నవరాత్రి ఉత్సవాలు అనగానే విజయవాడ కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. మన తెలంగాణాలో కూడా అంతటి ప్రాశస్త్యం కలిగిన ఉత్సవాలున్నాయి. వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో ప్రతి ఏటా శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవ రోజుల్లో టన్నుల కొద్దీ కూరగాయలతో ప్రత్యేక అలంకరణతో మెరిసిపోతుంది అమ్మవారు. ఈ నెల 14న మొదలైన శ్రీ శాకాంబరీ దేవి ఉత్సవాలు 26వ తేదీన ముగుస్తాయి. ఈ సందర్భంగా శాకాంబరీ అమ్మవారి విశిష్టత.. ఉత్సవాల గురించి..


భారతదేశంలోని అనేక ఆలయాల్లో వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు విధిగా జరుపుతారు. కానీ మన రాష్ట్రంలోని వరంగల్ నగరంలో వెలిసిన శ్రీ భద్రకాళీ దేవాలయంలో మాత్రమే నవరాత్ర చతుష్టం అత్యంత వైభవంగా నిర్వహిస్తుండటం విశేషం. మొదటి సారిగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు చారిత్రక భద్రకాళీ దేవస్థానంలో ప్రారంభమైన శాకాంబరీ నవరాత్రులు క్రమంగా విజయవాడ కనకదుర్గా అమ్మవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా మొదలయ్యాయి. ఆ తరువాత భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాలు, ప్రధాన నగరాలలోని వందలాది దేవాలయాలలో శాకాంబరీ ఉత్సవాన్ని జరుపుతూ అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నారు.

దేవీ నవరాత్రోత్సవాల విశిష్టత

దేవీ అమ్మవారికి జరిపే ఉత్సవాల్లో ప్రధానంగా నిర్వహించేవి రెండు నవరాత్రులు. అవి చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు. వీటినే దేవీ నవరాత్రులుగా పిలుస్తారు. వీటిపై దేవి భాగవతములో చాలా చక్కగా వివరించారని పండితులు పేర్కొంటున్నారు. వసంత రుతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్ట్రల వంటివి. వివిధ రకాలైన రోగాలు ఈ రెండు ఋతువులలో ప్రజలను బాధిస్తాయి. అలాంటి బాధలు రాకుండా ఉండాలన్నా, సమస్తమైన రోగాలు తొలగిపోవాలన్నా అమ్మవారిని ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలి. సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగించాలి అంటే ఆపరదేవతయైన అమ్మ అనుగ్రహం పొందడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి దేవీ భాగవతంలో ఈ రెండు నవరాత్రులు తప్పనిసరిగా నిర్వహించుకోవాలని ఉంది.అందుకే ఈ నవరాత్రులను ప్రజలందరూ విధిగా ఆచరించడం ఆచారంగా వస్తున్నది. 
విశేషఫలప్రదములైన అమ్మవారి నవరాత్ర చతుష్టయాన్ని గూర్చి దేవీ భాగవతంలో వివరించబడినది. 
శ్లో॥ చైత్రే శ్వినే తథాషాడే మాఘే కార్యోమహోత్సవః
చతుర్షునవరాత్రేషు విశేషాత్ఫలదాయకః
పై ప్రమాణాన్ని అనుసరించి అమ్మవారికి చైత్రమాసంలో జరుపబడే నవరాత్రులను వసంత నవరాత్రులని, ఆషాడ మాసములో జరుపబడే నవరాత్రులను శాకాంబరీ నవరాత్రులని,ఆశ్వయుజ మాసములో జరుపబడే నవరాత్రులను శరన్నవరాత్రులని,మాఘమాసములో జరిపే నవరాత్రులను మాఘ నవరాత్రులుగా వ్యవహరిస్తారు. విశేష ఫలములను కోరేవారు ఈ నవరాత్ర చతుష్టయాన్ని ఆచరిస్తారు. ఈ దేవీ నవరాత్రుల ఆచరణ విధానం, పూజలు తదితర విషయాలలిన్నీ తంత్రాలల్లో విశదీకరించబడ్డాయి.

శాకాలతో ఆకలి తీర్చే తల్లి

దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతి 11వ అధ్యాయంలో, రహస్య త్రయంలో మూడవదైన మూర్తి రహస్యంలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. ఒక్క నీటి చుక్క కూడా లేకుండా వంద సంవత్సరాల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూభాగంపై ఉన్న మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నూరు కన్నులతో చూస్తూ లోకాలను కాపాడుతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షీదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టిస్తాను. మళ్లీ వర్షాలు వచ్చేంతవరకు జనులకు ఆకలి తీరుస్తాను. వారి ప్రాణాల రక్షణ చేస్తాను. అందువల్లనే నేను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతాను అంటూ అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహారం చేసి దుర్గాదేవిగా కీర్తిపొందింది. శాకాంబరీ దేవి నీలవర్ణంలో సుందరంగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలగు కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది.

ఈ శాకాల సముదాయాలు అంతులేని కోర్కెలు తీర్చే రసాలు కలవై ఉంటాయి. జీవులకు కలుగు ఆకలి దప్పి, మృత్యువు, ముసలి తనము, జ్వరము మొదలగువాటిని పోగొడుతాయి. కాంతులను ప్రసరించే ధనుస్సును ధరించియున్న ఈ పరమేశ్వరి శాకాంబరీ, శతాక్షి, దుర్గ అనే పేర్లతో కీర్తింపబడుచున్నది. ఈ దేవి శోకాలను దూరం చేస్తుంది. దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేస్తుంది. పాపాలను పోగొడుతుంది. ఉమాగౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో స్తోత్రము చేసేవారు, ధ్యానం చేసేవారు. నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృతము అను ఫలములను అతి శీఘ్రముగా పొందుతారు. శుక్లపక్ష చంద్రుడు ప్రతిరోజు వృద్ధి చెందుతూ పౌర్ణమినాడు షోడశకళా ప్రపూర్ణుడౌతాడు.

ప్రతినిత్యము ఆ తిథికి ఆదిదేవతయైన నిత్యలను 15రోజులు క్రమం తప్పకుండా (పంచదశ నిత్యలను క్రమంగా) ఆరాధిస్తూ షోడశీ మహానిత్య అగు శ్రీ భద్రకాళీ అమ్మవారిని పౌర్ణమి రోజున శాకాంబరీ అవతారంలో సేవించడం వల్ల అమితమైన పుణ్యఫల ప్రాప్తిని భక్తులు పొందుతారని శాస్ర్తాలు తెలియచేస్తున్నాయి. ఈ మేరకు లోక కల్యాణార్థం శాకాంబరీ నవరాత్రులు పంచదశ నిత్యానుష్ఠాన పూర్వకంగా ఏక తంత్రంతో పదిహేను రోజులు జరుపబడుతున్నాయి.ప్రతిదినం ఒక విశేషమైన పూజ నివేదనలతో దిన దిన ప్రవర్ధమానంగా జరుపబడుతున్నాయి. శాకాంబరీ నవరాత్రులు 15రోజులల్లో ప్రతినిత్యం ఉదయం దశమహా విద్యలలో ఆద్యవిద్యయైన కాళీ క్రమాన్ని అనుసరించి, అదేవిధంగా సాయంత్రం షోడశీ క్రమాన్ని అనుసరించి పంచదశ నిత్యానుష్టానము (తిథిమండల దేవతా యజనము) జరుపబడుతుంది. 
-సేకరణ: గడ్డం శిరీష, వరంగల్


కూరగాయలతో శాకాంబరీ అలంకరణ

ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రులను శాకాంబరీ నవరాత్రులు అంటారు. రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారిని పలు రకాల కూరగాయలతో శాకాంబరీ దేవిగా అలంకరించి ఆరాధిస్తారు.ఇలా ఆరాధించడానికి గల నేపథ్యం ఈ విధంగా ఉంది. భూలోకంలో నూరు సంవత్సరాల వరకు కరువు సంభవించినప్పుడు శతాక్షిగా అవతరించి మునులను, లోకాలన్నింటిని కరువు బారి నుంచి కాపాడింది శాకాంబరీ అమ్మవారు. అందుకే గ్రీష్మ రుతువు నాట్లు జరిగి విత్తులు విత్తే కాలంలో శాకాంబరిని ఆరాధించడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా సువృష్టియై సస్య రక్షణ జరుగుతుంది. ప్రజలకు అన్నపానామృత ఫలములు సమృద్ధిగా దొరికి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని మూర్తి రహస్యంలో అమ్మవారు చెప్పింది. అదే మూర్తి రహస్యం 14వ శ్లోకంలో అమ్మవారు దుంపగడ్డలు, శాకములతో శోభించినదని తెలుస్తుండటం వలన గుణవిశేషేఫలవిశేషః అను న్యాయాన్ని పురస్కరించుకొని అమ్మవారిని వివిధమైన శాకములతో అలంకరిస్తారు.


మొదటి సారిగా భద్రకాళి ఆలయంలోనే

అప్పటి భద్రకాళి దేవాలయ ప్రధానార్చకులు గణేశ్ శాస్త్రి 1979 సంవత్సరంలో స్థానిక పండితులను సంప్రదించి ఆలయంలో ఒక రోజు మాత్రమే శాకాంబరీ ఉత్సవాలు జరుపడం ప్రారంభించారు.ఆ తర్వాత నేను 1985లో ప్రధానార్చకుడిగా భాద్యతలు తీసుకున్న తర్వాత దేవీ భాగవతాన్ని అనుసరించి నవరాత్రోత్సవాలు ఆచరించే విధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్నాను.దీని ప్రకారమే చైత్రమాసంలోను,ఆశ్వయుజ మాసంలోను నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి.ఆషాడ మాసంలో తిథి మండల దేవతాయజనంగా శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించాం. మొదట్లో స్థానిక రైతులు తాము పండించిన కూరగాయలు సమర్పిస్తే వాటినే అమ్మవారికి అలంకరించే వారం.ఆ తర్వాత కూరగాయల మార్కెట్ నుంచి 30 నుంచి 40 కిలోల వరకు కొన్ని రకాల కూరగాయలు ఉచితంగా అందచేస్తే వాటినే అలంకరించేది.

గత కొన్నేళ్లుగా టన్నుల కొద్ది కూరగాయలను ఉపయోగిస్త్తూ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.అలంకరణకే సుమారు 8 గంటల వరకు సమయం పడుతుందంటే అలంకరణ మహత్మ్యం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. ఇదేక్రమంలో భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.ప్రారంభంలో నగరానికి చెందిన భక్తులు వచ్చేవారు.ఆ తర్వాత జిల్లా ,రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment