గొల్లభామ గ్లో భళా!

సింగారం అనే దారంతో నేసిన చీరల్లో కూడా ప్రత్యేకతలున్నవి కొన్నే ఉంటాయి. అవి మగువల మనసు దోచుకోవడమేకాదు... ‘బ్రాండ్’గా కూడా మారుతాయి. ఈ లిస్టులోకి ఇటీవల ‘గొల్లభామ’ చీరలు కూడా చేరాయి. ప్రముఖ సినీతార సమంత సైతం ఈ చీరను చూసి ముచ్చటపడింది. ‘గొల్లభామ’కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారింది. ఈ చీరకు సంబంధించి పేటెంట్ హక్కులన్నీ సిద్దిపేట చేనేత కార్మికులకే దక్కడం విశేషం. ఇంతకీ ఈ ‘గొల్లభామ’లోఉన్న ప్రత్యేకతలేంటీ..?
కంచి, ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి... దేని ప్రత్యేకత దానిదే. అలాగే తెలంగాణలోని సిద్దిపేటలో తయారయ్యే ‘గొల్లభామ’ చీరలు ఇప్పుడు గ్లోబల్‌కు విస్తరించాయి. ఈ ‘గొల్లభామ’ ఇప్పటిదేం కాదు... 70 ఏళ్ల క్రితం పురుడు పోసుకుంది. అప్పట్లో సిద్దిపేటలో చేనేత కార్మికులైన వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్యలు తమ కులవృత్తి అయిన మగ్గంపైనే ఆధారపడి జీవిస్తుండేవారు. రంగు రంగుల చీరలు తయారు చేస్తూ విక్రయించేవారు. ఒకరోజు ఇంటి ముందు నుంచి తల మీద పాలకుండ, చేతిలో పెరుగు పట్టుకొని నడిచివెళుతున్న ఓ మహిళ నీడను చూసి ’గొల్లభామ‘ చీర ఆలోచన వారిలో పురుడు పోసుకుంది. వారి ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు ప్రత్యేక సాంచాను ఏర్పాటు చేసుకున్నారు. అలా వారి చేతుల్లోంచి జాలువారింది ‘గొల్లభామ చీర’. వాటిని వారసత్వంగా భావించిన నేతన్నలు నేటికీ గొల్లభామ చీరలు నేస్తున్నారు.
నాటి రాష్ట్రపతి ఫిదా ...
సిద్దిపేటకు రాష్ట్ర, దేశ నాయకులు ఎవరు వచ్చినా ముందుగా ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య కుంచె నుంచి జాలువారిన అందమైన చిత్రాలను కానుకగా అందజేసేవారు. వాటితో పాటుగా నేతన్నలు రూపొందించిన గొల్లభామ చీరతో సత్కరించేవారు. అప్పట్లో (1986) సిద్దిపేట పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌కు కూడా గొల్లభామ చీరలు అందించారు. వాటిని చూసిన రాష్ట్రపతి మంత్రముగ్ధులయ్యారు. దాంతో అప్పట్లోనే ఈ చీరలకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రత్యేక సాంచాలు...

వారసత్వంగా వచ్చిన ఈ చీరలు నేసేందుకు నేతన్నలు ఆసక్తిని కనబరుస్తున్నారు. సిద్దిపేటకు చెందిన తుమ్మ గాలయ్యతో పాటు పట్టణంలోని ఆదర్శ చేనేత సంఘంలోని నేతన్నలు, పలువురు తమ ఇళ్లలో ప్రత్యేకంగా సాంచా, కొంకీలను ఏర్పాటు చేసుకొని గొల్లభామ చీరలను నేస్తున్నారు. వీటిలో కాటన్ మెస్ రైజ్ పట్టు చీరలపై రంగురంగుల గొల్లభామ చిత్రాలను నేస్తున్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు దుబ్బాకలో తప్ప మరెక్కడా ఇలాంటి చీర తయారవ్వదు. గొల్లభామ చీరలను టెస్కో, ఆప్కో, లేపాక్షి సంస్థలతో పాటు ఇతర వ్యాపారస్తులకు సైతం విక్రయిస్తున్నారు. 25 మగ్గాల ద్వారా ప్రతి నెల దాదాపు 250 నుంచి 300 చీరలను నేస్తున్నారు. మొదటగా కాటన్ చీరలపై నేయగా గత ఐదేళ్ల నుంచి పట్టు చీరలపై కూడా నేస్తున్నారు. కాటన్ చీర ధర రూ. 2200, పట్టు చీర ధర రూ.6000 వరకు విక్రయిస్తున్నారు. ఈ చీరలను నేసేందుకు ఒక్కో మగ్గంపై ఒక్కో కార్మికుడు 15 రోజులు పనిచేస్తాడు. మగ్గంపై నేసిన దారాలకు రకరకాల రంగులద్ది ఎండబెడుతారు. అవి ఎండిన తరువాత సాంచాలలో మగ్గంపైకి చేర్చి చీరలు నేస్తారు. సన్నటి దారాలతో గొల్లభామ డిజైన్లు వేస్తారు. నేయడానికి కావాల్సిన సరుకులు దారాలు, రంగులు ముంబాయి నుంచి దిగుమతి చేసుకుంటారు.
విదేశాల్లోని ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శన..
గొల్లభామ చీరలకు చేనేత హస్తకళల పేరిట ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లలో విశేష గుర్తింపు లభిస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా... అమెరికా, లండన్‌లో జరిగిన ఎగ్జిబిషన్లలోనూ గొల్లభామ చీరలను ప్రదర్శించారు. ఇటీవల జపాన్ బృందం జరిపిన ఓ పరిశీలనలో ఈ చీరకు మంచి మార్కులు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 39వ స్థానంలో ఈ చీర ఉన్నట్లు తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపూర్‌తో పాటు ముంబయి, పుణే తదితర ప్రాంతాలలో గొల్లభామ చీరల ప్రత్యేకతను చాటుతూ మార్కెటింగ్ నిర్వహిస్తూ విక్రయాలు జరుపుతున్నారు.
ఆన్‌లైన్‌లో విక్రయాలు...
గొల్లభామ చీరలను మరింత విస్తృతంగా మార్కెటింగ్ చేసేందుకు చేనేత కార్మికుడు, గొల్లభామ చీరల తయారీదారుడు తుమ్మ గాలయ్య చిన్న కుమారుడు తుమ్మ ప్రవీణ్’ గొల్లభామ శారీస్ సిద్దిపేట్ వీవర్స్’ పేరిట ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసాడు. తద్వారా కొత్తగా నేసిన రంగురంగుల గొల్లభామ చీరలను ఆన్‌లైన్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నాడు. వాటిని చూస్తున్న పలువురు ప్రవీణ్‌ను కాంటాక్ట్ చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా మరిన్ని చీరల ఫొటోలను వారికి పంపిస్తాడు. నచ్చిన చీరలను సిద్దిపేటలోని చేపల మార్కెట్ వద్ద గల గొల్లభామ చీరలు విక్రయ కేంద్రంలో కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ముందే డబ్బులను అతడి బ్యాంక్ అకౌంట్‌లో వేస్తే కూడా చీరలను వారికి నేరుగా చేర్చుతాడు. సోషల్ మీడియా ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా గొల్లభామ చీరల ప్రత్యేకతను తెలుసుకున్న యువతులు, మహిళలు వాటిని కొనుగోలు చేసేందుకు సిద్దిపేటకు వస్తున్నారు.
పేటెంట్ హక్కులు సిద్దిపేటకే...
గొల్లభామ చీరల తయారీని ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు తామే చేసామని చెబుతుండడంతో సిద్దిపేట నేతన్నలు మండిపడ్డారు. 2009లో సిద్దిపేటకే గొల్లభామ చీరల తయారీకి పేటెంట్ హక్కులు కావాలని ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’లో నేతన్నలు నమోదు చేశారు. దాంతో గొల్లభామ చీరల తయారీలో సిద్దిపేటకు పేటెంట్ హక్కులను కల్పిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. అప్పటి నుంచి ఈ చీరల తయారీకి సిద్దిపేట కేరాఫ్‌గా మారింది. ‘‘గొల్లభామ చీరలకు ప్రపంచస్థాయిలో చోటు దక్కడం ఇక్కడి నేతన్నలకు దక్కిన గౌరవం. ప్రభుత్వం నేతన్నలు తయారు చేస్తున్న కేంద్రానికి వచ్చి నేరుగా కొనుగోలు చేస్తే మరింత న్యాయం చేసిన వారవుతారు. పేటెంట్ హక్కులు దక్కడంతో మా హక్కును గుర్తించినట్టయింది’’ అని గొల్లభామ చీర తయారీదారుడు తుమ్మ గాలయ్య అన్నారు.
సోషల్‌నెట్‌వర్క్‌తో విస్తరిస్తున్నాం...

-తుమ్మ ప్రవీణ్, గొల్లభామ చీరల తయారీదారుడు
సమంత రాకతో సందడి...

-పైడిపెల్లి అరుణ్‌కుమార్, సిద్దిపేట
ఫోటోలు: బాబూరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment