మౌనం ఒక మంత్రం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం! 
మన్త్ర మౌషధ సంగమం! 
దాన మా నావ మానాశ్చ! 
నవ గోప్యా మనీషిభిః

ఆయువు, ధనం, గృహకలహాలు, మంత్రం, ఔషధం, సాంసారికమైన సంగమం, దానం, మౌనం, అవమానం... వీటి విషయంలో మౌనం పాటించాలి. అంటే ఇతరులకు వెల్లడించకుండా ఉండాలని భావం. అప్పుడు మనిషి సుఖంగా జీవించవచ్చని శాస్త్రవచనం.

మాట, మౌనం మానవ జీవితంలో మాత్రమే కనిపించే రెండు అద్భుత దశలు.


పెద్దలు మాటను రజతం... మౌనాన్ని స్వర్ణం అని విశ్లేషించారు. అర్థవంతమైన, ప్రయోజనకారి అయిన మాట వల్ల పరమార్థం సిద్ధిస్తుంది. అర్థరహితమైన, అసందర్భమైన మాట కంటే మౌనమే మేలని చెబుతారు. జీవితంలో మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మౌనంగా ఉన్నప్పుడే చేతులు దక్షతను ప్రదర్శిస్తాయి. పనులను బాగా చేయగలుగుతాయి. మాటలు తగ్గించి, మనసును లక్ష్యంపై పెడితే పనిలో ఏకాగ్రత కుదురుతుంది. నోరు మాట్లాడకుండా ఉన్నప్పుడే హృదయం మాట్లాడుతుందని నానుడి. మన వేదాలు, పురాణాలు కూడా మౌనం ప్రాధాన్యాన్ని వివరించాయి. ఇక్కడ మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు. బాహ్య మౌనం కంటే మానసిక మౌనమే ముఖ్యం. అటువంటి స్థితి అంతులేని మనశ్శాంతినిస్తుంది. అందుకే మౌనాన్ని తపస్సు అంటారు. ఎవరైతే అమృతత్వాన్ని ఆశిస్తూ ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారో వారే ధీరులు. వారికి అమృత రాజ్య ద్వారాలు తెరవబడి ఉంటాయని కఠోపనిషత్తు అంటుంది.

వేదవ్యాసుడు భారత రచన ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు గణపతి సుదీర్ఘ కాలం పాటు మౌనం పాటిస్తాడు. ఆయన వ్రతానికి విస్తుపోయిన వ్యాసుడు ఇలాంటి అసాధ్యమైన మౌనం ఎలా సాధ్యపడిందని అడిగితే ‘మహర్షీ! జీవనానికి ఆధారమైన ప్రాణశక్తి అందరికీ ఉంటుంది. ఆ శక్తి నుంచి పూర్తి లాభం పొందాలంటే వాక్‌ సంయమనం కావాలి. అది లేకపోతే వాక్‌శక్తి క్షీణిస్తుంది. మౌనం వాక్కుతో పాటు ఆలోచనలను కూడా బంధించివేస్తుంది. కాబట్టి నేను మౌనంగా ఉంటూ మహాభారత రచనా సంకల్పాన్ని సాధించగలిగానని గణపతి అంటారు.

వాక్కును మనస్సులో లయం చేసి మౌనం వహిస్తే బుద్ధి ఆత్మలో, ఆత్మ నిర్వికల్పపూర్ణమైన బ్రహ్మంలో లయమవుతుంది. అప్పుడు పరమశాంతి లభిస్తుందని వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చెబుతారు. ఈ విధంగా మౌనం వహించిన వ్యక్తి ముని అవుతాడు. అటువంటి వారి చిత్తం ఈ ఉపాధి వ్యవస్థల నుంచి విముక్తి అవుతుంది. దీని వల్ల అతనికి సిసలైన సుఖం స్పష్టంగా తెలుస్తుంది. అతని మనస్సులో సచ్చిదానందం వెల్లివిరుస్తుంది.

అది మౌన వ్రతమే? 
సాధారణ పరిభాషలో మౌనం అంటే నోటితో మాట్లాడకుంటా ఉండడం. సామాన్యులు, నిత్య విధుల్లో ఉండేవారు మాటల్లో పొదుపు, సంయమనం పాటించడం కూడా మౌన వ్రతమని చెప్పొచ్చు. మితభాషణం కూడా ఒక విధమైన మౌనమే. అందరినీ అలరించేలా మాట్లాడడం ఒక కళ. ఇతరుల మనుసు నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోమంటారు. ఇతరులు నొచ్చుకునేలా మాట్లాడడం కంటే మౌనమే మేలని సుమతీ శతకకర్త అంటారు. 
దైనందిన కార్యక్రమాల్లో ఎప్పుడు మౌనంగా ఉండాలో పెద్దలు వివరించారు..

‘స్నానేచ భోజనే హోమే... జపే మౌనం సమాశ్రయత్‌’ 
స్నానం చేస్తున్నప్పుడు దేహ పరిశుభ్రతపై దృష్టి పెట్టుకోవాలి. భోజన సమయంలో జీర్ణక్రియపై దృష్టి నిలపాలి. హోమం, జపం చేస్తున్నప్పుడు ఏకాగ్రత కావాలి కాబట్టి ఆయా సందర్భాల్లో మౌనంగా ఉండాలి. ‘యోగస్య ప్రథమమ్‌ వాక్‌ నిరోథకమ్‌’ యోగ సాధన ప్రారంభానికి వాక్కును అదుపు చేసుకోవడం, నియంత్రించుకోవడం ప్రథమ సోపానమని చెబుతారు. ఓ మహానుభావుడు ‘మీ నాలుక కాదు మీ హృదయం పలకాలి’ అని చెబుతాడు. 
మౌనంతో హృదయంలో శక్తి కేంద్రీకృతమై ధ్యాన సాధనకు ప్రాతిపదిక కల్పిస్తుంది. ఫలితంగా శరీరం ఆధ్యాత్మిక సాధనలకు ఆలయమవుతుంది.

మౌనం కూడా సమయోచితంగా ఉండాలి. ‘జ్ఞానే మౌనం... క్షమా శక్తి’ జ్ఞానమున్నవారు మౌనం వహించారంటే అందులో పరమార్థం ఉండాలి. శక్తి కలిగిన వారు క్షమించడానికో అర్థముందని కాళిదాసు రఘువంశంలో అంటారు. అజ్ఞాని మౌనానికి విలువ లేదు. వివేకులైన వారి సమయోచితమైన మౌనానికి విలువ ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు మేధావి మౌనం వహించడం కూడా ప్రమాదకరమే.
- ఎం.సూర్యప్రకాశరావు, ఖమ్మం
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment