వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆయిల్ కంపెనీలు

హైదరాబాద్‌: పెట్రోల్‌ బంకుల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ఆయిల్‌ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క పెట్రోల్‌ ధరలు పెరిగి వాహనదారులు గగ్గోలు పెడుతుంటే మరోపక్క కొందరు పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు మాత్రం చేతివాటం ప్రదర్శించి పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ పోస్తుండడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సులభంగా గుర్తించడానికి ఆయిల్‌ కంపెనీలు నడుంబిగించాయి. అక్రమాలను నివారించడానికి అన్ని బంకుల్లోనూ ‘ఆటోమైజ్డ్‌ మిషన్ల’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కంపెనీలు ఇప్పటికే అనేక పెట్రోల్‌ బంకుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. కంపెనీలు సొంత ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి.

ప్రధానంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీ), హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీ) వంటి కంపెనీలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆటోమైజ్డ్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గ్రేటర్‌లో దాదాపు 700 పెట్రోల్‌ బంకులుండగా ఇందులో దాదాపు 60శాతం బంకుల్లో ఆటోమైజ్డ్‌ మిషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావచ్చిందని హెచ్‌పీసీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలోని చాలా పెట్రోల్‌ బంకుల్లో పాత మిషన్లు కొనసాగుతున్నాయి. పాత మిషన్‌ల ద్వారా డెలివరీ అయ్యే పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ వచ్చేలా కొందరు డీలర్లు వాటిని ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. తూనికలుకొలతలశాఖ అధికారులు నిర్వహించే తనిఖీల్లో పాత మిషన్లలోనే ఎక్కువ అక్రమాలు జరుగుతున్నట్టు తేలింది. దీంతో ఆయిల్‌ కంపెనీలు ఆటోమైజ్డ్‌ మిషన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాయి.

అక్రమాల నివారణఇలా....
పెట్రోల్‌ బంకుల్లో ఏర్పాటు చేసిన ఆటోమైజ్డ్‌ మిషన్లను నేరుగా ఆయా కంపెనీలు ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. పెట్రోల్‌ బంకుల్లో రోజువారీగా అమ్మకాలు జరిగే పెట్రోల్‌, డీజిల్‌ను నేరుగా కంపెనీలే పర్యవేక్షణ చేస్తాయి. ఒక్కో బంకులో ఎన్ని లీటర్లు పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకం జరుగుతోందనే విషయం కంపెనీలకు రోజువారీగా తెలిసిపోతుంది. మిషన్‌లో ఏర్పాటు చేసిన సెన్సార్‌ల వల్ల బంకులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే నేరుగా ఆయిల్‌ కంపెనీలకు తెలిసిపోతుంది. దీంతో వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక పెట్రోల్‌ డెలివరీలో చుక్కకూడా తక్కువ రాదని అధికారులు తెలిపారు. రోజువారీ వ్యాపార వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే రికార్డు అవుతుంది. ఒక్కో బంకుకు ఆరోజు వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ఎంత? ఎంత అమ్మకాలు జరిగాయన్నది ఆన్‌లైన్‌లోనే కంపెనీ రికార్డుల్లోకి వెళ్లిపోతుంది. ఒక వేళ పెట్రోల్‌, డీజిల్‌ కల్తీచేయాలన్నా సాధ్యం కాదు. ఎందుకంటే కొద్ది మొత్తం అదనంగా కలిసినా రికార్డులో తెలిసిపోతుంది. ఎవరైనా అక్రమాలకుపాల్పడితే వెంటనే కంపెనీ వారికి తెలిసి పోతుంది. అలాంటి వారిని బ్లాక్‌లి్‌స్టలో పెట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

మంచి ఫలితాలు వస్తాయి

పెట్రోలు బంకుల్లో సాధారణ మిషన్ల స్థానంలో ఆటోమైజ్డ్‌ మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఆటోమైజ్డ్‌ మిషన్లను తాము ఆహ్వానిస్తున్నాం. వినియోగదారులకు సైతం ఎంతో మేలు జరుగుతుంది. కొందరు అక్రమార్కుల వల్ల మిగిలిన వారికి చెడ్డపేరు వస్తోంది. - వినయ్‌కుమార్‌, తెలంగాణ పెట్రోల్‌ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment