భార్య భర్త గుర్తుపెట్టుకోవాల్సినవి
భద్రంగా తొలిముద్ర! 

    పాలు - నీళ్లలా, వాక్కూ - అర్థంలా, చంద్రుడు - వెన్నెలలా భార్యాభర్తలు కలిసుండాలని మన పెద్దలు చెబుతుంటారు. నిజమే! అలా ఉండాల్సిందే.. అయితే అది సాధ్యం కావాలంటే నవదంపతులు ముందుగా తమకు తాము సంయమనం, విచక్షణ, ఓర్పూ నేర్పూ అలవరచుకోవాలి. తొందరపాటు తనం, మాట తూలడం, మందబుద్ధిలా ఉండడం వంటివి ఎంతమాత్రమూ పనికిరావు. ముఖ్యంగా కొత్తగా జీవితంలోకి ప్రవేశించిన భాగస్వామితోనూ, తన బంధు మిత్రులతోనూ వ్యవహరించేటప్పుడు మరింత అప్రమత్తత అవసరం. కొత్త వ్యక్తులకు- అది భాగస్వామి కావచ్చు, తన బంధుమిత్రులు కావచ్చు ఎవరికైనా మనపై ఏర్పడే తొలి అభిప్రాయం ఎంత మంచిదిగా ఉంటే అంత మేలు. కారణం అదే చాలామంది మనసుల్లో స్థిరంగా నిలిచిపోతుంది. అంచేత ‘తొలిముద్ర’ విషయంలో నవదంపతులు ఎంత వీలైతే అంత అప్రమత్తంగా ఉండాలి.

భర్త గుర్తుపెట్టుకోవాల్సినవి.. 
* భార్య అంటే బానిసో సేవకురాలో కాదు.. ప్రియ నేస్తంగా పరిగణించాలి. 
* ఆమె తల్లిదండ్రులను, బంధువులను గౌరవిం చాలి. వారినెప్పుడూ కించపరచడం అవమా నించడం తగదు. 
* భార్యను సంతోషపెట్టడమే తన విధిగా భావించాలి. ఆమె ఆరోగ్యమే ఇంటిల్లిపాదికీ ఆరోగ్యంగా గుర్తించాలి. 
* గృహనిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి, ఆదాయ వ్యయాల గురించి ఆమెతో చర్చించాలి. సలహాలు తీసుకోవాలి. 
* ఆమె పొరపాటు చేసినా మన్నించాలే తప్ప దూషించడం, కించపరచడం, దండించడం ఎంతమాత్రమూ తగదు. తనతప్పు తనకు అర్థమయ్యేలా మృదువుగా చెప్పాలి. 
* పరాయి మహిళలతో అతిచనువుగా మసలడం, వారిని వక్రదృష్టితో చూడడం భావ్యంకాదు. వాళ్లంతా సోదరి లేదా మాతృ సమానులుగా సంభావించాలి. 
* మీకు నమ్మకం ఉన్నా లేకున్నా ఆమె భక్తి విశ్వాసాలను, ఆచారాలను కించపరచవద్దు. తను పూజలు, ప్రార్థనలు చేసుకుంటుంటే అడ్డంకులు కల్పించరాదు. 
* ఏ విషయంలోనూ ఆమెను అవమానించేలా ప్రవర్తించరాదు. 
* ఇంటి పనులు వంటపనులలో వీలైనంత సాయం చేయడం మరువకూడదు. 
* ఏ విషయంలోనూ ఆమెను బలవంత పెట్టడం ఒత్తిడికి గురిచేయడం తగదు. 
* ప్రేమ ఇవ్వడం ద్వారానే ప్రేమ వస్తుందన్న సత్యం గ్రహించాలి.

భార్య గుర్తుపెట్టుకోవాల్సినవి.. 
* భర్తను ఏ విషయంలోనూ అవమానించ కూడదు. అతని పట్ల గౌరవం ఉండాలి. 
* అతని తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను ఆదరించాలి. 
* అతనిని సంతోషపెట్టడమే తన బాధ్యతగా వ్యవహరించాలి. 
* ఒకవేళ పొరపాటు చేసినా నిండుమనసుతో మన్నించాలి. తప్పును విప్పిచెప్పి మరోసారి అది జరగకుండా జాగ్రత్తపడాలి. 
* భర్తకు వ్యతిరేకంగా నడుచుకోవడం, మాట లతో గాయపరచడం కూడదు. 
* పరపురుషులను పితృసమానులు లేదా సోదర సమానులుగా పరిగణించాలి. 
* గృహ నిర్వహణలో భర్త సలహాలు సంప్రదింపులు తీసుకోవడం మంచిది. 
* ఏదైనా ఇద్దరూ కలిసి పని చేయాలన్న ఆకాంక్ష ఉండాలి. అది తోటపని కావచ్చు.. తీర్థయాత్ర కావచ్చు.. మరేదైనా కావచ్చు. 
* అతని ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. 
* ప్రతిదానికీ అతన్ని అపార్థం చేసుకుంటూ సూటిపోటి మాటలతో నిందిస్తూ ఇంటిని నరకం చేసుకోరాదు. 
* ఆర్థిక విషయాలలోనూ చురుకుగా ఉండాలి. అనవసరపు వ్యయాల్ని అడ్డుకోవాలి.
- ప్రణవి

-------------------------

ప్రియమైన సత్యమే ఆణిముత్యం!

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ‘వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు’ అని భాగవతమూ చెబుతోంది. అంతమాత్రాన ఎడాపెడా అబద్ధాలు ఆడవచ్చునా? పెళ్లి ఒక ధర్మకార్యం. ఒక పుణ్యకార్యం. అబద్ధాలాడటానికి పూర్వీకులే లైసెన్సు ఇచ్చారనుకుని పెళ్లాడటానికి అబద్ధాలాడితే, అందులో ఏ ఒక్కటి బయటపడినా తాళి ఎగతాళి పాలుకావచ్చు. కళకళలాడటానికి కట్టుకున్న మేడలు పేకమేడలూ కావచ్చు. అయితే నిజాల సంగతో! వాటిని ఖనిజాల్లా తవ్వి బయటికి తీసి జీవిత భాగస్వామి ముందు పెట్టాలా? అన్నది చర్చనీయాంశమే.
‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటికంటె ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు తత్సుతు శతకంబుకంటె ఒక సూనృత వాక్యము మేలు చూడగన్‌’ అని శకుంతల తన భర్త దుష్యంతుడికి సత్యం గురించి హితబోధ చేసింది. మంచినీళ్లున్న నూతుల కన్నా ఒక బావి, వంద బావుల కన్నా ఒక యజ్ఞం, వంద యజ్ఞాల కన్నా సుతుడు, వందమంది సుతులకన్నా ఒక సత్యవాక్యం మంచిదని దాని భావం. సంసార సారమంతా సత్యంలోనే ఉందనడంలో తిరుగులేదు. అయితే జీవిత భాగస్వాములు తమకు సంబంధించిన సత్యాలన్నీ బయటపెట్టడం, ఎదుటివాళ్ల జీవితంలోని సత్యాలన్నీ ఆరాదీయడం సబబేనా? అన్నది ఆలోచించాలి. అందువల్ల కొంప కొల్లేరయితే ఎవరిది బాధ్యత? పెళ్లి జరగడం ముఖ్యం. ఆ తర్వాత దాంపత్యబంధాన్ని పది కాలాలపాటు కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. దీనిని ఎవరు కాదనగలరు?
తాతముత్తాతల కాలంలో కొన్ని అబద్ధాలు ఆడి పెళ్లిళ్లు చేసి ఉండవచ్చు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మంగళకరమైన వాటన్నిటిల్లో మంగళసూత్రం గొప్పది. పండంటి కాపురానికి పది సూత్రాలు అంటారు. నిజానికి ఒకే ఒక సూత్రం చాలు. అదే మంగళసూత్రం. ఆ మంగళసూత్రం కళ్లకద్దుకుని, మనస్సుకు అద్దుకుని మరీ ఆ కాలంవాళ్లు జీవితాంతం కాపాడుకునేవాళ్లు. సంసారం నిలబెట్టుకునేవాళ్లు. ‘మాంగల్యం తంతునానేనా’ అన్న వరుడు- భార్యకు దూరం కావాలన్న ఆలోచనను కూడా మనస్సులోకి రానిచ్చేవాడు కాదు. భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ భార్యాభర్తలు పరిపూర్ణంగా కట్టుబడి ఉండటానికి వారిద్దరూ మానసికంగా సిద్ధపడిపోయేవారు.
ఇప్పుడు కాలం మారిపోయింది. ఆలోచనావిధానాలు మారిపోయాయి. అనుమానాలు, అపార్థాలు, అనర్థాలు పెరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో సామాజిక మాధ్యమాలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. ‘సత్యమే చెప్పి జీవనం సాగించాలా? అబద్ధాలు చెప్పి జీవితాన్ని నెట్టుకురావాలా!’ అని ఎంతోమంది మథనపడుతుంటారు. ఇక్కడో ధర్మసూక్ష్మం... అబద్ధాలు చెప్పకూడదు... సత్యాలన్నీ చెప్పనవసరం లేదు. నీతిసూత్రాలు పక్కనబెట్టి అబద్ధాలు చెబితే ఎక్కడో ఒకచోట పట్టుబడటం ఖాయం. మరి అవసరం ఉన్నా, లేకపోయినా తెలిసిన నిజాలన్నీ ఏకరువు పెట్టాలా? సత్యహరిశ్చంద్రుడయినా సత్యం మీద నిలబడ్డాడు తప్ప అవసరం లేకపోయినా ప్రతి సత్యమూ పొల్లుపోకుండా చెప్పి ఉండడు.
అబద్ధాలు చెప్పడం.. నిజాలు చెప్పకుండా ఉండటం రెండూ పెద్ద సమస్యలే కదా! ఆచరణీయమైన మధ్యేమార్గం లేదా? అని బాధపడనక్కరలేదు. జీవితమన్న తర్వాత తెలిసో తెలియకో, తన ప్రమేయం ఉండి కానీ, లేక కానీ, ఉద్దేశపూర్వకంగా గానీ, ఉద్దేశం లేక గానీ తప్పులు చేసి ఉండవచ్చు. తరచిచూస్తే పశ్చాత్తాపానికి మించిన శిక్ష కూడా ఉండదు. చేసిన తప్పుల్లో కొన్ని గుర్తుండి ఉండవచ్చు, మరిచిపోయీ ఉండవచ్చు. ఏ తప్పూ చేయని మనిషి ఈ భూప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. సృష్టి మొదలయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఇంతే. భవిష్యత్తులోనూ ఇంతే. తప్పులు చేయడం మానవ సహజం. అలాంటప్పుడు భవిష్యత్తులో జీవితం సాఫీగా సాగడానికి ఎటువంటి ఇబ్బందులూ లేని నిజాల్ని చెప్పి ప్రమాదాల్ని కొనితెచ్చుకోవడం ఎందుకు? తప్పులు గుర్తొచ్చి బాధపడటం ఒక ఎత్తయితే, వాటిని జీవితభాగస్వామికి చెప్పి బాధపెట్టడం ఇంకో ఎత్తు. గతం గతః అని మన పెద్దలే చెప్పారు. జరిగిందేదో జరిగిందనుకుని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవడం అవసరం. బంధాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ‘సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌/నబ్రూయాత్‌ సత్య మప్రియం..’ అని మనుస్మృతి చెప్పింది. నిజం చెప్పాలి. అయితే ఇతరులకు ప్రియంకాని సత్యాన్ని చెప్పకూడదని దీనిభావం. మనం ఇతరుల ఇష్టాన్ని అర్థం చేసుకుంటే, మన ఇష్టాన్ని కూడా ఇతరులు దృష్టిలో పెట్టుకుంటారు. ఇదే గీటురాయి. జీవితంలో అడుగడుగునా ఇది ఉపయోగపడుతుంది. బతికినంతకాలం సంతోషంగా ఉండాలి. దాంపత్యబంధం చెక్కుచెదరకుండా ఉండాలి.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment