ఇక డ్రోన్‌లదే కాలం..! | Drone Camera | 

ఈ మధ్యకాలంలో ఏ పెళ్లికి వెళ్లినా.. ఏ పబ్లిక్‌ ఫంక్షన్‌కి వెళ్ళినా గాల్లో ఎగురుతూ, కలియతిరుగుతూ ఒక ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్‌లు కనిపిస్తున్నాయి. చాలామందికి డ్రోన్‌ అంటే కేవలం వీడియోగ్రాఫర్లు మాత్రమే వాడతారనే అపోహ ఉంది. కానీ వ్యవసాయ పనుల నుంచి మందుల డెలివరీ వరకు అన్ని డ్రోన్‌లతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం. 

డ్రోన్‌ అంటే ఏంటి? 

డ్రోన్‌లను అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ అంటారు. అంటే మనిషి లేకుండా గాల్లో ఎగిరే వాహనం అన్నమాట. దీంట్లో పొందుపరచబడి ఉండే సర్క్యూట్‌ బోర్డ్‌, చిప్‌సెట్‌, సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. సహజంగా డ్రోన్‌లలో రెండు కీలకమైన భాగాలుంటాయి. ఒకటి గాల్లో ఎగిరే డ్రోన్‌ కాగా, రెండవది దాన్ని కంట్రోల్‌ చేసే విభాగం. ఒక డ్రోన్‌లో చీకట్లో కూడా పనిచేసే ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు, లేజర్‌ (మిలిటరీ డ్రోన్‌ల విషయంలో ఇవి ఉంటాయి), జిపిఎస్‌ అంతర్గతంగా పొందుపరచబడి ఉంటాయి. బరువు తక్కువగా ఉండి ఎక్కువ దూరం ప్రయాణించడం కోసం డ్రోన్‌లను చాలా తేలికగా ఉండే పదార్థాలతో తయారుచేస్తారు. అవి ఏయే రంగాల్లో వాడబడతాయి అన్న దాన్నిబట్టి వేర్వేరు పరిమాణాల్లో డ్రోన్‌లు ఉంటాయి. మిలటరీ అవసరాల కోసం ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక డ్రోన్‌ని ఆన్‌ చేసిన వెంటనే అది ప్రస్తుతమున్న జీపీఎస్‌ లొకేషన్‌ గుర్తిస్తుంది. ఆ తర్వాత మాత్రమే అది ఎగరడానికి సిద్ధమవుతుంది. మనకు పని పూర్తయింది అనుకున్నప్పుడు రిటర్న్‌ టు హోమ్‌ అనే బటన్‌ను రిమోట్‌ కంట్రోల్‌లో గానీ, స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్‌లో గానీ ట్యాప్‌ చేసినప్పుడు ఆ డ్రోన్‌ ఎక్కడ ఉన్నా మెల్లగా మన దగ్గరకు చేరుకుంటుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా డ్రోన్‌ మన దగ్గరకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ రిమోట్‌ కంట్రోల్‌కీ, డ్రోన్‌కీ మధ్య సంబంధాలు తెగిపోయినప్పుడు కూడా గతంలో ఉన్న పొజిషన్‌ గుర్తుపెట్టుకొని తిరిగి వెనక్కి వచ్చే విధంగా డ్రోన్‌లలో ఏర్పాటు ఉంటుంది. 

ఎక్కడెక్కడ వినియోగిస్తారు? 

మొట్టమొదటి డ్రోన్‌ 2001 సంవత్సరంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఒక టెర్రరిస్టుని మట్టుబెట్టడం కోసం అమెరికాకు చెందిన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉపయోగించింది. అప్పటినుండి ఇప్పటివరకు అనేక సందర్భాల్లో మిలటరీ అవసరాలకోసం ప్రపంచవ్యాప్తంగా డ్రోన్‌లు వాడబడుతున్నాయి. డ్రోన్‌లను తయారుచేసిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయిల్‌ నిలుస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు డ్రోన్‌లను సరఫరా చేస్తున్న దేశం కూడా ఇజ్రాయిలే. కేవలం పెళ్లిళ్లకి మాత్రమే డ్రోన్‌లను వాడతారనే అపోహ చాలామందిలో ఉంది. ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాలకు ప్రాణాలను నిలబెట్టే మందులను సకాలంలో చేర్చి చాలామంది జీవితాలు రక్షించడం కోసం డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. అలాగే పోలీసుశాఖ కూడా నేరాలను అదుపు చేయడం కోసం, నేరస్తులను పట్టుకోవడం కోసం, పెద్ద పెద్ద మీటింగులు జరిగే ప్రదేశాలపై నిఘా పెట్టడం కోసం డ్రోన్‌లను వినియోగిస్తోంది. అలాగే అందరికీ సుపరిచితమైన డామినోస్‌ పిజ్జా డెలివరీ కోసం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో డ్రోన్‌లను వాడుతోంది. అమెజాన్‌ సంస్థ కూడా షాపింగ్‌ చేసిన వారి ఇళ్లకు వస్తువులను డెలివరీ చేయడానికి వీటిని వాడటం గమనార్హం. వ్యవసాయం చేసే రైతులకు తమ పంటలకు సంబంధించి చీడపీడలు, ఇతర అంశాలపై సమాచారం అందించడానికి డ్రోన్‌లు వాడుతున్నారు. అలాగే అటవీశాఖ జంతువుల సమగ్ర సమాచారం సేకరించడానికి, వాటి బాగోగులను పర్యవేక్షించడానికి మనుషులతో పనిలేని డ్రోన్‌లను వాడుతోంది. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి క్రీడల్లోనూ డ్రోన్‌లను వాడుతున్నారు. సినిమా నిర్మాణ క్రమంలో కూడా కష్ట సాధ్యమయ్యే దృశ్యాలను చిత్రీకరించడం కోసం నిర్మాణ సంస్థలు డ్రోన్‌లను వినియోగిస్తున్నాయి. 

కొన్ని ఆసక్తికరమైన విషయాలు 

2004 నుండి 2015 వరకు కేవలం ఒక్క పాకిస్థాన్‌లో మాత్రమే ఆయుధాలు అమర్చబడిన డ్రోన్‌లు 2500 నుండి 3300 వరకూ మనుషుల్ని మట్టుబెట్టాయి. డ్రోన్‌ కెమెరాలు రాకముందు ఫోటోగ్రాఫర్లు ఏరియల్‌ షాట్ల కోసం కైట్‌ కెమెరాలు వాడుతుండే వారు. 2013 సంవత్సరంలో చైనాకు చెందిన నిఘా డ్రోన్‌లు భారతీయ ఆకాశంలో సంచరిస్తున్నట్లు భారత్‌ గుర్తించింది. అయితే అవి జూపిటర్‌, వీనస్‌ గ్రహాలను పరిశీలించడం కోసం అమర్చబడినట్లు తర్వాత తెలుసుకుంది. 

ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జంతువులను వేటాడుతున్న వేటగాళ్ళను గుర్తించడం కోసం డ్రోన్‌లతో నిఘా పెట్టిన ఓ ప్రోగ్రామ్‌కి గూగుల్‌ సంస్థ 5 మిలియన్ల డాలర్ల వరకు విరాళం ఇచ్చింది. చేతిలో అమరే అతి చిన్న డ్రోన్‌లు కూడా పలు చైనా వెబ్‌సైట్లలో లభిస్తున్నాయి. వీటి ధర భారతీయ కరెన్సీ ప్రకారం ఐదారు వందల నుండి మొదలవుతోంది. ఒక మనిషిని మోసుకెళ్లగలి గేటంత శక్తివంతమైన డ్రోన్‌ కూడా ఉంది. అమెరికా తమ గగనతలంలో రికార్డు చేస్తున్న డ్రోన్‌ వీడియో ఫుటేజ్‌లను మార్చి వేయడం కోసం ఇరాక్‌ దేశస్థులు స్కైగ్రాబర్‌ అనే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ కూడా వినియోగిం చారు. ఒక అంచనా ప్రకారం రాబోయే పదిహేనేళ్ల కాలంలో అమెరికా గగనతలంపై నిరంతరం పరిసరాలను పర్యవేక్షిస్తూ 20 వేలకు పైగా డ్రోన్‌లు తిరగాడే అవకాశముంది. పోలెండ్‌లో అబార్షన్‌ చట్టవ్యతిరేకం కావడం వల్ల ప్రెగ్నెన్సీని పోగొట్టే మందులను డెలివరీ చేయడానికి కూడా అక్కడ డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఇలా డ్రోన్‌ల చుట్టూ అనేక ఆసక్తికరమైన విశేషాలున్నాయి. ఇండియాలోకి డ్రోన్‌లను వినియోగించడం పట్ల అనేక ఆంక్షలు ఉన్నాయి. మనం వాడే డ్రోన్‌ల పరిమాణం బట్టి సివిల్‌ ఏవియేషన్‌ శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. చివరకు పెళ్లిళ్లు, పబ్లిక్‌ ఫంక్షన్లు, ఇతర ఇండోర్‌ ఏక్టివిటీలకూ డ్రోన్‌లు వాడాలన్నా రూల్స్‌ ప్రకారం స్థానికంగా ఉండే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. అయితే మున్ముందు దేశంలో వీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇలా పనిచేస్తుంది.. 

ఒక డ్రోన్‌ మనకు కావాల్సిన దిశలో ఎగరటం కోసం దాంట్లో అమర్చబడి వున్న మోటార్లు, ప్రొపెల్లర్లు ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఒక క్వాడ్‌కాప్టర్‌ని తీసుకుంటే, వాటిలో రెండు మోటార్లు, ప్రొపెల్లర్లు క్లాక్‌వైజ్‌లోనూ, మరో రెండు కౌంటర్‌ క్లాక్‌వైజ్‌లోనూ తిరుగుతూ ఉంటాయి. ఫ్లైట్‌ కంట్రోలర్‌ నుండి ఎప్పటికప్పుడు అందే సమాచారాన్ని బట్టి అవి నడుచుకుంటూ ఉంటాయి. మిలటరీ స్థావరాలు వంటి ప్రదేశాల్లో డ్రోన్‌లు ఆకాశంలో ఎగరటం నిషేధం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక నిషిద్ధ ప్రదేశాలు ముందే నిర్దేశించబడి ఉంటాయి. డ్రోన్‌లను తయారు చేసే ప్రముఖ సంస్థ అయిన డిజెఐ తాను తయారుచేసే డ్రోన్‌లలో నో ఫ్లై జోన్‌ అనే ప్రత్యేకమైన ఏర్పాటుని కూడా చేసింది. అలాగే డ్రోన్‌లో పొందుపరచబడి ఉండే సెన్సార్లు ఎక్కడా గుద్దుకో కుండా డైరెక్షన్లని మార్చుకుంటూ ముందుకు సాగటానికి అవకాశం కల్పిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత శక్తివంతమైన డిజెఐ ఫాంటమ్‌ 4ప్రో 30 నిమిషాల పాటు నిరాటంకంగా గాల్లో ఎగరగలుగుతుంది. మనం నిలబడ్డ ప్రదేశం నుండి ఏడు కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్‌ని మన స్మార్ట్‌ ఫోన్‌ నుండి కంట్రోల్‌ చేసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్‌ రిజల్యూషన్‌ ఉన్న కెమెరా సెన్సార్‌ దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు లక్షన్నర రూపాయలు ఉంటుంది -నల్లమోతు శ్రీధర్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment