానికి దారి దీపాలవుతాయని చెబుతారు. చతుర్దశి నుంచి మూడు రోజులు ప్రదోష కాలంలో మనోహర దీపాలను దేవాలయ ప్రాంగణంలో, మఠాల్లో, ప్రాకారాల్లో, గోశాలల్లో, వీధుల్లో వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. త్రయోదశి నాటి సాయంత్రం యమ దీపం పెట్టడం, దీపావళినాడు సాయంత్రం వేళలో దీపారాధన, పాడ్యమినాడు దారికోసం గడ్డి బొమ్మలను కట్టడం... వీటిని మార్గపాళీ బంధం అంటారు. అందుకే ఆరోజును ప్రేత చతుర్దశి అని కూడా అంటారు.
దీపావళి రోజు బాణసంచా కాల్చడం ఆచారంగా వస్తోంది. మహాలయ పక్షంలో భూలోకానికి కవ్య భోజనానికి వచ్చిన పితృదేవతలు స్వర్గానికి తిరిగి వెళ్లేటప్పుడు దీపాలు, బాణసంచా వెలుగులు వారికి దారి చూపుతాయని భావిస్తారు. అలక్ష్మి, దారిద్య్రం తొలగిపోవాలని దీపావళి నాటి రాత్రి వివిధ వాద్యాలను మోగించేవారు. ఆ వాద్యాలు తర్వాత టపాసులుగా మారాయని చెబుతారు. ఇప్పటికీ పల్లెల్లో జొన్న చొప్పను, నువ్వుల కట్టెను కాల్చి జనాన్ని మధ్యలో నిలబెట్టి వారి చుట్టూ తిప్పుతారు. ఇందులో ఓ అగ్ని సంస్కారం ఉంది. వర్షాకాలంలో అనేక రకాల సూక్ష్మ క్రిములు వాతావరణంలో ఉంటాయి. వాటిని చంపడం ఈ బాణసంచా ఉద్దేశంగా భావిస్తారు.
లక్ష్మీదేవి కాంతికి, ఆనందానికి అభ్యుదయానికి ప్రతీక. కాబట్టే దీపాల పండగను ప్రజలు లక్ష్మీ ఉత్సవంగా పిలిచేవారని ఆంధ్రుల సాహిత్య చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకునే సంప్రదాయం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. ఆ రోజు మహాలక్ష్మి భూలోకంలోనే ఉంటుందని, ఇంటింటికీ తిరుగుతూ ఉంటుందన్న నమ్మకంతో తెల్లవార్లూ లక్ష్మీ ఆరాధన చేస్తారు. స్తోత్రాలు, భజనలు, నామ సంకీర్తనం, పురాణ శ్రవణాలతో అమ్మ కృప కోసం ప్రయత్నిస్తారు. గుజరాతీలు ఆ రోజు వాహిపూజ పేరుతో తమ ఖాతా పుస్తకాలను పూజిస్తారు. ఆరోజు వారి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్లు భావిస్తారు.
దీపావళి పండగను సాధారణంగా నరకాసురుడి సంహారం జరిగిన రోజుగా భావిస్తారు. భూమి పుత్రుడైన నరకుడు దేవతల సింహాసనాన్ని ఆక్రమించి, ఎందరో స్త్రీలను చెరబట్టాడు. సత్యభామ సహకారంతో పరమాత్ముడు నరకుణ్ణి సంహరించిన రోజు లోకాలన్నీ చేసుకున్న పండగే దీపావళిగా ప్రాసశ్త్యంలో ఉంది. ‘నరకుడనేవాడు ఎక్కడో నక్కి లేడు మనసులో చిమ్మచీకటి మసలు చోట వానికున్నది ఉనికి..’ అని మన కవులు వర్ణించారు. ఆ చీకటికి జ్ఞానకాంతులే విరుగుడు. అదే దీపావళి అంతరార్థం ఆధ్యాత్మికంగా నరకాసుర సంహారాన్ని మరోరకంగా వర్ణిస్తారు. నరక శబ్దానికి దుర్గతి అని అర్థం కూడా ఉంది. దాని నుంచి బయటపడవేసే చతుర్దశి ఇదేనని నమ్ముతారు. నరకమంటే కష్టం. దుఃఖం అని కూడా చెబుతారు. ఈ కష్టాలు, దుఃఖాలు తద్వారా కలిగే దుర్గతి నుంచి మానవులను ఉద్ధరించే చతుర్దశి దీపావళి. కృష్ణుడనేవాడు జ్ఞానానికి, సత్యభామ వివేకానికి సంకేతాలు. వాటి సాయంతో అజ్ఞానమనే నరకుణ్ణి నిర్మూలించడం మానవుల కర్తవ్యం. దాన్ని ప్రబోధించడమే దీపాల పండగ విశేషం.


5 రోజులు అలా...

దీపావళిని ఆశ్వయుజ మాసాంతంలో వచ్చే అమావాస్యనాడు చేసుకుంటాం. దీన్ని అయిదు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్యతో పాటు, ముందు, వెనక రెండు రోజులూ దీపావళి పర్వదినోత్సవంలో భాగాలే. ఆ అయిదు రోజుల్లో చేసుకునే వేడుకలన్నిట్లో అర్థం, పరమార్థం కనిపిస్తాయి. మానవ జీవితం మంగళకరం కావాలని, లోకానికి శ్రేయోదాయకంగా మారాలని ఇవి సూచిస్తాయి.


1వ రోజు

అమావాస్యకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని చేసుకుంటారు. ధన్‌తేరస్‌ అని పిలిచే ఈ పండగనాడు దీపాలు వెలిగించి, లక్ష్మీ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సంపద వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు భువికి దిగివచ్చే రోజుగా కూడా భావిస్తారు కాబట్టి వారికి దారి చూపేందుకు ఆ పవిత్ర దినాన ఇంటిముందు దీపాలు వెలిగించడం ఓ సంప్రదాయమైంది.


2వ రోజు

లోకకంటకుడైన నరకాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు యుద్ధరంగానికి వెళ్లాడు. ఆమె సహకారంతో రాక్షస వధ చేశాడు. ఆ రోజు నరక చతుర్దశిగా నిలిచిపోయింది.


3వ రోజు

అమావాస్యనాడు వచ్చే దీపావళి పండగ రోజు ఇంటింటా దీపాలు వెలుగుతాయి. నరకాసుర వధకు సంతోషంగా టపాసులు కాల్చుతారు. వ్యాపార సముదాయాలు, నివాస గృహాల్లోకి లక్ష్మీ దేవి అడుగు పెడుతుందని నమ్మే ప్రజలు రాత్రి వేళల్లో ఆమె రాక కోసం తలుపులు తెరిచి ఉంచుతారు.


4వ రోజు

దీపావళి తరువాత రోజు బలిపాడ్యమి. ఆ రోజు మహా విష్ణువు వామనావతారం ధరించాడని, బలి చక్రవర్తి అహంకారం అణచాడని నమ్ముతారు. అంతేకాకుండా ఆ రోజే బలికి పాతాళ లోకపు ఆధిపత్యం కూడా లభించింది. అందుకే బలిపాడ్యమిని పర్వదినంగా చేసుకుంటారు.


5వ రోజు

చివరి రోజు యమద్వితీయగా నిర్వహిస్తారు. ఆరోజు సోదరి చేతి వంట తిని, ఆమెకు కానుకలివ్వడం ఆనవాయితీ.    - ఎర్రాప్రగడ రామకృష్ణ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment