యూట్యూబ్ చెత్తకి చెక్!
యూట్యూబ్... కోట్ల వీడియోల సమాహారం. నిత్యం వేల వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. వాటిలో మనకు బాగా పనికొచ్చే వీడియోలతోపాటు, అవసరం లేని చెత్త వీడియోలు ఉంటాయి. ఆ చెత్త వీడియోలే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఆ వీడియోలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి.
కత్రినాకైఫ్ షూటింగ్ గ్యాప్‌లో ఏం చేసిందో తెలుసా? బిగ్ బాస్‌లో మీకు తెలియని రహస్యాలు ఇవే! ఇలాంటి పనికిమాలిన టైటిల్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతీ ఒక్కరిని వెంటాడుతూనే ఉంటాయి. వద్దనుకున్నా కూడా ఈ ఒక్కసారికి చూద్దాంలే అని రెండో ఆలోచన లేకుండా అలాంటి వీడియోలు జనాలు క్లిక్ చేసి చూస్తూ ఉంటారు. దాంతో వాటి వ్యూస్ లక్షల కొద్దీ గంట గంటకు పెరుగుతూనే ఉంటాయి. మనకు తెలియకుండానే మనం వాటిని వైరల్ చేయడంతో ఇకపై అవి మరింత మందికి ఆటో సజెషన్లలో చూపించబడతాయి. లోపల ఏమైనా విషయం ఉంటుందా అంటే ఏమీ ఉండదు.
ఒక నాలుగు ఫోటోలు వెదుక్కొచ్చి.. వాటిని జూమిన్, జూమవుట్, పేజ్ టర్స్ వంటి ట్రాన్సిషన్ ఎఫెక్టులతో చూపిస్తూ.. నోటికి వచ్చినట్లు స్ర్కిప్ట్ రాసుకుని, ఎవరో ముక్కూ మొహం తెలియని అమ్మాయి చేత వాయిస్ ఓవర్ చెప్పించి.. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తే మన బలహీనత కొద్దీ మనం వాటిని చూస్తూ ఉన్నాం. టైటిల్ ఒకటి ఉంటుంది, లోపల మాట్లాడేది మరొకటి ఉంటుంది, అసలు దేనికి సంబంధం ఉండదు. టైం వేస్ట్ అయిందని తిట్టుకొని బయటకు వచ్చేస్తుంటారు. ఈ చెత్తని అసలు అడ్డుకోలేమా? దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు?
యూట్యూబ్ అంతా ఇదేనా?
చాలా మంది ఫోన్‌లో కానీ, కంప్యూటర్‌లో గానీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇలాంటి అర్థం పర్థం లేని, సెన్సేషనల్ టైటిల్స్‌తో కూడిన వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అలాగని యూట్యూబ్ నిండా ఇలాంటి కంటెంటే ఉంటుందా? అనే సందేహం చాలామందికి వస్తుంది. అసలు కానే కాదు. మీకు తెలియని అద్భుత ప్రపంచం యూట్యూబ్‌లో ఉంది. మీరు చదువుకునే వారైతే, సబ్జెక్టుకు సంబంధించిన మరింత నాలెడ్జ్ ఉండాలన్నా, డ్యాన్స్, పాటలు పాడడం లాంటి ప్రపంచంలో ఉన్న వందలాది కళలను ప్రాక్టీస్ చేయాలన్నా.. మీ అవసరం ఏదైనా ప్రతీ దాని గురించి యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయి.
అయితే అవన్నీ మన కళ్ళకు చూపించబడకుండానే చెత్త వీడియోలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఉన్న విషయం చెప్పాలంటే, మీరు భుజాలు తడుముకోకుండా ఉండగలిగితే.. మీరు చెత్త చూస్తున్నారు కాబట్టే యూట్యూబ్ మీకు మరింత చెత్తను మీ కళ్ళ ముందు చూపిస్తోంది. ఒకసారి కనుక ఫేక్ వీడియోలు చూడడం ఆపేసి, మీ జీవితానికి ఉపయోగపడే కంటెంట్ యూట్యూబ్‌లో బ్రౌజ్ చేసి వాచ్ చేయడం మొదలు పెడితే ఇకపై మీకు అలాంటి మంచి కంటెంట్ ఆటో-సజెషన్లుగా వస్తుంటుంది.
మెషీన్ లెర్నింగ్ మాయాజాలం
ఇదంతా మెషీన్ లెర్నింగ్ మాయాజాలం. ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అనే పదాలను మళ్లీ మళ్లీ వింటూ ఉన్నారు కదా! మన జీవితం మొత్తాన్ని మార్చేసే ఈ కొత్త టెక్నాలజీలు మన కర్మకొద్దీ మనం ఎక్కువగా ఇష్టపడే పనికిమాలిన విషయాలను మళ్లీ మళ్లీ మనకు చూపిస్తూ మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అవును.. యూట్యూబ్ ఇంప్లిమెంట్ చేసిన మెషీన్ లెర్నింగ్ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ యూజర్ ఎలాంటి వీడియోలు ఎక్కువగా ఇష్టపడుతున్నాడో పరిశీలిస్తూ అతని పేరిట ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని.. ఇకపై అదే యూజర్ ఏ డివైజ్ నుండైనా యూట్యూబ్ వీడియోలు చూడటానికి ప్రయత్నించినపుడు, అతను ఇష్టపడిన వీడియోలను ఎక్కడెక్కడి నుండో ఏరుకొచ్చి సజెషన్లుగా చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకసారి యూట్యూబ్ దృష్టిలో మనం చెడిపోతే, మన జీవితాలు బాగుపరుచుకోవడం మానేసి హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలు, వివాదాస్పదమైన అంశాలు చూస్తూ పొల్యూట్ అయితే.. ఇక ఆ ఊబి నుండి బయటకు రావడం చాలా కష్టం.
మనమేం చేయాలి?
పైన చెప్పుకున్నట్లు యూట్యూబ్ మెషీన్ లెర్నింగ్ మాయాజాలంలో ఇరుక్కోకుండా ఉండాలంటే మీ ఫోన్‌లో గానీ, కంప్యూటర్లో గానీ, యూట్యూబ్ ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్లు చేయాలి. యూట్యూబ్ అప్లికేషన్‌లో మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. అందులో హిస్టరీ అండ్ పైవ్రసీ అని ఒక విభాగం ఉంటుంది. అందులోకి వెళ్లి అన్నిటికంటే మొదట క్లియర్ వాచ్ హిస్టరీ అని కనిపించే మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెంటనే స్ర్కీన్ మీద ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. నిర్మొహమాటంగా దాని క్రింద ఉండే క్లియర్ వాచ్ హిస్టరీ అనే పదం మళ్లీ క్లిక్ చేయండి. అంతే, ఇప్పటివరకు మీరు ఎలాంటి వీడియోలు చూశారు అన్నది యూట్యూబ్ మర్చిపోతుంది. దాంతో పరోక్షంగా అలాంటి వీడియోలు మళ్లీమళ్లీ చూపించే ప్రమాదం తగ్గుతుంది.
అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పటివరకు మీరు చూసిన వీడియోల హిస్టరీ మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా తొలగించబడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి నుంచి మళ్లీ అలాంటి చెత్త వీడియోలు చూడటం మొదలు పెడితే, అవి మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని శాశ్వతంగా అడ్డుకోవాలంటే.. అదే సెట్టింగ్స్ స్ర్కీన్ లో కనిపించే పాజ్ వాచ్ హిస్టరీ అనే ఆప్షన్ ఎంచుకోండి. దాంతో ఇకపై మీరు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు అన్నది యూట్యూబ్ గుర్తుపెట్టుకోవడం పూర్తిగా మానేస్తుంది. ఇలా చేయటం వలన పరోక్షంగా మీరు చెత్త వీడియోల నుండి రక్షణ పొందగలుగుతారు.
నాట్ ఇంట్రెస్టెడ్
అలాగే ఒకవేళ మీకు ఏదైనా నచ్చని వీడియో యూట్యూబ్ అప్లికేషన్‌లో సజెషన్స్‌లో చూపించబడితే, వెంటనే దాని పక్కనే ఉండే మూడు చుక్కల మెనూలోకి వెళ్లి నాట్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ క్లిక్ చేయండి. దాంతో యూట్యూబ్ ఇకపై మీకు అలాంటి వీడియోలు చూపించటం తగ్గిస్తుంది. ఇలా మన జీవితాన్ని ప్రభావితం చేయాలనుకునే యూట్యూబ్ మెషీన్ లెర్నింగ్‌కి మనకు చెత్త వద్దు, మంచి కంటెంట్ కావాలి అన్న విషయం ఎప్పటికప్పుడు స్వయంగా ఓపిక చేసుకుని ట్రైనింగ్ ఇవ్వగలిగితే కచ్చితంగా యూట్యూబ్ ద్వారా మనం అద్భుతమైన కంటెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది.
దానికంటే ముందు..
అనవసరమైన వీడియోలు కనిపించకుండా అడ్డుకోవడం కోసం యూట్యూబ్ అయితే మనకు పైన చెప్పుకున్న ఆప్షన్లు అందించింది గానీ మన బలహీనతలను అధిగమించవలసిన అవసరం మనకే ఉంది, లేదంటే మన విలువైన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కనీసం టైం వేస్ట్ వీడియోలకు దూరంగా ఉండాలన్న కనీస స్పృహ కలగటంతోనే మన మారడం మొదలు పెడతాం. ఆ మార్పు మీలో లేకపోతే ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కూడా గాసిప్స్ చూస్తూ ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతాం.
సెర్చ్ హిస్టరీ

నల్లమోతు శ్రీధర్
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment