చంద్రగ్రహణం | chandra grahan | bhaktibooks |


చంద్రగ్రహణం | chandra grahan | bhaktibooks |


అరుణారుణ జాబిలి
-ఆకాశవీధిలో నేడు అద్భుతం 
-శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం
-ఆరు గంటలకుపైగా భూమి నీడన చంద్రుడు
-103 నిమిషాలపాటు బ్లడ్ మూన్ ఆవిష్కృతం 
-దేశంలో ఎక్కడినుంచైనా గ్రహణాన్ని చూడొచ్చు 
-మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రవేత్తల సెల్ఫీ క్యాంపెయినింగ

అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం శుక్రవారం రాత్రి ఆకాశంలో కనువిందు చేయనున్నది. ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానున్నది. చంద్రుడు ఆరుగంటలకు పైగా భూమి నీడన గడుపనున్నాడు. ధవళ జాబిలి 103 నిమిషాలపాటు అరుణ జాబిలిగా మారనున్నది. దేశంలో ఎక్కడి నుంచి చూసినా ఈ సంపూర్ణ గ్రహణం సాక్షాత్కరించనున్నది. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించనున్నారు. దీనినో అంతరిక్ష పండుగలా నిర్వహించేందుకు పరిశోధకులు, ఖగోళప్రియులు ఏర్పాట్లు చేస్తుండగా.. అరుదైన సందర్భానికి సాక్షులుగా నిలువాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ జాబిలిని నేరుగా కంటితో చూడొచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అపోహలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎక్లిప్స్ ఈటింగ్ సెల్ఫీ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఈ అరుణ జాబిలి పక్కనే అంగారకుడు సైతం మిణుకుమిణుకుమంటూ మెరువనుండటం మరో విశేషం. 

న్యూఢిల్లీ, జూలై 26: ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా.. ఆరు గంటలకుపైగా చంద్రగ్రహణం. 103 నిమిషాల పాటు పూర్తిగా రక్త వర్ణం పులుముకోనున్న జాబిలి. ఆ పక్కనే నేనున్నానంటూ మినుకుమినుకుమంటూ మెరిసే అంగారకుడు. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించే అరుదైన సందర్భం.. మన దేశంలో ఎక్కడి నుంచైనా సంపూర్ణ గ్రహణాన్ని చూసే అవకాశం.. ఇన్ని ఆకాశ అద్భుతాలకు శుక్రవారం రాత్రి వేదిక కాబోతున్నది. ఇదే సమయంలో గ్రహణంపై అపోహలు తొలిగించేందుకు దేశవాసులంతా గ్రహణం సమయంలో ఆహారం తింటూ సెల్ఫీలు తీసుకోవాలని, సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. 21వ శాతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి ప్రారంభం కాబోతున్నది. ప్రారంభం నుంచి చివరివరకు వివిధ ప్రక్రియలు కలిపి మొత్తం ఆరు గంటలపాటు గ్రహణం కొనసాగనున్నది. గ్రహణం మన దేశంలో శుక్రవారం(27వ తేదీ) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం(28వ తేదీ) తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల మధ్య గ్రహణం ఉచ్ఛదశలో ఉంటుంది.

ఈ 103 నిమిషాలపాటు చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే బ్లడ్‌మూన్ అని పిలుస్తున్నారు. ఈ గ్రహణం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజలు చంద్రగ్రహణాన్ని సంపూర్ణంగా చూడగలుగుతారు. ఐరోపా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. మనకు గ్రహణం సమయంలో ఉత్తర అమెరికా, అంటార్కిటికా, రష్యాలోని ఉత్తర ప్రాంతాల్లో పగలు కావడంతో అక్కడి ప్రజలు గ్రహణాన్ని వీక్షించలేరు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ ప్రియులు, ప్రజలు గ్రహణ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి చూడలేనివారు మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడాలంటే 2025 సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందేనని ప్లానెటరీ సొసైటీ ఇండియాకు చెందిన ఎన్ శ్రీ రఘునందన్‌కుమార్ తెలిపారు. గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని, నేరుగా కండ్లతోనే చూడవచ్చని తెలిపారు. 

ప్రధాన దశలివే..గ్రహణంలో మొదటి దశ 10:45 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనిని పెనంబ్రల్ ఫేజ్ అంటారు. ఈ దశలో గ్రహణం లక్షణాలు కనిపించవు. రాత్రి 11:54 గంటలకు చంద్రుడిపై భూమి నీడ పడటం మొదలవుతుంది. దీనిని అంబ్రల్ ఫేజ్ అంటారు. ఇది తెల్లవారుజాము 3:49 వరకు కొనసాగుతుంది. ఈ ఫేజ్ ముగిసే సమయానికి భూమి నీడ నుంచి చంద్రుడు బయటపడుతాడు. ఈ అంబ్రల్ ఫేజ్‌లోనే రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల వరకు భూమి నీడ చంద్రుడిని పూర్తిగా ఆక్రమిస్తుంది. దీనిని టోటాలిటీ ఫేజ్ లేదా సంపూర్ణ దశ అంటారు. 

ఎందుకు సుదీర్ఘం..పౌర్ణమి రోజు సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందనే విషయం తెలిసిందే. సూర్యుడి నుంచి చంద్రుడిపై పడే కాంతి కిరణాలను గ్రహణం సమయంలో మధ్యలో ఉండే భూమి అడ్డుకుంటుంది. దీంతో చంద్రుడు భూమి నీడలో ఉండిపోతాడు. చంద్రుడు పరిభ్రమిస్తూ ఆ నీడను దాటేవరకు గ్రహణం కొనసాగుతుంది. భూమి-చంద్రుడి మధ్య ఉన్న దూరాన్ని బట్టి గ్రహణ కాలం మారుతుంది. భూమి-చంద్రుడి మధ్య సాధారణ దూరం 3.84 లక్షల కిలోమీటర్లు. ఈ సారి చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి మరో 22 వేల కిలోమీటర్ల దూరంలో అంటే 4.06 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు. ఇది భూమికి, చంద్రుడికి మధ్య గరిష్ఠ దూరం. దూరం పెరిగే కొద్దీ నీడ వైశాల్యం పెరుగుతుంది. దీంతో భూమి నీడను దాటేందుకు చంద్రుడికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే గ్రహణం దీర్ఘకాలం కొనసాగుతుంది. ఈ గ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉన్నది. శుక్రవారంనాడు చంద్రుడు భూమికి గరిష్ఠ దూరంలో ఉంటాడు కాబట్టి చిన్నగా కనిపిస్తాడు. ఈ ఏడాదిలోనే చంద్రుడు అతిచిన్నగా కనిపించే పౌర్ణమి ఇదే.

సెల్ఫీలు పంపండిశుక్రవారం సంభవించనున్న సుదీర్ఘ చంద్రగ్రహణం సమయంలో భారతీయులు ఆహార పదార్థాలు తింటూ సెల్ఫీలు తీసుకోవాలని, వాటికి #EclipseEating యాష్‌ట్యాగ్ జతచేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని ఖగోళశాస్త్రవేత్తలు కోరుతున్నారు. గ్రహణంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ క్యాంపెయిన్ చేపట్టినట్టు తెలిపారు.

     అంగారకుడు సైతం..
                          

అంగారకుడు భూమి సమీపంలోకి వస్తుండటంతో శుక్రవారం రాత్రి ఆకాశంలో చంద్రుడితోపాటు అంగారక గ్రహం కూడా కనిపించనున్నది. నాలుగు రోజులపాటు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అంగారకుడు కనిపిస్తాడని, నేరుగా కంటితో చూడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నెల 31న అంగారకుడు భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని, ఆ రోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల కంటే జమ్ముకశ్మీర్, తమిళనాడులో గ్రహణాన్ని, అంగారకుడిని మరింత స్పష్టంగా చూడొచ్చన్నారు. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే గ్రహణాన్ని వీక్షించలేరని చెప్పారు.     MORE......

నేడు ఆలయాలు మూసిఉంచే సమయాలువేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
శనివారం ఉదయం 3.45 నిమిషాల వరకు. 
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం
మధ్యాహ్నం 12.50 గంటల నుంచి శనివారం 
ఉదయం 5.15 గంటల వరకు. 
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం 
మధ్యాహ్నం 2 గంటల నుంచి 
శనివారం తెల్లవారు జామున 4.30 గంటల వరకు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం 
మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం ఉదయం వరకు. 
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జునస్వామి ఆలయం 
మధ్యాహ్నం 2 గంటల నుంచి శనివారం ఉదయం వరకు. 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం 
సాయంత్రం 5 గంటల నుంచి 
శనివారం ఉదయం 4.15 గంటల వరకు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment