కూర్చున్న శ్రీనివాసుడిని చూశారా?

ప్రభాతవేళ తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని మేల్కొల్పేందుకు ఆలపించే సుప్రభాతం ఎంత మధురంగా ఉంటుందో అభయ, కటి హస్తాలతో దర్శనమిచ్చే శ్రీవారి రూపం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. అయితే ఆ నిలువెత్తు రూపానికి భిన్నంగా శ్రీదేవీ భూదేవిసమేతంగా సుఖాసీనుడై యోగముద్రలో ఉన్నట్టుండే శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే తిరుపతికి సమీపంలోని తొండమనాడు వెళ్లాల్సిందే.

‘‘దొమ్ములు చేసిన యట్టి తొండమాన్‌ చెక్కురవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు’’ అంటూ తొండమాన్‌ చక్రవర్తి గురించి వివరించాడు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. శ్రీనివాసుడి సేవలో తరించిన రాజుగా తొండమానుడికి ఎంతో పేరుంది. శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడు ఈ తొండమాన్‌ చక్రవర్తి. ఆయన తన చివరి దశలో తిరుమలకు వెళ్లి స్వామిని సేవించే పరిస్థితిలేక... తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకున్నాడు. చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీవారు తొండమాన్‌ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించాడు. సుఖాసీనుడై చక్రవర్తి సేవలందుకున్నాడు. స్వామి విగ్రహం ఒక చేతితో యోగముద్ర, మరో చేత్తో అభయహస్తం కలిగి ఉండటంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తుంది.


తొండమానుడి నిర్మాణం 
శ్రీవారికి గొప్ప భక్తుడైన తొండమానుడు అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడ సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు తొండమానుడితో ‘కలియుగం అంతమయ్యే వరకూ నేను శేషాచల కొండల్లోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంటాను. అక్కడ నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించి దాని మధ్యలో బంగారు విమానాన్ని ఏర్పాటు చేయి’ అని ఆదేశిస్తాడు. దీనికి అంగీకరించిన తొండమానుడు విశ్వకర్మ సహాయంతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడు. రత్న ఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి, దాని చుట్టూ మూడు ప్రాకారాలతో, మూడు ప్రదక్షిణ మార్గాలనూ, మూడు మండపాలనూ, వంటశాలలనూ, బంగారుబావినీ నిర్మిస్తాడు. ఆనంద నిలయ విమానంపైన వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనే విమాన వేంకటేశ్వరుడు. ఆయనను దర్శించిన వెంటనే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి గోపురం ఆనంద నిలయమని ప్రసిద్ధి. రోజూ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చాకే రాజ్యపాలన వ్యవహారాలు చూసుకోవడం తొండమానుడికి అలవాటు. ఒక సొరంగ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లివచ్చేవాడట. అయితే, కొంతకాలానికి వృద్ధాప్యం కారణంగా తొండమానుడు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లలేకపోయేవాడు. దీంతో స్వామినే తన కోటలో వెలిసి, తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని వేడుకుంటాడు. దీంతో శ్రీవారు అభయహస్తంతో ఆసీన భంగిమలో శ్రీదేవీ, భూదేవిలతో కలిసి తొండమనాడులో స్వయంభూగా వెలిశాడు.

తామరగుంట పుష్కరిణి 
తిరుమలలోని ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే జలాన్ని కాలువల ద్వారా తొండమనాడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. రేణిగుంట రాళ్లకాలువ మీదుగా ఈ నీల్లు తొండమనాడు చెరువులోకి వస్తాయి. దీన్ని తామరగుంట చెరువుగా పిలుస్తారు. అంతరాలయ ద్వారంమీద తొండమానుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయ విమాన శిఖరం తిరుమలలో ఆనంద నిలయంమీద ఉన్నట్లే ఇక్కడా ఉండటం విశేషం. ఈ ఆలయం గత రాజుల వైభవానికి చిహ్నంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. గద్వాల్‌ మహారాణి ఈ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చినట్లు ఆలయచరిత్ర పేర్కొంటోంది. ఆ రోజుల్లో స్వామికి నిత్య పూజలు, సేవలు, నివేదనలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారని ప్రతీతి. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతి శ్రావణమాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. యోగ ముద్రలో వెలసిన స్వామిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. 
ఇలా చేరుకోవచ్చు 
తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్లు, శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందీ తొండమనాడు గ్రామం. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, శ్రీకాళహస్తిల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి మీదుగా పాపానాయుడుపేట వెళ్లే బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.
- ఆడెపు రాజ్‌కుమార్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment