పూరీ జగన్నాథుడి రథము కదిలె జగము మురిసె | Sri Jagannatha Ratha Yatra | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

రథము కదిలె జగము మురిసె

అనంత విశ్వానికి కర్త... కోరినవారి కొంగుబంగారంగా పూరీ జగన్నాథుడిని భావిస్తారు భక్తులు. అలంకార, భజన, శృంగార ప్రియుడైన స్వామికి నిత్యం 119 రకాల సేవలు... ఏడాదిలో 13 ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రముఖమైంది, ప్రసిద్ధి చెందింది రథయాత్ర. 44 అడుగుల ఎత్తున్న రథంలో సోదర, సోదరీ సమేతంగా సాగించే ప్రపంచ ప్రసిద్ధ ఈ మహా యాత్ర ఆద్యంతం అనేక విశేషాలమయం...

ఏటా రథాల తయారీకి అవసరమైన వృక్షాలను ఎంపిక చేసి, వాటిని 1072 ముక్కలుగా ఖండించి, పూరీకి తరలిస్తారు. ప్రధానార్చకుడు, తొమ్మిది మంది శిల్పులు సహా మొత్తం 125 మంది రథం తయారు చెయ్యటంలో పాల్గొంటారు. ఇంతకుముందు తీసుకువచ్చిన 1072 వృక్ష భాగాల్ని రథం తయారుచెయ్యటానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం, 763 భాగాలతో బలరాముడి రథం, 593 భాగాలతో సుభద్ర రథాన్ని తయారుచేస్తారు.

* జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. కచ్చితంగా 45 అడుగుల ఎత్తులో, 16 చక్రాలతో ఈ రథం తయారుచేస్తారు. ఎర్రటి చారలతో ఉన్న పసుపు రంగు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 
* బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. పద్నాలుగు చక్రాలతో, 44 అడుగుల ఎత్తులో ఈ రథం ఉంటుంది. దీన్ని ఎర్రటి చారలు ఉన్న నీలిరంగు వస్త్రంతో అలంకరిస్తారు. 
* సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు. ఇది 43 అడుగుల ఎత్తులో, 12 చక్రాలతో ఉంటుంది. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 
* ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల పొడవు ఉండే తాళ్లను ఏర్పాటుచేస్తారు.

జరామరణాలు అనివార్యం... 
పుట్టిన వారికి మరణం తప్పదు. సుఖదుఃఖాలు, వ్యాధులు అనివార్యం. తాను కూడా వాటికి అతీతుణ్ణి కానని చాటిచెబుతున్నాడు సర్వాంతర్యామి ఆయన పుష్కరానికోసారి నవ కళేబరం తీసుకుంటారు. దీన్నే బ్రహ్మంమార్పిడి అంటారు. 2015లో ఈ ఉత్సవం జరిగింది. జ్వరం పేరిట ఏటా పక్షం రోజులు చీకటి మందిరంలో గోప్య చికిత్స, సేవలు పొందుతారు. తర్వాత నవయవ్వన రూపంతో భక్తులకు కనులపండువ చేసి పెంచిన తల్లి సన్నిధి(గుండిచా మందిరం)కి రథాలపై చేరుకుంటారు. ఇందులో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి.

చీకటి మందిరంలో చికిత్స... 
ఏటా జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) 108 కలశాల పవిత్ర జలాలతో స్నానమాచరిస్తారు. దీన్నే దేవ స్నాన యాత్రగా పేర్కొంటారు. స్నాన పూర్ణిమ అని కూడా పిలుస్తారు. జూన్‌ 28న శ్రీక్షేత్రంలోని స్నానమండపంలో ఈ పవిత్ర కార్యాన్ని నిర్వహించారు. జల క్రీడలాడిన పురుషోత్తముడు జ్వరానికి గురై, అదేరోజు రాత్రి చీకటి మందిరానికి చేరారు. జూన్‌ 29 నుంచి స్వామి వారికి గోప్య చికిత్సలు ప్రారంభించారు.

చీకటి మందిరంలో గోప్య సేవల నేపధ్యంలో 14 రోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం ఉండదు. అస్వస్థతకు లోనైన చతుర్థా మూర్తులకు దైతాపతి సేవాయత్‌లు సేవలు చేస్తారు. వారికి పలియా సేవాయత్‌లు సహకరిస్తారు. ఈ గదిలోకి ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. స్వామికిక్కడ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స జరుగుతుంది. కరక్కాయ, జాజి, తాడి, గుగ్గిలం, కర్పూరం, చెట్ల బెరళ్లు, ఆకు పసర్లతో తయారు చేసిన ఔషధాలను చికిత్సలో వాడతారు. నువ్వుల నూనెలో పరిమళభరిత పుష్పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి మట్టి కుండల్లో ఏడాది పాటు మట్టిలో పాతిపెట్టి ఉంచుతారు. చీకటి గది సేవల సమయంలో ఈ కుండలు వెలుపలకు తీసి శుద్ధి చేసి స్వామికి లేపనంగా వినియోగిస్తారు. దీన్ని పుల్లెరి తెల్లో అంటారు. గోప్య సేవల్లో 11వ రోజు రాజవైద్యుని సూచనల మేరకు దశమూలికా గుళికలు పురుషోత్తమునికి అర్పిస్తారు. దీంతో స్వామి కోలుకుంటారు. పథ్యంలో భాగంగా ఈ పద్నాలుగు రోజులూ పళ్లు, ఖర్జూరం, తేనె, జున్ను, పంచామృతం నైవేద్యంగా పెడతారు.

విరహ వేదన... హీరా పంచమి 
జులై 18 2018
రథయాత్రలో మరో ముఖ్య ఘట్టం. హీరా పంచమి. గుండిచా మందిరంలో ఏర్పాటయ్యే ఈ వేడుక ఆలుమగల విరహవేదన, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. రథయాత్రలో తననూ తీసుకెళ్లాలని జగన్నాథున్ని మహాలక్ష్మి కోరుతుంది. అన్నాచెల్లెళ్ల యాత్రకు భార్యను వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదని.. పురుషోత్తముడు ఆషాఢ శుక్ల పంచమి ఉదయానికి శ్రీక్షేత్రానికి చేరుకుంటానని భార్యతో చిన్న అబద్ధం చెప్పి తల్లి దగ్గరికి వెళ్తాడు. పంచమి నాడు రోజంతా స్వామి కోసం వేచి చూసే మహాలక్ష్మి.. పురుషోత్తముడు నిజమందిరానికి రాకపోవడంతో ఆగ్రహిస్తుంది. రాత్రి తన చెలికత్తెల సాయంతో శ్రీక్షేత్రం నుంచి గుండిచా మందిరానికి చేరుకుని స్వామిని తన వెంట రావాలంటుంది. దశమి వరకు రావడం సాధ్యం కాదన్న స్వామితో జగడమాడే లక్ష్మి కోపంతో గుండిచా మందిరం వీడి వస్తుంది. వెలుపల ఉన్న నందిఘోష రథ చక్రాన్ని తన్ని శ్రీక్షేత్రానికి వెళుతుంది. దీంతో రథచక్రం ఊచ తెగి పడిపోతుంది. తరువాత దానికి సంప్రదాయబద్ధంగా మరమ్మతు చేస్తారు.

తిరుగు యాత్ర 
జులై 22 2018
తొమ్మిది రోజులు తల్లి సన్నిధిలో ఉండే స్వామి.. పదో రోజు తిరుగు యాత్రతో శ్రీక్షేత్రానికి చేరుతాడు. దీన్నే బహుడా యాత్ర అని పిలుస్తారు. ఉదయం గుండిచా పొహండి జరిగాక.. రాజు గజపతి చెరాపహర చేసి పూజలు నిర్వహిస్తారు. తర్వాత మూడు రథాలు కదులుతాయి. సాయంత్రం కల్లా ఇవి శ్రీక్షేత్రానికి అభిముఖంగా నిలుస్తాయి. మార్గమధ్యంలో పురుషోత్తముడు మవుసిమా (పిన్ని) ఆలయం దగ్గర ఆగుతాడు. ఆమె చేతి వంటకం పుడొపిఠా (జున్ను మిఠాయి) ఆరగిస్తాడు. అనంతరం రాజప్రాసాదానికి చేరువగా ‘హరిహరభేట్‌’ కార్యక్రమం ఉంటుంది. కాగా, దశమి ముందు రోజు గుండిచా మందిరంలో ఏర్పాటయ్యే జగన్నాథుని సంధ్యా దర్శనం అత్యంత శుభకరం, ఫలప్రదమని భక్తుల నమ్మకం.

అంత పెద్ద కళ్లతో... 
జులై 13 2018
ఆరోగ్యవంతుడైన స్వామి ఆషాఢ శుద్ధ పాఢ్యమి నాడు భక్తులకు దర్శనమిస్తాడు. . పద్నాలుగు రోజులూ అస్వస్థతతో కళ్లు తెరవని స్వామి ఆరోగ్యవంతుడై, ఆసనాన్ని అధిరోహించి భక్తులను పెద్ద కళ్లతో వీక్షిస్తారు. అందుకే దీన్ని నేత్రోత్సవం అని పిలుస్తారు. శుక్రవారం ఈ వేడుక జరుగనుంది.

రథము వెడలె... 
జులై 14 2018
నేత్రోత్సవం మరుసటి రోజు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో మూల విరాట్టులు రథ యాత్రగా జనంలోకి రావడం పూరీలోనే జరుగుతుంది. . గుండిచా మందిరానికి బయలుదేరే ముందు ముగ్గురు మూర్తుల ఆలయ పొహండి (లోపలి నుంచి వెలుపలకు తేవడం) వేడుక జరుగుతుంది. రథంపై ఉన్న దివ్య విగ్రహాలకు పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి పూజ చేస్తారు. తర్వాత రాజు గజపతి దివ్యసింగ్‌ దేవ్‌ రథాలపై బంగారు చీపురుతో ఊడ్చి, కస్తూరి కల్లాపి చల్లి, అర్చన చేసి హారతి పడతారు. ఈ ప్రక్రియను చెరాపహర అంటారు. అనంతరం రథాలకు ప్రత్యేకంగా తయారు చేసిన తాళ్లు కడతారు. వరుస క్రమంలో బలభద్ర, జగన్నాథుని రథాలు శ్రీక్షేత్ర ఆవరణ నుంచి గుండిచా మందిరానికి చేరతాయి. పెంచిన తల్లి సన్నిధిలో పురుషోత్తముడు తొమ్మిది రోజులు విడిది చేస్తాడు.

స్వర్ణాభరణ వేడుక 
జులై 23 2018
పురుషోత్తముడిని ఏడాదిలో ఐదుసార్లు సర్వాభరణాలతో అలంకరిస్తారు. దీనిని ‘సున్నా భెషొ’ అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశి పర్వదినాన.. రథాలపై వజ్రవైఢూర్య, గోమేధిక, పుష్యరాగ, కెంపులు పొదిగిన స్వర్ణాభరణాలతో స్వామిని అలంకరిస్తారు. 12వ శతాబ్దంలో పూరి రాజు ఆనంద భీమ్‌దేవ్‌ జగన్నాథున్ని చక్రవర్తిగా ప్రకటించి ఈ వైభవం ప్రారంభించాడని శ్రీక్షేత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది.

అధర పొణా వేడుక 
జులై 24 2018
ఏకాదశి మర్నాడు రాత్రి 8.30 గంటలకు ‘అధర పొణా’ వేడుక ఏర్పాటవుతుంది.రథాలపై జగన్నాథ, బలభద్ర, సుభద్రతో అభిముఖంగా నిలువెత్తు (విగ్రహాల పెదవులకు తాకేలా) మట్టి కుండల్లో పాలు, పెరుగు, జున్ను, తేనె తదితర మధుర పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పంచామృతం నింపుతారు. ముగ్గురు మూర్తులకు దీనిని అర్పణ చేసిన తర్వాత కుండలను పగులగొడతారు. అందులో ఉన్న పొణా (పంచామృతం) నేలపారుతుంది. యాత్రలో రథాలకు రక్షణగా నిలిచిన దివ్యశక్తులు దీనిని సేవించి వెనుదిరుగుతాయని నమ్ముతారు.

రసగుల్లా ఉత్సవం 
జులై 25 2018
ఇది రథయాత్ర అంతిమ ఘట్టం. అధరపొణ ముగిసిన మర్నాడు రాత్రి 10 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. రథాలపై ఉన్న ముగ్గురు మూర్తులకు ఆలయ పొహండి (లోనికి తీసుకెళ్లే వేడుక) ఏర్పాటు అవుతుంది. దీనికి ముందుగా అలిగిన లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్నాథడు రసగుల్లాలు తినిపిస్తాడని అంటారు. అందుకే దీనిని రసగుల్లాల దినోత్సవం అంటారు. దీంతో రథయాత్ర వేడుకకు తెరపడుతుంది.
- అయినాల నాగభూషణం, గోపాల్‌పూర్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment