ఐటిఆర్‌ ఫైలింగ్‌కు గడువు ముంచుకొస్తోంది.. | INCOME TAX

 

ఇప్పటికే చాలా మంది తమ ఆదాయ పన్ను రిటర్ను (ఐటిఆర్‌)లను ఫైల్‌ చేసి ఉంటారు. ఐటిఆర్‌ ఫైల్‌ చేయని వారికి ఇంకా వారమే గడువు ఉంది. మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకుంటే ఫైలింగ్‌ను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. అవేంటో క్లియర్‌టాక్స్‌.ఇన్‌ సిఇఒ అర్చిత్‌ గుప్తా ఆంధ్రజ్యోతి ‘బిజినెస్‌ ప్లస్‌’ పాఠకులకు తెలియజేస్తున్నారు.


ఐటిఆర్‌ ఫైల్‌ చేసేందుకు చివరి గడువు ఈ నెల 31. ఈ గడువు దాటితే జరిమానా తప్పదు. ఆగస్టు నుం చి డిసెంబరు వరకు ఐటిఆర్‌ ఫైల్‌ చేస్తే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైల్‌ చేస్తే 10,000 రూపాయలు చెల్లించాలి. వార్షిక ఆదా యం 5 లక్షల రూపాయలోపు ఉంటే మాత్రం 1,000 రూపాయల పెనాల్టీతో వదిలిపెడతారు. ఐటి రిటర్న్‌లు ఫైల్‌ చేసే వేతన జీవులు, ఇతరులు కింది డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకుని అవసరమైన వివరాలు చెక్‌ చేసుకుంటూ సులభంగా తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయవచ్చు.


పాన్‌ కార్డు
ఆదాయ పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ పాన్‌ కార్డు తప్పనిసరి. పన్ను చెల్లించే వారికి సంబంధించిన గుర్తింపు సాక్ష్యంగానే గాక, వారి ఐటి రిటర్న్‌ల ఫైలింగ్‌ను ట్రాక్‌ చేసేందుకు ఐటి శాఖకు ఇది అత్యంత ముఖ్యమైన సాధ నం. ఇ-ఫైలింగ్‌ కోసం ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకునేటప్పుడూ పాన్‌ నెంబర్‌ ఐడిగా పని చేస్తుంది.


ఫారం -16
చాలా మంది ఉద్యోగులకు మూలంలో పన్ను కోత (టిడిఎస్‌) ఉంటుంది. ఈ కోత తర్వాత మిగిలిన మొత్తమే ఉద్యోగుల జీతాల ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక ప్రతి కంపెనీ ఈ విషయాలను ఫారం-16లో పొందుపరుస్తుంది. ఇందులోనే ఉద్యోగుల జీతం వివరాలు, అందుకున్న పన్ను మినహాయింపులు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయి. కేవలం జీతం ఆదాయం మాత్రమే ఉన్న ఉద్యోగులైతే ఫారం-16 సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ప్రతి ఉద్యోగి తాను పని చేసే కంపెనీ లేదా సంస్థ నుంచి ఈ ఫారం తీసుకోవాలి. జీతం కాకుండా ఇతర ఆదాయం ఉంటే ఫారం-16ఎ సబ్మిట్‌ చేయాలి.


బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు
బ్యాంక్‌ సేవింగ్‌ ఖాతాపై వచ్చే వార్షిక వడ్డీ ఆదాయం రూ.10,000లోపు ఉంటే అది పన్ను విధింపు పరిధిలోకి రాదు. అంతకు మించితే మాత్రం పన్ను పోటు తప్పదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని తప్పనిసరిగా ఐటి రిటర్న్‌లో వెల్లడించాలి. ఒక్కోసారి పొరపాటునో గ్రహపాటునో టిడిఎస్‌ కింద అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తం కోత పడుతుంది. ఆ అధిక పన్ను మొత్తాన్ని రీఫండ్‌ కింద వెనక్కి తీసుకోవాలన్నా, మీ బ్యాంకు ఖాతా వివరాలను ఐటి రిటర్న్‌లో ఐటి శాఖకు సమర్పించాలి. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయానికి సంబంధించి అయితే బ్యాంక్‌ నుంచి తీసుకున్న వడ్డీ ఆదాయ వివరాలనూ, టిడిఎస్‌ సర్టిఫికెట్‌నూ రిటర్న్‌లో పేర్కొనాలి.


ఫారం 26ఎఎస్‌
ఐటి శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఫారం 26ఎఎస్‌ తీసుకోవచ్చు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో మీ తరఫున జరిగిన పన్ను చెల్లింపులు, పన్ను మినహాయింపుల వివరాలు ఉంటాయి. వాటిని ఫారం-16లోని వివరాలతో పోల్చుకోవాలి.


సెక్షన్‌ 80 పెట్టుబడులు
పిపిఎఫ్‌, ఎన్‌ఎస్‌సి, యులిప్స్‌, ఈల్‌ఎస్‌ఎస్‌ లేదా ఎల్‌ఐసి ప్రీమియం చెల్లింపులన్నీ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కిందికి వస్తాయి. ఈ పెట్టుబడులన్నిటికీ ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఐటి రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఈ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ దగ్గర ఉంచుకోవాలి. ఈ కింది పెట్టుబడులకు కూడా రూ.1.50 లక్షల వార్షిక పరిమితికిలోబడి, సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 

ఉద్యోగుల భవిష్య నిధికి చెల్లించే చెల్లింపులు.
పిల్లల ట్యూషన్‌ ఫీజులు
జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులు
స్టాంప్‌ డ్యూటీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు
గృహ రుణం కింద చెల్లించే అసలు మొత్తం

ఇతర పెట్టుబడి పత్రాలు
తాము నివసిస్తున్న లేదా అద్దెకు ఇచ్చిన ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వడ్డీపై ఏటా రూ.2 లక్షల వరకు మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దీనికి తోడు విద్యా రుణంపై చెల్లించే వడ్డీ మొత్తానికీ పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లనూ దగ్గర ఉంచుకోవాలి.


స్టాక్‌ ట్రేడింగ్‌ స్టేట్‌మెంట్‌
స్టాక్‌ మార్కెట్లో వచ్చే లాభాలపైనా పన్నులు చెల్లించాలి. ఏదైనా ఒక కంపెనీ షేర్లను కొన్న ఏడాది లోపు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తే, ఆ లాభాలపై 15 శాతం చొప్పున, ఏడాది తర్వాత అమ్మకుంటే వచ్చే లాభాలపై పది శాతం చొప్పున మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఐటి రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు ఇందుకు సంబంధించిన స్టేట్‌మెంట్లను దగ్గర ఉంచుకుని, రిటర్న్‌లో ఆ వివరాలూ పేర్కొనాలి. ఇలా పెట్టుబడులు, ఆదాయం, లాభాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకుంటే రిటర్న్‌ ఫైల్‌ చేయడం మరింత సులభమవుతుంది.


ఇ-ఫైలింగ్‌
ఈ కింది పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా తమ రిటర్న్‌లను ఇ-ఫైలింగ్‌ విధానం ద్వారా ఫైల్‌ చేయాలి.

రీఫండ్‌ బకాయిలు ఉన్న వ్యక్తులు
రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు
ఐటిఆర్‌-3, 4, 5, 6 ఫైల్‌ చేయాల్సిన వ్యక్తులు తప్పనిసరిగా ఇ-ఫైలింగ్‌ ద్వారానే రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి
వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇష్టం ఉంటే, తమ ఐటి రిటర్న్‌లను ఇ-ఫైలింగ్‌ ద్వారా ఫైల్‌ చేయవచ్చు

ఎవరు రిటర్న్‌ ఫైల్‌ చేయాలంటే?

వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే ఎక్కువ ఉండి ఆరు పదుల వయసు నిండని వ్యక్తులు
వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండి 60--80 సంవత్సరాల మధ్య వయస్కులైన సీనియర్‌ సిటిజన్లు
వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించి 80 ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్‌ సిటిజన్లు
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్‌ రీఫండ్‌ అందాల్సిన వ్యక్తులు
భారత్‌లో నివసిస్తూ విదేశాల్లో ఆస్తులు లేదా ఆర్థిక ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు
రూ.2.5 లక్షల కంటే ఎక్కువ విలువైన షేర్లు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లు విక్రయించి దీర్ఘ కాలిక మూల ధన లాభాల కింద పన్ను మినహాయింపు పొందిన వ్యక్తులు
ప్రవాస భారతీయులైనా భారత్‌లో వారి వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తులు
పైన పేర్కొన్న ఏ తరగతిలోకి రాకపోయినా ఏదైనా బ్యాంక్‌ లేదా ఎన్‌బిఎఫ్ సి, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులు కూడా ఐటి రిటర్న్‌లు ఫైల్‌ చేయవచ్చు. ఈ సంస్థలు ఐటి రిటర్న్‌లను ఆదాయ ధృవీకరణగా పరిగణిస్తాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment