నిద్రలోనే శుభ్రం! నిద్రతోనే భద్రం!!

కంటి నిండా నిద్ర.. మెదడు నిండా జ్ఞాపకాలు.. 
ఈ రెంటి మధ్యా విడదీయరాని సంబంధం ఉందన్న విషయం తెలుసా మీకు? 
తగినంత నిద్ర లేకపోతే మదిలోని జ్ఞాపకాల నిధి చెల్లాచెదరైపోతుందని వైద్యపరిశోధనా రంగం ఎప్పుడో గ్రహించింది. అయితే నేటి ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న అతి తీవ్రమైన మతిమరుపు వ్యాధి ‘ఆల్జిమర్స్‌’కూ.. నిద్ర లేమికీ మధ్య కూడా గట్టి లంకే ఉందని గుర్తించటం తాజా విస్మయకర వాస్తవం.

ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో నిద్ర సమస్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఆల్జిమర్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్యా అనూహ్యంగా విస్తరిస్తోంది. మరి ఈ రెంటి మధ్యా సంబంధం ఏదైనా ఉందా? ఇదే అనుమానంతో శాస్త్రవేత్తలు తీగ లాగితే.. డొంక మొత్తం కదిలింది. నిద్ర లేమి వల్ల మానసిక సామర్ధ్యాలు తగ్గటమే కాదు.. ఆల్జిమర్స్‌ ముప్పు కూడా పొంచి ఉంటోందని గుర్తించారు. మరీ ముఖ్యంగా ఎవరికైనా ఇప్పుడు హాయిగా నిద్ర పడుతోందా? లేదా? అన్నది భవిష్యత్తులో వాళ్లకు ఆల్జిమర్స్‌ వచ్చే అవకాశం ఉందా? అన్నది చెప్పేందుకు కీలక సంకేతంగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిద్రకూ-జ్ఞాపకాలకూ; నిద్రకూ-మతిమరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి, వీటిని ఎలా చక్కదిద్దుకోవచ్చన్న దానిపై వైద్యరంగం లోతుగా పరిశోధనలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు... 



   ఆల్జిమర్స్‌.. ఆధునిక ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అతి పెద్ద సమస్య ఇది! జ్ఞాపకాలు చెరిగిపోతూ.. తీవ్రస్థాయి మతిమరుపు సమస్యలు ఆవహించి.. చెట్టంత మనుషులూ ఎందుకూ కొరగానివారై పోతుండటం దీని లక్షణం. సాధారణంగా 60-65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుందిగానీ.. ఇటీవలి కాలంలో దీని లక్షణాలు చాలా ముందుగానే మొదలవుతున్నాయని గుర్తించారు. ఒకసారి ఇది ఆరంభమైన తర్వాత సమస్య మరింతగా ముదరటమేగానీ.. తగ్గటమన్నది కష్టం. తొలి రోజుల్లో పేర్లు గుర్తుకురాకపోవటం, పదాల కోసం తడబడటం వంటి లక్షణాలతో ఆరంభమయ్యే ఈ వ్యాధి క్రమేపీ ముదిరి.. చివరికి తమ పనులు తాము కూడా చేసుకోలేని స్థితికి తీసుకువెళుతుంది. వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవటం, గతం గుర్తులేకపోవటం, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని, అసలు తాము ఎక్కడున్నామో, ఇంట్లో ఏ గది ఎక్కడుందో కూడా మర్చిపోయే స్థితికి దారి తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 4.4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రజల సగటు ఆయుర్దాయం, దాంతో పాటే వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆల్జిమర్స్‌ బాధితుల సంఖ్యా విస్తరించిపోతోంది. ఇన్నేళ్లుగా అసలీ సమస్యకు మూలం ఏమిటో, ఈ బాధితుల సంఖ్య ఎందుకు పెరుగుతోందో, దీనికి కచ్చితమైన కారణాలేమిటో ఎవరికీ తెలియరావటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ చిక్కుముడి వీడుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కేవలం వృద్ధుల సంఖ్య పెరుగుతుండటమే కాదు, ప్రజల నిద్రా సమయం తగ్గిపోతుండటం కూడా ఒక ముఖ్య కారణం కావొచ్చని పరిశోధకులు నిర్ధ´రణకు వస్తున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ గాఢమైన నిద్ర అన్నది తగ్గిపోతుంది. మన నిద్రలో కనుగుడ్లు వేగంగా కదులుతుండే గాఢమైన నిద్రా దశ ఒకటి ఉంటుంది. దీన్ని రెమ్‌ (ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌) దశ అంటారు. అలాగే కనుగుడ్లు కదలకుండా, నిద్ర గాఢంగా ఉండే దశ కూడా ఉంటుంది, దీన్ని ‘నాన్‌ రెమ్‌’ దశ అంటారు. తాజా అనుభవాలు, ఇటీవలి సంఘటనలన్నీ మెదడులో నిక్షిప్తమై, జ్ఞాపకాలుగా స్థిరపడేది ఈ ‘నాన్‌ రెమ్‌’ దశ నిద్రా సమయంలోనే. అందుకే జ్ఞాపకాలు, ధారణ శక్తి మెరుగ్గా ఉండాలంటే నిద్ర బాగుండాలి, ముఖ్యంగా ఈ నాన్‌ రెమ్‌ దశ నిద్ర తప్పనిసరిగా బాగుండాలి. ఆల్జిమర్స్‌ బాధితుల్లో ఈ గాఢమైన నిద్రా దశే సరిగా ఉండటం లేదు. ఆల్జిమర్స్‌ లక్షణాలు మొదలవటానికి చాలా కాలం ముందే ఈ గాఢ నిద్ర దెబ్బతినటమనేది జరుగుతోందని, కాబట్టి నిద్ర దెబ్బతినటాన్ని ఆల్జిమర్స్‌కు ముందస్తు సంకేతంగా భావించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరో రకంగా చూస్తే గాఢ నిద్ర సరిగా లేకపోవటం వల్లనే ఆల్జిమర్స్‌ ముదురుతుండొచ్చు కూడా! అందుకే ఇప్పుడు పరిశోధకులు ఈ నిద్ర గురించీ, ఆల్జిమర్స్‌ లక్షణాల గురించీ లోలోతుగా పరిశోధిస్తున్నారు.


నిద్ర ఎంత తగ్గితే ముప్పు అంత ఎక్కువ! 

జీవిత కాలంలో మనం ఎంత తక్కువగా నిద్రపోతే.. ఆల్జిమర్స్‌ ముప్పు అంత ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగాల రీత్యా నిద్ర లేకుండా రేయింబవళ్లు పని చేసేవాళ్లు, గురక వంటి ఇతరత్రా సమస్యల కారణంగా సరిగా నిద్రపోలేని వాళ్లు, నిద్రలేమితో బాధపడేవాళ్లు.. వీరంతా సమస్యలను చక్క దిద్దుకోవటం ద్వారా ఆల్జిమర్స్‌ ముప్పును కొంత వరకూ నివారించుకునే వీలుంటుంది. ఈ సమస్యలకు చికిత్స తీసుకోవటం ద్వారా జ్ఞాపకాలు పదిలమవటం, విషయ గ్రహణ శక్తి మెరుగుపడటమే కాదు, ఆల్జిమర్స్‌ వంటి మతిమరుపు వ్యాధుల ముప్పును కొన్ని దశాబ్దాల పాటు వాయిదా వేసుకోవచ్చని స్పష్టంగా గుర్తించారు. పెద్దలందరికీ కనీసం 7 నుంచి 9 గంటల రాత్రి నిద్ర అవసరమని అమెరికా ‘నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌’ సిఫార్సు చేస్తోంది. చాలామంది వృద్ధులకు నిద్ర అంత ఎక్కువగా ఉండదని భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఏ వయసు వారికైనా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా అంతా చెప్పే సూత్రం ఒకటుంది. రాత్రంతా హాయిగా నిద్రపోయి.. ఉదయం ఎవరూ లేపాల్సిన అవసరం లేకుండా, అలారం పెట్టుకోవాల్సిన పని లేకుండా నిద్ర లేస్తున్నారంటే.. నిద్ర సరిపోతోందనే అనుకోవచ్చు!


మెదడులో విషతుల్యం.. ఆల్జిమర్స్‌కు అదే మూలం! 

మెదడులోని నాడీకణాల మధ్య ‘బీటా అమైలాయిడ్‌’ అనే విషతుల్య ప్రోటీను పేరుకుపోతుండటం ఆల్జిమర్స్‌కు మూలం. ఈ ప్రోటీను నాడీ కణాల మధ్య సమాచార ప్రసారాన్ని అడ్డుకుంటూ, అంతిమంగా అవి క్షీణించేలా చేస్తోంది. అయితే ఈ అమైలాయిడ్‌ మెదడులోని కొన్ని ప్రాంతాల్లోనే పేరుకుంటోంది. ముఖ్యంగా మన నుదురు భాగానికి వెనకాలే ఉండే ‘ఫాల లంబిక’లో ఎక్కువగా చేరిపోతోంది. గాఢమైన నాన్‌ రెమ్‌ నిద్రకూ ఈ నుదుటి వెనకాల ఉండే ఫాల లంబికే మూలం. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై మరిన్ని అధ్యయనాలు చేసి, చివరికి గుర్తించిందేమంటే- ఫాల లంబికలో ఎవరికి అమైలాయిడ్‌ విషతుల్యాలు ఎక్కువగా పేరుకుని ఉన్నాయో.. వాళ్లలో గాఢ నిద్ర లేకపోవటమన్న సమస్య చాలా అధికం. ఆల్జిమర్స్‌కూ, గాఢ నిద్రకూ- రెంటికీ అమైలాయిడ్‌ విషతుల్య ప్రోటీను పేరుకుపోవటం కీలకమని స్పష్టంగా నిర్ధ´రణకు వచ్చారు.


నిద్ర - మెదడులో ప్రోటీను - జ్ఞాపకాలు 
వీటి మధ్య ఏమిటి లింకు?

మన తాజా అనుభవాలన్నీ.. గాఢ నిద్రా సమయమైన ‘నాన్‌ రెమ్‌’ దశలోనే మెదడులో జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతాయి. దీన్నే సులభంగా చెప్పుకోవాలంటే మనం రోజంతా కంప్యూటర్‌ మీద పని చేస్తూ చేస్తూ.. మధ్యలో ‘సేవ్‌’ బటన్‌ నొక్కటం లాంటిది ఈ నాన్‌రెమ్‌ దశ. దాంతో అప్పటి వరకూ చేసిన పని అంతా ‘సేవ్‌’ అవతుంది. మెదడులో విషతుల్య ప్రోటీను ఎక్కువగా పేరుకున్న ఆల్జిమర్స్‌ బాధితుల్లో ఈ నాన్‌రెమ్‌ దశ సరిగా ఉండటం లేదు. దీంతో వీరిలో తాజా జ్ఞాపకాలూ సుస్థిరంగా నిక్షిప్తం కావటమన్నదీ సరిగా జరగటం లేదు. అమైలాయిడ్‌ ప్రోటీను ఎక్కువగా పేరుకుని ఉన్న వాళ్లలోనే గాఢ నిద్ర సరిగా లేకపోవటమన్నదీ తీవ్రంగా ఉంటోంది. దీంతో రాత్రికి రాత్రే వాళ్లు చాలా విషయాలను మర్చిపోతున్నారు. కాబట్టి పరిశోధకులు మరో అడుగు ముందుకు వేసి.. ఈ ప్రోటీను ఎక్కువగా పేరుకుపోవటానికి కారణం ఏమిటన్నది అన్వేషించారు. సరైన నిద్ర లేకపోవటం వల్లనే ఈ ప్రోటీను ఎక్కువగా పేరుకుంటోందా? అన్న దిశగా శోధించారు. ఇక్కడే కీలకం దొరికింది. మెదడు నుంచి వ్యర్ధ రసాయనాలను, విషతుల్యాలను బయటకు పంపించేసేందుకు నాడీకణాల మధ్యనే ‘గ్లింఫాటిక్‌ సిస్టమ్‌’ అనే వ్యవస్థ ఒకటి ఉందని న్యూయార్క్‌లోని రోచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకుడు మైకెన్‌ నెదర్‌గార్డ్‌ గుర్తించారు. ఈ వ్యవస్థ మొత్తం- గాఢ నిద్రా దశలోనే చురుకుగా తయారై.. మెదడును, నాడీకణాలను శుభ్రం చేసేస్తోంది. మనందరం రాత్రిపూట ఇళ్లలో ఆదమరిచి నిద్రపోతున్న సమయంలోనే... పారిశుద్ధ్య కార్మికులంతా రోడ్ల మీదకు వచ్చి.. రాత్రికి రాత్రే వూరంతా వూడ్చి శుభ్రం చేస్తుంటారు. మన మెదడులోని గ్లింఫాటిక్‌ వ్యవస్థ కూడా రాత్రిపూట మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే చురుకుగా తయారై మెదడు నుంచి వ్యర్థ రసాయనాలన్నింటినీ బయటకు కడిగేస్తోంది. ఇవన్నీ మెదడు, వెన్ను చుట్టూ ఉండే ద్రవం (సీఎస్‌ఎఫ్‌) ద్వారా మెదడు నుంచి బయటకు కొట్టుకొచ్చేస్తున్నాయి. నాడీ కణాల మధ్య పేరుకుపోయి, ఆల్జిమర్స్‌ వ్యాధికి కారణమయ్యే అమైలాయిడ్‌ ప్రోటీను కూడా- ఇలా నిద్రా సమయంలో మెదడును శుభ్రం చేసే క్రమంలో బయటకు వచ్చేయాల్సిన రసాయనమే. కాకపోతే మనం సరిగా నిద్ర పోనప్పుడు లేదా తగినంత నిద్ర పోనప్పుడు- ఈ మెదడులో శుభ్రతా కార్యక్రమం కుంటుపడిపోయి, అమైలాయిడ్‌ ప్రోటీను ఎక్కువగా పేరుకుపోతోంది... ఆల్జిమర్స్‌ లక్షణాలు ఆరంభమవుతున్నాయి! కాబట్టి తగినంత నిద్రపోవటమన్నది మెదడు పరిశుభ్రమవటానికి, మెదడులో ‘స్వచ్ఛభారత్‌’ సమర్థంగా జరగటానికి.. తద్వారా ఆల్జిమర్స్‌ రాకుండా నివారించుకోవటానికి చాలా కీలకమని విస్పష్టంగా వెల్లడైంది.

నిదురించే మెదడులో స్వచ్ఛ భారత్‌!

మనం రాత్రిపూట ఇళ్లలో ఆదమరిచి నిద్రపోతున్న సమయంలోనే... పారిశుద్ధ్య కార్మికులంతా రోడ్ల మీదకు వచ్చి.. రాత్రికి రాత్రే వూరంతా వూడ్చి శుభ్రం చేసేస్తుంటారు. మన మెదడులోని గ్లింఫాటిక్‌ వ్యవస్థ కూడా రాత్రిపూట మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే చురుకుగా తయారై మెదడు నుంచి వ్యర్థ రసాయనాలన్నింటినీ బయటకు కడిగేస్తోంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment