కొత్త 100 నోటు భారం రూ.100 కోట్లు!
2.4 లక్షల ఏటీఎంలకు మార్పులు చేయాలి
12 నెలల సమయమూ పట్టొచ్చు
పరిశ్రమ వర్గాల అంచనా
ముంబయి


     సాధారణంగా ఒకసారి పొరపాటు చేస్తే మరోసారి జరగకుండా చూసుకుంటాం. అయితే కొత్త నోట్ల విడుదలలో మాత్రం అలా జరగడం లేదు. కొత్తగా విడుదల చేస్తున్న నోట్ల పరిమాణానికి, ప్రస్తుత నోట్లకు తేడాలున్నందున, ఏటీఎమ్‌లలో మార్పులు చేయాల్సి వస్తోంది. ఇందుకు భారీఎత్తున వ్యయం, సమయమూ అవసరమవుతున్నాయి. దేశంలోని అత్యధిక ఏటీఎంలు పాత రూ.100, 500, 1000 నోట్ల పరిమాణానికి అనుగుణంగా రూపొందించారు. మార్పులు చేయకపోతే, కొత్త నోట్లను ఏటీఎంల ద్వారా అందించే అవకాశం బ్యాంకులకు లభించడం లేదు.

     2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను రిజర్‌వ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచరు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎమ్‌లలో ఎప్పటికప్పుడు మార్చులు చేయాల్సి వస్తోంది.

సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయ్‌
దేశంలోని ఏటీఎమ్‌లలోకి కొత్త రూ.100 నోట్లు రావాలంటే మొత్తం 2.4 లక్షల ఏటీఎమ్‌లలో మార్పులు చేయాలి. ఇందుకు రూ.100 కోట్ల పెట్టుబడి అవసరమని ఏటీఎమ్‌ కార్యకలాపాల పరిశ్రమ వెల్లడించింది. కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని అభిప్రాయపడింది. ‘ఈ మధ్యే వచ్చిన రూ.200 నోటుకు తగ్గట్లు ఏటీఎమ్‌లలో మార్పులు చేస్తున్నాం. అదే ఇంకా పూర్తికాలేదు. మళ్లీ కొత్త రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లే’నని పరిశ్రమ సంఘం కాట్‌మి డైరెక్టర్‌ వి. బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. కొత్త రూ.100 నోట్లతో పాటు.. పాత రూ.100 నోట్లకూ ఏటీఎంలలో స్థానం కల్పిస్తూ మార్పులు చేపట్టడం సవాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నోట్ల లభ్యతను బట్టి ఏటీఎమ్‌లలో మార్పులు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంద’ని సుబ్రమణియన్‌ అన్నారు. ‘దేశంలోని 2.4 లక్షల ఏటీఎమ్‌లలో మార్పులు చేసి, కొత్త రూ.100 నోటుకు అనుగుణంగా మార్చడానికి రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి; 12 నెలలకు పైగా సమయం వెచ్చించాల్సి ఉంటుంద’ని హిటాచి పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ లానీఆంటోనీ అంచనా వేశారు. ‘అన్ని ఏటీఎమ్‌లలో ఇంకా రూ.200 నోట్లకు తగ్గట్లు మార్పులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త రూ.100 నోటుకు చోటు కల్పించడానికి మరింత సమయం అవసరం అవుతుంది. సరైన ప్రణాళిక లేకుంటే ఇంకా జాప్యం కావొచ్చ’ని అన్నారు.

గర్వించదగ్గదే కానీ..
అత్యున్నత భద్రతా ప్రమాణాలతో సరికొత్త నోటు తీసుకురావడం గర్వించదగ్గ అంశమే కానీ నోటు పరిమాణంలో మార్పుల వల్ల ఏటీఎమ్‌ల ద్వారా వాటిని ప్రజలకు అందించాలంటే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని యూరోనెట్‌ సర్వీసెస్‌ ఎండీ హిమాన్షు పుజారా పేర్కొన్నారు. ‘అన్ని ఏటీఎమ్‌లనూ మార్చాల్సి ఉంటుంది. అందుకు సమయం కావాలి. భారీ వ్యయాలను కూడా వెచ్చించాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు.
2.4 లక్షలు దేశంలో ఉన్న మొత్తం ఏటీఎమ్‌లు. ఇందులో ఎన్‌సీఆర్‌ 1.1 లక్షల ఏటీఎమ్‌లను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎమ్‌లను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్‌ఐఎస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి
రూ.100-120 కోట్లుగత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి ఖర్చు చేసిన నగదు
రూ. 3000-4000 సగటున ఒక్కో ఏటీఎమ్‌ను కొత్త నోటుకు అనుగుణంగా మార్చడానికి అయ్యే వ్యయం
5 నవంబరు 2016లో రూ.500; రూ.1000 నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నోట్లలో రూ.100 అయిదోది
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment