మహా విహంగం... మహా వినోదం!
పార్క్ విస్తీర్ణం 65 ఎకరాలు
జటాయు విగ్రహం పొడవు 250 అడుగులు
వెడల్పు 150 అడుగులు
ఎత్తు 70 అడుగులు
పీఠంతో కలిపి 1500 చదరపు అడుగులు
ఖర్చు 100 కోట్ల రూపాయలు
నిర్మాణానికి పట్టిన సమయం 10 సంవత్సరాలు
మొత్తం 20 ఎడ్వంచర్ గేమ్స్
సముద్ర మట్టానికి విగ్రహం ఎత్తు 1000 అడుగులు
ఒక శిల్పి ఊహ... పదేళ్ళ కల... దాదాపు రూ. వంద కోట్ల ఖర్చు... ఎత్తయిన కొండలూ, గుట్టల మధ్య వందలమంది శ్రమ...
ఫలితం కేరళలోని జటాయుపుర రాక్ థీమ్ నేచర్ పార్క్... అందులో ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి విగ్రహం!
సాహస, పర్యావరణ, ఆరోగ్య పర్యాటకాలు ఒక పౌరాణిక పక్షి చుట్టూ అల్లుకున్న ఇలాంటి అరుదైన ప్రాజెక్ట్ మరెక్కడా లేదు.
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనమ్
వైదేహీ హరణమ్ జటాయు మరణమ్ సుగ్రీవ సంభాషణమ్
వాలీ నిగ్రహణమ్ సముద్ర తరణమ్ లంకాపురీ దాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం హ్యేతద్ధి రామాయణం
ఇది ఏకశ్లోకీ రామాయణం. ఈ ఒక్క శ్లోకంలో ప్రస్తావించిన ఘట్టాలను- అంటే ఆ గాథలోని ప్రధానమైన మలుపులను తెలుసుకుంటే, రామాయణం పూర్తిగా అర్థమైపోతుంది. వీటిలోని కీలక ఘట్టాలలో జటాయు మరణం ఒకటి. అంతటి ప్రాధాన్యం కలిగిన జటాయు మరణ ఘట్టం కేరళ రాష్ట్రంలో జరిగిందని పౌరాణికులు చెబుతారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రెండు దశలుగా చేపట్టిన జటాయు రాక్-థీమ్ నేచర్ పార్క్ మొదటి దశ ఏడాది కిందట పూర్తయింది. రెండో దశను కూడా పూర్తి చేసి, ఈ శుక్రవారం నాడు (ఆగస్టు 17) ప్రారంభిస్తున్నారు. పౌరాణికత, సంస్కృతి, సాహసం, వినోదం, ఆరోగ్యం, సాంకేతికతల కలబోత ఇది.
శ్రీరాముడికి కోవెల
రామాయణ ఇతిహాసం ప్రకారం, సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు పక్షి అడ్డగిస్తుంది. దాని రెక్కలను రావణుడు ఖండించి సీతను తీసుకువెళ్తాడు. జటాయువును రావణుడు ఖండించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. జటాయువు విగ్రహం సమీపంలో శ్రీరాముని ఆలయ నిర్మాణం కూడా జరిగింది.
హెలికాఫ్టర్‌లో విహంగంలా...
జటాయుపురలో సందర్శకులకోసం హెలీ ట్యాక్సీని అందుబాటులోకి తెచ్చారు. దీనిలో విహరిస్తూ, విహంగ వీక్షణంతో చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. కేరళలో హెలికాఫ్టర్ సేవలు అందిస్తున్న మొదటి పర్యాటక ప్రదేశం ఇదే కావడం విశేషం. దీనిలో పైలెట్‌తో సహా ఏడుగురు దీనిలో ప్రయాణించవచ్చు. ఈ రైడ్ ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉంటుంది. ఒక్కొక్క ప్రయాణికునికి రూ. 3,299 వసూలు చేస్తారు. అలాగే రూ. 40 కోట్ల వ్యయంతో విదేశాల తెప్పించిన కేబుల్ కారు మీద కొండపైకి పర్యాటకులు చేరుకోవచ్చు.
ఎక్కడుంది?: కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా చండ్యమంగళం(జటాయుమంగళం)లో, త్రివేండ్రం నగరానికి 50 కి.మీ.దూరంలో. చండ్యమంగళం సెంటర్ నుంచి జటాయుపుర ప్రవేశ ద్వారం 500 మీటర్ల దూరంలో ఉంటుంది.
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి త్రివేండ్రానికి నేరుగా రైళ్ళున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం త్రివేండ్రంలో ఉంది.
6డి వీడియో, కేవ్ రిసార్ట్స్

సముద్రమట్టానికి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో, కొండలూ, గుట్టలతో ఉన్న ప్రాంతంలో ఈ పార్క్ నిర్మాణం జరిగింది. ఇక్కడ జటాయువు విగ్రహం మూడు అంతస్తులుగా ఉంటుంది. రామాయణ గాథను దృశ్య రూపంలో వివరించే డిజిటల్ మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో 6డి వీడియో షోలు ఉంటాయి. నేచర్ పార్క్‌లో ఎడ్వెంచర్ జోన్ ఉంది. సాహసాలను ఇష్టపడేవారికి ఇది స్వర్గధామం. విలువిద్య, రైఫిల్ షూటింగ్, పెయింట్ బాల్, రాక్ క్లైంబింగ్, లేజర్ ట్యాగ్, లోయల్ని దాటడం, ట్రెక్కింగ్, కమాండో నెట్, రోప్ వాకింగ్, వాల్ క్లైంబింగ్... ఇలాంటి పిల్లలనూ, పెద్దలనూ అలరించే ఇరవైకి పైగా ఎడ్వంచర్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఆయుర్వేదిక్ కేవ్ రిసార్ట్స్ మరో ఆకర్షణ. మల్టీ డైమెన్షనల్ థియేటర్, సిద్ధ కేవ్ హీలింగ్ సెంటర్ లాంటివి సరే సరి. అలాగే అరవై సీట్లతో అత్యాధునికమైన కాన్ఫరెన్స్ హాల్ ఉంది. సమావేశాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఎడ్వంచర్ సెంటర్ మధ్యలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. సంగీతం వింటూ, ఆరుబయట, వెన్నెల వెలుగులో మంచి రుచులను కూడా ఆస్వాదించవచ్చు.
టైమ్, థీమ్ బట్టి ఛార్జీ!

జటాయుపురలో ప్రవేశానికి టిక్కెట్టు ఛార్జీ రూ.400, రానూ, పోనూ కేబుల్ కారు ప్రయాణానికి రూ. 250, ప్రవేశ రుసుము రూ.150 దీనిలో కలిసి ఉంటాయి.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకూ సమయం, ఎంచుకున్న థీమ్, ఎడ్వెంచర్ యాక్టివిటీ ఆధారంగా ఛార్జీలు రూ. 1,000 నుంచి రూ.3,500 వరకూ ఉంటాయి.
ఏడేళ్ళ లోపు పిల్లలను అనుమతించరు. ఏడు నుంచి పన్నెండేళ్ళ మధ్య వయసున్న పిల్లలకు 50 శాతం రాయితీ ఉంటుంది.
ఏ ప్యాకేజీనైనా ఇరవై నాలుగు గంటల ముందు బుక్ చేసుకోవాలి.
జటాయుపురలోకి రోజుకు 4,000 మందినీ, ఎడ్వెంచర్ పార్క్‌లోకి 400 మందినీ, కేవ్ రిసార్ట్‌లోకి 12 మందినీ మాత్రమే అనుమతిస్తారు.
రాత్రి గుడారాల్లో బస చేసి, చల్లని గాలినీ, ఆహ్లాదమైన వాతావరణాన్నీ పర్యాటకులు ఆస్వాదించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మైలురాయిగా నిలుస్తుంది

కొన్నేళ్ళ కిందట నా ఆలోచనల్లో ఈ ప్రాజెక్ట్‌కు బీజం పడింది. ప్రాథమికంగా ఈ విగ్రహం కాంక్రీట్ నిర్మాణం. దానికి రాతి మాదిరి ఫినిషింగ్స్ చేశాం. మేం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఇది చాలా కష్టతరమైన ప్రదేశం కావడమే. నిర్మాణ సామగ్రిని కొండపైకి చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ శిల్పాన్ని తయారు చెయ్యడానికి మాకు ఏడు సంవత్సరాల సమయం పట్టింది. మొత్తం ప్రాజెక్ట్ పదేళ్ళలో పూర్తయింది. కేరళ పర్యాటక రంగానికి ఇది సరికొత్త మైలురాయి అవుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం వర్షపు నీటి సంరక్షణ లాంటి చర్యలు తీసుకుంటున్నాం. ఈ పార్కు నిర్మాణం వెనుక ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక, సాహస, ఆరోగ్య పర్యాటకాలను ప్రోత్సహించడం.
రాజీవ్ ఆంచల్,
జటాయుపుర టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, శిల్పి, ప్రముఖ మలయాళ ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment