మేఘాల పల్లకిలో.. వానదేవుడు వస్తున్నాడు!

-ఆషాఢమాసానికి వారంలో వీడ్కోలు
-ఆకాశ వీథులు మబ్బుల మయం!
-మంచి వర్షాల కోసం ప్రార్థనలుపంచాంగకర్తల లెక్కల ప్రకారం వర్షఋతువు శ్రావణంతో మొదలై కార్తీక మాసంతో ముగుస్తుంది. మరో తొమ్మిది రోజుల్లో ఆషాఢం ముగుస్తుంది. ఐతే, ఇప్పటికే వర్షాలు మొదలైనా వ్యవసాయ, గృహ తదితర అవసరాలకు చాలినంతగా భూగర్భ జలాలు, నీటివనరుల అవసరం తీరిందా అంటే లేదనే చెప్పాలి. అందుకే, వరుణదేవుణి కరుణ కోసం ఆరాధనలు మొదలవుతున్నాయి. వర్షం ఎప్పుడు, ఎంత మొత్తంలో పడాలో అప్పుడు, అంతే పడుతుంది. మరి, కొన్ని ప్రాంతాలకు అతివృష్టి, వరదలు సంభవిస్తున్నాయంటే లోపం మనది కాక, ప్రకృతిది ఎలా అవుతుంది? ఇంతటి నాగరికతలు తెలిసిన మేధోవంతులమైన మనం ఎంతటి ఎండావానలనైనా తట్టుకొనేలా జీవన విధానాలను ఏర్పరచుకోలేమా! ఇది పూర్తిగా మన సమస్యే. ప్రకృతిని, దేవుళ్లను నిందించడం తప్పు.

ఆషాఢం అంటేనే ఏడాదిలోని మూడు శూన్యమాసాలలో ఒకటి, మొదటిది అనుకుంటారు చాలామంది. కానీ, దేవుడు సృష్టించినదేదీ అనవసరం, అపవిత్రం కాదు. దేని ప్రాధాన్యం దానికుంటుంది. ఆషాఢ వైశిష్ఠ్యం తెలిసిన వాళ్లు అటువంటి ఆలోచనలు చేయరు. గ్రీష్మతాపానికి మండిపోయిన గుండెల్ని చల్లబరచడానికేనా అన్నట్టుగా ఆషాఢంలోనే మబ్బుల రాక మొదలవుతుంది. నిండు మేఘాలు గుంపులు- గుంపులుగా వడివడిగా ఆకాశవీథుల్లో సంచరిస్తూ నిర్ణీత ప్రాంతాలలో జడివానల్ని కురిపించడం ప్రారంభిస్తాయి. మన చేతుల్లో ఉన్నదేమిటంటే, అతివృష్టితో వరదలు సృష్టించకుండా సానుకూల స్థాయిలో మంచి వర్షాలను కురిపించమని ఆ వరుణదేవుణ్ణి ప్రార్థించడమే.

మరొక వారం రోజుల్లో (ఆగస్టు 11వ తేదీతో) ఆషాఢమాసం ముగుస్తుంది. ఈ నెలలోని 4 ఆదివారాలలో జరిగే ఆషాఢ జాతర తెలంగాణ రాష్ట్ర గర్వదాయక పర్వమైన బోనాల సంబురాలు వచ్చే ఆదివారం (5వ తేది)తో ముగుస్తున్నాయి. అలాగే, ప్రతినెలా వచ్చే మాస శివరాత్రి (9వ తేది)తోపాటు కామ్య ఏకాదశి పర్వదినం (7వ తేదీన స్మార్తులకు, 8వ తేదీన వైష్ణవులకు) వస్తున్నది. వీటితోపాటు మహిళలు, ఆడపిల్లలు తమ జీవన వైభవానికి చిహ్నంగా భావించే గోరింటాకు (మైదాకు) అలంకరణకు ఈ కొద్ది రోజులు సమయం ఉంది. ఆ తర్వాత, ఎప్పుడైనా మైదాకును పెట్టుకోవచ్చేమో కానీ, ప్రత్యేకించి ఆషాఢమాసంలో అలంకరించుకోవడం మాత్రం ఒక సంప్రదాయంగా వస్తున్నది. ముఖ్యంగా పెళ్లయిన వారు ఈ నెలలో విధిగా గోరింటాకు పెట్టుకోవాలన్నది మన పెద్దల సూచన. మైదాకులోని రసశక్తి ఒంటికి పట్టి వేసవి వేడిమి నుంచి ఒకింత ఉపశమనం కలిగిస్తుందన్నది నిజం.

ఇక, వర్షదేవుడైన వరుణుని రాకకు గుర్తుగా దాదాపు ఈ నెలంతా (ఇంకా ఎక్కువ రోజులు కూడా) ఆకాశంలో మబ్బులు కమ్ముకొంటాయి. వానలు విశేషంగా కురవడంతో చెరువులు, కాలువలు, నదులు కొత్తనీరుతో నిండుకుండల్ని తలపిస్తాయి. అప్పుడు రైతుల ఆనందం వర్ణనాతీతం. ఈసారి ఇప్పటికే వర్షాలు మొదలైనా, చాలాకాలం పాటు ఋతుపవనాలు గతి తప్పి వుండడం వల్ల వ్యవసాయానికి, గృహావసరాలకు చాలినంతగా భూగర్భ జలాలు, నీటివనరుల అవసరం మనకింకా తీరనేలేదు. అందుకే, ఆషాఢం ముగుస్తుంది కదాని మేఘమాలలను అప్పుడే వానలకు ముగింపు పలికి, వెళ్లిపోవద్దని కోరుకుందాం. ఒకవేళ తాత్కాలికంగా వెళ్లినా మళ్లీ రమ్మంటూ వరుణదేవుణ్ని శరణు వేడుదాం.

ఆషాఢం ప్రారంభంతోనే అంటే జూలై 16 (లేదా 17) నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. నిజానికి ఉత్తరాయనమే పుణ్యకాలమని, దక్షిణాయనం అంత పుణ్యప్రదం కాదని ప్రజలలో ఒక దురభిప్రాయం ఉంది. దీనిని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. కచ్చితమైన కారణం ఇదేనా, లేక మరేదైనా ఉందా అన్నది పండితులు చెప్పాలి. అలాగే, ఈ నెలను హైందవ నియమ, సంప్రదాయాల ప్రకారం శూన్యమాసంగా పిలుస్తారు. అలాగని ఇదంతా అపవిత్ర కాలమనీ చెప్పలేం. కొన్ని రకాల శుభకార్యాలు (పెళ్లిళ్లు, ఉపనయనాలు, గృహప్రవేశాలు) వంటివాటిని నిషిద్ధం చేశారు. పుట్టినతేదీలు వంటి విధిపూర్వక వేడుకలను చక్కగా జరుపుకోవచ్చు. అంతేకాదు, ఈ నెలలో కొన్ని పర్వదినాలు కూడా వస్తాయి.

సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సంక్రమణం సందర్భంగా దక్షిణాయనం మొదలవుతుంది. ఇది ఈ నెలలోనే జరుగుతుంది కాబట్టి, ఆషాఢమాసంతో దక్షిణాయనం ప్రారంభమని చెబుతారు. విజ్ఞానశాస్త్ర పరంగా ఈ ఆర్నెలలు భూమి దక్షిణార్ధ గోళం ఒకింత సూర్యుని వైపు వొంపు తిరుగుతుందని అంటారు. ఈ భౌగోళిక మార్పు వల్ల ఈ కాలం పగటి వేళల కంటే రాత్రివేళలు కొంచెం ఎక్కువ సమయంతో ఉంటాయి. వచ్చే మకర సంక్రాంతి (2019) వరకూ దక్షిణాయనం కొనసాగి, తర్వాత ఉత్తరాయన పుణ్యకాలం మొదలవుతుంది.

ఇక, ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులు తమ అత్తవారిళ్లకు దూరంగా ఉండడం సంప్రదాయంగా వస్తున్నది. ఎవరి పుట్టింట్లలో వారుంటారు. ఐతే, ఈ ఆధునిక కాలంలో ఉద్యోగావసరాల రీత్యా ఎక్కువ మంది దీనిని పాటించడం లేదన్నది వేరే విషయం. ప్రత్యేకించి పెళ్లయిన తొలి సంవత్సరంలోని ఆషాఢంలో మాత్రం ఇలా దూరం పాటించడం కద్దు.

వరుణ ప్రసన్నానికి యాగాలువరుణదేవుని కరుణ కోసం ఈ కాలంలో యాగాలు చేయడం పరిపాటి. మన యాదాద్రిలో నిన్నటి (గురువారం) నుంచి వరుణ యాగం మొదలుపెట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతున్నది. సోమవారం వరకూ కొనసాగుతుంది. కాగా, అష్టదిక్పాలకులలో అయిదో దైవమైన వరుణుని భార్య పేరు కాళికాదేవి. ఆయన వాహనం మకరమైతే, ఆయుధంగా పాశాన్ని ధరిస్తాడు. వరుణుడు కాపురం ఉండే పట్టణం శ్రద్ధావతి

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment