మరణంలోనూ మహాదానం!
నలుగురు కూచుని నవ్వే వేళల నాపేరొక తరి తలవండి... అంటుంది గురజాడవారి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. తాను ఈ లోకాన్ని వీడివెళ్లిపోయినా తన గురించి కొందరైనా తలచుకోవాలనీ నాలుగు మంచి మాటలు చెప్పుకోవాలనీ ఆశించడం మనిషి సహజ స్వభావం. అందుకు ఏ సంపదా అక్కర్లేదు. ఏ త్యాగాలూ చేయనక్కర్లేదు. ప్రాణం పోయాక మట్టిపాలయ్యే ఈ భౌతిక కాయాన్ని వైద్యులకు అప్పగిస్తే చాలు. కనీసం ఎనిమిది మంది మన పేరు చెప్పుకుని మరో పదికాలాలు చల్లగా బతుకుతారు. ఆ రకంగా, మరణానంతరం కూడా జీవించి ఉండే అవకాశాన్నిస్తుంది... అవయవదానం.క్కసారిగా టీవీలన్నీ బ్రేకింగ్‌ న్యూస్‌ వేస్తుంటాయి.
విమానాశ్రయం నుంచి ఫలానా ఆస్పత్రి వరకూ గ్రీన్‌ఛానల్‌ ప్రకటించారనీ, బెంగళూరు నుంచి విమానంలో గుండెను తెచ్చిహైదరాబాదులోని రోగికి అమరుస్తారనీ హడావుడిగా వార్తలు చెబుతుంటారు. పోలీసులు దడికట్టి ఖాళీగా ఉంచిన రోడ్డుమీద అంబులెన్సు రయ్యిన దూసుకుపోతుంది. దాంట్లోనుంచి వైద్యసిబ్బంది పరుగు పరుగున పెట్టెని మోసుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్తారు. ఆ దృశ్యాల్ని ఉత్కంఠగా చూస్తాం. ఎక్కడో ఓ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే అతడి గుండెను తీసి మరెక్కడో ఉన్న రోగికి పెడతారట... అంటూ ఆశ్చర్యంగా చెప్పుకుంటాం.
ఆ గుండె ఎవరిది? మరొకరికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎలా తీస్తారు? అసలు అవయవాలు దానం చేయడం ఏమిటి? ఏ అవయవాలు దానం చేయవచ్చు? సవాలక్ష సందేహాలు! ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోగలిగితే మట్టిలో కలిసిపోయే ఈ శరీరంలో ఎన్ని అమూల్యమైన అవయవాలున్నాయో తెలుస్తుంది. అవి ఎంతమంది ప్రాణాలు నిలబెడతాయో అర్థమవుతుంది. నిండు జీవితం జీవించి తనువు చాలించాక కూడా మరికొందరి ఆరోగ్య సమస్యలు
తీర్చగల గొప్ప సంపద ఈ శరీరంలో ఉందని స్పష్టమవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికీ అవయవదాత అవ్వాలనిపిస్తుంది!
ఒక్కరి వల్ల ఎనిమిది మంది...
జీవనశైలి వ్యాధులు ముప్పిరిగొంటున్న ఈరోజుల్లో వాటి ప్రభావం గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయంలాంటి కీలక అవయవాలపై పడుతోంది. వాటిల్లో ఏ అవయవమైనా  మరమ్మతు చేయలేనంతగా పాడైపోతే దాని స్థానంలో ఆరోగ్యకరమైన అవయవాన్ని అమర్చడమే ప్రస్తుతం వైద్యుల ముందున్న ప్రత్యామ్నాయం. ఇవే కాదు, గుండె కవాటాలు, కళ్లు, ఎముక, ఎముకలోని మూలుగ, చిన్నపేగులు, చర్మకణజాలం తదితరాలనూ దాతలనుంచి స్వీకరించి అవసరమైనవారికి ఉపయోగిస్తారు. అందుకే అవయవదాతలు కావాలి. ఒక్క దాత నుంచి తీసుకున్న అవయవాలతో ఎనిమిది మందికి ఆరోగ్యకరమైన కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. కణజాలంతో మరో 50 మంది ఆరోగ్య
సమస్యలనూ పరిష్కరించవచ్చు. ఇలా అవయవదానం స్వీకరించినవారి జీవిత కాలం తేలిగ్గా రెండు దశాబ్దాలు అంతకన్నా ఎక్కువగానూ పెరుగుతుంది.
అండగా ‘జీవన్‌దాన్‌’
సౌజన్యకి చŸదువంటే చాలా ఇష్టం. బీఫార్మసీలో చేరింది. రెండో సంవత్సరంలో ఉండగా ఉన్నట్టుండి మొదలైన జ్వరం ఎంతకీ తగ్గలేదు. మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షలన్నీ చేసి మూత్రపిండాలు రెండూ చెడిపోయాయన్నారు. తల్లిదండ్రులకు అది పిడుగుపాటే అయింది. తమ గారాల చిన్నకూతురు, ‘పెద్ద ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాన్నా’- అనే తమ సౌజన్యకి... ఇంత పెద్ద శిక్షేమిటో అర్థం కాలేదు వారికి. తమ ధైర్యం సడలకుండా చూసుకోవడమూ ఆమెకు ధైర్యం చెప్పడమూ వారికి కత్తి మీద సామే అయ్యేది. క్రమం తప్పకుండా డయాలిసిస్‌ చికిత్స చేయించేవారు. ఒకటీ రెండూ కాదు, దాదాపు ఏడేళ్లు. ఓపక్క బిడ్డ అనుభవిస్తున్న నరకాన్ని చూస్తూ, మరో పక్క అగమ్యగోచరంగా కన్పిస్తున్న భవిష్యత్తును తలచుకుని ఆ తల్లిదండ్రులు పడ్డ నరకయాతన ఇంతా అంతా కాదు. అప్పుడు ఎవరి ద్వారానో తెలిసింది జీవన్‌దాన్‌ పథకం గురించి. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి ఆమె పేరు నమోదుచేయించారు. కిడ్నీ అందుబాటులో ఉందన్న సమాచారం రాగానే వారి ఆనందానికి అవధుల్లేవు. ఇటీవలే కిడ్నీమార్పిడి ఆపరేషన్‌ చేసి దాత నుంచి తీసుకున్న కిడ్నీని సౌజన్యకు అమర్చారు. ఆమె కోలుకుంటోంది. చదువు కొనసాగించి తన కాళ్లపై తాను నిలబడతానని ధైర్యంగా చెబుతున్న సౌజన్యని కళ్ల నిండుగా చూసుకుంటున్నారు అమ్మానాన్నలు.
సౌజన్యలాంటి వారి అవసరాలు తీరాలంటే ఎవరైనా అవయవాలు దానం చేయాలి. ఎవరు చేస్తారు? దానికి సమాధానమూ‘జీవన్‌దాన్‌’ దగ్గరే ఉంది.
పన్నెండేళ్ల రూప్‌కుమార్‌ ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఓరోజు బడిలో ఎగిరి దూకుతూ పట్టుతప్పి పడిపోయాడు. తలకు బల్ల గట్టిగా కొట్టుకుంది. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడులో తీవ్రంగా రక్తస్రావం అయిందంటూ బ్రెయిన్‌డెడ్‌ అన్నారు డాక్టర్లు. బాధను దిగమింగుకుని అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రులు మరో నలుగురిలో తమ బిడ్డ బతికే ఉన్నాడని తృప్తిపడుతున్నారు.
రెండు మూత్రపిండాలూ చెడిపోయి బాధపడుతున్నాడు భర్త. దాతల కోసం వేచి చూస్తే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని భావించిన భార్య తన మూత్రపిండాన్నే భర్తకు దానం చేసింది.
నిమ్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలోని జీవన్‌దాన్‌ కార్యాలయానికి వెళ్తే ఇలాంటి గాథలెన్నో విన్పిస్తాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమైన జీవన్‌దాన్‌ పథకం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా పనిచేస్తూ ఎందరికో కొత్త జీవితాన్నిస్తోంది.జీవించి ఉండగానూ, మరణించిన తర్వాతా... రెండు రకాలుగా అవయవదానం చేయవచ్చు. మూత్రపిండాలు రెండు ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఒకటి తీసి అవసరమైన మరొకరికి పెట్టవచ్చు. అలాగే కాలేయంలో కొంత భాగం కూడా మరొకరి కోసం దానం చేయవచ్చు. కానీ ఎక్కువగా అవయవదానం జరిగేది మరణించాక- అంటే బ్రెయిన్‌డెత్‌ సందర్భాల్లో. చాలావరకూ రోడ్డు ప్రమాదాల్లో, కొన్నిరకాల అనారోగ్యాల్లో, ఉరివేసుకోవడం లాంటివి జరిగినప్పుడూ మొదట మెదడు దెబ్బతింటుంది. అది తీవ్రంగా దెబ్బతిని ఇక కోలుకునే అవకాశం లేని పరిస్థితిని బ్రెయిన్‌ డెత్‌ అంటారు. ఆ పరిస్థితిలో వైద్య పర్యవేక్షణలో కృత్రిమశ్వాస అందిస్తే శరీరంలోని మిగతా అవయవాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కుటుంబసభ్యులు అనుమతిస్తే వాటిని తీసి ఇతరులకు అమరుస్తారు. సహజ మరణం తర్వాత కూడా కళ్లూ ఇతర కణజాలాన్ని దానం చేయవచ్చు.
అవగాహన పెరగాలి!
మనదేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాల్లోనే బ్రెయిన్‌ డెడ్‌ కేసులు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారి కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరిస్తే- అవయవాల కొరత సగానికి సగం తీరుతుంది. చాలా దేశాల్లో బ్రెయిన్‌డెడ్‌ కేసుల్లో ఆ శరీరాలపై సర్వహక్కులూ ప్రభుత్వాలవే. కుటుంబసభ్యుల అనుమతితో నిమిత్తం లేకుండా అవయవాలను స్వీకరించి అవసరమైనవారికి అమరుస్తారు. దాంతో అవయవమార్పిడి శస్త్రచికిత్సలు అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశంలో కుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి. కాబట్టి డోనార్‌ కార్డులు తీసుకున్నవాళ్లు ఆ విషయం సన్నిహితులకు చెప్పాలి. ప్రాణం పోయాక వృథాగా అగ్నికి ఆహుతయ్యే లేదా మట్టిలో కలిసిపోయే శరీరానికి మరొకరి ప్రాణాలు నిలపడానికి మించిన సార్థకత ఏముంటుంది? ఆ అవగాహన ప్రజల్లో తీసుకురావడానికి పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ కృషి చేస్తున్నాయి. ఏటా ఆగస్టు 13న ఆర్గాన్‌ డొనేషన్‌ డే నిర్వహిస్తున్నాయి.
అవయవదానానికి సంబంధించిన వివరాలను తెలిపే వెబ్‌సైట్లు చాలానే ఉన్నాయి. మోహన్‌ ఫౌండేషన్‌, కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌, రాష్ట్ర ప్రభుత్వాల జీవన్‌దాన్‌ వెబ్‌సైట్లూ; శతాయు, గిఫ్ట్‌యువర్‌ఆర్గాన్‌, గిఫ్ట్‌ఎలైఫ్‌ లాంటి వెబ్సైట్లూ అవయవదానం చేయాలనుకునేవారిని ప్రోత్సహిస్తున్నాయి. వీటిద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫారం నింపి డోనార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించి తలెత్తే సందేహాలన్నిటికీ సమాధానాలూ, అవయవదానానికి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన చట్టాలూ తదితర సమాచారమంతా వీటిల్లో ఉంది. దాతలుగా నమోదు చేసుకోవడానికి మోహన్‌ ఫౌండేషన్‌ ఈ-డోనార్‌ కార్డ్‌ అనే మొబైల్‌ ఆప్‌నీ విడుదల చేసింది.
మార్పు తేవచ్చు!
అవయవదానం గురించి సమాజంలో అవగాహన పెంచడానికి మోహన్‌ ఫౌండేషన్‌ సంస్థ అన్ని నగరాల్లో, పట్టణాల్లో కార్యకర్తలకు శిక్షణ ఇస్తోంది. ‘ఏంజెల్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ అనే ఈ శిక్షణలో అవయవదానం గురించి అన్ని కోణాల్లో వివరిస్తారు. వైద్య నిపుణుల సహాయంతో సందేహాలను తీరుస్తారు. దాతల, స్వీకర్తల కుటుంబాలతో మాట్లాడిస్తారు. ఈ శిక్షణ పొందిన వలంటీర్లే అవయవమార్పిడి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులకు సున్నితంగా వివరించి అవయవదానానికి సానుకూల వాతావరణం కల్పిస్తారు.జీవన్‌దాన్‌ పథకం ద్వారా కూడా పెద్ద ఆస్పత్రులన్నిట్లోనూ వైద్యసిబ్బందికే ఈ శిక్షణ ఇస్తున్నారు. దాంతో క్రమంగా అవగాహన పెరుగుతోంది. అవయవదానానికి ముందుకొస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. సంపాదించినవో, వారసత్వంగా వచ్చినవో ఎంతో కొంత ఆస్తులంటూ ఉంటే వాటిని మరికాస్త పెంచి పదిలంగా వారసులకు అప్పగిస్తాం. మరి శరీరం విషయంలో మాత్రం ఈ అలసత్వం ఎందుకు? కుళ్లి కృశించి మట్టిలో కలిసిపోయే కళేబరంలో అన్ని అవయవాలూ ఉంటేనేం, లేకపోతేనేం? అందుకే అవసరమైనవి తీసి ఆపన్నులకు ఇవ్వమని వీలునామా రాసిపెట్టాలి. అవయవదానమనే మహాదాన క్రతువులో అందరూ భాగస్వాములు కావాలి.  
*  *  * *  *  * *  *  * *  
ఒక కోటీశ్వరుడు కోట్ల రూపాయల ఖరీదు చేసే తన కారుకి ఫలానా రోజున అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు పేపర్లో ప్రకటన వేశాడు. ఆ కారంటే తనకి చాలా ఇష్టమనీ తాను పోయిన తర్వాత కూడా ఆ కారు తనకే చెందాలి కాబట్టి అంత్యక్రియలు చేస్తున్నాననీ రాశాడు. కారుకి అంత్యక్రియలేమిటని ఆశ్చర్యపోయిన జనాలు ఆ తంతు చూడడానికి గుమికూడారు. కారు పట్టేలా అక్కడ ఓ పెద్ద గొయ్యి తవ్వి ఉంది.
ఇంతలో కారులో కోటీశ్వరుడు వచ్చాడు. మిలమిలా మెరిసిపోతున్న ఆ ఖరీదైన కారుని మట్టిలో పాతిపెట్టబోతున్నారంటే అక్కడ చేరినవారందరికీ మనసు చివుక్కుమంది. కొందరైతే ఆగ్రహంతో ఆయన మీద పోట్లాటకు వెళ్లారు.
‘ఇంత విలువైన కారుని పాతిపెట్టడానికి మీకు మనసెట్లా ఒప్పుతోంది. ఎవరికైనా ఇస్తే వాడుకుంటారు కదా. అమ్మితే వచ్చిన డబ్బుతో ఎందరి ఆకలో తీర్చవచ్చు కదా. మీరు చచ్చిపోయాక కారు ఏమైతే మీకెందుకు? మరీ ఇంత మూర్ఖత్వమా?’ అంటూ నిలదీశారు. దానికి ఆయన ఇలా చెప్పాడు.
‘నిజమే. ఖరీదైన కారుని మట్టిపాలు చేస్తున్నానని మీకు కోపం వచ్చింది. కారుదేముంది, కోటి రూపాయలు పెడితే వస్తుంది. నాకు గుండె కావాలి, పది కోట్లిస్తాను ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా! ఖరీదు కట్టలేని అలాంటి విలువైన అవయవాలనెన్నిటినో చనిపోయిన మనిషితో పాటు పాతిపెట్టేస్తున్నాం... తగలబెట్టేస్తున్నాం... అప్పుడు ఎవరూ ఇలా ప్రశ్నించరేం?’
ఆ ప్రశ్న విని వారంతా తెల్లబోయారు. ‘కారు మీద ప్రేమతోనో, మూర్ఖత్వంతోనో నేనీ పని చేయాలనుకోలేదు. అవయవదానం విలువ మీకు గుర్తుచేయాలనే ఇదంతా చేశాను. ఇప్పటికైనా ఆలోచించండి. అవయవదాతలు కండి...’ అని చెప్పి ఆయన కారు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.
అవయవదానపత్రం ఎప్పుడు రాస్తున్నారు మరి?
ఇవన్నీ అపోహలే!  
వయవదానంపై చాలామందికి ఎన్నో సందేహాలు, రకరకాల అభిప్రాయాలు. వాటిల్లో చాలావరకూ అపోహలే అంటున్నారు నిపుణులు. అలాంటి కొన్ని అభిప్రాయాలు...
అవయవదానం చేయడానికి అంగీకరిస్తే డాక్టర్లు సరిగా చికిత్స చేయరేమో.
- ఏ వైద్యుడికైనా ఎదురుగా ఉన్న రోగి ప్రాణాలు నిలపడమనేది ప్రథమ కర్తవ్యం. ప్రాణాలు కాపాడడం అసాధ్యమని నూటికి నూరుశాతం నిర్ధారించాకే అవయవదానం చేయొచ్చన్న ప్రస్తావన వస్తుంది. పైగా బ్రెయిన్‌ డెడ్‌ కేసుల్లో అవయవదానం చేసేవారికి మరిన్ని పరీక్షలు అదనంగా చేస్తారు. ఏ కోశానా బతికే అవకాశం లేదని నిర్ధారించుకునేవరకూ బ్రెయిన్‌ డెడ్‌ అని ప్రకటించరు. అలా నిర్ధారించడానికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో సహా కనీసం నలుగురు డాక్టర్ల కమిటీ ఉంటుంది.
మతం అంగీకరించదేమో!
- ఏ మతమూ అవయవదానాన్ని తప్పనదు. మరొకరికి ప్రాణదానం చేసే మంచి కార్యాన్ని ఎవరు మాత్రం తప్పు పని అంటారు. అయినా సందేహంగా ఉన్నవారు తమ మత పెద్దలతో ఒకసారి చర్చించాకే నిర్ణయం తీసుకోవచ్చు.
మైనర్లు కూడా అవయవదానం చేయవచ్చా?
- చేయొచ్చు. అయితే అందుకు వారి తల్లిదండ్రుల అనుమతి కావాలి. చాలామంది పిల్లలకూ అవయవాల మార్పిడి అవసరం ఉంటుంది. వారికి పెద్దల అవయవాల కన్నా పిల్లలవే సరిపోతాయి.
అవయవాలు తొలగించడం వల్ల శరీరం ఆకృతి పాడైపోయి చివరిచూపుకోసం వచ్చిన ఆత్మీయులు బాధపడతారేమో!
- అవయవాలను శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. వాటిని తీయడం వల్ల ఆకృతిలో ఎలాంటి మార్పూ ఉండదు. పలుచని చర్మకణజాలాన్ని వీపు తదితర పైకి కన్పించని ప్రాంతాలనుంచి తీస్తారు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.
వృద్ధుల అవయవాలు పనికిరాకపోవచ్చు.
- అవయవదానానికి వయోపరిమితి అంటూ లేదు. రోజుల వయసు పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధులవరకూ ఎవరైనా చేయొచ్చు.
ఎలాంటి సమస్యలూ లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారే అవయవాలు దానం చేయాలి.
- ఇదీ అపోహే. చిన్నా చితకా ఆరోగ్య సమస్యలున్నా వాటివల్ల అవయవాలు చెడిపోవు. ఎయిడ్స్‌, హెపటైటిస్‌ లాంటివి ఉంటే తప్ప మిగిలినవారెవరైనా అవయవదాతలు కావచ్చు.
అవయవాలు తీసేసిన శరీరానికి అంత్యక్రియలు నిర్వహిస్తే వచ్చే జన్మలో ఆ అవయవాలు లేకుండా పుడతానేమో!
- అవయవ మార్పిడి ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రక్రియ. కానీ శారీరక వైకల్యం అనేది మానవజాతి మొదలైనప్పటినుంచీ ఉంది. దీనివల్లే ఆ పరిస్థితి వస్తుందనుకోవడం అపోహే.
డబ్బూ పలుకుబడీ ఉన్నవాళ్లే ముందుగా అవయవాలు పొందుతారేమో. న్యాయంగా పేదలకు నా అవయవాలు దక్కుతాయన్న గ్యారంటీ ఏమిటి?
- ఈ చికిత్స చేసేటప్పుడు రోగి పరిస్థితీ అనారోగ్య తీవ్రతల గురించి ఆలోచిస్తారే తప్ప ఆర్థిక స్థితి గురించి వైద్యులు ఆలోచించరు. స్వీకర్తలందరూ ఆస్పత్రిలో నమోదుచేసుకున్నవారై ఉంటారు. ఎవరికి అత్యవసరంగా అవయవమార్పిడి చేయాలో చూసి వారికే చేస్తారు. ఇతర విషయాలు ఆలోచించరు.
అవయవదానం చేస్తే నా కుటుంబం డబ్బు కట్టాల్సి ఉంటుందేమో!
- అస్సలు కట్టక్కర్లేదు. ప్రాణాలు నిలపడానికి చివరివరకూ చేసిన ప్రయత్నాలకు మాత్రమే ఆస్పత్రి బిల్లు కట్టాల్సి ఉంటుంది. చాలామందికి అది తెలియక అవయవదానం చేసినందుకు కూడా డబ్బు తీసుకుంటున్నారని అనుకుంటారు. ఇక జీవించే అవకాశం ఏ కోశానా లేదని తేలాక రూపాయి కూడా రోగి కుటుంబం నుంచి తీసుకోరు.
ఇది వ్యాపారంగా మారిపోతుందేమో!
- మానవ అవయవాల మార్పిడి గురించి నిర్దిష్టమైన చట్టాలున్నాయి. అవయవ మార్పిడిని దుర్వినియోగం చేసినవారు ఆ చట్టాల కింద కఠినశిక్షలకు అర్హులు.
ఎంత తేడానో!  
వసరానికీ అందుబాటులో ఉన్న అవయవాలకీ మధ్య విపరీతమైన తేడా ఉంది మన దేశంలో. ఆ పరిస్థితిని అంకెల్లో పెడితే...
అవసరమైన అవయవాలు అందుబాటులో లేక ఏటా ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
2లక్షల 20 వేల మంది మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తుండగా 15 వేల మూత్రపిండాలు మాత్రమే లభిస్తున్నాయి.
లక్ష మంది కాలేయ జబ్బులతో మరణిస్తున్నారు. కేవలం వెయ్యి మందికే కాలేయం దొరుకుతోంది.
కళ్ల కోసం 10 లక్షల మంది, గుండె మార్పిడి కోసం 50వేల మంది, ఊపిరితిత్తుల కోసం 20 వేల మంది వేచి చూస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గత ఎనిమిదేళ్లలో మొత్తం అన్ని రకాల అవయవమార్పిడి ఆపరేషన్లూ కలిసి 2216 మాత్రమే జరిగాయి. అయితే ఏటికేడాదీ ఇవి పెరగడం సానుకూలాంశం. 2010లో ఒకే ఒక గుండెమార్పిడి జరగ్గా 2017లో 32 జరిగాయి. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లు 46 నుంచి 221కి పెరిగాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి జులై 24 వరకు జరిగిన అవయవమార్పిడి శస్త్రచికిత్సలు మొత్తం 351.
వీరిని సంప్రదించవచ్చు!
వయవ మార్పిడి అవసరమైనవారు జీవన్‌దాన్‌ కార్యాలయాల్లో తమ వివరాలను నమోదుచేయించుకోవాలి. అలాగే అవయవదాతల సమాచారమూ వివిధ ఆస్పత్రుల ద్వారా వారికి చేరుతుంది. అందుబాటులో ఉన్న అవయవాలను బట్టి అవసరమైనవారికి సమాచారం ఇచ్చి వెంటనే శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పిస్తారు. ఉస్మానియా, గాంధీ లాంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఆరోగ్యశ్రీ కింద అవయవమార్పిడి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అవయవదానానికి సంబంధించిన సమాచారం కోసం జీవన్‌దాన్‌ పథకానికి చెందిన ఈ కింది నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.
తెలంగాణ: 9603944026, 8885060092 
ఆంధ్రప్రదేశ్‌: టోల్‌ఫ్రీ నంబరు: 1800 4256 4444


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment